సంగతులూ,సందర్భాలూ….

మార్చి 27, 2010

ఎంత అజ్ఞానం!

పెళ్ళికి ముందు శృంగారం తప్పుకాదంటూ గౌరవనీయులైన సర్వోత్తమ న్యాయస్థానమూర్తులుంగారు తమ అభిప్రాయం వ్రాక్కుచ్చి ఊరుకుంటే బాగుండేది కానీ మధ్యలో రాధాకృష్ణుల సంగతి ఎందుకు తెచ్చారంటూ చాలామంది హిందువులు నొచ్చుకుంటుండగా అది కేవలం వ్యాఖ్యమాత్రమేనని పెళ్ళివినా సహజీవనం హైందవ సంస్కృతికి విరుద్ధం కాదని వక్కాణించడానికి వాడిన ఉదాహరణ మాత్రమేనని కొంతమంది విశాలహృదయులు సర్ది చెప్తున్నారు.

ఈ సంగతులెలా ఉన్నా, ఇవన్నీ చూసిన పెళ్ళికాని యువకులెవరైనా శ్రీకృష్ణునికున్న అష్టభార్యలనుదహరిస్తూ హిందూ వివాహచట్టాన్ని బహుభార్యాత్వానికి అనుకూలంగా సవరించాలని ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలుచేసి సఫలీకృతులైతే వారి అజ్నానంవల్ల పుట్టిన అత్యాశకి వారే మూల్యం చెల్లించుకోవాలని మాత్రం హెచ్చరిస్తున్నాను.

నాకు మాత్రం తాతయ్య మా చిన్నప్పుడు చెప్పిన కధొకటి గుర్తొస్తోంది.

ఆదిశంకరులు శిష్యబృందంతో కలిసి భిక్షాటన చేస్తుండగా దారిలో ఒక కల్లుపాక ఎదురయ్యిందిట. శంకరులు వెళ్ళి భిక్షాందేహీ అన్నారుట. పాపం ఆ కల్లుపాకవానికి ఆ రోజు ఇంకా బోణీ కాలేదుట. అయ్యా! నా దగ్గర కల్లుతప్ప ఇంకేమీ లేదని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడుట. అది చూసి చలించిన శంకరులు ఆ కల్లే పొయ్యమని భిక్షాపాత్ర పట్టారుట. అతను మహదానందంగా సమర్పించుకోగా గటగటా శంకరులు ఔపోసన పట్టేసారుట. అయితే ఇది చూసిన కొంతమంది శిష్యపరమాణువులు గురువుగారు తాగితే లేని తప్పు తాము తాగితే ఏముందనిచెప్పి ఆ సాయంత్రం వెళ్ళి పూటుగా పుచ్చుకుని రావడం చూసిన శంకరులు వారి అజ్నానాన్ని పోగొట్టాలని చెప్పి మరునాడు బిక్షాటనకి ఒక కమ్మరి దుకాణం వద్దకు తీసుకెళ్ళారుట. భిక్షాందేహీ అన్న శంకరులని చూసి దుకాణదారు, స్వామీ! ఉన్న ద్రవ్యమంతా ఇప్పుడే లోహం కొనడానికి ఖర్చు చేసాను, కొలిమిలో కాగుతున్న సీసం తప్పితే నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడుట. శంకరులు అదే పొయ్యవయ్యా అనడంతో వాడు సలసల కాగుతున్న సీసాన్ని బిక్షగా పొయ్యగా ఈయన అదే ధారగా తాగేసి శిష్యులకేసి చూసి మీరూ తాగుతారా అని అడిగారుట. తమ తప్పుతెల్సుకున్న శిష్యులు ఆయన కాళ్ళమీద పడ్డారుట.

అందుచేత పిల్లలూ, గురువుగారు చుట్టతాగేరని మేమూ తాగుతామనడం, కృష్ణుడు వెన్నదొంగతనం చేస్తే లేని తప్పు మేము సున్నుండలు దొబ్బితే ఏమిటనడం లాంటివి అజ్ఞానపు మాటలని చెప్పి మా తాతయ్య ముక్తాయించేవాడు.

ఔను మరి, పదహారువేలమందిని పెళ్ళాడాడని శ్రీకృష్ణుడిని వెక్కిరించడానికి తయారయ్యే మన మేధావులకి, ఆయన ఏకకాలంలో పదహారువేలరూపాలలో గడపగలిగిన వాడని మాత్రం గుర్తుండదు. మహాభక్తులకి సైతం ఎంతో సాధన వల్లకానీ అర్ధంకాని కృష్ణతత్వం గురించి నోటికొచ్చినట్టల్లా మాట్లాడకూడదన్న కనీస జ్నానం ఈ మేధావులకి లేకపోవడం వారి ప్రారబ్దం అనుకోవచ్చు కానీ, ఇలాంటివాళ్ళ నోరుమూయించే శక్తి హిందూసమాజానికి లేకపోవడం మాత్రం శోచనీయమైన విషయం (హిందూ పురాణపాత్రలగురించి, వాటి నిగూఢార్ధం గురించీ నేనీమధ్య చదివిన ఈ మంచి వ్యాసాన్ని ఆసక్తి ఉన్నవారు చూడండి).

భారతీయులందరూ అనాదిగా పరమ పవిత్రులనీ, మన సమాజంలో వివాహేతర సంబంధాలు ఉండేవే కావనీ నేను అనట్లేదు. మన పిత్రుస్వామ్య వ్యవస్థలో పురుషులు, ముఖ్యంగా కాస్త ధనవంతులు స్త్రీలను ’ఉంచుకోవడం’ వందల ఏళ్లుగా జరిగిన వ్యవహారం. అయితే, మధ్యయుగపు సంధికాలంలో ప్రబలిన ఈ వ్యవహారాన్ని సమాజం నిరసించడమూ, ఇటువంటి సంబంధాలవల్ల కలిగిన సంతానం సమాజంలో వివక్షకి గురికావడమూ జరిగింది కానీ ఇలా శాస్త్ర సమ్మతమంటూ తీర్పులిచ్చినవాళ్ళెవరూ లేరు. కాలక్రమేణా భారతీయసమాజం లో జరిగిన మార్పులూ సంస్కరణల ఫలితంగా ఇలాంటి అవాంఛనీయపోకడలు బాగా తగ్గుముఖం పట్టడం మన అద్రుష్టమనే చెప్పాలి. ఇప్పటికే వివాహవ్యవస్థ బాగా దెబ్బతిన్న పాశ్చాత్యదేశాలలో ప్రబలిన పెళ్ళికాని జంటల వల్ల ఎన్ని దుష్ప్రభావాలు కలుగుతున్నాయో చూసి కూడా కేవలం విశాలహ్రుదయులుగా, హిందూవ్యతిరేకులుగా తద్వారా లౌకిక వాదులుగా గుర్తింపబడడం కోసం ఇటువంటి పోకడలని సమర్ధించే కుహనామేధావులనీ, సంస్కర్తలనీ సమాజం తిరస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మార్చి 6, 2010

ఆపాతమధురం…4(రీతిగౌళ రీతులు)

చా…లా రోజుల తర్వాత ఆమధ్య కూడలివైపు రాగానే “తెలుగు అభిమాని” గారి టపా కనపడింది. ఆయన అన్నట్టు, ఔను! రీతిగౌళ లో ఏదో లాక్కొచ్చే మాయ ఉంది! పండితపామరులనందరినీ కట్టిపడేసే శక్తీ ఉంది. అందుకే అలనాటి ఘంటసాల నుంచి ఈనాటి రహ్మాన్ వరకూ అన్నితరాల సంగీత దర్శకులనీ తన మాధుర్యంతో ముగ్ధుల్ని చేసి తన అందాలకి కొత్త నగిషీలు చెక్కించుకుంటూనే ఉంది.

నాకు తెలిసి సినిమా పాటల్లో ఈ రాగంలో వచ్చిన మొదటి పాట ఘంటసాల గారు స్వయంగా నటించి, తన ప్రియదైవానికి భక్తిగా సమర్పించుకున్న “శేషశైలావాస శ్రీవేంకటేశా…”.

“శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు….” అన్న చరణపు పాదంలోనే ఈ పాటమొత్తం అందం ఉంది అనిపిస్తుంది నాకు. అమితమైన చనువు, అంతకుమించిన ప్రేమ వీటికి తోడు కాస్త చిలిపితనం – వీటన్నింటిని కలిపి పలికించడానికి రీతిగౌళకి మించిన రాగం లేదనే కాబోలు ఘంటసాలగారు ఈ రాగంలో స్వరపరచారు. మధ్య మధ్యలో వినిపిచే జలతరంగంలాంటి వాయిద్యం చాలా హృద్యంగా ఉంటుంది ఇందులో. ఈ పాటని స్వరపరిచిన విధానం రీతిగౌళరాగంలోని సుబ్బరాయశాస్త్రి గారి ప్రసిద్ధ కీర్తన “జననీ నిన్నువినా దిక్కెవరమ్మా….” కి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది నాకు.

ఐతే ఘంటసాలగారు ఈ రాగంలో ఇంకే పాటలూ చేసినట్టు లేదు. దానికి కారణం బహుశా ఈ రాగంలో వైవిధ్యం చూపించడం కష్టమని కావచ్చు. కానీ సంగీతంలో ఇళయరాజాకి అసాధ్యమంటూ ఉండదు కదా! బాలు,ఇళయరాజాల ద్వయం ఈ రాగంలో చూపించిన అందాలు అద్వితీయం అని చెప్పచ్చు. స్వాతిముత్యం చిత్రంలోని “రామా కనవేమిరా….” అన్న పాటతో జరిపించిన సీతాస్వయంవరం ఎంత అందమైనది!

అయితే, స్వచ్చమైన రీతిగౌళలో ఒక కీర్తనలాగ స్వరపరచిన ఈ కింది తమిళపాట ఒక ఆణిముత్యం. అన్నట్టు సుమలతతో పాటు ఇందులో నటించినది కుర్రవయసులో ఉన్న రఘువరన్‌ట!

మరి ఇళయరాజా స్వరానికి మంగళంపల్లి వారే పాడితే!

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, రీతిగౌళ అనగానే నాకు గుర్తొచ్చేది రహ్మాన్ స్వరపరిచిన “అందాల రాక్షసివే …” అన్నపాటే. బహుశా అది మాతరం పాట అవ్వడం వల్ల కావచ్చు. మురళీగానానికి ఘట వాయిద్యాన్ని జోడించి ప్రారంభించి అద్భుతమైన వాయిద్యమేళనంతో మనసుని మైమరిపించే వింటేజ్ రహ్మాన్ బాణీ ఇది. “చిలకా! రామచిలకా…..” – బాలూకి వందనాలు!

అలాగే, బహుశా ప్రస్తుత కాలేజీ విద్యార్ధులకి అనంతపురం చిత్రంలోని ఈ పాటే ఎక్కువగా నచ్చుతుందేమో!నాకు మాత్రం ఈ పాటలో ఏదో కాస్త లోపం ఉందనిపిస్తుంది… 🙂

కర్ణాటక సంగీతంలోని రక్తిరాగాలలో రీతిగౌళ ముందువరసలోని రాగం. నాకు తెలిసి హిందుస్తానీ సంగీతంలో సమాన లక్షణాలున్న రాగం లేదు. ఈ రాగ ఆరోహణ, అవరోహణలు:

స గ రి గ మ ని ద మ ని ని స
స ని ద మ గ మ ప మ గ రి స

చూసారా ఎన్ని వంకరలున్నాయో! ఈ వక్రాలే ఈ రాగానికి అందం. ముఖ్యంగా “ని ని స”, “ని ద మ ని ని స” వంటి ప్రయోగాలు ఈ రాగాన్ని ఇట్టే కనిపెట్టగలిగేలా చేస్తాయి. ఒక్కసారి “చిలకా! రామచిలకా” విని చూడండి మళ్ళీ.
శాస్త్రీయ సంగీతంలో ఈ రాగాన్ని బాగా ప్రాముఖ్యంలోకి తెచ్చింది త్యాగరాజస్వామేనని చెప్పాలి. నన్ను విడచి కదలకురా, ద్వైతము సుఖమా…అద్వైతము సుఖమా, రాగరత్నమాలికచే….లాంటి అద్భుతమైన కీర్తనలెన్నో స్వరపరిచారు ఈ రాగంలో. పైన ఉదహరించిన సుబ్బరాయశాస్త్రి గారి కీర్తన కూడా చాలా ప్రాముఖ్యం పొందినదే. రీతిగౌళ రాగంలోని శాస్త్రీయ సంగీతాన్ని ఇక్కడ వినచ్చు.

*కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3