సంగతులూ,సందర్భాలూ….

మార్చి 19, 2007

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Filed under: కబుర్లు — Sriram @ 10:53 సా.

Palanquin

సూర్యమండలమధ్యస్థితుడైన నారాయణుడు
చైత్రలక్ష్మి చేయి పట్టేవేళ
పులకించిన ప్రకృతికాంత పంపిన పచ్చటి పల్లకిలో
పరమాద్భుతమైన పరిణయహేల

పరవశించిన మనసు చేసే వేదపఠనం
లోకాః సమస్తాః సుఖినో భవంతు!

మార్చి 14, 2007

ఆపాతమధురం(కొనసాగింపు…)

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 3:40 సా.

హంసధ్వని అందాలు

వాతాపి గణపతిం భజే… అన్న కృతి వినని తెలుగు వాడుండడు. ఈ కృతి కోసం పుట్టినదే హంసధ్వని రాగం అనిపిస్తుంది నాకు. హంసధ్వని వల్ల వాతాపిగణపతిం కీర్తనకి పేరు వచ్చిందా లేక వాతాపి గణపతిం కీర్తన వల్ల హంసధ్వని అందం పెరిగిందా అనేది చెప్పటం కష్టం. ఇటువంటి అన్యోన్యత మరే ఇతర రాగాలకు ఏ కృతి తోనూ లేదు.

ఈ హంసధ్వని రాగాన్ని సృష్టించినది ముత్తుస్వామి దీక్షితార్ గారి తండ్రి గారైన రామస్వామి దీక్షితార్ గారు. మరి అందుకేనేమో ముత్తుస్వామి దీక్షితార్ గారు ఇంత అందమైన కృతిని కూర్చారు ఈ రాగంలో. ఏ కొడుకు మాత్రం ఇంతకన్న విలువైన బహుమతి ఇవ్వగలడు తండ్రికనిపిస్తుంది నాకు.

తెలుగు సినిమా సంగీత దర్శకులలో హంసధ్వనిని నాకు తెలిసి ఎంతో ప్రీతితో వాడినది ఇళయరాజా. రుద్రవీణ సినిమాలో తరలి రాద తనే వసంతం అన్న పాట ఒక అద్భుతమైన కంపోజిషన్. హంసధ్వని ఆధారంగా స్వరపరచిన ఈ పాట మాధుర్యంలో వసంత కోకిల గానాన్ని తలపిస్తుంది.

ప్రేమ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన ఈనాడే ఏదో అయ్యింది అన్న పాట కూడా హంసధ్వని ఆధారంగా చేసినదే. హంసధ్వని రాగాన్ని వాడి వాతాపిగణపతిం కీర్తన ఛాయలనుండి తప్పించుకోవడం ఇళయరాజాకే చెల్లింది.

జెంటిల్మేన్ చిత్రం రెహ్మాన్‌కి ఎంత పేరు తెచ్చిందో మనందరికీ తెలిసినదె. ఈ చిత్రంలోని ఒక మధురమైన పాట నా ఇంటిముందున్న పూదోటనడిగేవో అన్న దానిలో హంసధ్వని అందాలు తొంగి చూస్తాయి. పల్లవికీ మొదటి చరణానికి మధ్యలో వాయిద్యాన్ని వినండి. వాతాపి గణపతిం గుర్తుకొస్తుంది.

కలోనియల్ కజిన్స్‌గా పేరుపెట్టుకున్న జంట హరిహరన్, లెజ్ ల సంగీతం చాలా మధురంగా ఉంటుంది. విల్ యు బి మై లేడీ అన్న ఈ పాటవినండి. హంసధ్వనిని ఎంత గొప్పగా వాడుకున్నారో. పాటమొదలైన 2:30 నిముషాలకి వినిపించే పొడుగాటి వయొలిన్ వాదన వినండి ఎంతబాగుంటుందో.

శాస్త్రీయ సంగీత పరంగా చూస్తే హంసధ్వని చిన్నరాగమే. ఆరోహణలో ఐదు, అవరోహణలో ఐదు స్వరాలున్నాయి.
ఆరోహణ: స రి2 గ3 ప ని3 స
అవరోహణ: స ని3 ప గ3 రి2 స

ఈ రాగం పేరు చెప్పగానే గణేశుడే గుర్తుకు వచ్చేది. చాలా కీర్తనలు ఆయన పైనే ఉన్నాయి ఈ రాగంలో. హంసధ్వని కచేరీ ఆరంభంలో పాడే రాగం కావడం వల్లనేమో, ఉభయతారకంగా ఉంటుందని ఇలా చేసి ఉండచ్చు.

అన్ని కీర్తనలలోకీ తలమానికమైనది వాతాపిగణపతిం భజేహం. శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్రంలో ఇక్కడ వినండి. శ్రీనివాస్ గారి మేండొలిన్ వాదనలో ఈ కీర్తన మెరుస్తుంది.

త్యాగరాజ స్వామి వారి రఘునాయకా అన్న కృతి చాలా అందంగా ఉంటుంది.

ముత్తయ్య భాగవతార్ గారి గం గణపతే అన్న కృతి చక్కటి సాహిత్యం కలిగి ఉంటుంది.

హంసధ్వని రాగంలోని మరిన్ని కృతులకై ఇక్కడ చూడండి.

మార్చి 13, 2007

శ్రీనాధుని చమత్కారం

కవికీ కంసాలికీ సీసం లోకువంటారు. మరి కవిసార్వభౌముడైన శ్రీనాధుడికెంత లోకువో అనిపిస్తుంది ఈ సీస పద్యం చదివితే:
సీ: రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                       తలప నల్లయ వేమ ధరణి పతికి
     రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                       తలప నల్లయ వేమ ధరణి పతికి
     రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                        తలప నల్లయ వేమ ధరణి పతికి
     రాజనందన రాజ రాజాత్మజుల సాటి
                        తలప నల్లయ వేమ ధరణి పతికి

గీ: భావభవ భోగ సత్కళా భావములను
     భావభవ భోగ సత్కళా భావములను
     భావభవ భోగ సత్కళా భావములను
     భావభవ భోగ సత్కళా భావములను

శ్రీనాధుడు ఈ పద్యం ఉపయోగించి గౌడ డిండిమ భట్టుని ఎలా ఓడించాడో బాపూ గారి శ్రీనాధ కవిసార్వభౌముడు చిత్రంలో చూపించారు. అన్ని పాదాలూ ఒకేలా ఉన్న ఈ పద్యం యొక్క అర్ధం తెలుసుకోవాలంటే శబ్దరత్నాకరం భట్టీ వేసుండాలి. ఐనా కూడా తెలియదేమో.

ఉదాహరణకి రాజు అన్న పదానికి మన్మధుడు, ఇంద్రుడు, కుబేరుడు, క్షత్రియుడు ఇంకా ఇలా ఎన్నో అర్ధాలున్నాయి. అవన్నీ తెలుసుకుని ఇంకా ఇలాగే ఈ పద్యంలోని ఇతర పదాల నానార్ధాలు సమీకరించి, సమన్వయించుకుంటే తప్ప ఈ పద్యార్ధం బోధపడదు.  శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు ఇలా సమన్వయించి ఇచ్చిన అర్ధం ఇక్కడ చదవచ్చు(రానారెకు కృతజ్ఞతలు). 

పాండిత్య ప్రకటనకి ఇలాంటి పద్యాలు ప్రతీకలుగా ఉంటాయి కానీ నాకు మాత్రం “నల్లనివాడు పద్మనయనంబుల వాడు….” అంటూ మురిసిపోయిన పోతన గారి పద్యాలలోని అందం ఇంతకన్నా అపురూపం అనిపిస్తుంది.

మార్చి 9, 2007

త్యాగరాజ స్వామి గడుసుతనం!

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 12:36 ఉద.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు….తెలుగు వారందరికీ సుపరిచితమైన కృతి ఇది. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులులో ఐదవది. మంగళకరమైన శ్రీ రాగంలో ఉండడం వల్ల కాబోలు దీనిని ఆఖరున పాడతారు.

ఈ కృతి గురించి ప్రచారంలో ఉన్న విషయం ఆసక్తికరమైనది. త్యాగరాజ స్వామి గురువు గారైన శొంఠి వెంకటరమణయ్య పంతులు గారి సమక్షంలో సంగీత విద్వత్సభ జరిగినప్పుడు, గురువు గారి ప్రతినిధిగా త్యాగరాజుల వారు తమ విద్వత్తు ప్రదర్శించవలసిన సందర్భంలో ఈ కృతి ని రచించి పాడారనీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరి పైన విజయం సాధించారని చెప్పుకుంటారు.

ఐతే నేనిక్కడ రాయబోయే విషయం ఈ కృతిలోని ఒక పాదానికి సంబంధించినది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు…అంటూ మొదలుపెట్టిన త్యాగరాజ స్వామి అనుపల్లవిలో:

“చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారు…

ఎందరో మహానుభావులు”

అంటారు. ఇక్కడే వచ్చింది తిరకాసంతా. మనందరికీ తెలిసిన విషయం రాముడు నీలమేఘ శ్యాముడు అని, అంటే నీలి మబ్బుల రంగులో ఉండేవాడు కదా. మరి చంద్రుని రంగులో ఉండడం ఏంటి? ఈ విషయమే సాహిత్యం గూగుల్ గుంపులో ఎవరో ఈ మధ్య అడిగారు.

దీని గురించి నేను శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి పుస్తకంలో చదవి ఉండడం వల్ల అక్కడ సమాధానం ఇచ్చాను. వర్ణము అంటే రంగు,కులము అనే అర్ధాలతో పాటు గుణము అనే అర్ధం ఉంది (వర్ణో ద్విజాది శుక్లాది యజ్ఞే గుణ కధాసు చ – వర్ణమనగా బ్రాహ్మణాది కులాలు, తెలుపు మొదలైన రంగులు, యజ్ఞము, గుణము-ఇన్ని అర్ధాలున్నాయి). రాముడు చంద్రుని మల్లే చల్లని చూపులతో ప్రకాశవంతంగా ఉంటాడు కనక అలా పోల్చవచ్చు. అందుకే వాల్మీకి మహాముని రాముని “సోమవత్ ప్రియదర్శనః” అని కీర్తించారు.

తరువాత అలోచిస్తే త్యాగరాజ స్వామి చేసినది చాలా చిలిపి పనిగా అనిపించింది. మనకి అందరికీ వర్ణము కి తెలిసిన అర్ధాలు రంగు ఇంకా కులము. రాముడు చంద్రునిలా తెల్లగా ఉండడు. పైగా రామునిది సూర్యవంశం. మరి పని గట్టుకుని చంద్రుని లాగుకు రావడం, వర్ణము అనడం,  పైగా అందచందాల గురించి ప్రస్తావించడం అంతా పనిగట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుంది. చంద్రుని వర్ణంలో ఉండేవాని అందచందాలు చూడడం  అనగానే ఎవరికైనా రంగు అనే అర్ధమే కదా గుర్తొస్తుంది. ఇలా మనని తప్పుదోవ పట్టించవలసిన అవసరం ఆయనకేమిటి? కేవలం ప్రాస కోసం ఇంత పని చేసుంటారా?

నాకు తోచిన సమాధానం ఏంటంటే ఇక్కడ త్యాగరాజ స్వామి తప్పుదోవ పట్టించినది కావాలనే. ఆ రోజుల్లో విద్వత్సభల్లో నెగ్గుకు రావడానికి ఇలాంటి కిటుకులు చాలా అవసరంగా ఉండేవని నేను విన్నాను. ఎందుకంటే ప్రతీ చోటా దుష్ట శంకలు చేసే మిడిమిడి జ్ఞానపు పండితులు చాలా మందే ఉండేవారు. తప్పులు పట్టడం వీరి పని.అజ్ఞానం వీరి లక్షణం. ఈ కృతి సభలో పాడగానే వీరికి ఇది వెంటనే దొరుకుతుంది. వెంటనే రాముని వర్ణం కూడా మీకు తెలీదంటూ మొదలు పెడతారు. ఇంత పండితుడికి,భక్తుడికి ఈ మాత్రం తెలియదా, ఏదో అర్ధం ఉండే ఉంటుందని కూడా ఆలోచించరు. దెబ్బకి ఈయన చేతిలో చిక్కుతారు. అర్ధం చెప్పగానే నోరుముయ్యవలసిందే కదా. ఇంక మరి మాట్లాడరు. ఇలాంటి వారి కోసమే త్యాగరాజ స్వామి ఈ ఎర విసిరారేమో అనిపిస్తుంది నాకు.

మహాకవి శ్రీనాధుడు కూడా గౌడ డిండిమ భట్టుని ఓడించే సందర్భంలో “రాజనందన రాజ రాజాత్మజులు సాటి….” అంటూ రాజ శబ్దానికి ఉన్న వివిధ అర్ధాల ఆధారంగా ఒక పద్యం చెప్పి ప్రతిపక్షులని బోల్తా కొట్టించడం మనకి తెలిసిన విషయమే. బాపూ గారి సినిమాలో కూడా చూపించారు. 

కానీ త్యాగరాజుల వారు శ్రీనాధుని కన్నా చాలా మెత్తన. నిజానికి మనం కొద్దిగా నిదానించి చూస్తే త్యాగరాజ స్వామి ఎరలో చిక్కుకోకుండా బయటకి రావచ్చు. మరొక్కసారి చూడండి, అంద చందమును కళ్ళతో చూసి అనలేదు హృదయంలో చూసి అని కదా వాడారు. మరి మనం హృదయంతో చూసేవి గుణగణాలేకానీ రంగులు కాదు కదా. పైగా ఆ చూసినవారు “బ్రహ్మా”నందం పొందుతారని కూడా అన్నారు. అంటే ఏమిటన్నమాట, ఆత్మ సాక్షాత్కారమే కదా. మరి అటువంటి జ్ఞానులకి బాహ్య సౌందర్యంతో పనేముంది. ఇప్పుడు మరొక్కసారి ఆ అనుపల్లవి చూస్తె “పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరాముని గుణగణాలను హృదయమనే పద్మంలో చూసి చిదానంద స్థితిని పొందే మహానుభావులకి వందనం” అన్న అర్ధం గోచరిస్తుంది. తరచి చూస్తే ఈ పాదంలో వేదాంత పరమైన ఇంత అర్ధం ఉంది.  
 
త్యాగరాజ స్వామి కృతిలోని ఒక్క అనుపల్లవి గురించి నాబోటి వాడు ఇంత రాయగలిగితే, సమర్ధులైన వారు ఒక్కొక్క కృతి మీదా పీహెచ్‌డీ చెయ్యవచ్చనిపిస్తుంది నాకు.
 

మార్చి 1, 2007

ఆనందోదయం !

Filed under: కబుర్లు — Sriram @ 6:48 ఉద.

DSCN0932

తెలతెలవారుతుండగా పెరటి గోడ పై కూర్చుని చెరువులో ఈదులాడే చేపపిల్లల చేష్టల్లోని చిత్రాలు చూస్తుంటే, ఆనందానికి అసలు అర్ధం ఇదేనేమో అనిపిస్తుంది.

ఆలయ శిఖరాల నుండి “గంగాతరంగ రమణీయ జటా కలాపం…” అంటూ వెలువడిన శివస్తుతి వినగానే మనస్సుకి ఆ ఆనందపు అనుభవం ఏమిటో తెలుస్తుంది. “ప్రాణానల సంయోగం” వల్ల పుట్టిన నాదం ఆకాశ మార్గాన ప్రయాణించి, నీటి అలలపై తేలియాడి, భూమాత పాదాలని స్పృశించి….పంచభూత సమ్మిళతమైన ప్రణవరూపంగా సాక్షాత్కరిస్తుంది.

పాడిఆవుల వరప్రసాదమైన గుమ్మపాలు, వాటిని కడవలలో నింపి తీసుకెళ్ళే పల్లె పడచుల అందాలకి ఆఘ్రాణత్వాన్ని అద్దుతున్నాయా అనిపిస్తుంది.

కొమ్మల గుబురుల నుండి తీయటి తేట తెలుగు గానాలు వినిపించే కోయిల పాటలు వింటుంటే, పంచమ స్వరానికి గమకాలు అద్దే కొత్త ప్రయోగం చేసి భళీ అనిపించుకున్న గాయక శిరోమణియా అనిపిస్తుంది. మూడే స్వరాలతో రాగాలు కనిపెట్టిన బాలమురళీ కృష్ణ గారి కన్నా కేవలం ఒకే ఒక్క స్వరంలో ఇంత అందమైన రాగం ఆలపిస్తున్న ఈ కోయిల విద్వత్తు ఎంతగొప్పదో అనిపిస్తుంది.

తల్లి వెనుకనే ఛంగు ఛంగు మని గెంతుతూ… ఆటగా, అంబా అనే పాటగా సాగిపోయే లేగదూడల ముఖాలలోని అమాయకత్వాన్ని చూసినప్పుడు జనించే భావానికి అక్షర రూపాన్ని ఇవ్వలేను అనిపిస్తుంది.

ఈ క్షణం కదలక ఇలాగే నిలచి ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది.

*స్వాతిగారికి కృతజ్ఞతలతో….

*ఫోటో సేకరణ – నా ఫోటో బ్లాగు నుండి.