మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా…
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందెనటుగాన
అని అన్నమయ్య పాడుకున్నాడంటే, ఆ రోజుల్లో ఆ వెంకటపతి సేవలో తరించే వారి జీవితం ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. కానీ ప్రజాతంత్రపు ప్రతినిధిత్వాన్నే ఆధిపత్యంగా మార్చుకున్న నాయకుల దయాదాక్షిణ్యాల మీద భగవత్సేవకుల జీవితాలు ఆధారపడి ఉన్న ఈరోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉందా?
తరతరాలుగా స్వామివారి సేవలో తరిస్తున్న కుటుంబాలని ఆలయ వ్యవహార విషయాలలో పూచికపుల్లలాగా తీసి పడేసి, ఆగమ విషయాల గురించిన కనీస జ్ఞానంలేని అయ్యేయెస్ ఆఫీసరుని వాళ్ళ నెత్తిమీద కూచోబెట్టీ, వీళ్ళందరి మీద ఆధిపత్యం చెయ్యడానికి కొంత మంది రాజకీయుల్ని తోలి వినోదం చూస్తున్న నాయకులన్న ఈరోజుల్లో వారికి దైన్యం తప్ప ఏం మిగిలింది?
ఒక్క జీవోతో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలనీ హక్కులనీ తోసిపడేయగలమన్న పొగరుతో విర్రవీగుతున్న రాజకీయ నాయకులని చూసి వీరంతా భయంతో వణకరా? ఒకరి ఉద్యోగమో జీవితమో కాదు, వారి వంశపు భవిష్యత్తు మొత్తం వీరి చేతుల్లో లేదూ? అసలు ఇటువంటి పరిస్థితికి కారణం ఏమిటి?
అర్చకులైనా, ప్రభువులైనా ప్రాధమికంగా మనుషులే. పూర్వకాలంలోనైనా ఇప్పుడైనా వారి ప్రాధమిక తత్వం స్వయం లాభమే అయి ఉంటుంది. వీరెవరూ బ్రహ్మజ్ఞానులు కారు సాధారణంగా. ఐతే పూర్వం రాజులకి నిరంకుశాధికారం లేదా? ఇప్పటికన్నా ఎక్కువేనే?
పూర్ణకుంభాల స్వాగతాలు పూర్వకాలంలో పుట్టిన సంప్రదాయమే. రాజుకూ, అధికారులకూ కొంత అధికారం ప్రాధాన్యత అప్పుడూ ఉండేది. కానీ తేడా ఏమంటే, స్వామి వారి సేవలో ఉండే వారికి పరిపూర్ణమైన స్వేచ్చ, నిర్భీతి ఉండేవి.
ఇవి ఎలా సాధ్యమయ్యేవి? ఇటువంటి స్వేచ్చ, నిర్భీతత్వం కలిగి ఉండడానికి వారి నిష్ట, జీవన విధానం ఒక కారణమైతే అప్పటిలో పాటించిన ధర్మశాస్త్రాలు, సాంఘిక కట్టుబాట్లూ మరొక కారణం.
ఆచార వ్యవహారాలనీ, ధర్మశాస్త్ర విషయాలనీ సమన్వయంతో అర్ధం చేసుకోకుండా అనాగరికత ముద్ర వేసి, సినిమాలు తీసి వెక్కిరించి వాటి పైన గౌరవాన్ని సంఘంలో నాశనం చేసి కుదిరినచోటల్లా చట్టాలు తెచ్చి తొక్కిపడేసిన ఈరోజుల్లో సాధ్యమవ్వడం ఎలా?
ఒక ఉదాహరణ గుర్తు వస్తోంది. నవాబు ఇచ్చిన తాంబూల సత్కారం గ్రహించినందుకు ఒక సంగీత విద్వాంసుడి కుటుంబానికి సంఘ బహిష్కరణ విధించిన వారణాసి పండితుల విజ్ఞతని ప్రశ్నించే మనం, స్వలాభం కోసం అప్రాచ్యుల ప్రాపకానికి పోకుండా ఇటువంటి కట్టుబాట్లు ఎక్కువమంది ప్రజలని ఆపి ఉంచాయన్న విషయం గ్రహించలేకపోయాం.
పవిత్రమైన బాధ్యతలున్న మనుషులకి పెట్టిన కట్టుబాట్లూ నియమాలూ ఇందుకు కాదూ? ఎవరైనా నియమం నిష్టాతో బ్రతుకుతుంటే అది ఒక వివక్ష చూపించడం అని నానాయాగీ చేయడం మనకి సరదా. మడికట్టుకోవడం అనే పదాన్ని అపహాస్యం చేయడానికే వాడుతున్నాం కదా?
ఆచార వ్యవహారాలూ సంప్రదాయాలూ వద్దనుకున్నప్పుడు చిత్తశుద్ధి మాత్రం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించి నెలకొల్పిన వ్యవస్థలని అప్రాచ్యుల పాలనలో సంపాదించిన మిడిమేలపు జ్ఞానపు కొలబద్దలతో కొలిచి చట్టాలను చేసిన మేధావులకి ఏం తెలుసు ?
ఆలయ ధర్మకర్తగా ఉన్నవాడికి కుక్కజన్మ లభిస్తుందని అనడం వినే ఉంటారు. అంతెందుకు అర్చకత్వానికి కూడా సంప్రదాయంలో ఎక్కువ గౌరవ ప్రదమైన స్థానం లేదు. భగవత్సేవ ద్వారా జీవనభృతి సంపాదించుకోవడం ఒకటైతే, దేవాలయ వ్యవస్థలో ఉండే వ్యక్తులు అత్యంత విరాగులూ బ్రహ్మజ్ఞానులూ ఐతే తప్ప ఎంతో కొంత మనుష్య సహజమైన లాలసత్వం వల్ల తప్పులు జరుగుతాయనే భావన మరొకటి.
ఐతే కాలానుగుణంగా ఈ వ్యవస్థని సంస్కరించుకుంటూ తగినన్ని కట్టుబాట్లతో కుదిరినంత ఉత్తమంగా తీర్చిదిద్దుకోకుండా మరింత దిగజార్చి, వ్యవస్థలోని వ్యక్తులు మాత్రం ఉత్తమంగా ఉండాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
విష్ణోర్బలం ప్రవర్ధతాం.
స్వస్తి.
ఏప్రిల్ 9, 2021
మనుజుడై పుట్టి మనుజుని సేవించి…
నవంబర్ 9, 2020
నోట్లరద్దు 2016 గురించి…
నేను ఒక సగటు భారతీయుణ్ణి మాత్రమే. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి ఆవేశకావేశాలు నాకులేవు. ట్విట్టర్లో కొంతమంది లాగ ఆ రంగాలలోని వారితో పరిచయాలుండడం వాట్లలోని లోగుట్టులు తెలియడం వంటి పరిస్థితి కూడా కాదు.
నోట్ల రద్దు జరిగినప్పుడు చాలా మంది నాకులాంటి వాళ్ళలాగే ఇదేదో మంచికోసమే అనుకున్నాను. మావొక ఇరవైవేలు పోగొట్టుకోవలసి వచ్చినా దేశంకోసం అనుకుని ఊరుకున్నవాడినే.
నెమ్మదిగా అందులో జరిగిన లోటుపాట్లు కొన్ని బయటకొచ్చాక, మళ్ళీ నేను కూడా చాలా మంది నాకులాంటి వాళ్ళలాగే ఇది సఫలం కాలేదు అనే అనుకున్నా. చెప్పకపోవడమే, ఈ మార్చి వరకూ నేను యూపీఐ వాలెట్లు కానీ కనీసం పేటీయెం కానీ వాడలేదు.
ఐతే నాకు తెలీకుండా భారతదేశంలో ఎంత ఆర్ధిక విప్లవం జరిగిందో నాకు ఈ మార్చిలోనే తెలిసొచ్చింది.
“పనికిరాకపోయినా జీతమిస్తాన్నారుగా, ఇదిగోనండి నా ఫోన్ నంబర్ దీనికి వేసెయ్యండి” – పనమ్మాయి
“సార్! నెల రోజులుగా పనేం లేదు కొంత ఏమైనా సహాయం చెయ్యండి. నా ఫోన్ నంబర్‌కి వేసిపెడతారా?” – ఇస్త్రీ చేసే అబ్బాయి
“మా అబ్బాయి నిన్న అమెరికా నుంచి ఫోన్లో చెప్పాడు – నా పెన్షన్ పడిందో లేదో ఫోన్ పే లో చూసుకోవచ్చుట కదా. అదేదో కాస్త ఈ ఫోన్లో పెడుదు బాబూ” – పక్కింటాయాన
“ఒరేయ్! మాస శివరాత్రి అభిషేకానికి పూజారిగారికి డబ్బులు పంపాలి, ఆయన ఫోన్ నంబర్‌కి వెయ్యమని ఇప్పటికి రెండుసార్లు చెప్పా. నా ఫోన్లోనే ఆ యాప్ ఏదో ఇన్ స్టాల్ చెయ్యి నేనే చేసుకుంటా” – నాన్నగారు
ఇవన్నీ చూసాకా నాకు అనిపించిది ఏమిటంటే, భారతదేశంలో నగదు చెల్లించడంలో సమూలమైన మార్పులు వచ్చాయని. బండిమీద పుల్లట్లమ్మే ఆవిడ దగ్గరనుంచి, ఇల్లు కదలడానికి భయపడే వృద్ధుల వరకూ అందరూ ఎంతో సులభంగా సాంకేతికతని వాడుకుంటున్నారు. నామటుకు నేనే ఒక అరడజను పెద్దవాళ్ళకి ఫోన్ పే/ జీ పే లాంటివి వాడడం నేర్పించి ఉంటా. వాళ్ళెంతో తెలివిగా వాడుకుంటున్నారు కూడా.
ఇంత విప్లవం జరగడానికి రెండు ముఖ్య కారణాలు. అందరికీ బేంక్ సేవలు అందు బాటులోకి రావడం ఒకటి. నోట్ల రద్దు వల్ల ఈ యాప్‌లకి లభించిన ఊతం మరొకటి.
ఆ రకంగా నోట్లరద్దు ఉపయోగపడిందని మాత్రం నా భావన.
ఇప్పటిదాక వచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఎక్కువ పాశ్చాత్యదేశాలలో వారి సమాజానికి అనుగుణంగా వచ్చినవి. ఈ నగదుచెల్లింపుల విప్లవం మాత్రం మన సమాజం నుంచి పుట్టినది. దీని గురించి తప్పక గర్వ పడవచ్చు. కొంత కృతజ్ఞత మోడీకి కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంకో ఏడాది తర్వాత రెండువేల నోట్ల రద్దు చేపడితే మంచి ఫలితం వస్తుందని ఆశించే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే అసలు 500 రూపాయల నోటు వాడాల్సిన అవసరమే కనపడనప్పుడు 2000 రూపాయల నోటురద్దు చేస్తే ఏమిటిట సమస్య? చాలా సులభంగా అమలు చెయ్యచ్చు. అంతవరకు అది సఫలమే.
ఐతే ఈ రకమైన విప్లవం రావడానికి ఇదొక్కటే మార్గమని కానీ, నోట్లరద్దు వల్ల ప్రజలకి నష్టం జరగలేదని కానీ నేను అనట్లేదు. పైగా – మోడీ మంచివాడా మోసగాడా, నిజంగా మంచి చేస్తాడా – ఈ విషయంలో నాకు ఎటువంటి విషయ పరిజ్ఞానం, దానివల్ల కలిగే అభిప్రాయం – పూర్తిగా లేవు. ఇది ఇంతవరకే.
సెప్టెంబర్ 8, 2020
భరతవర్షే, భరతఖండే…కృష్ణాగోదావరీ మధ్యప్రదేశే
భరతవర్షే, భరతఖండే అని సంకల్పం చెప్పించిన పెద్దలు నా విధేయతలు ఎక్కడ ఉండాలో చెప్పనే చెప్పారు. ఐతే అక్కడితో ఆగకుండా శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే కృష్ణాగోదావరీ మధ్యప్రదేశే అని కూడా చెప్పుకోమన్నారు.
అందుచేత భారతీయుడినైనందుకు ఎంత గర్వ పడతానో, తెలుగువాడిగా పుట్టినందుకు అంతగా సంతోషపడతాను.
అంతమాత్రం చేత నా భాషనే భారతీయులందరూ మాట్లాడాలనుకోను. ఎవరి స్థానిక సంస్కృతులు వాళ్ళవి. అవి ఒకరివొకరు గౌరవించుకోవలసిందే. పిల్లలకి ఆంజనేయ దండకంతో పాటు హనుమాన్ చాలీసా కూడా నేర్పడం నాకు ఎంతో ఆనందం.
ఇటువంటి భావనల వల్లే మన సమైక్యత వర్ధిల్లింది. ఉదాహరణకి తరతరాలుగా తెలుగునేలకీ వారణాశికీ ధృఢమైనబంధం ఉంది. అప్పటికి నేటి హిందీ భాషలేదు. సంస్కృతమే ఈ బంధాన్ని కట్టి నిల్పింది. ఎందుకంటే సంస్కృతం కేవలం భాషకాదు, అది మనందరి ఉమ్మడి వారసత్వం.
ఆ వారసత్వ భావనలేనప్పుడు, ఏదైనా పరాయిదానికిందే అనిపిస్తుంది. హిందీతో వచ్చిన చిక్కు ఇదే. ఐతే ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నారన్నది ప్రశ్న. నాకనిపించేది ఏమిటంటే ఆంగ్ల భాష తన విలువని విద్యా, వైజ్ఞానిక,వాణిజ్యపరంగా పెంచుకుంది కనక. ప్రత్యేకించి ప్రస్తుత ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా వారు మాట్లాడే భాష కనుక. దాని వల్ల ప్రజలకి లౌకిక ప్రయోజనాలు కళ్ళముందే కనపడుతున్నాయి కనుక.
హిందీ భాష నేర్చుకోవడంవల్ల ఇటువంటి ప్రయోజనాలేవీ లేవు. లౌకిక ప్రయోజనాలు పక్కనపెట్టి చూసినా, సాంస్కృతికంగా కూడా దానికి ఎక్కువ విలువ కనపడదు. తెలుగు వంటి కావ్య సంపద, వారసత్వం దానికి లేదు. ఈ భాష మనుగడ మొదలయ్యే రెండు మూడు శతాబ్దాలైందేమో అంతే. అందుచేత బలవంతంగా ప్రజలకి ఎక్కించాల్సిందే. ఇంగ్లీషు ఉపాధ్యాయుడి గా పనిచేసే మా నాన్నగారు, మా చిన్నతనంలో హిందీ ప్రాధమిక, మధ్యమ పరీక్షలు వ్రాసారు – ఒక ఇంక్రిమెంటు కలుపుతారని. అది గుర్తొస్తుంది నాకు.
అందుచేత అనవసరపు హిందీ గొడవలలో కాలం వృధా చేయకుండా, ఆ వనరులన్నీ సంస్కృతానికి పూర్వ వైభవం తేవడానికి ఉపయోగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. సంస్కృతభారతి లాంటి సంస్థలు సాధిస్తున్న అధ్భుతాలు చూస్తే నాకు ఇది సాధ్యమే అనిపిస్తుంది. భారతదేశపు సత్తాని విశ్వవీధిలో చాటగలిగే సత్తా సంస్కృతానికి మాత్రమే ఉంది.
ఇంకొక్క విషయం గురించి వ్రాస్తాను. హిందీని ప్రోత్సహించడం వల్ల తెలుగు భాషకి ఏమి నష్టం అన్న ప్రశ్న. మామూలుగా ఐతే ఏమీ నష్టంలేదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల భాషా బోధనని ఆపే, నిరుత్సాహపరిచే పరిస్థితి లేదు. అందుచేత దానికి సమాన స్థాయిని ఇస్తేనే మాతృభాషలకి మనుగడ సాధ్యం. వేరే ఏ భాష ఐనా మాతృభాష తర్వాతి స్థానంలోనే ఉండాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వపు విధానాలుంటే రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి. లేకపోతే కూలీలుగా మారుతున్న తెలుగు ఆచార్యుల కధలు మనం ఇంకా ఇంకా చూడవలసి వస్తుంది. మహామహులైన ఎస్వీ జోగారావు గారి దగ్గర శిష్యురాలిగా పీహెచ్డీ పుచ్చుకున్న మా చిన్న అమ్మమ్మ గారు ఒక ఎయిడెడ్ కాలేజీలో కూలిపనులకి లభించే దానికన్నా తక్కువ వేతనానికి పనిచేసి పదవీ విరమణ చేయడం మా కుటుంబంలో నాకు అనుభవమే. ఇటువంటి పరిస్థితికి కారణం స్థానికభాషల పురోగతికీ, సంరక్షణకీ ఉపయోగపడేలా ప్రభుత్వ విధానాలు లేకపోవడమే. సెంట్రల్ బోర్డుని అనుసరిస్తున్న పాఠశాలలు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ విధానాలు దీనికి సహాయపడట్లేదు. మాతృభాషల గురించి ఈ సెంట్రల్ బోర్డు వారికి ఏమీ పట్టదు (వీట్లలో కేంద్రీయ విద్యాలయాలది ఇంకా విపరీత ధోరణి. ఢిల్లీలో వర్షం పడితే వీళ్ళిక్కడ గొడుగులెత్తుతూ ఉంటారు).
చెప్పొచ్చేదేమిటంటే హిందీ నేర్పే ముందు పిల్లలు మాతృభాషని నేర్చుకునేలా చెయ్యడం ముఖ్యం అని. దేశ సాంస్కృతిక సమైక్యతకోసం సంస్కృతభాష మీద దృష్టి పెట్టమనీను.
ఫిబ్రవరి 25, 2020
తెనాలి రాముడి దేవీ ఉపాసన
పూర్వకవులలో అమ్మవారి సాక్షాత్కారం పొందినట్టుగా మనం చెప్పుకునేవాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరూ చాలా పేరు పొందినవాళ్ళే. ఒకరు సంసృతకవి కాళిదాసు కాగా ఇంకొకరు మన తెనాలి రాముడు.
వీళ్ళిద్దరూ రచించిన గ్రంధాలేవీ అమ్మవారికి సంబంధించినవి కావు. కానీ కాళిదాసు పేరువల్ల, రచించిన శ్యామలాదండకం, అశ్వధాటి, లఘుస్తుతి వంటివాటివల్ల ఆయన దేవీ ఉపాసకుడని మనకు కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. మరి తెనాలివారి సంగతి? ఈయన శైవుడా, వైష్ణవుడా – రామకృష్ణుడా లేక రామలింగడా అని కొంత చర్చ జరిగింది కానీ దేవీ ఉపాసన గురించిన విషయాలు ఎవరూ చర్చించినట్టులేదు. ఐతే అమ్మవారు కనిపించి పాలగిన్నా పెరుగుగిన్నా అని అడగడం, ఈయన రెండూ కలుపుకు తాగెయ్యడం కట్టుకధేనా? కధ సంగతి పక్కన పెట్టినా, అసలు ఈయన దేవీ ఉపాసకుడా కనీసం? చిన్న పరిశోధన చేద్దాం.
తెనాలి రాముడి కవిత్వం,పాండిత్యం ఎంత గొప్పవైనా ఆయన హాస్యచతురత ఇంకా ఎంత గొప్పదంటే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాతకూడా ఆయన హాస్యమే ప్రజలని ఆకర్షిస్తూ ఉంది. అమ్మవారే వికటకవిగా దీవించారని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఋజువుకావాలి?
ఐతే తెనాలి రాముని కవిత్వం, ఆయన రాసిన పాండురంగమహత్యం కొద్దిగా పరిశీలిస్తే ఆయన అద్వైతుడని వెంటనే తెలుస్తుంది. కావ్యారంభంలో లక్ష్మీ నారాయణులతో పాటు, శివపార్వతులని కూడా స్తుతించాడు. పైగా ఈయన ఎంత స్థితప్రజ్ఞుడంటే ప్రార్ధన కూడా, తనకోసం, తనకావ్యం కోసం చెయ్యలేదు. కృతి ఇచ్చిన విరూరు వేదాద్రి మంత్రి కోసం చేసాడు. ఈ వేదాద్రిగారు ఎవరయ్యా అంటే ఒక వ్రాయసకాడు. అంటే గ్రంధాలని తాటియాకుల మీద వ్రాసే పని చేసేవాడు. ఒక కృతిని అంకితం ఇవ్వడానికి ఇంతకన్నా అర్హుడు ఎవరుంటారు? ఐతే ప్రజలకి ఇందులో కూడా హాస్యమే కనపడింది. రాసేవాడికి అంకితం ఇస్తే ఆయనే బోలెడు ప్రతులు రాసిపెడతాడు కదా అని తెనాలి రాముడి ఆలోచన అన్నారు.
విషయానికి వస్తే, తెనాలి రాముడి దేవీ ఉపాసన గురించిన ఆధారం పాండురంగమహత్యం మొదటలోనే కనిపిస్తుంది. నాల్గవ పద్యం, ఈయన చేసిన సరస్వతీ ప్రార్ధన:
కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబినీ చంద్రికా
జిద్రూపాంచిత పద్మగర్భ ముఖ రాజీవావళీహంసి వ
ర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్షులన్!
తెనాలి రాముని కవిత్వంలో ఉన్న విశిష్టత మొత్తం ఈ పద్యంలొ చూడచ్చు. ఆయన వాడే ఉపమానాలు, ప్రయోగాలు చాల విశిష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి శివుడిని కద్రూజాంగదుడు అన్నాడు – కద్రువ పిల్లలు నాగులు, అవి అంగదములుగా అంటే ఆభరణాలుగా గలవాడు, శివుడు.
సరే పద్యానికి సారం ఏమిటంటే వేదాద్రి మంత్రికి శారదా దేవి విద్య, బుద్ధి, వాక్సిద్ధి ప్రసాదించుగాక అని. ఐతే ఇదేదో అల్లాటప్పా దీవెన పద్యం కాదు. శారదా స్వరూపాలలో
విద్యనిచ్చేది – సరస్వతీ దేవి
బుద్ధిని ప్రచోదనం చేసేది – గాయత్రీ దేవి
మాటకి సిద్ధి ఇచ్చేది – మంత్ర స్వరూపిణి శ్యామలా దేవి
ఈ ముగ్గురి తత్వాలని ఎలా చూపించాడో చూడండి. భాగవతం ప్రకారం బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టినప్పుడు నుదుటినుంచి రుద్రుడు పుట్టాడు, ఆ తర్వాత మనసు నుంచి సరస్వతీ దేవి పుట్టింది. అందుకే శివుడి తోబుట్టువు సరస్వతి గనుక, మొదటి పాదంలో అది గుర్తు చేసాడు. ఆవిడ శుద్ధమైన విద్యా/జ్ఞాన స్వరూపం గనక తెల్లని శరత్కాల మేఘాలతో పోలిక.
ఇంక రెండవపాదంలో పద్మగర్భ ముఖ రాజీవావళీ హంసి – బ్రహ్మగారి ముఖాలనే పద్మాలలో తిరిగే హంస అన్నాడు. బ్రహ్మగారి 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి కదా. ఆ వేదాలలో తిరిగే హంస గాయత్రీ శక్తి. బుద్ధిని ప్రచోదనం చేసేది ఈవిడే.
ఇక మూడవపాదంలో చెప్పినది, వర్ణద్రాక్షాఫలకీరి – అక్షరాలనే ద్రాక్ష పళ్ళని మెక్కే చిలుక(ఎంత ఆగుదామన్నా హాస్యప్రియత్వం దాగదు). అమంత్రమక్షరం నాస్తి అనికదా. అంటే అక్షరాలన్నీ మంత్రములే. పైగా ద్రాక్షపళ్ళతో పోలిక అంటే బీజములు/గింజలు ఉన్నవి బీజాక్షరాలకి సూచన కదా. గుత్తులుగా ఉండేవి, అంటే బీజాక్షరాల గుత్తులు – మంత్రాలు. ఆ మంత్రాలతో నిండిన స్వరూపమే శ్యామలాదేవి. పైగా చిలుక – ఈవిడకి సంకేతమే. శుకశ్యామల అని ఒక స్వరూపం కూడా ఉంది.
దీనిని బట్టి చూస్తే తెనాలి రామునికి శ్యామలా ఉపాసనా విషయాలమీద పరిజ్ఞానం ఎంత ఉందో తెలుస్తోంది. ఈయన పద్యాలలో చిలుకని ఎన్నిసార్లు ప్రస్తావిస్తారంటే తప్పక శుకశ్యామలా ఉపాసకుడేమో అనిపిస్తుంది. పార్వతీ ప్రార్ధన, పరమేశ్వర ప్రార్ధన కూడ మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఇంకోసారి.
ఇంకొక విషయం ఏమిటంటే, తెనాలి రాముడు రచించిన ఉద్భటాచార్య చరిత్ర అనే గ్రంధాన్ని యూరె దేచనమంత్రికి అంకితం ఇచ్చాడు. దేచనమంత్రి గొప్ప పండితుడు. శంకరాచార్యుల సౌందర్యలహరికి అధికారికమైన వ్యాఖ్యానం రాసిన లొల్ల లక్ష్మీధర పండితుడి శిష్యుడు. ఇలాంటి వారితో సాహచర్యం ఉన్న తెనాలి రాముడికి దేవీ ఉపాసనా రహస్యాలు తెలవడం విచిత్రమేమీ కాదు కదా.
మన కవుల ప్రజ్ఞా పాటవాలు ఎంతగొప్పవో ఇలాంటి ఒక్క పద్యం చూస్తే తెలుస్తుంది. ప్రయత్నించి అర్ధం చేసుకోగలగాలి కానీ ఎంతలోతుకెళ్ళినా అంతం ఉండదు. అందుకే అవి ఆలోచనామృతాలు.
జనవరి 15, 2020
భోగిమంటలూ – భూతాపమూ !
తాతయ్యా, ఇదే నేనూ ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అశ్విన్ చెప్పాడు చూడు. భోగి మంటలవల్ల భూతాపం పెరిగిపోతోంది.
ఓహో ఎవరీ అశ్విను?
ఇంకెవరు, క్రికెట్ ఆటగాడు, స్పిన్నర్.
ఓహో ఆటగాడా, ఆటగాళ్ళకి చదువు తక్కువరా, అందుకే ఇలాంటి విషయాల్లో వాళ్ళమాటలకి విలువివ్వకూడదు.
నీ వెటకారాలకేం కానీ, భూతాపం పెరిగిపోడం ఎంతపెద్ద సమస్య! బొత్తిగా సామాజిక బాధ్యతలేకుండా మాట్లాడకు.
అబ్బా, తమరికి ఎక్కువైపోయింది. తిండి తినడానికి వంటగేస్ తో పాటు స్విగ్గీవాడి పెట్రోలు కూడా తగలేస్తున్న రకాలు, మీరు కూడా మాట్లాడడమే!
పంచ్ డైలాగ్ కొట్టడం కాదు, పాపం చెన్నైలో వాళ్ళ ముక్కులు తెగ ఇబ్బంది పడ్డాయిట. నీదేం పోయింది.
ఒరేయ్! అసలు భూతాపం పెరగడానికి కారణమేమిటో నీకు గాని ఆ అశ్వినుడిక్కానీ తెలుసా?
ఎందుకు తెలీదు? గ్రీన్ హౌస్ గేసెస్. మనవల్లే అవి ఎక్కువైపోతున్నాయి.
కదా! ఐతే నీకు తెలీని ఒక విషయం ఏమిటంటే, ఈ ఉద్గారాలు కేవలం గత శతాబ్దన్నర కాలంగానే పెరగడం మొదలెట్టాయి. అంతకుముందు వీటి పరిమాణం స్థిరంగానే ఉండేది. గత శతాబ్దన్నరకాలంగా జరిగిన వనరుల దురుపయోగాలే దీనికి కారణం గానీ భోగిమంటలు కాదు. మా భోగిమంటలు గత కొన్ని శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం.
ఔనా! ఈ విషయం నాకు తెలీదే! ఆగు వికీపీడుయా చూస్తాను.
ముందు నీ మొహం చూసుకో అద్దంలో. కనీసం కామన్సెన్సు వాడద్దూ కామెంట్ చేసే ముందు? కనీసం అద్దాలు దింపుకుని ఏసీ కట్టుకుని కూడా కారులో వెళ్ళలేరు ఈ సెలబ్రిటీలు, వాళ్ళుకూడా మాట్లాడడమే? ఒక్కక్కళ్ళనీ వాళ్ళింటి కరెంటుబిల్లులు చూపించమని అడగాలి కుంకల్ని.
ఇంకొక విషయం ఒరేయ్! సంప్రదాయాలు జాతికి రూపాన్నిచ్చి ఆత్మని ప్రతిష్ఠించే స్తంభాలు. ఇవే లేకపోతే జాతి నిర్వీర్యమయ్యి జనానికి నిర్వేదమే మిగులుతుంది. అవసరమయితే కొన్ని ప్రాపంచిక సుఖాలని వదులుకుని వీటిని కాపాడుకోవాలి. మనందరి బాల్యం లో ఇవే కదా మధురానుభూతులు. కూచున్న కొమ్మని నరుక్కునే ఇలాటి ఆలోచనలు ఇంకముందెప్పుడూ చెప్పకు, ఆ!