సంగతులూ,సందర్భాలూ….

ఏప్రిల్ 26, 2007

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

Filed under: కబుర్లు — Sriram @ 11:25 సా.

వారాంతం శలవులలో ఇంటికి వెళ్ళిన నాకు ఆదివారం నాడు ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాలు చూసి చూసి తల వేడెక్కడంతో కాస్త చల్లగాలి పీల్చుకుందామని డాబా ఎక్కాను. దూరంగా అవధాన్లు తాతయ్య వాళ్ళింటి అరుగు మీద జంధ్యాలు వడుకుతూ కనిపించాడు. పలకరింపుగా నవ్వాను. ఈ మధ్య ఇంతే, దూరంగా చూసి నవ్వడమే కానీ దగ్గరకి వెళ్ళట్లేదు. ఆయన వేసే ప్రశ్నలకి జవాబు చెప్పడమే కష్టమైతే దానికి తోడు ఈ మధ్య వినికిడి కూడా తగ్గడంతో గట్టిగా అరవవలసి వస్తోంది. ఇదంతా పడలేక ఏదో పనిలో ఉన్నట్టుగా నవ్వి వెళ్ళిపోడమే తప్ప ఆగి మాట్లాడటంలేదు. కానీ ఈసారి ఆయనని చూడగానే బ్లాగులోకంలో జరుగుతున్న వేదాలగురించిన చర్చ గుర్తొచ్చింది. ఈ మధ్య కొత్తగా తెలుసుకున్న విషయాలు ఆయనమీద ప్రయోగించి ఆయనని తప్పనిపించాలి అన్న బుద్ధి పుట్టడంతో మెట్లుదిగి వాళ్ళింటికి బయల్దేరాను.

తాతయ్యతో మా వీధి కుర్రవాళ్ళందరికీ చిన్నప్పటినుంచీ దోస్తీ. చీకటి పడుతుండగా ఆటలు ముగించి వాళ్ళ అరుగు మీద చేరిన మా అందరికీ సాయంత్రపు సంధ్యావందనం, అర్చన ముగించుకొచ్చిన తాతయ్య పెట్టే పటికబెల్లం పలుకులూ, అంతకన్న తియ్యగా ఉండే కధలూ, కబుర్లూ మంచి కాలక్షేపంగా ఉండేవి. పెద్దవాళ్ళమయ్యే క్రమంలో ఎంసెట్లూ వగైరాలు మొదలయ్యాక ఆటలతో పాటు ఈ కాలక్షేపం కూడా ఆగిపోయింది. ఎప్పుడైనా తాతయ్యతో మాట్లాడినా, ఆయన అడిగే ప్రశ్నలూ, చెప్పే కబుర్లూ నచ్చకపోవడం మొదలవ్వడంతో ఆయన దగ్గరకి వెళ్ళడమే తగ్గిపోయింది. ఆయనకీ కొత్త స్నేహితులు వచ్చారు, మా తరువాత పుట్టినవాళ్ళు.

దగ్గరకెళ్ళి తాతయ్యా బాగున్నావా అని పలకరించాను. ఆయన ఒక నవ్వు నవ్వి, ఒరేయ్ విభూతి డబ్బా లోపల మర్చిపోయాను కొంచెం తెచ్చి పెడుదూ అన్నాడు. డబ్బా తెచ్చి చేతికిచ్చాను. విభూతి చేతికి రాసుకుని ఏరా మనదేశంలోనే ఉన్నావా? ఈ మధ్య బొత్తిగా కనపడటమే లేదు అని అడిగాడు. ఒక వెర్రి నవ్వు నవ్వి, పని ఎక్కువగా ఉంటోందని సంజాయిషీ ఇచ్చుకున్నాను. ఆలస్యంచేస్తే ఈయన మాటలు ఎటువైపు మళ్ళిస్తాడో అని ఇలా మొదలెట్టాను:

“తాతయ్యా! మీ వేదాలలో సైన్సు ఉందట నిజమేనా?”

“సైన్సా? అంటే మీ స్కూళ్ళలో సామాన్య శాస్త్రం అని బోధిస్తుంటారే అదేనా? కామన్సెన్సురా, దానికి వేదాలెందుకూ?” కాస్త వెటకారంగా వచ్చింది సమాధానం.

“తాతయ్యా! సైన్సు అంటే విజ్ఞాన శాస్త్రం, కామన్సెన్సు కాదు.”

“ఓహో విజ్ఞానమా! ఆ విజ్ఞానశాస్త్రం అంటే ఏంటో నాకు తెలీదు కానీ మా వేదాలలో మీకు తెలియని విజ్ఞానం చాలా ఉంది. దేనికోయ్ ఇప్పుడు?”

నాకు వళ్ళు మండిపోయింది. “మీరు ఏమీ అర్ధంతెలీకుండా బండ భట్టీయం వేసిన ఆ సంస్కృతపు వాక్యాలలో మాకు తెలియనిది విజ్ఞానం ఉందా? ఇది ఒకటి వచ్చు మీకు, ఏమి చెప్పినా అన్నీ వేదాలలోనే ఉన్నాయిష అనడం” అన్నాను.

“ఏం ఎందుకనకూడదు? మా వేదాలలో ఉన్న విజ్ఞానం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోడం తప్పా?”

“ఏముంది మీ వేదాలలో సైన్సు? ఒక విమానం కాదు కదా కనీసం ఒక సైకిలు తయారు చెయ్యి చూద్దాం వేదంతో, ఏమి సైన్సు ఉందో తెలిసిపోతుంది”.

“ఇదే మీతో వచ్చింది. మా వేదంగురించే కాదు, మీ చదువు గురించి కూడా సరిగా తెలీదు. పరీక్ష పేసు చదువులు ఇలాగే ఉంటాయి. సైన్సు వేరు, ఇంజనీరింగ్ వేరు. సైకిలు లాంటివన్నీ యంత్ర శాస్త్రం, తంత్ర శాస్త్రం లోకి చేరుతాయి. వాటి కధ వేరు. కాకపోతే వీటికి మూలమైన విజ్ఞానం మా వేదాలలో ఉంది”.

“తాతయ్యా! నాది పరీక్ష పేసు చదువుకాదు. మా క్లాసులో మొదటి రేంకు ఎప్పుడూ నాదే. ఐనా ఇప్పటి ఈ ఇంజనీరింగ్ అద్భుతాలన్నీ ఐన్‌స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రంలో చేసిన కృషివల్ల సాధ్యపడ్డాయి కానీ మీ వేదాల వల్ల కాదు”.

“ఓహో! మొదటి రేంకు వాడి జ్ఞానమే ఇలా ఉంటే ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటో. ఐనా ఏమిటి కనిపెట్టాడు అంత గొప్ప విషయం ఐన్‌స్టీన్”

“ఏం తాతయ్యా! ఇన్ని కబుర్లు చెప్తావు, ఈ ఈజీక్వల్టూ ఎంసీ స్క్వేర్ తెలీదా నీకు. పదార్ధాన్ని శక్తిగా మార్చవచ్చని కనుక్కున్నది ఆయనే”

“ఈ విషయం ఖచ్చితంగా మా వేదాలలో ఉంది”.

“నాకు సంస్కృతం రాదు కదా అని ఏవో కల్లబొల్లి శ్లోకాలు రెండు అల్లి చెప్తావు నువ్వు. నేనెలా నమ్మేది?”

“ఇదొక సమస్య, మీకు తెలియనివన్నీ తప్పులే మీకు. సరే నీకు తెలిసిందే చెబుతాలే. నువ్వు చిన్నప్పుడు అన్నం తినక గోల చేస్తుంటే నేనేం చెప్పేవాడినో గుర్తుందా”.

“ఆ ఉందిలే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బలవంతంగా నోట్లో కుక్కించే వాడివి. ఐనా అన్నం దేవుడేవిటి, తెలీక వినేవాడిని కానీ…”

“ఇప్పుడేమో అతి తెలివి వచ్చింది! నేను అన్నం రాముడనో కృష్ణుడనో చెప్పానా? పరబ్రహ్మ స్వరూపం అంటే ఈ సకల జీవ జాలంలోనూ ఉన్న చైతన్యం. అదే ప్రాణశక్తి. మనం తీసుకున్న ఆహారమే ఈ ప్రాణశక్తిగా మారుతోందని మా వేదం ఎప్పుడో ఘోషిచింది. మనం తీసుకునే ఆహారం మన స్వభావాన్ని నిర్దేశిస్తుంది. దాని మీదే మన ప్రవర్తన, ప్రవర్తన మీద జీవనం ఆధారపడి ఉంటాయి. ఈ మధ్యనే మీ సైన్సు వాడే ఎవడో శాకాహారులకి తెలివితేటలెక్కువని కనుక్కున్నాట్ట. అందుకే భోజనం చెయ్యడానికి, పదార్ధాలు తయారు చెయ్యడానికీ వేదంలో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. వాటి నుంచి శుచి శుభ్రాల కోసం ఏర్పడినవే మడులు వగైరా. ఇవేవీ తెలీవు కానీ మడి కట్టుకున్న అమ్మమ్మని ముట్టుకుంటానని ఆటపట్టించడం తెలుసు మీకు. సరేలే, విషయానికి వస్తాను. ఈ సృష్టిలోని సమస్తమైన పదార్ధాలలోనూ మా వేదాలు ఆ అనంత చైతన్యాన్ని, శక్తినీ చూసాయి. రోజూ సంధ్యావందనం చేసేటప్పుడు “…సదా సర్వభూతాని చరాణి స్థావరాణిచ సాయంప్రాతర్నమస్యంతీ…” అంటూ నేను చదివే మంత్రార్ధం తెలుసా నీకు? చరములు, స్థావరములు అనగా జీవములు, నిర్జీవములు ఐన సమస్త భూతములలోనూ నిబిడీ కృతమై ఉన్న ఆ శక్తికి నేను నమస్కరిస్తున్నాను అన్న వేద వాక్యం మీ ఐన్‌స్టీన్ చెప్పినదానికి సరిపోయిందా లేదా?”

నాకు ఏం చెప్పాలో తెలియలేదు. ఇంత దెబ్బ కొడతాడనుకోలేదు ఈయన. ఉక్రోషం పొడుచుకొచ్చి ఎలాగైనా ఎదురుదాడి చెయ్యాలని మొదలెట్టాను.

“నువ్వు చెప్పినదే నిజమైతే మీ వేదాలని నలుగురికీ పంచడానికి ఏమిటి అభ్యంతరం? విజ్ఞానం ప్రజలందరికోసం కాదా? ఏదో కొంతమంది సొత్తుగా ఎందుకుండిపోవాలి?”

“అణు విజ్ఞానం ఉగ్రవాదుల చేతికి ఎందుకు వెళ్ళకూడదు? అందుకే ఇదీను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటూ కొత్తగా అరుస్తున్నారే మీ సాఫ్టువేరు వాళ్ళందరూ, మరి అంత గొప్ప శక్తినిచ్చే వేదవిజ్ఞానం ఉన్నవాడికి ఎంత బాధ్యత ఉండాలి? బాధ్యతలేని శక్తి ఎంత ప్రమాదకరం! పాత్రత ఉన్నవాడికే విద్యగరపాలని మా సనాతన ధర్మ నియమం. అందుకే మా వేదాలు ప్రపంచ శాంతిని కోరాయి, మీ సైన్సు వల్ల ఆటంబాంబు పుట్టింది.”

“పాత్రత అంటే కులమా? మొన్న మా ఆఫీసు కొచ్చిన ఒక ఇంగ్లాండువాడు మన కులాల గురించి అడుగుతుంటే ఎంత సిగ్గేసిందో తెలుసా నాకు?”

“ఆహా! వాడు వాళ్ళ దేశంలో లార్డో కామనో కనుక్కోపోయావ్! గాంధీ గారిని రైల్లోంచి తోసేసింది వీడి తాతో ముత్తాతో అయ్యుంటాడు.”

“మనలో ఉన్న లోపానికి సమాధానం ఎదుటివాడిలో లోపం వెతకడంకాదు”.

“ఒరేయ్! ఈ ప్రపంచకం పుట్టిన దగ్గర నుంచీ ఈ అసమానతలూ, అణచివేతలూ అన్ని చోట్లా ఉన్నాయి. జుట్టు అందిన వాడిని మొత్తడం మానవ నైజం. దానికీ మతానికీ ముడిపెట్టకు. ఐనా బుద్ధుడి మొదలు ఏ ప్రవక్తనీ ఈ దేశంలో శిలువ వెయ్యలేదు. అసలు నా సనాతన ధర్మం గురించి నేను గర్వపడేదేమిటో తెలుసా? ఆటవికజాతుల లాగ బలవంతుడికో, లేక పాశ్చాత్యదేశాలలో లాగ రాజులూ భూస్వాములకో అగ్రత్వం ఇవ్వలేదు. విజ్ఞానానికున్న విలువ గ్రహించి ఆ జ్ఞానాన్ని పెంచుతూ రక్షించే వేదవిద్యా పారంగతులకి గౌరవం కట్టబెట్టింది. ఆ జ్ఞానాన్ని పొందడానికి అనేక నియమాలు పెట్టి వారిలో బాధ్యత పెంచింది. భిక్షాటన చేసుకుని బతకమని చెప్పింది. అంతేకానీ మీ సైంటిస్టులలాగ, సాఫ్టువేరు నిపుణులలాగ జ్ఞానంతో పాటు సంపాదన పెంచుకోమని చెప్పలేదు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని బట్టి గౌరవించింది కానీ కులాన్ని బట్టి కాదు. ఐనా ఈ అగ్రకులమన్నమాటే వేదాలలో ఎక్కడా లేదు. సమాజంలోని వివిధ వర్గాలని శరీరంలోని వివిధ భాగాలతో పోల్చింది వేదం. శరీరంలో ఏ భాగం ఎక్కువ గొప్ప అంటే ఏమి చెప్తావ్? కాకపోతే కొంతమంది ప్రబుద్ధులు ఇందులో కూడా తప్పుడర్ధాలు వెతికే వాళ్ళున్నారు, శిరస్సుకి అగ్రత్వాన్నీ కాళ్ళకి తక్కువతనాన్నీ కట్టబెట్టి చొప్పదంటు ప్రశ్నలు వేసేవారు. శిరస్సు మేధకి సంకేతమనీ, కాళ్ళు శ్రమకి గుర్తనీ ఇందులో ఒకటిగొప్ప ఇంకొకటి తక్కువా ఏమీ లేదన్న విషయాన్ని గ్రహించుకోక ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఎలా? ”

“మరి రాముడు శంభూకుడిని ఎందుకు చంపాడు? శూద్రుడనే కదా?”

“వాడు శూద్రుడని కాదు. క్షుద్రుడని. కులాన్ని బట్టి కాదు గుణాన్ని బట్టి. వాడి ప్రవర్తన ప్రజా శ్రేయస్సుకి వ్యతిరేకంగనుక.”

“ఇది నీ కల్పన. నువ్వు చూసావా అతడు క్షుద్రుడని?”

“అక్కడే నాకు కోపమొస్తుంది. నమ్మితే మొత్తం నమ్మాలి. నీకు నచ్చింది నమ్ముతావు నచ్చనిది నమ్మవు. సరే నిన్ను ఒప్పిస్తాను. అసలు రాముడు ఎందుకు పుట్టాడో చెప్పు?”

“రావణబ్రహ్మని చంపడానికి.”

“చూసావా నీ నోటితో నువ్వే చెప్పావు. రావణబ్రహ్మ అనే బ్రాహ్మణుడు వాడి ప్రవర్తనవల్ల రావణాసురుడిగా మారితే వాడిని చంపడానికి కదా పుట్టాడు. మరి కేవలం పుట్టిన కులమాధారంగా ఆలోచించేవాడైతే రావణుడిని చంపుతాడా? బ్రాహ్మణుడైన రావణుడిని చంపినందుకు బ్రాహ్మలెవరూ ఆయనని పూజించకూడదా? ఇవేవీ ఆలోచించరు మీరు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఏదైనా చిన్న విషయం కనపడితే అది పట్టుకు కూచుంటారు. అష్టాదశ పురాణాలూ నైమిశారణ్యంలో బోధించిన సూత మహాముని పుట్టుకతో శూద్రుడనీ, ఐనప్పటికీ ఆయన బుర్ర బద్దలుకొట్టిన బలరాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందన్న విషయమూ తెలుసా నీకు?”

నాకేమి మాట్లాడాలో తెలీలేదు. బిక్కమొహం వేసి కూచున్నాను. పాపం చిన్నవాడని జాలిపడ్డాడో ఏమో మళ్ళీ ఆయనే “మరీ అంత బిక్కమొహం వెయ్యకురా! ఇంత మాత్రానికే మీ సైన్సు వోడిపోయిందనీ నేను గెలిచేసాననీ అనుకోకు. ఎప్పుడూ కూడా వాది దోషమేకానీ వాదనలో దోషం ఉండదని ఒక సూక్తి ఉంది సంస్కృతంలో. వాదించే వాడి సమర్ధతని బట్టి తిమ్మి బమ్మి ఔతుంది. మీ ఐన్‌స్టీన్ లాంటివాడొచ్చి వాదిస్తే నేనూ చేతులెత్త వలసిందే. గుర్తుపెట్టుకో, బ్రహ్మము మాత్రమే సత్యం. మిగిలినదంతా మాయే. అందుకే మన మన సమర్ధతని బట్టి సత్యమనీ అసత్యమనీ ఋజువు చేసెయ్యచ్చు. నీకు వేదమూ తెలీదు. నీ పరీక్ష పేసు చదువుల వల్ల మార్కులొచ్చాయికానీ మీ సైన్సూ తలకెక్కలేదు. నాతో ఏమి వాదిస్తావ్ ఇంక?” అంటూ నవ్వేసాడు.

“ఐతే ఇప్పుడేమంటావ్, సైన్సు గొప్పా మీ వేదాలు గొప్పా? ఏమిటి నీ అభిప్రాయం?” కాస్త ధైర్యం కూడదీసుకుని అడిగా.

“ఒరేయ్! ఇలాంటి వాదాల వల్లే అసలు సమస్యలన్నీ. ఆధునిక విజ్ఞానం వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంకా జరుగుతాయి. అవి మనందరికీ అవసరం కూడా. కానీ ఆ వ్యామోహంలో పడి వేదాలు ఎందుకూ కొరగానివిగా భావించి అవహేళన చెయ్యడం చాలా తప్పు. వేరే ఏ దేశప్రజలకీ లేని వారసత్వ సంపద ఇది. అందులో ఉన్న విజ్ఞానం ఎంతో మంది మహాద్రష్టల తపోఫలం. ప్రతివ్యక్తిలోనూ దాగి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోడానికి అవసరమైన మార్గం. ప్రపంచ శాంతికీ, సుభిక్షతకీ సైన్సు కన్నా ఎక్కువ అవసరమైన జ్ఞానం ఇది. అది గుర్తు పెట్టుకో చాలు. ఈ విషయం చెప్పడానికే నేను నీతో వాదన చేసింది. నిజానికి వేదాలలో సైన్సు లేకపోయినా నాకు నష్టం లేదు. వేదాల స్థాయి, దృక్పధం వేరు. సైన్సు సంగతి వేరు. సరే మరి నేనింక సంధ్యావందనానికి లేస్తాను. ఈ రోజు నా స్నేహితులు స్పైడర్మేన్ సినిమా పట్టుకొస్తామన్నారు. వాళ్ళతో కలిసి అది చూడాలి” అంటూ తాతయ్య లేచాడు.

నవ్వుకుంటూ నేను ఇంటి ముఖం పట్టాను. “విత్ గ్రేట్ పవర్ కంస్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ” అన్న పీటర్ పార్కర్ డైలాగ్ ఎందుకో పదే పదే గుర్తొచ్చింది.

ఏప్రిల్ 20, 2007

అందమైన సమస్య!

Filed under: Uncategorized — Sriram @ 12:17 ఉద.

గత రెండు వారాలుగా స్వాతికుమారి గారిని తిట్టుకోని రోజు లేదు. ఏమి పని చేసారీవిడ? ఆ మాత్రం సామాజిక స్పృహ ఉండద్దూ? ఏదో కనిపించింది కదా అని లావణ్య కౌముది అనుకుంటూ అంతటి అందాన్ని పట్టుకొచ్చి కూడలిలో పెట్టెస్తే జరిగే పరిణామాలకి ఎవరిది బాధ్యత? ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు బయట ఎక్కడైనా ఇలాంటి ప్రమాదకరమైన హోర్డింగ్స్ ఉంటే వెంటనే తొలగిస్తారు. నేను కూడా ఇదే ముక్క వీవెన్ గారితో చెప్పి ఆ పోస్ట్‌ని తీయించెద్దామనుకున్నాను. గోరుచుట్టు మీద రోకటిపోటంటారే అలాగ సరిగ్గా అదే సమయానికి ఆయన ఊరికెళ్ళడం, కూడలి కదలకపోవడం లాంటి వన్నీ జరిగాయి. 

ఏం చెయ్యడానికీ లేకుండా తయారయ్యింది పరిస్తితి. అలాగని కూడలి చూడడం మానడం కుదరదు కదా. అది అంతకన్నా బాధ. రోజూ ఆ ఫోటో చూడడం తప్పక, చూసి మామూలుగా ఉండలేక, ఎంత యాతనో ఏమి చెప్పేది. అప్పుడెప్పుడో దూరదర్శన్ వారు సమస్యా పూరణం కార్యక్రమంలో ఇచ్చిన పాదం:

కలమా సాగదు నిద్రరాదు మన మా కాంతాలతాధీనమై !

అన్నది గుర్తొచ్చింది. ఎంత అందమైన సమస్య అనిపించింది వెంటనే. ఏమీ చెయ్యలేమని కూర్చుంటే ఇంకా బాధ కనక, ఈ పద్యాన్ని పూర్తి చెయ్యాలి ఎలాగైనా అని ప్రయత్నించాను. ఈ మత్తేభం ఇదిగో ఇలా తయారయ్యింది:

చల మా తొంగలి రెప్పలందమరు కంజాక్షద్వయాభాస, మం
దల మా మేను విరాజమానమగు సౌందర్యంబుకున్, నా మనో
బలమా చాలదు నిగ్రహాచరణకున్, భారంపు రేయందు  నా
కలమా సాగదు నిద్రరాదు మన మా కాంతాలతాధీనమై !   

(చలము=కదలాడునది;తొంగలి రెప్పలు=quivering eyelids ; కంజాక్షద్వయాభాసము=పద్మాల వంటి కన్నుల కాంతి;
అందలము=పల్లకి;మేను=శరీరము )

* ఈ పద్యం రాయడానికి కారణమైన  కొత్తపాళీగారికి, స్వాతిగారికి కృతజ్ఞతలు. సహపాఠి రానారెకు అభినందనలు.

ఏప్రిల్ 8, 2007

జీవనాధారస్వరం!

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 11:13 సా.

వారాంతం వచ్చిందంటే నాకు ఎక్కడలేని ఆనందం ముంచుకొస్తుంది, నిద్ర రూపంలో. పనిరోజుల్లో పడుక్కుందామన్నా ప్రశాంతత కరువే ఈ నగరంలో. పొద్దున్న ఏడు గంటలనుంచీ మొదలయ్యే చిత్ర విచిత్ర రూపాలలో ఉండే ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాల రణగొణధ్వని ముందు విశ్వామిత్రుడి తపస్సైనా సరే భంగం కావలసిందే మరి. అందుకే నిద్ర అనే యోగసమాధిలో చిదానందపు అంచులు చూస్తూ పరవశంతో పడుక్కుని ఉన్నాను. 

 

ఇంతలో ఏదో మధురమైనా కల. నిజానికి కలో మెలకువో తెలియని స్థితి. ఏమిటో స్పష్టతలేని ఒక ఊహాతీతమైన సౌఖ్యభావన మనసుని ఊపెయ్యడంతో మెలకువవచ్చింది. “వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం…” అంటూ ఎక్కడనుంచో ఒక శ్రావ్యమైన సింధుభైరవి రాగం వినిపించింది. ఇంత అందంగా నాదస్వరంతో సుప్రభాతం పాడితే దేవుడే నిద్రలేస్తాడుకదా నాకు మెలకువ రావడంలో వింతేముంది అనిపించింది.

 

ఇంక పడుక్కోబుద్ధికాలేదు. “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది…” అని కూనిరాగం తీస్తూ బ్రష్షూ,పేస్టూ పట్టుకుని బాత్రూంలో దూరాను. ఇంతలో సన్నాయి శబ్దం మరింత దగ్గరైంది. పాట మారి,నగుమోము కనలేని నాజాలి తలచి…” అంటూ ఆభేరి రాగం మొదలైంది.నా ఆనందం రెట్టింపైంది.ఇంత పొద్దున్నే ఏమిటా ఇది, కొత్తగా వెలసిన అపార్ట్మెంట్లలో ఎవరిదేనా గృహప్రవేశమేమో అనుకున్నా. ఐనా ఇలా నాదస్వరం పెట్టించి త్యాగరాజ కృతులు వాయించమనేది ఎవరు ఈరోజుల్లో అనిపించింది మళ్ళీ. కొద్ది సేపటికి “ఎంతనేర్చినా, ఎంతచూసినా….కాంతదాసులే”  అంటూ శుద్ధ ధన్యాసి రాగం వినబడింది. అప్పుడు తట్టింది నాకు డోలు వాయిద్యం లేదేమిటా అని. సాధారణంగా నాదస్వరానికి డోలు పక్కవాయిద్యం ఉంటుంది కదా మరి. ఎక్సైట్మెంట్ ఎక్కువయ్యి గబగబా షవర్ తిప్పడం మొదలుపెట్టాను. నాదస్వరం మరింత దగ్గరై ఆనంద భైరవి రాగంలో “పలుకే బంగారమాయెనా…” అంటూ భద్రాచల రామదాసు కీర్తన పలుకుతోంది.

 

ఇంక నా వల్ల కాలేదు.పొడి తువ్వాలు చుట్టుకుని బాల్కనీలోకి పరిగెట్టాను. కిందకి చూద్దును కదా నా ఆశ్చర్యానికి అంతేలేదు. సుమారు ఇరవై సంవత్సారాలుంటాయేమో, ఒక యువకుడు తన్మయత్వంతో నాదస్వరం వాయిస్తూ ఒక్కడూ రోడ్డుమీద నడచి వెళ్తున్నాడు.  మధ్యలో ప్రతీ గేటు దగ్గరా ఒక నిముషం ఆగి ఏమైనా ఇస్తే తీసుకుంటున్నాడు.

మనస్సులో ఒక్కసారి ఎన్నో ప్రశ్నలు. ఎవరితను? ఇంత అందంగా, శాస్త్రీయంగా వాయిస్తున్న ఇతనికి ఏమిటీ ఖర్మ? ఏదో పాడుతూనో, గంగిరెద్దులని తీసుకొచ్చి సన్నాయి వాయిస్తూనో భిక్షకి రావడం మనదేశంలో కొత్త కాదు. కానీ అవి వినగానే ముష్టి వాయిద్యమని మనకి తెలిసిపోతుంది. ఇంత బాగా వాయించే శక్తి వాళ్ళకుండదు. ఎప్పుడో త్యాగరాజ స్వామి కాలంలో ఊంచ వృత్తినవలంబించారని విన్నాను కానీ ఈ రోజుల్లో ఏమిటితను?ఏమి కష్టంలో ఉన్నాడో పాపం? కనుక్కుని కుదిరినంత సాయం చెయ్యాలనుకున్నాను. ఆగమని అరుద్దామంటే నాగరికత అడ్డొచ్చింది. పరుగెట్టి కిందకెళ్దామంటే ఈ అవతారంతో ఎలా వెళ్ళడం.

 

చూస్తూ ఉండలేక లోపలకొచ్చి చేతికందిన బట్టలు వేగంగా తొడగడం మొదలెట్టాను. “నిధి చాల సుఖమా…” అంటూ కల్యాణి రాగం మొదలయ్యింది ఇంతలో. సన్నాయి శబ్దం దూరమవ్వడం ప్రారంభించింది.నేను కిందకెళ్ళేప్పటికి వినిపించటం ఆగిపోయింది. ఎటు వెళ్ళాడో ఆ యువకుడు జాడకూడా లేదు. నా నిస్సహాయతకి నా మీద నాకే జాలి వేసింది. దిగాలుగా మెట్లెక్కి వాకిట్లోని న్యూస్ పేపర్ తీసుకునొచ్చి సోఫాలో కూలబడ్డాను.

 

కద్రి గోపాలనాధ్ గారి సేక్సోఫోన్, రోనూ మజుందార్ గారి వేణువాదన జుగల్బందీ కచేరీ చౌడయ్య హాలులో. ప్రవేశ రుసుము తల ఒక్కింటికీ రెండొందల యాభై రూపాయలు మాత్రమే.

ప్రకటన చూసిన నాకు అప్రయత్నంగానే ఎందుకో ఒక్కసారి ముఖంలో చిరునవ్వు మొలిచింది.