సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 4, 2007

శారదా….!

Filed under: సంగీతం,సినిమాలు — Sriram @ 4:35 సా.

“శుద్ధ్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది…?” గర్జిస్తారు శంకరాభరణం శంకరశాస్త్రి గారు.  తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం మారు మోగే వాక్యం అది. చిన్నతనంలో ఈ సినిమా చూసిన నాకు ఇదేమిటో అర్ధంకాకపోయినా, ఈ వాక్యం బాగా గుర్తుండిపోయింది.

ఈ రిషభం అంటే ఏమిటి? హిందోళంలో ఎందుకు రాకూడదు? అసలు హిందోళం అంటే ఏమిటి? ఇవి మాత్రం నన్ను దొలుస్తూ ఉండేవి. చాలా రోజుల తరువాత నాకు ఈ ప్రశ్నలకి సమాధానం దొరికింది.

రిషభమా…వృషభమా?

మొదట తెలిసిన విషయం. సరిగమలలోని “రి” ని రిషభం అంటారు. అబ్బో బాగుంది అనిపించింది. మరి మిగిలిన వాటికి కూడా ఏమైనా పేర్లున్నాయా? ఉన్నాయిట.

స: దీనిని షడ్జమం అని కూడా అంటారు. మిగిలిన ఆరు స్వరాలకీ ఇదే ఆధార స్వరం. ఈ స్వరం నెమలి కూత నుండి పుట్టింది.

రి: రిషభం అంటే ఇదే. ఇందులో మూడు రకాలు ఉన్నాయి.రి1, రి2, రి3 అంటారు వీటిని. ఈ స్వరం వృషభ ధ్వని నుండి పుట్టింది.

గ: గాంధారం అంటారు దీనిని. ఇందులో కూడా గ1,గ2,గ3 అని మూడు రకాలున్నాయి. ఇది మేక స్వరం నుంచి పుట్టింది.

మ: దీనిని మధ్యమం అంటారు. మ1,మ2 అని రెండు రకాలు. క్రౌంచ పక్షి స్వరం నుండి పుట్టింది.
 
ప: పంచమం దీని పేరు. ఇందులో రకాలు లేవు. వసంత ఋతువులో కోకిల పంచమ స్వరంలో కూస్తుంది.

ద: దైవతం. ద1,ద2,ద3 అని మూడు రకాలు. గుఱ్ఱము ధ్వని నుంచి పుట్టింది.

ని: నిషాదం అంటారు. ఇది కూడా ని1,ని2,ని3 అని మూడు రకాలు. యేనుగు ఘీంకారం నుంచి పుట్టింది.

హిందోళం అంటే?
హిందోళం ఒక రాగం పేరు. మన సంగీతంలో ఉన్న అనేక రాగాలలో ఇదీ ఒకటి. పైన చెప్పిన సప్తస్వరాలలోని కొన్ని నిర్దిష్ట స్వరాల కూర్పునే రాగం అంటారు. ప్రతీ రాగానికి ఒక స్వంత లక్షణం, లక్ష్యం ఉంటాయి. వీటికి లోబడే ఆయా రాగాలని ఆలపించాలి.

మరి హిందోళ రాగంలో రిషభం రాకూడదా?
రాకూడదు. హిందోళ రాగం లక్షణానికి ఇది విరుధ్ధం. ఈ రాగంలో స,గ2,మ1,ద1,ని2 అనే స్వరాలు మాత్రమే వస్తాయి.
ఈ రాగపు ఆరోహణ : స గ మ ద ని స
అవరోహణ: స ని ద మ గ స
 
త్యాగరాజు గారి కీర్తన “సామజవరగమనా…” ఈ రాగంలోనే ఉంది. ఇదే కీర్తనని పాటగా మార్చి శంకరాభరణం సినిమాలో వాడారు. అసలు కీర్తన వినాలని ఉందా? కె.జె. యేసుదాస్ గారి గాత్రంలో ఇక్కడ వినండి. యు.శ్రీనివాస్ గారి మేండోలిన్ వాదనలో కూడా ఇక్కడ వినచ్చు. ఎక్కడైనా రిషభం వచ్చిందేమో చూడండి. శారదా…అని మాత్రం అరవకండి. 🙂

20 వ్యాఖ్యలు »

  1. miru samgiitam nercukunnaraa?leda just anni telusukunnaraa?

    వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 4, 2007 @ 7:33 సా. | స్పందించండి

  2. రాధిక గారూ, తెలుసుకోవడం కూడా నేర్చుకోవడమే అనుకున్నాను…ప్రస్తుతానికి అంతవరకే!

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 5, 2007 @ 10:35 ఉద. | స్పందించండి

  3. మంచి సమాచారం ఇచ్చారు. ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఆరాటం వున్నా బద్దకిస్తూ వచ్చాను. ఇప్పుడు మీరిచ్చిన సమాచారం చూశాక ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తోంది. చెప్పగలరా?

    –ప్రసాద్
    http://blog.charasala.com

    వ్యాఖ్య ద్వారా Prasad Charasala — ఫిబ్రవరి 5, 2007 @ 3:03 సా. | స్పందించండి

  4. prasad gArU, tappakunDaa…naaku telisindi andaritO paMcukODaaniki praytnistaanu. appuDappuDu ikkaDaki vacci veltuMDaMDi.

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 5, 2007 @ 5:08 సా. | స్పందించండి

  5. మీలాంటివారి కోసమే చూస్తున్నాను. కాస్త సంగీతజ్ఞతగల మీలాంటివారు – కొంతైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండి తగిన సాహచర్యంలేని నాబోంట్లకు కూడా కాస్త జ్ఞానం పంచగలరని ఆశ. ఈ-మాట అనే మాసపత్రికలో కొడవటిగంటి కుటుంబరావుగారి వ్యాసాలతో ఈ మధ్యనే షడ్జమ రిషభ గాంధారాదుల గురించి కొంత అవగాహన కలిగింది. కానీ నేనర్థంచేసుకున్నది సరైనదేనా అని బేరీజు వేసుకోవడానికి నాకెవ్వరూ అందుబాటులో లేరు. సినిమాపాటలు వింటున్నపుడు -అరె, ఈ పాటలోని ఈ భాగం ఆ పాటను పోలివుందే. ఈ రెంటికీ ఆధారం ఏ రాగమో కనుక్కుందాం – అని ఇంటర్నెట్లో వెదకడం వరకే నా సంగీతఙ్ఞానం పరిమితం. నేను పుట్టిపెరిగిన పరిస్థితులు నాకీమాత్రం అభిరుచి కలిగించినందుకు నేనదృష్టవంతుణ్ణే. ఆమీదట మరికొంత తెలుసుకోవాలనే నా కుతూహలానికి రోహిణీప్రసాద్ గారి ఈ వ్యాసంతో ఒక దిశ ఏర్పడింది. వ్యాసం రాసి వూరుకోక ప్రతి అభిప్రాయానికీ తగురీతిన స్పందించడం ఆయనపట్ల గౌరవాన్నిపెంచింది. పాండిత్యాన్ని పక్కనపెట్టి, ప్రాథమికాంశాల్ని చిన్నపిల్లలకు అర్థమయేలా Scientificగా చెప్పగలగడం చాలా గొప్పసంగతి. నా తొలి శాస్త్రీయసంగీత గురుదేవునికి కృతఙ్ఞతాభివందనాలతో… ఆ వ్యాసం ఇక్కడ: http://eemaata.com/em/issues/200609/905.html

    వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 5, 2007 @ 8:29 సా. | స్పందించండి

  6. రానారె గారూ, మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. తప్పకుండా చర్చిద్దాం. మీలాంటివారు ఇచ్చిన ఉత్సాహంతో నేను నాకు తెలిసిన సంగతులు రాయడానికి ప్రయత్నిస్తాను.
    రోహిణిప్రసాద్ గారి వ్యాసాలు నేను కూడా చదివాను. ఆయన విద్వాంసులు. నాకు లాంటి వాళ్ళు విధ్వంసం చెయ్యకుండా ఉంటే చాలు… 🙂

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 6, 2007 @ 5:08 ఉద. | స్పందించండి

  7. మీ బ్లాగులు బాగున్నాయి. చాలా ఓపికమంతుల్లా ఉన్నారు. ఒక చిన్న అంశం. నాకు తెలిసి గాంధారం గాడిద అరుపు నుండి వచ్చింది. పాత సీతాకోకచిలుక సినిమాలో ముచ్చెర్ల అరుణ సంగీతం నేర్చుకొంటున్నప్పుడు, ఆమె ‘గా’ అనడానికి కష్టపడుతోంటే బయటినుండి మురళి గాడిద చేత సందర్భోచితంగా అరిపిస్తాడు. శారదా అన్న అరుపు ఆరోజుల్లో ఒక క్రేజ్ అయిపోయింది. ఎవరైనా ఆ పాట పాడితే శారదా అని అరవడానికి అందరూ రెడీ అయిపోయేవాళ్ళు.

    వ్యాఖ్య ద్వారా సత్యసాయి — ఫిబ్రవరి 8, 2007 @ 11:08 ఉద. | స్పందించండి

  8. సాయిగారూ, ధన్యవాదాలు.
    ఇక గాంధారం సంగతి. మీరు చెప్పిన సినిమా సంగతి నాకు గుర్తు లేదు. నేను రాసినదానికి ఆధారం ఈ శ్లోకాలు.

    షడ్జం మయురో వదతి గావో ఋషభాషిణః
    అజావికంతు గాంధారం క్రౌంచః క్వణతి మధ్యమమ్

    పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమమ్
    దైవతం హేషతే వాజీ నిషాదం బ్రంహతే గజః

    “అజావికంతు గాంధారం ” అని కదా ఉంది. అజం అంటే నాకు తెలిసినంత వరకూ మేక అనే అర్ధం. బ్రౌను నిఘంటువులో ఇక్కడ చూడండి.

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 8, 2007 @ 6:16 సా. | స్పందించండి

  9. నా మలయాళం మిత్రుడొకరు ఈ సంగతి చెబుతుండేవారు. ఆయనకోసం మీరు ఇక్కడరాసిన శ్లోకాలను మలయాళంలో రాసిచ్చాను. షడ్జం అని ప్రారంభంకావాలికదూ, అచ్చుతప్పుదొర్లినట్లుంది. ఆ శ్లోకాలు మలయాళంలో ఎలా కనిపిస్తాయో చూడండి సరదాగా:

    ഷഡ്ജമ് മയുരോ വദതി ഗാവോ ഋഷഭാഷിണഃ |
    അജാവികംതു രാംധാരമ് ക്രൌംചഃ ക്വണതി മധ്യമമ് ||

    പുഷ്പ സാധാരണേ കാലേ പികഃ കൂജതി പംചമമ് |
    ദൈവതമ് ഹേഷതേ വാജീ നിഷാദം ബ്രഹ്മതേ ഗജഃ ||

    వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 9, 2007 @ 11:09 సా. | స్పందించండి

  10. మంచి చర్చ. కానీ, సంస్కృత వాఙ్మయంలో సప్త స్వరాల ప్రస్తావన విశదంగా కనిపించే భరతుని నాట్యశాస్త్రం(400 BCE) లో గాని, దత్తిలుని దత్తిలం (100 CE)లో గాని, మాతంగుని బృహద్దేశి (500 CE)లో గాని, సారంగదేవుని సంగీత రత్నాకర (1200 CE) లో గాని సప్త స్వరాలను సప్త జంతువుల కూతల ఆధారంగా ఏర్పడ్డట్టుగా ఎక్కడా చెప్పలేదు(ట)*. మీరు ఉటంకించిన శ్లోకం నారదీయ శిక్ష (200 CE) లోనిది. ఇదే పుస్తకంలో సప్త స్వరాలను సప్త ఋషులకు, సప్త వర్ణాలకు, సప్త జాతులకు, సప్త శరీరాంగాలకు ఆపాదించడాన్ని బట్టి ఈ వ్యుత్పత్తిని మనం ఎంత సీరియస్ గా తీసుకోవాలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంతో మంది (వా)గ్గేయకారులు – త్యాగరాజు నుండి వేటూరి వరకూ – ఈ “కూత”లను ఆధారంగా చేసుకొని పాటలు రాసారు కాబట్టి వాటిని సంగీత సంప్రదాయంలో భాగంగా భావించి చర్చించడంలో తప్పేమి లేదు.

    *Music and Musical Thought in Early India By Lewis Rowell

    వ్యాఖ్య ద్వారా వార్త్తిక్ — ఫిబ్రవరి 10, 2007 @ 7:47 ఉద. | స్పందించండి

  11. రానారె గారూ, వార్త్తిక్గారూ…మీరిద్దరూ బహుభాషా కోవిదులలా ఉన్నారే…ఇంతకీ మీ స్నేహితుడు ఏమిటి చెబుతూ ఉండేవారో నాకు అర్ధం కాలేదు.దయచేసి కొంచెం వివరించండి.

    వార్త్తిక్ గారూ మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు. నాకు తెలియని విషయాలు ఇవి. మీరన్నట్టు, ఇది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెట్టి, అదొక భావనగా గుర్తించి ఆనందించడమే మనం చేయవలసింది అని నా అభిప్రాయం.

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 10, 2007 @ 7:00 సా. | స్పందించండి

  12. నేను మాత్రం కోవిదుణ్ణి కానండి. మలయాళం కూడా తెలీదు, కాకపోతే యూనీకోడ్‌లో రాయగలనంతే. వాళ్ల సినీసంగీతం మన సినీసంగీతమంత సంకరం కాలేదు. అంచేత మలయాళంపాటలు ఇష్టంగా వింటాను. నా మిత్రుడు కూడా మీరు చెప్పిందే చెప్పేవాడు, సప్తస్వరాలు ఏడు జంతువుల అరుపులనుండి వచ్చాయని. కానీ అతనికీశ్లోకాలు తెలియవిన్నాళ్లూ.

    వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 12, 2007 @ 8:47 సా. | స్పందించండి

  13. “వాళ్ల సినీసంగీతం మన సినీసంగీతమంత సంకరం కాలేదు”
    నిజమే…

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 13, 2007 @ 5:56 ఉద. | స్పందించండి

  14. మా వాడికి ఓ ‘కీ బోర్డు’ పుట్టినరోజు కానుకగా వచ్చింది. ఇన్నాళ్లు ఏదో అపస్వరాలు తప్ప సరిగా పలికించింది లేదు.మీ బ్లాగు చూశాక సంగీతంలో ఓనమాలు నేర్చుకోవాలని అనిపిస్తోంది. అలాగే ‘రోహిణీ ప్రసాద్’ గారి వ్యాసాన్ని పరిచయం చేసిన ‘రానారె’కు కృతజ్ఞతలు!

    వ్యాఖ్య ద్వారా డా.ఇస్మాయిల్ పెనుకొండ — ఫిబ్రవరి 19, 2007 @ 10:40 సా. | స్పందించండి

  15. మా వాడికి ఓ ‘కీ బోర్డు’ పుట్టినరోజు కానుకగా వచ్చింది. ఇన్నాళ్లు ఏదో అపస్వరాలు తప్ప సరిగా పలికించింది లేదు.మీ బ్లాగు చూశాక సంగీతంలో ఓనమాలు నేర్చుకోవాలని అనిపిస్తోంది. అలాగే ‘రోహిణీ ప్రసాద్’ గారి వ్యాసాన్ని పరిచయం చేసిన ‘రానారె’కు కృతజ్ఞతలు!

    వ్యాఖ్య ద్వారా డా.ఇస్మాయిల్ పెనుకొండ — ఫిబ్రవరి 19, 2007 @ 10:40 సా. | స్పందించండి

  16. ఇస్మాయిల్ గారూ, చాలా సంతోషం. మనం నేర్చుకోవడమే కాక మంచి సంగీతాన్ని, మన సంస్కృతిని ప్రొత్సహించడం, రక్షించుకోవడం మన బాధ్యత.

    వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 20, 2007 @ 1:30 సా. | స్పందించండి

  17. నేను ఇప్పుడే ఆంగ్లం లో ఇది అంతా చదివి… తెలుగులో ఎవరన్నా రాసారా? చూద్దామని గూగుల్ సెర్చి కొట్టాను. మీ వ్యాసం బాగుంది… ధన్యవాదాలు.

    వ్యాఖ్య ద్వారా vbsowmya — అక్టోబర్ 10, 2007 @ 4:01 సా. | స్పందించండి

  18. hi sriram garu….munduga meeku namaskaramulu….mee yokka visleshana…vivarinchina reeti nijam ga chala baguni…naaku kooda sangeetham ante pranam….kaani nerchukune..avakasalu..adharalu….
    levu. anduke thelusukovadaniki prayatnisthunnanu….meeku naa kruthagnajathalu…ika pothe naaku ika chinna sandeham vundi…
    oka ragam nundi migilina raagalu elavasthayi…asalu oka raagam ela puduthundi…ippudu vasthunna cenima patala lo kooda ee raagalu upayogisthunnara….? oka ragam yokka lakshanalu enti……meeru upa swaralu gurinchi chepparu…..(ga2,ma1,da1) veetini gurinchi kooda konchem vivaramga cheppandi……?
    mundugaane meeku kruthagnajathalu thelupukuntunnanu…..

    suresh sai.v

    వ్యాఖ్య ద్వారా suresh sai — జూలై 10, 2008 @ 9:50 ఉద. | స్పందించండి

  19. […]  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3 […]

    పింగ్ బ్యాక్ ద్వారా ఆపాతమధురం…4(రీతిగౌళ రీతులు) « సంగతులూ,సందర్భాలూ…. — మార్చి 6, 2010 @ 5:37 సా. | స్పందించండి

  20. […]  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – […]

    పింగ్ బ్యాక్ ద్వారా ఆపాతమధురం: ‘కారుణ్య’ వాణి | సంగతులూ,సందర్భాలూ…. — జూన్ 16, 2017 @ 3:43 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

Leave a reply to Sriram స్పందనను రద్దుచేయి