సంగతులూ,సందర్భాలూ….

జూలై 21, 2007

ఆకాశదేశాన ఆషాఢమాసాన…

తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే.

ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక సాహిత్యం గూగుల్ గుంపులో అడిగేసరికి పద్మ గారు ఆ కావ్యం గురించిన వివరాలు అందచేసారు.

ఆవిడ మాటల్లో : “మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, “శ్రీకాళా” వ్యాఖ్య కూడా ఉంది. ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను ’98 లో అట్లాంటాలో జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో కూడా దొరకచ్చు.”

ఈ వివరం చూసి నేను ఆన్లైన్ గ్రంధాలయంలో వెతికితే శరత్బాబుగారి పుస్తకం దొరికేసింది.

మేఘదూతం కావ్యాన్ని చదవాలనీ, కాళిదాసు “ఉప్మా” రుచి చూడాలనీ ఆసక్తి ఉండి, సంస్కృతానికీ గ్రాంధికానికీ భయపడే నాలాంటి వాళ్ళకి గొప్ప కానుక ఈ పుస్తకం. ప్రతీ శ్లోకానికీ సరళమైన వ్యావహారిక భాషలో  అర్ధం,వ్యాఖ్యానం ఉన్నాయి. దీనివల్ల కావ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలగడమే కాక, మన భాషాజ్ఞానాన్ని కూడా  పెంచుకోగలుగుతాం. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలని నా ఆశ.
 

జూలై 20, 2007

సంచలనాత్మక నవల: ఆవరణ

పుస్తకాలు చదవడం అనే అలవాటు ఈరోజుల్లో ఎంత తగ్గిపోయిందో మనందరికీ తెలిసినదే. అందులోనూ పుస్తకాన్ని కొని చదవడమంటే! అభిమాన హీరో సినిమా ఎంత చెత్తగా ఉన్నా పదిహేనోసారి చూడడానికి ఎటువంటి ఆలోచనా చేయని జనాలు పుస్తకం మీద పది రూపాయలు ఖర్చుపెట్టడానికి కూడా ఇష్టపడటంలేదు. అలాంటిది ఒక ప్రాంతీయ భాషలో రాసిన నవల విడుదలైన నాలుగు నెలలోనే తొమ్మిది సార్లు పునర్ముద్రింపబడింది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది.

ఆ నవలే ప్రముఖ కన్నడ రచయిత, చరిత్రకారుడు అయిన ఎస్.ఎల్.భైరప్ప రాసిన “ఆవరణ” .

ఈ మధ్యకాలంలో పాశ్చాత్య సమాజాన్ని డావిన్సీ కోడ్ ఎంత ఊపు ఊపిందో కన్నడ సాహితీరంగాన్ని ఈ నవల అంతగా కుదిపివేసింది.

లౌకికవాదం ముసుగులో ఓటుబేంకు రాజకీయాలకు పాల్పడుతున్న మన రాజకీయనాయకులు చరిత్రని ఎలా వక్రీకరించి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారో కళ్ళకు కట్టిన నవల ఇది.

ఈ నవల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంటే ఈ పుస్తకసమీక్షని చదవండి.

జూలై 10, 2007

సింహఘడ్, శివాజీ, సీసపద్యం…

Filed under: కబుర్లు,భారతదేశం — Sriram @ 12:12 ఉద.

గమనిక: ఈ పోస్ట్ సినిమాలగురించి కాదు.
DSCN1307

ఈ ఫోటోలో మీరు చూస్తున్నది పూనే సమీపంలోని సింహఘడ్ కోట ప్రవేశద్వారం (మరిన్ని చిత్రాలకై నా ఫోటోబ్లాగు చూడండి).

ముష్కరమూకల దారుణాలని అడ్డుకుని భారతజాతికి ఆత్మగౌరవాన్ని గుర్తుచేసిన వీర శివాజీ అనుచరులు దుష్కరమైన పశ్చిమకనుమల ఇరుకు మార్గాలనుంచి ప్రయాణించి, ఉడుములని కోటగోడలెక్కించి, వాటిని పట్టుకు ఎక్కి, ఔరంగజేబు సైన్యాన్ని కకావికలం చేసిన అద్భుత సాహసకృత్యానికి నిలువెత్తు నిదర్శనం.

అక్కడ కోటగోడలు చూసిన నాకు, వారి ధైర్యాన్ని, సాహసకృత్యాన్ని తలచుకుంటే వళ్ళు గగుర్పొడిచింది. గుండెధైర్యం అంటే ఇది కదా అనిపించింది.
 
ఇంక ఆ పరిసరాల్లో తిరుగాడుతుంటే చిన్నప్పుడు శివాజీని గురించి విన్న వీరగాధలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. దొంగదెబ్బ తీసిన అఫ్జల్ఖాన్ ని ఉక్కుగోళ్ళతో చీల్చడం, ఔరంగజేబు ఖైదు నుండి పళ్ళబుట్టలో తప్పించుకోడం వంటి సాహసకృత్యాలన్నీ కళ్ళముందు కదిలాయి.

ఒక అందమైన స్త్రీని సైనికులు బంధించి తెచ్చినప్పుడు ఆవిడ కాళ్ళమీదపడి, “నేను నీ కొడుకునైతే ఎంత అందంగా ఉండేవాడినో” అన్న శివాజీ సంస్కారం గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.

ఎంత తలుచుకున్నా తనివితీరక ఇలా సీసపద్యం చెప్పుకుని ఆనందించాను:

సీ: భారతకధలను బలుమారు తెలుపగ
                         భక్తితో వినినట్టి బాలుడతడు
     విన్నకధలలోని వివరము మేల్కొల్ప
                         విక్రమించిన మహా వీరుడతడు
     భారతావనికున్న బానిసత్వముగని
                         తిరగబడిన గొప్ప ధీరుడతడు
     కన్నబిడ్డలకన్న గారముతోడను
                         ప్రజలనుగాచిన ప్రాజ్ఞుడతడు

గీ: అతడు హైందవజాతిని ఆదుకొనగ
    వీరమాతకు పుట్టిన విచ్చుకత్తి
    ధర్మరక్షణ చేసిన దార్శనికుడు
    ఛత్రపతియనబడు శివ చక్రవర్తి!

(గురుస్మరణతో…)

జూలై 5, 2007

తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…)

“కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్”
దోమ నోట్లో మదపుటేనుగులు దూరాయి అని దీనర్ధం. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన తెలుగువారందరికీ ఈ సమస్య సుపరిచితమే. తెనాలి రాముడిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి పండితులు ఒక కాపలా వాడిచేత ఈ సమస్యని అడిగిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతే ఆయన తెనాలిరాముడెందుకౌతాడు. అందుకే కాపలా వాడిని అడ్డంపెట్టి వాళ్ళని బండబూతులు తిడతాడు. గంజాయి తాగి నానా జాతులతోటీ కలిసి కల్లుతాగి పేలుతున్నావా లం*కొడకా, ఎక్కడరా దోమనోట్లో ఏనుగులు దూరాయి? అని ఇలా పూరించాడు:

కం: గంజాయితాగి తురకల
     సంజాతులగూడి కల్లు చవిగొన్నావా
     లం*లకొడకా! ఎక్కడ
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

దెబ్బకి కుళ్ళుకున్నవాళ్ళు నోళ్ళుమూసుకుని ఏడ్చుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. కానీ ఈ విషయం రాయలవారికి చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు కదా, ఇంత అందమైన సమస్య వ్యర్ధమైపొయిందే అని బాధపడి తెనాలి రాముడిని పిల్చి, ఇప్పుడు ఇదే సమస్య నేనిస్తున్నాను పూరించమని ఆజ్ఞాపిస్తాడు. మరి తెనాలిరాముడి నాలుకకి రెండుపక్కలా పదునే కదా, ఎంత సరసంగా పూరించాడో చూడండి:

కం: రంజనచెడి పాండవులరి
     భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!
     సంజయ! విధినేమందును
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

సంజయా! విధి ఎంత బలీయమైనదో చూసావా. పాండవులంతటివారు కూడా విరాటరాజు కొలువలో ఊడిగం చెయ్యాల్సివచ్చింది. ఏనుగులు వెళ్ళి దోమ నోట్లో దూరడం లాగ ఉంది ఇది అని మంచి సమయస్ఫూర్తితో పూర్తిచేసేప్పటికి రాయలవారు ఎంతో ఆనందించారుట.

ఇటువంటి పద్యాలూ, కధలూ తెనాలి రాముడిపేరు మీద ఎన్నో ఉన్నాయి. అవి నిజంగా జరిగినవా కావా అన్న వివాదాన్ని పక్కన పెడితే ఇంత మంచి సాహిత్య వారసత్వాన్ని మనకి అందజేసిన పెద్దవాళ్ళందరికీ మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని నేను అనుకుంటాను.

ఇంక  నా పైత్యం గురించి. తెనాలిరాముడి గురించి నేను రాసిన పోస్ట్ చూసిన స్వాతికుమారి గారు రాయలవారి వేషంవేసి, “శ్రీరాం! ఈ సమస్యని పూరించండి చూద్దాం” అంటూ దీన్ని నాకు గుర్తుచేసారు. నా శాయశక్తులా ప్రయత్నించి ఇలా పూర్తిచేసా:

కం: గింజలు పండక కర్షకు
    లంజలిపట్టిరి కొలువుల నడుగుచు దొరలన్!
    బంజరు లయ్యెను భూములు
    కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్!

ఎవరి దయాదాక్షిణ్యాలమీదా ఆధారపడక భూమితల్లిని నమ్ముకుని స్వతంత్రంగా మదపుటేనుగుల్లా ఎంతో స్వాభిమానంతో జీవించే శ్రమజీవులు మన రైతులు. కానీ ఈరోజుల్లో వారి పరిస్తితి ఎంత దయనీయంగా మారిందో మనం చూస్తున్నదే. వ్యవసాయాన్నీ భూములనీ వదులుకుని చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో యజమానుల దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్నారు. ఇది చూస్తే నాకు ఏనుగులు దోమనోట్లో దూరినట్టే అనిపించింది.

మరి నాపూరణ చూస్తే రాయలవారికేమనిపించిందో! 🙂