సంగతులూ,సందర్భాలూ….

జనవరి 31, 2007

ఏమున్నది గర్వకారణం!

Filed under: సినిమాలు — Sriram @ 6:19 సా.

ఎంతో ఆర్భాటంగా మొదలైన తెలుగు సినిమా వజ్రోత్సవాలు అభాసుగా ముగిసాయి. అయినా అది దిష్టి చుక్కట లెండి. నాకు అర్ధంకాని విషయమల్లా దిష్టి కొట్టే అంత గొప్ప స్థానంలో తెలుగు సినిమా ఎక్కడ ఉందా అని. అసలు రెండున్నర కోట్ల ఖర్చుతో ఈ ఉత్సవాలు జరపడానికి కారణం తెలుగు సినిమాకి ప్రస్తుతం లేని గుర్తింపు తేవడమేనని కదా వారు చెప్తున్నది. జాతీయ స్థాయిలో ఎక్కడ సినిమా ఉత్సవాలైనా తెలుగు సినిమాకి గుర్తింపు లభించడంలేదని కదా మన సిమిమాకీయులు వాపోతున్నది.

గుర్తింపు అంటే ఏమో అనుకునేరు, గుర్తింపు అంటే నిలువెత్తు కటౌట్లు పెట్టడం వాటికి రబ్బరు బంతుల దండలు వెయ్యడం లాంటివన్నమాట. వంశవృక్షాలు ప్రదర్శించడం అని కూడా చదువుకోవచ్చు అనుకుంటా.

ఇంతకీ ఇలా హైదరాబాదులో ఒకరికొకరు సన్మానాలు చేసుకోడం వల్ల ఇది ఎలా సాధ్యమౌతుందో నాకు చిక్కని విషయం. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో గుర్తింపు రావాలంటే మంచి కళాత్మక విలువలున్న సినిమాలు తియ్యాలి. ఇది మాత్రమే నాకు తెలిసిన విషయం. కనీసం కాస్త అర్ధవంతమైన సన్నివేశాలున్న సినిమా ఐనా తియ్యాలి. అలాంటి సినిమాలు తియ్యడానికి ప్రయత్నించే వాళ్ళని ప్రోత్సాహించాలి. వ్యక్తి పూజకి,  ముఖస్తుతికి అలవాటు పడ్డ మన కధానాయకులకి ఈ విషయాలు అర్ధం కావడం కొంచెం కస్టమేనేమో.

మేమంతా ఒక్కటే అంటూ పాటలు పాడిన వీరిలో ఒక్కరైనా గత పది సంవత్సరాల కాలంలో అంతర్జాతీయ స్థాయి కాదు కదా కనీసం జాతీయ స్థాయిలో ఉత్తమమైనది అని చెప్పుకో గలిగే ఒక్క సినిమాలో ఐనా నటించారా అని. ఈ ఆత్మావలోకనం చేసుకోకుండా నేను గొప్ప అంటే నేను గొప్ప అని అరుచుకోవడం వల్ల, తొడలు కొట్టుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం?

ఒక మంచి సినిమా ఎలా పుడుతుంది? ఒక సంస్కృతి లోంచి పుట్టచ్చు. ఒక గొప్ప సంప్రదాయంలోచి పుట్టచ్చు. ఇలాంటి కోవలోకి వచ్చేవి శంకరాభరణం, ముత్యాలముగ్గు లాంటివి. కానీ సంస్కృతీసంప్రదాయాలని, మన కళలనీ చివరకి మన భాషనీ వదిలేసి చాలా రోజులే ఐంది. ఆంగికం, వాచకం మన ఇప్పటి నటులకి తెలియని విషయాలు. వదిలేద్దాం. కనీసం సమకాలీన అంశాలతో, మంచి కధతో ఒక చిత్రాన్ని నిర్మించగల నైపుణ్యం ఐనా ఉందా? టాం హేంక్స్ నటించిన టెర్మినల్ అన్న సినిమా ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి సృజనాత్మకమైన చిత్రాలైనా మనకున్నాయా కనీసం?

ఏమి చూసి గుర్తించేస్తుంది ప్రపంచం! మన సినీ ప్రముఖుల బేంక్ బేలన్సులు చూసా? 

జనవరి 25, 2007

శ్రీమతి పంతుల రమ

Filed under: సంగీతం — Sriram @ 10:26 ఉద.

మనోరంజనం(ఎంటర్ టైన్మెంట్) అనగానే మన తెలుగు నాట ఈ రోజుల్లో కేవలం సినిమాలు మాత్రమే గుర్తొస్తున్నాయి. మనవైన కళలకి ఆదరణ అంతంతమాత్రమే. సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి.

ఈ విషయంలో తమిళులని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. తెలుగులో ఉన్న త్యాగరజ కృతులు ఇప్పటికీ ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటూ ఉంటారు.శాస్త్రీయ సంగీతాన్ని ఆదరిస్తున్నారు.అందులోని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అందుకేనేమో వారి భాషకి ప్రాచీన హోదా సాధించుకోగలిగారు.    

శ్రిమతి పంతుల రమ మనకున్న కొద్దిపాటి శాస్త్రీయ సంగీత గాయనులలో ఒకరు. విశాఖపట్నం వాస్తవ్యురాలు. ఈ రొజే నాకు ఈ వీడియో లింకు దొరికింది. ఆమె గాత్రం విని ఆనందించండి.

http://video.webindia123.com/interviews/singers/pantularama/index.htm

జనవరి 23, 2007

చంద్రశేఖరా!

Filed under: తెలుగు పద్యం — Sriram @ 7:00 సా.

పద్య కవిత్వం అనగానే కొద్దిగా బాధగా ముఖం పెట్టి అది ఏమీ అర్ధం కాదనీ, పాషాణమైన సంస్కృత సమాసాలతోనూ ఏ  మాత్రం వాడుకలో లేని గ్రాంధిక పదాలతోనూ నిండి ఉంటుందని అనే వాళ్ళు తప్పక ఈ పద్యం చదావాలి.

చేరువ వాడపల్లి నరసిమ్ముడి తీరతమోయి బోగమ
మ్మోరుల ఆట జూస్తి! వారి ముంగిలి దేవుడదెంత? విద్దెలో
తీరు పయాస గంటి, ఒక తిత్తిని నేర్పున నూదువాని కా
లూరక మొక్కబుధ్ధగు! అహో యను మూఢుడు చంద్రశేఖరా!

ఈ చంద్రశేఖర శతకం రాసింది ఎవరో నాకు తెలీదు. నా దగ్గర పుస్తకం కూడా లెదు. ఎక్కడో చదివిన గుర్తే. ఒక్కసారి చదవగానే గుర్తున్న ఈ పద్య ధార అమృతప్రాయంగా అనిపిస్తుంది నాకు. కవిత్వం అంటే ఇది. రసం అంటే ఇది.

ఇదే మకుటంతొ మొత్తం శతకమంతా రాసిన ఆ కవి, మొత్తం శతకమంతా ఇదే ధారలో నడిపించాడని చెప్పుకోవడం విన్నాను. ఇంకా ఒకటి రెండు పద్యాలు తెలుసు కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు.

మీకెవరికైనా ఈ శతకం వివరాలు తెలిస్తే దయచేసి తెలియచేయండి.