సంగతులూ,సందర్భాలూ….

జూలై 21, 2007

ఆకాశదేశాన ఆషాఢమాసాన…

తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే.

ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక సాహిత్యం గూగుల్ గుంపులో అడిగేసరికి పద్మ గారు ఆ కావ్యం గురించిన వివరాలు అందచేసారు.

ఆవిడ మాటల్లో : “మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, “శ్రీకాళా” వ్యాఖ్య కూడా ఉంది. ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను ’98 లో అట్లాంటాలో జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో కూడా దొరకచ్చు.”

ఈ వివరం చూసి నేను ఆన్లైన్ గ్రంధాలయంలో వెతికితే శరత్బాబుగారి పుస్తకం దొరికేసింది.

మేఘదూతం కావ్యాన్ని చదవాలనీ, కాళిదాసు “ఉప్మా” రుచి చూడాలనీ ఆసక్తి ఉండి, సంస్కృతానికీ గ్రాంధికానికీ భయపడే నాలాంటి వాళ్ళకి గొప్ప కానుక ఈ పుస్తకం. ప్రతీ శ్లోకానికీ సరళమైన వ్యావహారిక భాషలో  అర్ధం,వ్యాఖ్యానం ఉన్నాయి. దీనివల్ల కావ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలగడమే కాక, మన భాషాజ్ఞానాన్ని కూడా  పెంచుకోగలుగుతాం. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలని నా ఆశ.
 

జూలై 20, 2007

సంచలనాత్మక నవల: ఆవరణ

పుస్తకాలు చదవడం అనే అలవాటు ఈరోజుల్లో ఎంత తగ్గిపోయిందో మనందరికీ తెలిసినదే. అందులోనూ పుస్తకాన్ని కొని చదవడమంటే! అభిమాన హీరో సినిమా ఎంత చెత్తగా ఉన్నా పదిహేనోసారి చూడడానికి ఎటువంటి ఆలోచనా చేయని జనాలు పుస్తకం మీద పది రూపాయలు ఖర్చుపెట్టడానికి కూడా ఇష్టపడటంలేదు. అలాంటిది ఒక ప్రాంతీయ భాషలో రాసిన నవల విడుదలైన నాలుగు నెలలోనే తొమ్మిది సార్లు పునర్ముద్రింపబడింది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది.

ఆ నవలే ప్రముఖ కన్నడ రచయిత, చరిత్రకారుడు అయిన ఎస్.ఎల్.భైరప్ప రాసిన “ఆవరణ” .

ఈ మధ్యకాలంలో పాశ్చాత్య సమాజాన్ని డావిన్సీ కోడ్ ఎంత ఊపు ఊపిందో కన్నడ సాహితీరంగాన్ని ఈ నవల అంతగా కుదిపివేసింది.

లౌకికవాదం ముసుగులో ఓటుబేంకు రాజకీయాలకు పాల్పడుతున్న మన రాజకీయనాయకులు చరిత్రని ఎలా వక్రీకరించి తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారో కళ్ళకు కట్టిన నవల ఇది.

ఈ నవల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంటే ఈ పుస్తకసమీక్షని చదవండి.

జూలై 7, 2006

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు!

Filed under: పుస్తకాలు — Sriram @ 6:30 ఉద.

ఈ మధ్య నేను చదివిన తెలుగు పుస్తకాలలో ఒకటి ఇది. విశ్వనాధ వారి ఊహాశక్తి కి, సృజనాత్మకతకి ఇది చక్కటి తార్కాణం. అద్భుతమైన వ్యంగ్యం, కడుపుబ్బనవ్వించే హాస్యం వీటికిమించి ప్రతి ఒక్కళ్ళనీ ఆలోచింపచేసే సునిశితమైన తర్కం ఈ పుస్తకంలో కనిపిస్తాయి.మన భాష గొప్పతనాన్ని తెలియచేస్తూ, గుడ్డిగా మనం పరభాషావ్యామోహంలో ఎలా కొట్టుకుంటున్నామో చూపిస్తుంది ఈ పుస్తకం. తెలుగు భాషని అభిమానించేవాళ్ళు తప్పక చదవవలిసిన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోచ్చు. ఈ పుస్తకాన్ని చదవడానికి  ఈ ప్లగిన్ కూడా అవసరం.
గమనిక: ఆర్కైవ్।ఆర్గ్ నుంచి సేకరించబడినది.హక్కుల విషయమైన వివాదాలు ఏమైనా ఉంటే వెంటనే తెలియపరచగలరు.