సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 3, 2024

గుడిలోనేముందీ…బాబూ…

Filed under: Uncategorized — Sriram @ 5:29 సా.
గుడిలోనేముందీ…బాబూ…

మస్జిద్ ధా దే (మసీదు కూల్చుకోండి)
మందిర్ ధా దే (మందిరం కూల్చుకోండి)
ధా దే జో కుచ్ ధిందా (ఏదైనా కూల్చుకోండి)
పర్ కిసీ దా దిల్ న ధా (కానీ ఎవరి హృదయం కూల్చకండి)
రబ్ దిలన్ విచ్ రెహందా (దైవం హృదయంలోనే ఉంటుంది)

~ బాబా బుల్లే షాహ్

ఇటువంటి ఉదారవాద సూఫీ కవితలు చదువుకోడానికి వినడానికి చాలా గొప్పగా ఉంటాయి. సినిమాల్లో ఊదరగొట్టి ఉపన్యాసాల్లో నూరిపోసి చాలామంది బుర్రల్లో ఇలాంటి భావజాలం గొప్ప ప్రభావాన్ని చూపెట్టడంలో ఉదారవాదులు చాలా సఫలం అయ్యారు కూడా. ఐతే ఇలాంటి వాదనల్లో ఉన్న డొల్లతనాన్ని మనకి తెలిసొచ్చేలా చేసే గురువులనీ పండితులనీ మన సమాజంలో చాందసులుగా ముద్రవేసి వారికి గౌరవం లేకుండా చేసేసాక భావితరానికీ యువతరానికీ సరైన దిశా నిర్దేశం జరిగే అవకాశమే లేదు కదా. ఇలాంటి తరాల వారు త్యాగరాజు కృతులకీ అన్నమయ్య కీర్తనలకీ ఉదారభాష్యాలు చెప్పడంలో వింత ఏముంది.

ఏదేమైనా విషయానికి వస్తే, సూఫీలైనా వేరే ఏ అవైదిక మతస్థులైనా ఇలాంటి ఉదారవాదాలు చేయడాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రవక్తలద్వారా ప్రచారమైన మతాలు మంత్రబలం ఉన్నవి కావు కనక – వారికి ఆ భగవంతుణ్ణి శబ్దబ్రహ్మంగా దాని నుండి యంత్ర బలోద్ధితమైన అర్చావతారంగా దర్శించి అర్చించే శక్తిలేదు కనక – ఆధ్యాత్మికంగా ఉద్ధతి పొందని ఆ సమాజంలోని కొద్దిమంది బాబాలకి వారి ప్రార్ధనాలయాలు ప్రత్యేక శక్తిగలిగినవిగా అనిపించకపోవడంలో వింతలేదు.

కానీ మన ఆలయాలు అటువంటివికావే! వేదజనితమైన ఆగమశాస్త్ర బలంతో నిర్మితమైన దేవాలయాలలో సాముద్రికశాస్త్ర ప్రమాణాలతో విరాజిల్లే విగ్రహాలలో అఖండ మంత్రజపబలోద్ధారణతో స్థాపించిన యంత్రాల వల్ల కలిగిన తేజస్సుని చూసి పులకించి ఆ దేవతాశక్తి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పండితపామరులందరూ పొందగలగిన అదృష్టం మన సనాతనధర్మవర్తనులకే సొంతం!

దేవాలయం కేవల ప్రార్ధనాలయం కాదు. అది సమాజ శ్రేయస్సుకోసం ప్రజలలో ధర్మవర్తన పెంపొందిచడం కోసం మన ఋషులు ఏర్పాటు చేసిన వ్యవస్థ. అదొక శక్తికేంద్రం. అందుకే దాని స్థాపనకి నిర్వహణకీ నియమాలు. నియమబద్ధంగా నిర్వహించబడే ఆలయాలలోనే శక్తి సంపూర్ణంగా అనుభవించగలం. అందుకే ఇప్పటికీ కేరళ ఆలయాలు అత్యంత శక్తివంతమైనవిగా విరాజిల్లుతున్నాయి. ఇప్పటికీ జగద్గురువులంతటివారు కూడా ఏదైనా అనుష్టానం జరపవలిస్తే కేరళ ఆలయాలవైపు చూడడానికి అదే కారణం కూడా.

అందుచేత ఈసారి గుడిలోనేముందీ అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్పడానికి సంకోచించకండి. దేవాలయాల ప్రాభవాన్ని వాటి ప్రాముఖ్యతనీ తెలపడానికి సంకోచించకండి. ముఖ్యంగా పైన చెప్పిన కవితల్లాంటివి చెప్పబోతే మౌనంగా విని వదిలేయకండి. గుడిలో దేవుణ్ణి చూడలేనివాడికి గుండెల్లో మాత్రం ఏం కనిపిస్తుంది అని అడగండి.

వ్యాఖ్యానించండి »

ఇంకా వ్యాఖ్యలు లేవు.

RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి