సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 21, 2007

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు(మళ్ళీ…)

Filed under: Uncategorized — Sriram @ 11:40 సా.

ఆమధ్య ఈ పుస్తకం గురించి రాసిన వ్యాసంలోని లింకు పని చెయ్యటంలేదంటూ కొంతమంది మిత్రులు అడిగారు. ఆర్కైవె.ఆర్గ్ లోని లింకు నాకు మళ్ళీ దొరికింది. ఇక్కడ నుంచి ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు .

ఫిబ్రవరి 20, 2007

తెలుగు – తీయదనం

Filed under: Uncategorized — Sriram @ 4:41 సా.

(భాషా దినోత్సవం సందర్భంగా….)

బ్రోచేవారెవరురా…అన్న కృతి మనందరికీ తెలిసిందే కదా. ఈ కృతి కర్త పేరు మైసూరు వాసుదేవాచార్య. ఈయన జన్మతః కన్నడిగుడు. కానీ రచించిన కృతులన్నీ తెలుగు, సంస్కృతంలలోనే.

అలాగే రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ….అంటూ కదనకుతూహల రాగంలో మనలని కదిలించిన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, పేరులోనే ఉంది కదా, తమిళుడు.

ఇంకా శ్యామ శాస్త్రి, పూచి శ్రీనివాస అయ్యంగార్ ఇలా ఎన్ని పేర్లైనా చెప్పుకోవచ్చు. వీరెవ్వరూ తెలుగు వారు కాదు. కష్టపడి తెలుగు నేర్చుకుని తెలుగులో మాత్రమే రచించిన వారు. అందుకే కర్ణాటక సంగీతంలో ఎనభై శాతం సాహిత్యం అంతా తెలుగులోనే ఉంది. దీనికి కారణం?

కారణం తెలుగు భాష తియ్యదనమే. సంస్కృతేతర భాషలలో గానానికి ఎక్కువ అనుకూలంగా ఉండే భాష తెలుగు భాషే. అందుకే “సుందర తెలుగులో” పాడమన్నాడు తమిళుడైన సుబ్రహ్మణ్య భారతి. తెలుగు భాషలో తియ్యదనం మిళితమై ఉంది. దీనికి కారణాలు నాకు తోచినవి రెండు రాస్తాను.

మన తెలుగు భాషలో పదాలన్నీ అచ్చులతో పూర్తి అవుతాయి. ఉదాహరణకి రామ,కృష్ణ అంటాం మనం. రామన్, కృష్ణన్ అనము కదా. ఇలా అచ్చులతో ముగించడం వల్ల భాషకి, అందులో పాటలకి ఎనలేని అందం వస్తుంది.పాటలో గమకాలు చక్కగా పలికించవచ్చు. దానితో పాట విన సొంపుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ పొల్లు మాటలే ఫ్యాషన్ అయ్యాయనుకోండి. రాహుల్, రోహిత్ ఇలాంటివేగా మన వాళ్ళ పేర్లు ఇప్పుడు. కానీ అవి తెలుగు మాటలు కాదని మనం అనుకోము. రాహులుడు అని పేరు పెట్టుకుంటే మరి అనాగరికం కదా.

మన తెలుగు భాషకున్న మరొక వరం ప్రధమా విభక్తి. చిన్నప్పుడు చదువుకున్నాం గుర్తుందిగా. డు,ము,వు,లు. అంటే మన పేర్లన్నీ రాముడు, కృష్ణుడు ఇలా ఉంటాయిగా. “రాముడూ లోకాభిరాముడూ….” అంటూ పాడుకుని మనం మురిసిపోవచ్చు. ఈ ప్రధమా విభక్తి మన సోదర భాష ఐన కన్నడకి కూడా లేదు. అందుకేనేమో ఆ భాషలో కన్నా తెలుగులోనే రచన చేసారు వాసుదేవాచార్య లాంటి వాళ్ళు.

ఇదేదో నేను భాషా దురభిమానంతో రాసిన రాత కాదు. వందల సంవత్సరాలనుండీ అందరూ ఒప్పుకున్న విషయం. ఇంత అందమైన ఆంధ్రభాష మన మాతృభాషకావడం మన అదృష్టం.  

ఫిబ్రవరి 18, 2007

విశాఖపట్నం, భారత్ విజయం, మయూర్ సూటింగ్స్…నా అనుమానం!

Filed under: కబుర్లు,భారతదేశం — Sriram @ 12:39 ఉద.

పరమచెత్తదైన పిచ్…
దుమ్మురేగుతూ ఉండే ఔట్‌ఫీల్డ్…
పరుగెట్టలేక ఆటగాళ్ళ పాట్లు…
వీటిని చూసి టీవీ వ్యాఖ్యాతల పెదవి విరుపులూ…

ఒకప్పటి విశాఖ క్రికెట్ మైదానం చిత్రం ఇది. కానీ ఈరోజు భారత్-శ్రీలంకల మేచ్ జరిగిన మైదానం చూసి నేను నమ్మలేకపోయాను. ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణంగా ఉంది ఈ కొత్త ఆట మైదానం. కానీ, ఈ నాణ్యతని ఎన్ని రోజులు నిలిపి ఉంచుతారనేదే నా అనుమానం.

ఏమైతేనేం మొత్తానికి భారత్ గెలిచింది. సిరీస్‌ని కూడా కైవసం చేసుకుంది. కీలక ఆటగాళ్ళు సౌరవ్,సెహ్వాగ్,యువరాజ్,సచిన్ అందరూ బాగా ఆడుతున్నారు. ద్రవిడ్ ఎప్పుడూ నిలకడైన వాడే అనుకోండి. కానీ, ఈ పులులన్నీ వెస్టిండీస్ లోని మైదానాలలోని పచ్చికని ఏమాత్రం భయపెట్టగలవనేదే నా అనుమానం.

మీరు గమనించారో లేదో, మయూర్ సూటింగ్స్ వ్యాపార ప్రకటనలలో సెహ్వాగ్ కనిపించటంలేదిప్పుడు. అవును మరి ఆ సంస్థ యాజమాన్యం భారతీయ క్రికెట్ సెలక్షన్ బోర్డ్ లాంటిది కాదు కదా. అందుకే సెహ్వాగ్‌కి ప్రపంచ కప్ లో చోటైతే దక్కింది కానీ కాంట్రాక్ట్ మాత్రం మళ్ళీ దక్కలేదు. అందుకే ఈ సంస్థ ప్రకటనలలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడు. కానీ, షర్ట్‌లు అమ్ముకునే ఈ కంపెనీ, అవంటే బొత్తిగా పడని సల్మాన్‌ని ప్రకటనలకి వాడుకోడం ఏమాత్రం తైలివైన పనా అనేదే నా అనుమానం. 

ఫిబ్రవరి 16, 2007

పంచారామ క్షేత్రాలు

Filed under: భారతదేశం — Sriram @ 7:09 సా.

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

భీమారామం గూర్చి వివరాలు తెలియవని రాసారు. ఈ ఆలయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంది. దీనిని సోమారామం అని కూడా పిలుస్తారు.

ఫిబ్రవరి 15, 2007

ఆపాతమధురం

Filed under: సంగీతం,సినిమాలు — Sriram @ 8:01 సా.

ఏ ఆర్ రెహ్మాన్ అనగానే మీకేమి గుర్తొస్తుంది?  ‘ముక్కాలా ముకాబ్‌లా…’ నా లేక ‘ఓ చెలియా నా ప్రియసఖియా…’నా? అప్పట్లో యావద్భారతాన్నీ ఒక ఊపు ఊపిన ‘ముక్కాలా…’ పాట రెహ్మాన్ కి తెచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. అదొక ప్రభంజనం అప్పట్లో. కానీ ఇప్పటికీ ఆ సినిమాలో పాట జనాల నోళ్ళలో నలుగుతున్నదీ, టీవీ చానళ్ళలో అప్పుడప్పుడు మెరుస్తున్నదీ ఏదీ అంటే ‘ఓ చెలియా…’ పాటనే చెప్పుకోవాలి. దానికి కారణం బ్రహ్మరహస్యం ఏమీ కాదు. మాధుర్య ప్రధానమైన, వినడానికి హాయిగా ఉండే పాటలని సంగీతప్రియులు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు. ఇలాంటి పాట ఒకటి ఇప్పుడు విందాం.

“ఇద్దరు” సినిమాలో “శశివదనే శశివదనే…..” అన్న పాట విన్నారు కదా. ఈ పాట రాసింది సినీ కవితా చక్రవర్తి అనదగ్గ మన వేటూరి గారే ఐనా డబ్బింగ్ పాట కావడం వల్లనేమో దాని అర్ధం అంతగా బోధపడదు. కానీ వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది! ఆ హాయి ఆ పాటకి అద్దినది శాస్త్రీయ సంగీతమే. నాట రాగమే. వేటూరి గారు చిలిపి వారు కావడం వల్ల కాబోసు ఈ పాట ట్యూన్ తెలిసి ఉండి కూడా పాటలో నీలాంబరి, తోడి, మాండు, మోహనం అన్నారేగానీ ఎక్కడా నాట అన్న పదం వాడలేదు. ఇదొక చమత్కారం.

రెహ్మాన్ ఏదైనా శాస్త్రీయమైన రాగాన్ని వాడినా, అది చాలా లలితంగా ఉంటుంది. రాగఛాయలోకి వెళ్ళినట్టే వెళ్ళి బయటకు దూకుతూ ఉండడం, పక్క రాగాల వైపు క్రీగంట చూసి ఊరించడం ఆయనకి అలవాటు. కానీ మామ మహదేవన్ దగ్గర ఇలాంటి ఆటలు కుదరవు. “ప్రణతి ప్రణతి ప్రణతీ….” అంటూ ససాంప్రదాయంగా గౌరవించాల్సిందే. ఈ పాటలో సిరివెన్నెల వారి పదాల గాంభీర్యానికి మహదేవన్ నాట రాగపు గాంధారాన్ని పోటీ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు.

విన్నారుగా పాట, మరి ఇంత శాస్త్రీయమైన పాట పాడింది బాలూగారేనంటే ఆశ్చర్యమేస్తుంది. ఈయనేమో నేను శాస్త్రీయంగా ఏమీ నేర్చుకోనేలేదంటారు. మరి శాస్త్రీయ సంగీతం లొ ఉద్దండులైన నిత్యశ్రీ మహదేవన్, హరిహరన్ లు నాట రాగంలో పాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సరసకె బారో (సరసకు రారా…) అంటూ వీరు కన్నడంలో ఎలా పాడారో ఒకసారి వినండి. దీనికి సంగీత దర్శకుడు గురుకిరణ్ అన్నాయన. ఈ మధ్యనే తెలుగులో కూడా పని చేసినట్టున్నారు.

ఇంకొక్క సినిమా పాట కూడా విందాం. ఇది అవ్వడానికి సినిమా పాటే అయినా, నిజానికి శాస్త్రీయమైన కృతే. ఇళయరాజా నిమిత్తమాత్రుడే. యేసుదాస్ గారు సింధుభైరవి సినిమాలో పాడిన “మహాగణపతిం” అన్న కృతి దీక్షితార్ వారిది. సంగీతం నేర్చుకునేవారు కృతులలోకి అడుగుపెట్టాక నేర్చుకునే తొలి వాట్లలో ఇదీ ఒకటి. 

ఇప్పుటిదాక మనం విన్నవి ఒకెత్తూ, ఇప్పుడు వినబోయేది ఒక ఎత్తూ. శాస్త్రీయ సంగీత చరిత్రలో నాట రాగపు ధాటిని శాశ్వతం చేసిన ఘనత త్యాగరాజుల వారిదే. పంచరత్న కృతులలో మొదటిదైన “జగదానందకారకా….” అన్న కృతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో విన్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా….అంటూ మొదలుపెట్టిన త్యాగరాజు మొత్తం ఇటువంటి 108 నామాలతో ఈ కృతిని సమకూర్చిన తీరు అనితర సాధ్యం. అంతేకాదు ఈ కీర్తనలో రామాయణం మొత్తం ఇమిడి ఉంది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. ఈ పంచరత్నకృతుల విషయాలు ఎప్పుడైనా తీరికగా చెప్పుకోవలసినవే కానీ ఇలా టూకీగా తేలేవి కావు.

ఇక నాట రాగపు లక్షణాలేమిటో ఒకసారి చూద్దాం. ఈ రాగపు
ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స
అవరోహణ: స ని3 ప మ1 రి3 స
ఈ రాగ స్వరాలని పరిశిలిస్తే రి3,గ3 ఇంకా ద3,ని3 చాలా దగ్గరగా ఉండే స్వరాలు. గాత్రంలో ఈ తేడా చూపించడం కష్టం. ఇటువంటి రాగాలని వివాది రాగాలు అంటారు. సంగీత కచేరీలలో నాట రాగం సాధారణంగా మొదటి రెండు,మూడు కీర్తనలలోపే వస్తుంది. నాట రాగంలో ఉన్న మరిన్ని కృతులకై ఇక్కడ చూడండి. 

ఇప్పుడు చెప్పండి, ‘శశివదనే…’ పాటలోని అందానికే పొంగిపోయిన మనని, ‘జగదానందకారకా…’ లోని మాధుర్యం ఇంకెంత ఆనందింపచెయ్యగలిగిందో. శాస్త్రీయ సంగీతపు మహత్తే అది. ఈ రాగాలు అంతులేని బంగారు గనులు. తవ్విన కొద్దీ తన్మయత్వం పెరుగుతూ ఉంటుంది.   

(ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం నాకు తెలిసిన కొన్ని మంచి పాటలనీ, కృతులనీ నలుగురితో పంచుకుందామనే. సరిగమల గురించి రాసిన వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యల్లో చర్చ నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకునేలా చేసింది.నాకున్న సంగీత జ్ఞానం పూజ్యం. అందుచేత ఎక్కడైనా తప్పులు రాస్తే, అవి విజ్ఞులు సవరిస్తే నన్ను దిద్దుకోవచ్చని ఒక ఆశ. మీరు కూడా నేను ఇక్కడ రాసిన చెవాకుల మాట ఎలా ఉన్నా, పాటలు విని ఆనందిస్తారని ఇంకొక ఆశ.అందుకే ఈ పనికి పూనుకున్నది. ఇంకొక్క విషయం, ఈ వ్యాసాన్ని కేవలం చదవడం కాకుండా ఇక్కడ ఉదాహరణగా ఇచ్చిన పాటలన్నీ విని చూడండి. ఎక్కడైనా, ఎప్పుడైనా నాట రాగాన్ని చాలా సుళువుగా గుర్తించగలుగుతారు. రసాస్వాదనం చేయగలుగుతారు.)      

తర్వాత పేజీ »