మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా…
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందెనటుగాన
అని అన్నమయ్య పాడుకున్నాడంటే, ఆ రోజుల్లో ఆ వెంకటపతి సేవలో తరించే వారి జీవితం ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. కానీ ప్రజాతంత్రపు ప్రతినిధిత్వాన్నే ఆధిపత్యంగా మార్చుకున్న నాయకుల దయాదాక్షిణ్యాల మీద భగవత్సేవకుల జీవితాలు ఆధారపడి ఉన్న ఈరోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉందా?
తరతరాలుగా స్వామివారి సేవలో తరిస్తున్న కుటుంబాలని ఆలయ వ్యవహార విషయాలలో పూచికపుల్లలాగా తీసి పడేసి, ఆగమ విషయాల గురించిన కనీస జ్ఞానంలేని అయ్యేయెస్ ఆఫీసరుని వాళ్ళ నెత్తిమీద కూచోబెట్టీ, వీళ్ళందరి మీద ఆధిపత్యం చెయ్యడానికి కొంత మంది రాజకీయుల్ని తోలి వినోదం చూస్తున్న నాయకులన్న ఈరోజుల్లో వారికి దైన్యం తప్ప ఏం మిగిలింది?
ఒక్క జీవోతో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలనీ హక్కులనీ తోసిపడేయగలమన్న పొగరుతో విర్రవీగుతున్న రాజకీయ నాయకులని చూసి వీరంతా భయంతో వణకరా? ఒకరి ఉద్యోగమో జీవితమో కాదు, వారి వంశపు భవిష్యత్తు మొత్తం వీరి చేతుల్లో లేదూ? అసలు ఇటువంటి పరిస్థితికి కారణం ఏమిటి?
అర్చకులైనా, ప్రభువులైనా ప్రాధమికంగా మనుషులే. పూర్వకాలంలోనైనా ఇప్పుడైనా వారి ప్రాధమిక తత్వం స్వయం లాభమే అయి ఉంటుంది. వీరెవరూ బ్రహ్మజ్ఞానులు కారు సాధారణంగా. ఐతే పూర్వం రాజులకి నిరంకుశాధికారం లేదా? ఇప్పటికన్నా ఎక్కువేనే?
పూర్ణకుంభాల స్వాగతాలు పూర్వకాలంలో పుట్టిన సంప్రదాయమే. రాజుకూ, అధికారులకూ కొంత అధికారం ప్రాధాన్యత అప్పుడూ ఉండేది. కానీ తేడా ఏమంటే, స్వామి వారి సేవలో ఉండే వారికి పరిపూర్ణమైన స్వేచ్చ, నిర్భీతి ఉండేవి.
ఇవి ఎలా సాధ్యమయ్యేవి? ఇటువంటి స్వేచ్చ, నిర్భీతత్వం కలిగి ఉండడానికి వారి నిష్ట, జీవన విధానం ఒక కారణమైతే అప్పటిలో పాటించిన ధర్మశాస్త్రాలు, సాంఘిక కట్టుబాట్లూ మరొక కారణం.
ఆచార వ్యవహారాలనీ, ధర్మశాస్త్ర విషయాలనీ సమన్వయంతో అర్ధం చేసుకోకుండా అనాగరికత ముద్ర వేసి, సినిమాలు తీసి వెక్కిరించి వాటి పైన గౌరవాన్ని సంఘంలో నాశనం చేసి కుదిరినచోటల్లా చట్టాలు తెచ్చి తొక్కిపడేసిన ఈరోజుల్లో సాధ్యమవ్వడం ఎలా?
ఒక ఉదాహరణ గుర్తు వస్తోంది. నవాబు ఇచ్చిన తాంబూల సత్కారం గ్రహించినందుకు ఒక సంగీత విద్వాంసుడి కుటుంబానికి సంఘ బహిష్కరణ విధించిన వారణాసి పండితుల విజ్ఞతని ప్రశ్నించే మనం, స్వలాభం కోసం అప్రాచ్యుల ప్రాపకానికి పోకుండా ఇటువంటి కట్టుబాట్లు ఎక్కువమంది ప్రజలని ఆపి ఉంచాయన్న విషయం గ్రహించలేకపోయాం.
పవిత్రమైన బాధ్యతలున్న మనుషులకి పెట్టిన కట్టుబాట్లూ నియమాలూ ఇందుకు కాదూ? ఎవరైనా నియమం నిష్టాతో బ్రతుకుతుంటే అది ఒక వివక్ష చూపించడం అని నానాయాగీ చేయడం మనకి సరదా. మడికట్టుకోవడం అనే పదాన్ని అపహాస్యం చేయడానికే వాడుతున్నాం కదా?
ఆచార వ్యవహారాలూ సంప్రదాయాలూ వద్దనుకున్నప్పుడు చిత్తశుద్ధి మాత్రం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించి నెలకొల్పిన వ్యవస్థలని అప్రాచ్యుల పాలనలో సంపాదించిన మిడిమేలపు జ్ఞానపు కొలబద్దలతో కొలిచి చట్టాలను చేసిన మేధావులకి ఏం తెలుసు ?
ఆలయ ధర్మకర్తగా ఉన్నవాడికి కుక్కజన్మ లభిస్తుందని అనడం వినే ఉంటారు. అంతెందుకు అర్చకత్వానికి కూడా సంప్రదాయంలో ఎక్కువ గౌరవ ప్రదమైన స్థానం లేదు. భగవత్సేవ ద్వారా జీవనభృతి సంపాదించుకోవడం ఒకటైతే, దేవాలయ వ్యవస్థలో ఉండే వ్యక్తులు అత్యంత విరాగులూ బ్రహ్మజ్ఞానులూ ఐతే తప్ప ఎంతో కొంత మనుష్య సహజమైన లాలసత్వం వల్ల తప్పులు జరుగుతాయనే భావన మరొకటి.
ఐతే కాలానుగుణంగా ఈ వ్యవస్థని సంస్కరించుకుంటూ తగినన్ని కట్టుబాట్లతో కుదిరినంత ఉత్తమంగా తీర్చిదిద్దుకోకుండా మరింత దిగజార్చి, వ్యవస్థలోని వ్యక్తులు మాత్రం ఉత్తమంగా ఉండాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
విష్ణోర్బలం ప్రవర్ధతాం.
స్వస్తి.