సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 20, 2007

తెలుగు – తీయదనం

Filed under: Uncategorized — Sriram @ 4:41 సా.

(భాషా దినోత్సవం సందర్భంగా….)

బ్రోచేవారెవరురా…అన్న కృతి మనందరికీ తెలిసిందే కదా. ఈ కృతి కర్త పేరు మైసూరు వాసుదేవాచార్య. ఈయన జన్మతః కన్నడిగుడు. కానీ రచించిన కృతులన్నీ తెలుగు, సంస్కృతంలలోనే.

అలాగే రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ….అంటూ కదనకుతూహల రాగంలో మనలని కదిలించిన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, పేరులోనే ఉంది కదా, తమిళుడు.

ఇంకా శ్యామ శాస్త్రి, పూచి శ్రీనివాస అయ్యంగార్ ఇలా ఎన్ని పేర్లైనా చెప్పుకోవచ్చు. వీరెవ్వరూ తెలుగు వారు కాదు. కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగులో మాత్రమే రచించిన వారు. అందుకే కర్ణాటక సంగీతంలో ఎనభై శాతం సాహిత్యం అంతా తెలుగులోనే ఉంది. దీనికి కారణం?

కారణం తెలుగు భాష తియ్యదనమే. సంస్కృతేతర భాషలలో గానానికి ఎక్కువ అనుకూలంగా ఉండే భాష తెలుగు భాషే. అందుకే “సుందర తెలుగులో” పాడమన్నాడు తమిళుడైన సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాషలో తియ్యదనం మిళితమై ఉంది. దీనికి కారణాలు నాకు తోచినవి రెండు రాస్తాను.

మన తెలుగు భాషలో పదాలన్నీ అచ్చులతో పూర్తి అవుతాయి. ఉదాహరణకి రామ,కృష్ణ అంటాం మనం. రామన్, కృష్ణన్ అనము కదా. ఇలా అచ్చులతో ముగించడం వల్ల భాషకి, అందులో పాటలకి ఎనలేని అందం వస్తుంది.పాటలో గమకాలు చక్కగా పలికించవచ్చు. దానితో పాట విన సొంపుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ పొల్లు మాటలే ఫ్యాషన్ అయ్యాయనుకోండి. రాహుల్, రోహిత్ ఇలాంటివేగా మన వాళ్ళ పేర్లు ఇప్పుడు. కానీ అవి తెలుగు మాటలు కాదని మనం అనుకోము. రాహులుడు అని పేరు పెట్టుకుంటే మరి అనాగరికం కదా.

మన తెలుగు భాషకున్న మరొక వరం ప్రధమా విభక్తి. చిన్నప్పుడు చదువుకున్నాం గుర్తుందిగా. డు,ము,వు,లు. అంటే మన పేర్లన్నీ రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాయిగా. “రాముడూ లోకాభిరాముడూ….” అంటూ పాడుకుని మనం మురిసిపోవచ్చు. ఈ ప్రధమా విభక్తి మన సోదర భాష ఐన కన్నడకి కూడా లేదు. అందుకేనేమో ఆ భాషలో కన్నా తెలుగులోనే రచన చేసారు వాసుదేవాచార్య లాంటి వాళ్ళు.

ఇదేదో నేను భాషా దురభిమానంతో రాసిన రాత కాదు. వందల సంవత్సరాలనుండీ అందరూ ఒప్పుకున్న విషయం. ఇంత అందమైన ఆంధ్రభాష మన మాతృభాషకావడం మన అదృష్టం.  

14 వ్యాఖ్యలు »

  1. nakU alaanE anipistundi okkOsaari 🙂

    వ్యాఖ్య ద్వారా swathi — ఫిబ్రవరి 20, 2007 @ 4:45 సా. | స్పందించండి

  2. ఇలా అచ్చుతో అంతమయ్యే గుణం వల్లే Italian of the east అన్నారు. ఇటాలియన్ కూడా అంతేనట. ఇలా అచ్చుతో అంతమయ్యే భారతీయ బాష ఇంకోటీ వుందట..పేరేంటబ్బా…దాంట్లోనేనట రామచరిత మానస్ రాసింది! మనము రాముడు, లక్ష్మణుడు అంటే ఆ బాషలో రామ, లఖణ అంటారట!

    –ప్రసాద్
    http://blog.charasala.com

    వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — ఫిబ్రవరి 20, 2007 @ 11:27 సా. | స్పందించండి

  3. తెనె కన్నా తీయనది మన తెలుగు భాష. కష్టపడి తెలుగు నేర్చుకుని అని వ్రాసారు. అందుకు నేనోప్పుకోను. ఎంత సుందరమైనదో,తెలుగు భాష అంత సులువైనది కూడా. శ్రీ కృష్ణదేవరాయులంతటి వారే “తెలుగు తేట….” అని తెలుగు భాష ఉన్నతిని, ఔన్నిత్యన్ని కొనియాడారు. భారతీయత అంటె గిట్టని ఇంగ్లిష్ వాడుకోడా తెలుగుని “ఇటలియన్ అఫ్ ది ఇస్ట్” అన్నాడు. అంతటి మహోన్నత భాషతో నేను నా తొలిపలుకులు పలకటం నేర్వటం గర్వకారణం కాకా మరేమిటి?

    వ్యాఖ్య ద్వారా valluri — ఫిబ్రవరి 20, 2007 @ 11:35 సా. | స్పందించండి

  4. మహా గొప్పగా వివరించగలిగారు మీరు. తెలుగు భాషని లెస్స అని ఏందుకు అన్నారో దాదాపు మీ పోస్టుతో ఇప్పుడు జనాలకి కొంచెం అర్ధం ఔతుంది. మీరు చెసిన కృషికి ధన్యవాదాలు అయ్యా.

    వ్యాఖ్య ద్వారా మధు — ఫిబ్రవరి 20, 2007 @ 11:47 సా. | స్పందించండి

  5. రాహుల్ రోహిత్‌ల దాకా ఎందుకయ్యా శ్రీరా’మా’! 🙂

    వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 21, 2007 @ 10:39 ఉద. | స్పందించండి

  6. మీ ఉద్దేశం మంచిదే అయినా, మీ గుండె సరైన చోట్లోనే ఉన్నా, తెలుగు భాష తియ్యదనానికీ, కర్ణాటక సంగీతం మన భాషకి వేసిన పెద్దపీటకీ కారణాలు మీరు చెప్పినవి కావని – భాషా శాస్త్ర వేత్త ఒకరూ, త్యాగరాజు నాటి దేశ కాల పరిస్థుతుల్ని పరిశోధించిన పండితులొకరూ చెప్పగా విన్నాను. నేనూ అప్పటిదాకా మీరు చెప్పిన కారణాలే నమ్మేవాణ్ణి.
    తియ్యదనానికి సంబంధించిన కారణం – పదాల కూర్పు, పలుకుబడి, నుడికారం, వీటన్నిటి మీదా ఆధార పడుతుందిట.
    ఇక కర్ణాటక సంగీత సాహిత్యానికి పునాది అవటానికి ఆ నాటి ఆర్థిక-సామాజిక-రాజకీయ పరిస్థితులు కారణం. మీరే ఆలోచించండి. కర్ణాటక సంగీతం ఒక రూపు దిద్దుకున్న కాలం – సంగీత త్రిమూర్తుల కాలంలో ఉన్న తంజావూర్ రాజులు మరాఠీలయినా, తెలుగు/తమిళ దేశాల్ని పాలించ వలసి వచ్చింది. వారికి ముందు రాజ్యమేలిన నాయక రాజులు తెలుగు వారు. వారి కాలంలో పటిష్ఠమైన అర్థిక, పరిపాలనా వ్య్వస్థ (revenue and administration) నెలకొల్పారు. ఆ వ్యవస్థకి వెన్నెముకగా నిలిచింది తెలుగు వారే. అలాగ, త్యాగరాజు నాటికి తెలుగు రాజభాషగా, పరిపాలనా భాషగా చెలామణిలో ఉండేది. అంతెందుకు, సుమారు 1905 లో సేలం లో పుట్టిన మా నాయనమ్మకు తెలుగులో అక్షరాభ్యాసం చేశారుట. సేలం, మదురై, తంజావూర్ మొ. నగరాల్లో పాత షాపుల మీద పేర్లు తెలుగులో ఉండడం చూశాను.
    నాకు మిగతా భాషల గురించి తెలియదు గానీ తమిళంలో ఆళ్వారులు, నాయనారులు రచించిన భక్తి కవిత్వం, త్యాగరాజు సమకాలికుడైన గోపాలకృష్ణ భారతి కృతులూ చాలా మధురంగా ఉన్నట్టే ఉంటాయి, అర్థం కాకపోయినా.
    అలాగే ఉర్దూ కవిత్వం కూడా వినడానికి నాకు చాలా బావుంటుంది.

    “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అనడం కూడా శాస్త్రీయ సంగీతానికీ తెలుగుకీ ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకునే అన్నారు – ట. ఆపెరాలు (Operas) ఎక్కువగా ఇటాలియన్ లో ఉంటాయి – ట.

    ఈ గొడవంతా రాసుకొచ్చింది – మీరు చెపుతున్న విషయానికి పుష్టి కలిగించడానికే కాని, దిగతియ్యడానికి కాదు. చివరికి ఇంటికి తీసుకెళ్ళే పాఠమేమంటే – భాష, సంస్కృతి లాంటి వాటివి పదికాలాల పాటు బతకాలంటే రాజాదరణ, దానితో కూడిన ఆర్థిక వ్యవస్థ (political need and economic incentive) ఉండాలి.

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 21, 2007 @ 10:50 సా. | స్పందించండి

  7. శ్రీరామ – నీ నామ మేమి రుచిరా! 🙂

    మొన్ననే నాగార్జునది శ్రీ రామదాసు సినిమా చూశాను.
    అయిదో కామెంటులో రానారె మంచి పాయింటు లాగాడు. :-))

    ఇలా హలంతాలయిన మొగపిల్లల పేర్లని దానికో దీర్ఘం తగిలించి పిలవటం నాకో సరదా. అది అలవాటుగా కూడా పరిణమించింది.
    శ్రీనివాసా, సురేశా .. ఇలాగ. ఇంతలో మా మరదలు గారింటికి వెళ్ళాం. వాళ్ళబ్బాయిని కూడా ఇదే పద్ధతిలో పిల్చాను. వాడు వెంటనే మూతి ముడుచుకున్నాడు, ‘అదేంటి పెదనానా, నా పేరు అమ్మాయి పేరు చేసేశావూ” అని. వాడి పేరు సుశీల్! :-))

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 21, 2007 @ 10:56 సా. | స్పందించండి

  8. అందరికీ ధన్యవాదాలు.
    వల్లూరి గారూ, కష్టపడి అని నేను అనడంలో ముఖ్య ఉద్దేశం వారి ప్రయత్నాన్ని పొగడడం మాత్రమే. వాసుదేవాచార్య కీర్తనలలో తెలుగు ఎంత మధురంగా ఉంటుందంటే, ఒక అన్య భాష కి చెందిన వ్యక్తి అంత ప్రజ్ఞ సంపాదించడానికి ఎంత శ్రమించాడా అని ఆశ్చర్యం వేస్తుంది నాకు.

    రానారె గారూ, మీరు వదలరు కదా…ఒప్పుకోక ఏం చెయ్యడం 🙂

    కొత్తపాళీ వారి వ్యాఖ్యలు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుపుతూ ఉంటాయి.
    మీరు చెప్పింది నిజమే. ముద్దు పళని వంటి తెలుగు కవయిత్రులు నాయక రాజుల కొలువులో వారే. అంత మాత్రం చేత తెలుగు అందాన్ని బొత్తిగా కారణం కాదనడానికి నాకెందుకో మనసొప్పదు. శ్యామ శాస్త్రి లాంటి వారికి రాజాశ్రయంతో పనేమిటి. పూచి అయ్యంగార్ ఎవరో తమిళ జమీందార్ ఆస్థాన విద్వాంసుడు. ఇంక కన్నడిగుడూ, 20వ శతాబ్దం వాడూ, మైసూరు ఆస్థానంలో వాడూ అయిన వాసుదేవాచార్య కి తెలుగుతో ఏమి అవసరం. కాదు ఇదంతా త్యాగరాజు మహిమ అంటారా, కాదనే మనసు నాకు లేదు.

    అన్నట్టు, సేలం ప్రాంతం ఇప్పుడు తమిళనాడులో ఉన్నా ఇప్పటికీ అక్కడ పాఠశాలలో తెలుగు బోధిస్తున్నారు.

    పాపం సుశీల్ బాధ నిజమే…సుశీలుడా అని పిలవండి ఈ సారి 🙂

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 21, 2007 @ 11:23 సా. | స్పందించండి

  9. తెలుగులో హలంతాల పేర్ల గురించి నా అభిమాన రచయిత శ్రీపాద వారిది ఒక చక్కని కథ ఉంది – “శుభికే శిర ఆరోహ” – అని. ఆ ఒక్క విషయాన్నే కాదు, తెలుగు వారు తమ భాషా సంస్కృతుల ఔన్నత్యం గుర్తించుకోలేక ఇతర సంస్కృతుల్ని అరువు తెచ్చుకుని నెత్తిన రుద్దుకోవటాన్ని అనితర సాధ్యమైన సునిశిత హాస్యంతో చురకలు వేస్తారు శ్రీపాద.

    భాషలో అందం ఉన్నదనే ఆలోచనని నేను కాదనలేదు – అది కేవలం పదాలు అచ్చులతో అంతమవ్వడం ఒక్కదాని వల్లే కాదు, అంతకంటే విస్తృతమైన కారణాలున్నాయి అంటున్నానంతే.

    కవులూ, వాగ్గేయకారులూ రాజాస్థానంలో ఉండక్కర్లేదు నేను చెప్పిన సిద్ధాంతం వర్తించడానికి. ఈ భాష బాగా వస్తేనే పండితుడు, ఈ భాషలో రాస్తేనే కవి అనే భావం సంఘంలో ప్రబలి ఉంటే, పండిత కుటుంబంలో పుట్టిన పిల్లాడు సహజంగా ఆ భాషనే నేర్చుకుంటాడు, కవి అయ్యాక ఆ భాషలోనే రాస్తాడు. గాంధీ గారి ఉద్యమంతో తెలుగు వారు రెచ్చిపోయి హిందీలో రచనలు చెయ్యటం కొంత వరకూ ఇలాంటిదే. శ్రీపాద ఈ వేలం వెర్రినిగూడా ఏకారు పైన చెప్పిన కథలో.

    వాసుదేవాచారి గారి వంశం గురించీ, గురు పరంపర గురించీ నాకు తెలీదు. ఆయన బాగా ఇటీవలి వారని తెలుసు – ఇరవయ్యో శతాబ్దం వచ్చాకే పోయారాయన. మరి ఆయనకి తెలుగు ఎలా అలవాటయిందో. ఆయన సంస్కృతంలో కూడా బాగా రాసినట్టున్నారు – శ్రీ హరి వల్లభే అని శ్రీ రాగంలో లక్ష్మీ దేవి మీద – డి. పశుపతి గారు పాడగా ఎప్పుడో విన్నాను – ఇప్పటికీ గుర్తుండి పోయింది. అన్నట్టూ, పశుపతి గారు ఈయనకి డైరెక్ట్ శిష్యుడు, గురువు గారి కృతుల్ని గొప్ప భక్తితో, రసవంతంగా పాడేవారు. అంతెందుకు, మొన్న మొన్నటిదాకా ఉన్న ఎం.డి రామనాథన్ గారు తెలుగు, సంస్కృతం, తమిళం మూడింట్లోనూ కృతులు రచించాడు, మాతృభాష అయిన మలయాలం ఒదిలేసి. శెమ్మంగూడి శ్రీనివాసయ్యరుకీ తెలుగు బాగా వొచ్చు, నేను మాట్లాడాను, కాపోతే బాగా తమిళ యాసతో మాట్లాడారు.

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 22, 2007 @ 2:06 ఉద. | స్పందించండి

  10. శ్రీరామ్ గారూ…

    మాబాగా చెప్పారు.ఇది చదువుతూంటే మొన్న త్రివిక్రముడి ‘అవీ-ఇవీ’లో నా వ్యాఖ్య మీతో పంచుకోవాలనిపిస్తోంది-
    “మరోమాట మన తెలుగుకు ‘తేనెలొలుకు తెలుగు’,’Italian of the East’ అన్న నానుడి వచ్చింది ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది కాబట్టి కానీ మన పేర్లేమో…’సురేశ్’,’కిరణ్’,’ఇస్మాయిల్’,’త్రివిక్రమ్’,’వార్తిక్’,’ప్రసాద్’…ఇలా ఆశ్చర్యంగా లేదూ? రానారె,రవి,బా.సు.గార్లవి మాత్రం అచ్చ తెలుగు పేర్లని అనగలమా?”

    కొత్తపాళీ గారు…

    బాగా చెప్పారు.తెలుగు తియ్యదనానికి తిరుగులేదు.
    మీరు చెప్పిన కాలమాన పరిస్థితులు భాషా వ్యాప్తికి దోహదపడతాయి. తమిళులు-కన్నడిగులు మన తెలుగును అంతగా ఆదరించడానికి ఒక కారణం అదే!
    దీనికి నిదర్శనం మన కళ్లెదుటే ఉంది… ఎన్నెన్నో ఉర్దూ/పారశీక పదాలు తెలుగులో ఇలానే ప్రవేశించాయి.ఎందుకు అంటే ఆ కాలంలో అది అధికార భాష, ఉద్యోగం సంపాయించి పెట్టే భాష(ఉదా.తెలంగాణా తెలుగు)
    మరి ఇప్పుడు తెలుగాంగ్ల మనే కొత్త భాష అవతరించడానికి అదే కారణం.’శోధన’ గారు చెప్పినట్టు మనవాళ్లకు ఇప్పుడు తెలుగులో హల్లులు నాలుగట!ఆంగ్లం ఇప్పుడు రాజభాష కాకపోయినా ఉద్యోగం సంపాయించిపెట్టే భాష.అందుకే ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి పెరిగి తెలుగు మాధ్యమంలో చదివే వారు తక్కువయ్యారు.నేనూ ఆ గూటి పక్షినే!(చిన్నప్పటి నుంచి నాదీ ఆంగ్ల మాధ్యమమే…కానీ భాషాభిమానం మెండుగా కలవాన్ని కాబట్టి అప్పుడప్పుడూ నా తెలుగుకు సానపెడుతూంటాను.) తెలుగును ‘ఇంటర్’ వరకూ తప్పనిసరి చేయాలి, అందులో మార్కులకు విలువ ఇవ్వాలి అప్పుడైనా భాషను మరీ ఇంతలా మరచిపోరు.(తమిళ,కన్నడ ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయని విన్నాను.)

    వ్యాఖ్య ద్వారా డా.ఇస్మాయిల్ పెనుకొండ — ఫిబ్రవరి 22, 2007 @ 2:33 ఉద. | స్పందించండి

  11. మీ భావం అర్ధమైందండీ. నేను కూడా నాకు తోచినవి రెండు అనే రాసాను.

    శ్రీపాద వారు అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించా…కృష్ణమూర్తి శాస్త్రి గారా?

    వాసుదేవాచారి గారు త్యాగరాజ శిష్యపరంపరలో వారు. తిరువయ్యూరు వెళ్ళి పట్నం వారి దగ్గర నేర్చుకున్నారు. ఈ సారి ఎప్పుడైనా ఆ కబుర్లు చెప్పుకుందాం.

    ఇస్మాయిల్ గారూ, చాలా చక్కగా చెప్పారు. నేను విన్నది ఏమిటంటే ఈ సంస్కృతం ఇంగ్లీషులో రాసే పప్పులు ఇంక ఉడకబోవని. వచ్చే సంవత్సరం నుంచి పదవ తరగతి వరకూ తెలుగు చదివిన వారు ఇంటర్ లో కూడా తెలుగే చదవాలిట.

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 22, 2007 @ 11:22 సా. | స్పందించండి

  12. కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి.
    కృష్ణమూర్తి శాస్త్రిగారి పేరు విన్నాను, సంస్కృతాంధ్రాల్లో మహా విద్వాంసులని గుర్తు. అంతకంటే తెలీదు.

    వాగ్గేయకారుల చరిత్రలు కూడా తెలీవు, ఏవో ప్రచారంలో ఉన్న పిట్టకథలు తప్ప. ఒక్క త్యాగయ్య విషయం మట్టుకు కొంచెం అధ్యయనం చేశాను. దీనికి తోడు నా చిన్నప్పుడు విజయవాడలో ములుకుట్ల సదాశివశాస్త్రిగారి త్యాగరాజ హరికథలూ, వయొలిన్ విద్వాంసులు అరిపిరాల సత్యనారాయణ మూర్తి గారి బోధలూ త్యాగయ్య విషయాలు కొన్ని మనసుకి హత్తుకునేలా చెప్పాయి.
    అలాగె, మీరన్నట్టు – ఆ విషయాలు మరోచోట సమయోచితంగా మాట్లాడుకుందాం.

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఫిబ్రవరి 23, 2007 @ 8:40 సా. | స్పందించండి

  13. శ్రీరామా, ఛలోక్తిని అలాగే స్వీకరించినందుకూ, ఈ సజ్జనసాంగత్యంలో నన్నూ చేర్చుకొన్నందుకూ మీకు నా కృతజ్ఞతలు.

    వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 24, 2007 @ 1:57 ఉద. | స్పందించండి

  14. “ఈ సజ్జనసాంగత్యంలో నన్నూ చేర్చుకొన్నందుకూ మీకు నా కృతజ్ఞతలు”…ఈ మాట నేననాలండీ…

    వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 7, 2007 @ 4:28 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to Sriram స్పందనను రద్దుచేయి