సంగతులూ,సందర్భాలూ….

అక్టోబర్ 11, 2006

కందర్పజనకా…

Filed under: సంగీతం — Sriram @ 8:48 ఉద.

నాకు ఎంతో ఇష్టమైన అన్నమయ్య కీర్తన ఇది. కందర్పజనకా!గరుడగమనా! నందగోపాత్మక నమో నమో…ఇలా సాగిపోతుంది. నేను మొదట ఈ కీర్తన శ్రీ బాలకృష్ణప్రసాద్ గారి గాత్రం లో విన్నాను. ఆప్పట్లో అది ఏ రాగంలో ఉందో తెలియదు కానీ మనసుకి చాలా ఆనందంగా ఉండేది ఈ కీర్తన వింటుంటే.
తరువాత నాకు తెలియవచ్చింది దీనిని స్వరపరిచింది శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారని. ఈయన ప్రఖ్యాత గాయకులు. కర్ణాటక, హిందుస్తానీ సంగీత సాంప్రదాయాలు రెంటిలోనూ దిట్ట. ఈ మధ్యనే నాకు ఈ కీర్తన ఆయన గాత్రంలో వినే అదృష్టం దక్కింది. ఆహా! ఏమి అందం! ఎంతో అద్భుతంగా మనోహరమైన వంపులు, విరుపులతో ఆలపించారు. మీరు కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కీర్తన కళావతి రాగంలో స్వరపరచబడింది. ఇది హిందుస్తానీ రాగం. కర్ణాటక సంప్రదాయంలో దీనిని మిశ్ర వలచి రాగం అంటారు. అసలు హిందుస్తానీ సంగీతం నాకు అంత అర్ధంకాదు. కానీ హిందుస్తానీ రాగాలు కర్ణాటక సంగీత బాణీలో పాడినప్పుడు చాలా అందంగా ఉంటాయి. బేహాగ్,బాగేశ్రీ, ఖమాజ్ లాంటి రాగాలన్నీ చాలా మధురంగా ఉంటాయి.
అసలు హిందుస్తానీ సంగీతం పీకుడు సంగీతమని, ఆస్వాదించడం కష్టమని కొందరు అనుకుంటూ ఉంటారు…వీరందరూ అజయ్ చక్రవర్తి గారి ఈ కళావతి రాగ ఆలాపన విని తీరాలి. మాధుర్యం అంటే అది!