సంగతులూ,సందర్భాలూ….

జూలై 7, 2006

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు!

Filed under: పుస్తకాలు — Sriram @ 6:30 ఉద.

ఈ మధ్య నేను చదివిన తెలుగు పుస్తకాలలో ఒకటి ఇది. విశ్వనాధ వారి ఊహాశక్తి కి, సృజనాత్మకతకి ఇది చక్కటి తార్కాణం. అద్భుతమైన వ్యంగ్యం, కడుపుబ్బనవ్వించే హాస్యం వీటికిమించి ప్రతి ఒక్కళ్ళనీ ఆలోచింపచేసే సునిశితమైన తర్కం ఈ పుస్తకంలో కనిపిస్తాయి.మన భాష గొప్పతనాన్ని తెలియచేస్తూ, గుడ్డిగా మనం పరభాషావ్యామోహంలో ఎలా కొట్టుకుంటున్నామో చూపిస్తుంది ఈ పుస్తకం. తెలుగు భాషని అభిమానించేవాళ్ళు తప్పక చదవవలిసిన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోచ్చు. ఈ పుస్తకాన్ని చదవడానికి  ఈ ప్లగిన్ కూడా అవసరం.
గమనిక: ఆర్కైవ్।ఆర్గ్ నుంచి సేకరించబడినది.హక్కుల విషయమైన వివాదాలు ఏమైనా ఉంటే వెంటనే తెలియపరచగలరు.

జూలై 5, 2006

కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత!

Filed under: పుక్కిటి పురాణాలు — Sriram @ 7:13 ఉద.

పూర్వం మన దేశాన్ని పరిపాలించిన రాజులలో భోజరాజు సాహిత్యపోషణకి పెట్టింది పేరు. కాళిదాసు ఇతని ఆస్థాన కవే. వీరిద్దరికీ సంబంధించిన ఒక కధ ఇది.
వీరిద్దరూ చాలా మంచి స్నేహితులని ప్రసిద్ద్ధి. ఒకసారి ఇద్దరికీ ఏదో సాహిత్య విషయమై వాదం వచ్చి, కాళిదాసు చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లి పోయాడుట.

అదే సమయంలో, భోజరాజు రాజ్యంలో ఒక బీదవాడు ఎలాగైనా రాజుగారి ఆశ్రయం సంపాదించి తన సంసారాన్ని పోషించుకోవాలని ఆశ పడుతూ ఉండేవాడు. కవులనైతే రాజుగారు బాగా గౌరవిస్తారని, ఎలాగైనా కవిత్వం చెప్పి ఆయన మెప్పు పొందాలని ఇతని ప్రయత్నం. కష్టపడి ఒక శ్లోకంలో ఒక పాదం రాశాడు.

“భోజనందేహి రాజేంద్రా!ఘృత సూప సమన్వితం” ఇది అతను రాయ గలిగింది. ఓ రాజా! పప్పు,నేయి లతోటి భోజనం ప్రసాదించు అని దీని అర్ధం.శ్లోకంలో రెండవ పాదం ఎంత ఆలోచించినా తట్ట లేదు.అతనేమీ కవి కాదు కదా..ఇలా ఉండగా కాళిదాసు వీళ్ల ఊరు వచ్చాడు. ఇతడు కాళిదాసు దగ్గరకెళ్లి రెండవ పాదం పూర్తి చెయ్యమని ప్రార్ధించాడు. వెంటనే కాళిదాసు “శరశ్చంద్ర చంద్రికా ధవళం మాహిషం దధీ” అని పూర్తి చేశాడుట. అంటే, “శరత్కాలంలోని చంద్రుని వెన్నెల అంత తెల్లనైన గేదె పెరుగు కూడా” అని. ఇంకేముంది, ఈ శ్లోకం పట్టుకుని ఇతను భోజరాజు దగ్గరికి వెళ్లాడు.
“భోజనందేహి రాజేంద్రా!ఘృత సూప సమన్వితం
శరశ్చంద్ర చంద్రికా ధవళం మాహిషం దధీ”
అని చదివాడు. భోజరాజు కూడా గొప్ప కవి ఆయె. విన గానే అతనికి అనుమానం వచ్చింది.ఇది ఎవరు రాసిందో చెప్పమని గట్టిగా గద్దించాడు. వాడు భయపడి, “ప్రభూ! ఇది కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత” అనేప్పటికి భోజరాజు అతని ద్వారా కాళిదాసు ఆచూకీ తెలుసుకుని, మళ్లీ ఆస్థానానికి రప్పించుకున్నాట్ట. ఈ బీదవానికి తగిన ధనాన్ని కూడా ఇచ్చి పంపాడుట.

ఎ క్రాసింగ్ …

Filed under: తోటి బ్లాగర్లు — Sriram @ 7:12 ఉద.

నా ఫోటో బ్లాగులో ఈ పోస్ట్ ని స్వాతిగారు తెలిగించారు.
నేనైనా ఇంతబాగా తెలుగు చేయగలనో లేదో…
స్వాతిగారికి ధన్యవాదాలు!