తెనాలి రాముడి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి చిన్నప్పుడు విన్న చమత్కారపు కధలూ అందులోని హాస్యమూను. నిజానికి ఇలా పిల్లలని ఆకట్టుకునే చారిత్రక పాత్రలు మనకి చాలానే ఉన్నాయి. బీర్బల్, మర్యాద రామన్న వగైరాలు. కానీ తెనాలి రాముడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన పిల్లలతో పాటు పెరుగుతూ వస్తాడు. అమ్మ వారి చేతుల్లోని రెండు గిన్నెల్లో పాయసమూ తాగేసిన కధ వినే వయసు దాటేసరికి గూని చాకలి వాడి కధ దొరుకుతుంది. ఇంకొంచెం పెద్దయ్యేప్పటికి భావతురంగం కధ ఆకట్టుకుంటుంది. ఇంక కధలు వినే వయసు దాటేసరికి ఆయన చాటువులు, సమస్యా పూరణలూ ఆస్వాదించమని ఆహ్వానిస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం అభిరుచి, చెప్పేవాళ్ళు ఉండాలి. ఇక ఈ స్థాయి దాటితే పాండురంగమహత్యం చదవచ్చు.
ఇలా ఆబాలగోపాలన్నీ ఆకట్టుకునే తెనాలి రాముడి వికటకవిత్వపు విన్యాసాలలో ఒక సమస్యా పూరణ నాకు ఈ మధ్య రాఘవ గారి బ్లాగు ద్వారా గుర్తొచ్చింది. ఇది ఏదో ఒక సినిమాలో కూడా విన్న గుర్తు (ఆదిత్య 369 అనుకుంటా). సమస్య ఏమిటంటే
బలరాముడు సీతజూచి ఫక్కున నగియెన్!
అడిగేవాడికి చెప్పే వాడు లోకువని కాకపోతే, ఎక్కడో త్రేతాయుగంలోని సీతమ్మవారిని ద్వాపరయుగంలోని బలరాముడు చూడడమేమిటి! పైగా చూసి ఫక్కుమని నవ్వేడు కూడాట. ఇదంతా ఎలా సరిపెట్టాలి? చూడటానికి అసంబద్ధంగా ఉన్నా ఈ సమస్యలో ఒక అందం ఉంది. అది కవికి మాత్రమే కనపడుతుంది. అందుకే తెనాలి రాముడు ఇలా పూర్తి చేసాడు:
లలనలు పాయస మానిన
కలుగుదురే బిడ్డలంచు క్ష్మాసుతనవ్వన్
పొలమున దొరికెదరని ధీ
బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్!
చోద్యం కాకపోతే ఎక్కడైనా ఆడవాళ్ళు పాయసం తింటే పిల్లలు పుడతారా అని సీతమ్మవారు శ్రీరాముడిని వేళాకోళం చేస్తే, బుద్ధిబలుడైన రాముడు “కాదులే పొలాల్లో దొరుకుతారట” అని తానేమీ తక్కువ కాకుండా సమాధానం ఇచ్చాడుట.
ఇంత అందమైన భావనలతో హాస్యాన్ని పండిచాడుకనకనే ఆయన మన తెలుగు వారిలో హాస్యానికి మరో పేరుగా నిలిచిపోయాడు.
బలరాముడిని ధీబల రాముడి గా మార్చేసుకోడం కుదిరింది కాబట్టి ఆ పై మూడు పాదాల్లోనూ అద్భుతమైన భావాన్ని నింపి ఒక గొప్ప పద్యంగా ఆ సమస్యని పూరించాడు తెనాలి రాముడు.
ఐతే అన్నిసార్లూ ఇలాంటి వెసులుబాటు ఉండదు. ఉదాహరణకి రాఘవగారు ఈ మధ్య ఇచ్చిన సమస్య:
“రావణు చెల్లి ద్రౌపదిని రాముడు యెత్తుకు పోయె చక్కగా”
ఈ సమస్యని ఎలా మార్చినా ఒక అర్ధవంతమైన పద్యం చెప్పడం కష్టం. తెనాలి రాముడి లాంటి కవుల సంగతేమో కానీ నాబోటి వారి వల్ల అయ్యే పని కాదు. ఇలాంటప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునేది క్రమాలంకారం. ఉదాహరణకి నా పూరణ చూడండి:
కావరమొంది రామునికి కామము దెల్పినదెవ్వరు? ద్యుతిన్
పావకుడిచ్చెనెవ్వరిని పార్ధుని మామకు? కష్టమందు సు
గ్రీవుని గాచెనెవ్వరది?కృష్ణుడు రుక్మిణినేమి చేసెనో?
రావణుచెల్లి, ద్రౌపదిని, రాముడు, యెత్తుకు పోయె చక్కగా !
వరుసగా కొన్ని ప్రశ్నలు, అదే వరుసలో వాటికి సమాధానాలు.
ప్రశ్నలూ సమాధానాలూ చూడండి:
1. పొగరెక్కి శ్రీరాముడి వద్ద కామాన్ని కోరినది ఎవరు? రావణు చెల్లి (శూర్పణఖ)
2. పావకుడు (అగ్ని) మంచి కాంతితో, పార్ధుని (అర్జునుడి) మామగారికి ఎవరినిచ్చాడు? ద్రౌపదిని, ఆవిడ యజ్ఞగుండంలోంచి పుట్టింది.
3. సుగ్రీవుడు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసింది ఎవరు? శ్రీరాముడు
4. కృష్ణుడు రుక్మిణిని ఏమి చేసాడు? చక్కగా ఎత్తుకుపోయాడు
ఇలా ముప్పతిప్పలూ పడి ఈ ఉత్పలమాలని పూర్తి చెయ్యవలసి వచ్చింది. రాఘవగారికి నా పూరణ నచ్చుతుందని ఆశిస్తూ, తెనాలి రాముడి పద్యం కింద నా పద్యం రాసినందుకు ఆ మహాకవికి క్షమాపణలు తెల్పుకుంటున్నాను.