సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబర్ 8, 2020

భరతవర్షే, భరతఖండే…కృష్ణాగోదావరీ మధ్యప్రదేశే

Filed under: Uncategorized — Sriram @ 3:26 సా.

భరతవర్షే, భరతఖండే అని సంకల్పం చెప్పించిన పెద్దలు నా విధేయతలు ఎక్కడ ఉండాలో చెప్పనే చెప్పారు. ఐతే అక్కడితో ఆగకుండా శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే కృష్ణాగోదావరీ మధ్యప్రదేశే అని కూడా చెప్పుకోమన్నారు.

అందుచేత భారతీయుడినైనందుకు ఎంత గర్వ పడతానో, తెలుగువాడిగా పుట్టినందుకు అంతగా సంతోషపడతాను.

అంతమాత్రం చేత నా భాషనే భారతీయులందరూ మాట్లాడాలనుకోను. ఎవరి స్థానిక సంస్కృతులు వాళ్ళవి. అవి ఒకరివొకరు గౌరవించుకోవలసిందే. పిల్లలకి ఆంజనేయ దండకంతో పాటు హనుమాన్ చాలీసా కూడా నేర్పడం నాకు ఎంతో ఆనందం.

ఇటువంటి భావనల వల్లే మన సమైక్యత వర్ధిల్లింది. ఉదాహరణకి తరతరాలుగా తెలుగునేలకీ వారణాశికీ ధృఢమైనబంధం ఉంది. అప్పటికి నేటి హిందీ భాషలేదు. సంస్కృతమే ఈ బంధాన్ని కట్టి నిల్పింది. ఎందుకంటే సంస్కృతం కేవలం భాషకాదు, అది మనందరి ఉమ్మడి వారసత్వం.

ఆ వారసత్వ భావనలేనప్పుడు, ఏదైనా పరాయిదానికిందే అనిపిస్తుంది. హిందీతో వచ్చిన చిక్కు ఇదే. ఐతే ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నారన్నది ప్రశ్న. నాకనిపించేది ఏమిటంటే ఆంగ్ల భాష తన విలువని విద్యా, వైజ్ఞానిక,వాణిజ్యపరంగా పెంచుకుంది కనక. ప్రత్యేకించి ప్రస్తుత ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా వారు మాట్లాడే భాష కనుక. దాని వల్ల ప్రజలకి లౌకిక ప్రయోజనాలు కళ్ళముందే కనపడుతున్నాయి కనుక.

హిందీ భాష నేర్చుకోవడంవల్ల ఇటువంటి ప్రయోజనాలేవీ లేవు. లౌకిక ప్రయోజనాలు పక్కనపెట్టి చూసినా, సాంస్కృతికంగా కూడా దానికి ఎక్కువ విలువ కనపడదు. తెలుగు వంటి కావ్య సంపద, వారసత్వం దానికి లేదు. ఈ భాష మనుగడ మొదలయ్యే రెండు మూడు శతాబ్దాలైందేమో అంతే. అందుచేత బలవంతంగా ప్రజలకి ఎక్కించాల్సిందే. ఇంగ్లీషు ఉపాధ్యాయుడి గా పనిచేసే మా నాన్నగారు, మా చిన్నతనంలో హిందీ ప్రాధమిక, మధ్యమ పరీక్షలు వ్రాసారు – ఒక ఇంక్రిమెంటు కలుపుతారని. అది గుర్తొస్తుంది నాకు.

అందుచేత అనవసరపు హిందీ గొడవలలో కాలం వృధా చేయకుండా, ఆ వనరులన్నీ సంస్కృతానికి పూర్వ వైభవం తేవడానికి ఉపయోగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. సంస్కృతభారతి లాంటి సంస్థలు సాధిస్తున్న అధ్భుతాలు చూస్తే నాకు ఇది సాధ్యమే అనిపిస్తుంది. భారతదేశపు సత్తాని విశ్వవీధిలో చాటగలిగే సత్తా సంస్కృతానికి మాత్రమే ఉంది.

ఇంకొక్క విషయం గురించి వ్రాస్తాను. హిందీని ప్రోత్సహించడం వల్ల తెలుగు భాషకి ఏమి నష్టం అన్న ప్రశ్న. మామూలుగా ఐతే ఏమీ నష్టంలేదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల భాషా బోధనని ఆపే, నిరుత్సాహపరిచే పరిస్థితి లేదు. అందుచేత దానికి సమాన స్థాయిని ఇస్తేనే మాతృభాషలకి మనుగడ సాధ్యం. వేరే ఏ భాష ఐనా మాతృభాష తర్వాతి స్థానంలోనే ఉండాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వపు విధానాలుంటే రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి. లేకపోతే కూలీలుగా మారుతున్న తెలుగు ఆచార్యుల కధలు మనం ఇంకా ఇంకా చూడవలసి వస్తుంది. మహామహులైన ఎస్వీ జోగారావు గారి దగ్గర శిష్యురాలిగా పీహెచ్డీ పుచ్చుకున్న మా చిన్న అమ్మమ్మ గారు ఒక ఎయిడెడ్ కాలేజీలో కూలిపనులకి లభించే దానికన్నా తక్కువ వేతనానికి పనిచేసి పదవీ విరమణ చేయడం మా కుటుంబంలో నాకు అనుభవమే. ఇటువంటి పరిస్థితికి కారణం స్థానికభాషల పురోగతికీ, సంరక్షణకీ ఉపయోగపడేలా ప్రభుత్వ విధానాలు లేకపోవడమే. సెంట్రల్ బోర్డుని అనుసరిస్తున్న పాఠశాలలు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ విధానాలు దీనికి సహాయపడట్లేదు. మాతృభాషల గురించి ఈ సెంట్రల్ బోర్డు వారికి ఏమీ పట్టదు (వీట్లలో కేంద్రీయ విద్యాలయాలది ఇంకా విపరీత ధోరణి. ఢిల్లీలో వర్షం పడితే వీళ్ళిక్కడ గొడుగులెత్తుతూ ఉంటారు).

చెప్పొచ్చేదేమిటంటే హిందీ నేర్పే ముందు పిల్లలు మాతృభాషని నేర్చుకునేలా చెయ్యడం ముఖ్యం అని. దేశ సాంస్కృతిక సమైక్యతకోసం సంస్కృతభాష మీద దృష్టి పెట్టమనీను.