సంగతులూ,సందర్భాలూ….

నవంబర్ 9, 2020

నోట్లరద్దు 2016 గురించి…

Filed under: Uncategorized — Sriram @ 12:49 సా.

నేను ఒక సగటు భారతీయుణ్ణి మాత్రమే. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి ఆవేశకావేశాలు నాకులేవు. ట్విట్టర్లో కొంతమంది లాగ ఆ రంగాలలోని వారితో పరిచయాలుండడం వాట్లలోని లోగుట్టులు తెలియడం వంటి పరిస్థితి కూడా కాదు.

నోట్ల రద్దు జరిగినప్పుడు చాలా మంది నాకులాంటి వాళ్ళలాగే ఇదేదో మంచికోసమే అనుకున్నాను. మావొక ఇరవైవేలు పోగొట్టుకోవలసి వచ్చినా దేశంకోసం అనుకుని ఊరుకున్నవాడినే.

నెమ్మదిగా అందులో జరిగిన లోటుపాట్లు కొన్ని బయటకొచ్చాక, మళ్ళీ నేను కూడా చాలా మంది నాకులాంటి వాళ్ళలాగే ఇది సఫలం కాలేదు అనే అనుకున్నా. చెప్పకపోవడమే, ఈ మార్చి వరకూ నేను యూపీఐ వాలెట్లు కానీ కనీసం పేటీయెం కానీ వాడలేదు.

ఐతే నాకు తెలీకుండా భారతదేశంలో ఎంత ఆర్ధిక విప్లవం జరిగిందో నాకు ఈ మార్చిలోనే తెలిసొచ్చింది.

పనికిరాకపోయినా జీతమిస్తాన్నారుగా, ఇదిగోనండి నా ఫోన్ నంబర్ దీనికి వేసెయ్యండి” – పనమ్మాయి

సార్! నెల రోజులుగా పనేం లేదు కొంత ఏమైనా సహాయం చెయ్యండి. నా ఫోన్ నంబర్కి వేసిపెడతారా?” – ఇస్త్రీ చేసే అబ్బాయి

మా అబ్బాయి నిన్న అమెరికా నుంచి ఫోన్లో చెప్పాడు – నా పెన్షన్ పడిందో లేదో ఫోన్ పే లో చూసుకోవచ్చుట కదా. అదేదో కాస్త ఈ ఫోన్లో పెడుదు బాబూ” – పక్కింటాయాన

ఒరేయ్! మాస శివరాత్రి అభిషేకానికి పూజారిగారికి డబ్బులు పంపాలి, ఆయన ఫోన్ నంబర్కి వెయ్యమని ఇప్పటికి రెండుసార్లు చెప్పా. నా ఫోన్లోనే ఆ యాప్ ఏదో ఇన్ స్టాల్ చెయ్యి నేనే చేసుకుంటా” – నాన్నగారు

ఇవన్నీ చూసాకా నాకు అనిపించిది ఏమిటంటే, భారతదేశంలో నగదు చెల్లించడంలో సమూలమైన మార్పులు వచ్చాయని. బండిమీద పుల్లట్లమ్మే ఆవిడ దగ్గరనుంచి, ఇల్లు కదలడానికి భయపడే వృద్ధుల వరకూ అందరూ ఎంతో సులభంగా సాంకేతికతని వాడుకుంటున్నారు. నామటుకు నేనే ఒక అరడజను పెద్దవాళ్ళకి ఫోన్ పే/ జీ పే లాంటివి వాడడం నేర్పించి ఉంటా. వాళ్ళెంతో తెలివిగా వాడుకుంటున్నారు కూడా.

ఇంత విప్లవం జరగడానికి రెండు ముఖ్య కారణాలు. అందరికీ బేంక్ సేవలు అందు బాటులోకి రావడం ఒకటి. నోట్ల రద్దు వల్ల ఈ యాప్లకి లభించిన ఊతం మరొకటి.
ఆ రకంగా నోట్లరద్దు ఉపయోగపడిందని మాత్రం నా భావన.

ఇప్పటిదాక వచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఎక్కువ పాశ్చాత్యదేశాలలో వారి సమాజానికి అనుగుణంగా వచ్చినవి. ఈ నగదుచెల్లింపుల విప్లవం మాత్రం మన సమాజం నుంచి పుట్టినది. దీని గురించి తప్పక గర్వ పడవచ్చు. కొంత కృతజ్ఞత మోడీకి కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంకో ఏడాది తర్వాత రెండువేల నోట్ల రద్దు చేపడితే మంచి ఫలితం వస్తుందని ఆశించే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే అసలు 500 రూపాయల నోటు వాడాల్సిన అవసరమే కనపడనప్పుడు 2000 రూపాయల నోటురద్దు చేస్తే ఏమిటిట సమస్య? చాలా సులభంగా అమలు చెయ్యచ్చు. అంతవరకు అది సఫలమే.

ఐతే ఈ రకమైన విప్లవం రావడానికి ఇదొక్కటే మార్గమని కానీ, నోట్లరద్దు వల్ల ప్రజలకి నష్టం జరగలేదని కానీ నేను అనట్లేదు. పైగా – మోడీ మంచివాడా మోసగాడా, నిజంగా మంచి చేస్తాడా – ఈ విషయంలో నాకు ఎటువంటి విషయ పరిజ్ఞానం, దానివల్ల కలిగే అభిప్రాయం – పూర్తిగా లేవు. ఇది ఇంతవరకే.