సంగతులూ,సందర్భాలూ….

జూన్ 16, 2017

ఆపాతమధురం: ‘కారుణ్య’ వాణి

మంచి తెలుగు పాటల గురించి తపించే నాలాంటి వాళ్ళందరికీ మంచి ఊరట. కారుణ్య కొత్త పాటతో వచ్చాడు, పైగా తనే తయారు చేసుకొచ్చాడు. చాలా మందిలాగే నేనూ చాలా రోజులనించి ఇతని గాత్రంలో ఒక మంచి పాటకోసం చూస్తున్నాను. మంచి తెలుగుపాటకుండాల్సిన లక్షణాలు అన్నీ కలగలిపి పట్టుకొచ్చిన మిక్చర్ పొట్లం లాగా ఉందీ పాట. సినిమా సంగీతం అభ్యసించేవాళ్ళకైతే వర్క్డౌట్ ఎగ్జాంపుల్ లాంటిదనుకోండి. భారతీయ సంగీతం ఆధారంగా చేయబడినా ఇళయరాజా లాగ పాశ్చాత్య వాద్యాలని చక్కగా వాడుకున్నాడు. గాత్రానికి ముందు వెనకా వినిపించే వాద్యసంగీతం అతి మనోహరంగా అందరినీ ఆకట్టుకునేలాగ ఉంది. కష్టపడి మంచి పాటనిచ్చినందుకు కారుణ్యకి నా ధన్యవాదాలు.

గౌరీ మనోహరా, కీరవాణా లేక మరొకటా అనే అలోచనలు పక్కనపెడితే ఇది చక్కని కారుణ్య వాణి. ఈ పాట ద్వారా కారుణ్య సంగీత సాహిత్యలలో తనకున్న అభిరుచిని అందరికీ మరోసారి చాటాడు. తెలుగు యువతరానికి ఒక ఆదర్శగాయకుడిగా తన ఉనికిని చాటుకున్నాడు. ఇప్పుడైనా సినీపరిశ్రమ తనని ప్రోత్సహించాల్సిన స్థాయిలో ప్రోత్సహిస్తుందని ఆశిద్దాం.

సాహిత్యం గురించి ఇక్కడ కొంచెం – అచ్చతెలుగు సాహిత్యం, అందంగా ఉంది. ఐతే  రంధ్రాన్వేషణే కానీ, కొన్ని కొన్ని ప్రయోగాలు ఇంకా బావుండొచ్చేమో అనిపించింది:
– నిదురలోనైనా కలల వీధుల్లో విహరించ బోకే అలా: వాక్య నిర్మాణం?
– ప్రణయరాగాలు నాలో జ్వలించాయి: జ్వాలలు జలిస్తాయి, రాగాలు కాదుగా?

తెలుగు సంగీతసాహిత్యాభిమానులందరూ తప్పకుండా వినండి, ప్రోత్సహించండి.

*కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3