సంగతులూ,సందర్భాలూ….

మార్చి 6, 2010

ఆపాతమధురం…4(రీతిగౌళ రీతులు)

చా…లా రోజుల తర్వాత ఆమధ్య కూడలివైపు రాగానే “తెలుగు అభిమాని” గారి టపా కనపడింది. ఆయన అన్నట్టు, ఔను! రీతిగౌళ లో ఏదో లాక్కొచ్చే మాయ ఉంది! పండితపామరులనందరినీ కట్టిపడేసే శక్తీ ఉంది. అందుకే అలనాటి ఘంటసాల నుంచి ఈనాటి రహ్మాన్ వరకూ అన్నితరాల సంగీత దర్శకులనీ తన మాధుర్యంతో ముగ్ధుల్ని చేసి తన అందాలకి కొత్త నగిషీలు చెక్కించుకుంటూనే ఉంది.

నాకు తెలిసి సినిమా పాటల్లో ఈ రాగంలో వచ్చిన మొదటి పాట ఘంటసాల గారు స్వయంగా నటించి, తన ప్రియదైవానికి భక్తిగా సమర్పించుకున్న “శేషశైలావాస శ్రీవేంకటేశా…”.

“శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు….” అన్న చరణపు పాదంలోనే ఈ పాటమొత్తం అందం ఉంది అనిపిస్తుంది నాకు. అమితమైన చనువు, అంతకుమించిన ప్రేమ వీటికి తోడు కాస్త చిలిపితనం – వీటన్నింటిని కలిపి పలికించడానికి రీతిగౌళకి మించిన రాగం లేదనే కాబోలు ఘంటసాలగారు ఈ రాగంలో స్వరపరచారు. మధ్య మధ్యలో వినిపిచే జలతరంగంలాంటి వాయిద్యం చాలా హృద్యంగా ఉంటుంది ఇందులో. ఈ పాటని స్వరపరిచిన విధానం రీతిగౌళరాగంలోని సుబ్బరాయశాస్త్రి గారి ప్రసిద్ధ కీర్తన “జననీ నిన్నువినా దిక్కెవరమ్మా….” కి చాలా దగ్గరగా ఉంటుంది అనిపిస్తుంది నాకు.

ఐతే ఘంటసాలగారు ఈ రాగంలో ఇంకే పాటలూ చేసినట్టు లేదు. దానికి కారణం బహుశా ఈ రాగంలో వైవిధ్యం చూపించడం కష్టమని కావచ్చు. కానీ సంగీతంలో ఇళయరాజాకి అసాధ్యమంటూ ఉండదు కదా! బాలు,ఇళయరాజాల ద్వయం ఈ రాగంలో చూపించిన అందాలు అద్వితీయం అని చెప్పచ్చు. స్వాతిముత్యం చిత్రంలోని “రామా కనవేమిరా….” అన్న పాటతో జరిపించిన సీతాస్వయంవరం ఎంత అందమైనది!

అయితే, స్వచ్చమైన రీతిగౌళలో ఒక కీర్తనలాగ స్వరపరచిన ఈ కింది తమిళపాట ఒక ఆణిముత్యం. అన్నట్టు సుమలతతో పాటు ఇందులో నటించినది కుర్రవయసులో ఉన్న రఘువరన్‌ట!

మరి ఇళయరాజా స్వరానికి మంగళంపల్లి వారే పాడితే!

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, రీతిగౌళ అనగానే నాకు గుర్తొచ్చేది రహ్మాన్ స్వరపరిచిన “అందాల రాక్షసివే …” అన్నపాటే. బహుశా అది మాతరం పాట అవ్వడం వల్ల కావచ్చు. మురళీగానానికి ఘట వాయిద్యాన్ని జోడించి ప్రారంభించి అద్భుతమైన వాయిద్యమేళనంతో మనసుని మైమరిపించే వింటేజ్ రహ్మాన్ బాణీ ఇది. “చిలకా! రామచిలకా…..” – బాలూకి వందనాలు!

అలాగే, బహుశా ప్రస్తుత కాలేజీ విద్యార్ధులకి అనంతపురం చిత్రంలోని ఈ పాటే ఎక్కువగా నచ్చుతుందేమో!నాకు మాత్రం ఈ పాటలో ఏదో కాస్త లోపం ఉందనిపిస్తుంది… 🙂

కర్ణాటక సంగీతంలోని రక్తిరాగాలలో రీతిగౌళ ముందువరసలోని రాగం. నాకు తెలిసి హిందుస్తానీ సంగీతంలో సమాన లక్షణాలున్న రాగం లేదు. ఈ రాగ ఆరోహణ, అవరోహణలు:

స గ రి గ మ ని ద మ ని ని స
స ని ద మ గ మ ప మ గ రి స

చూసారా ఎన్ని వంకరలున్నాయో! ఈ వక్రాలే ఈ రాగానికి అందం. ముఖ్యంగా “ని ని స”, “ని ద మ ని ని స” వంటి ప్రయోగాలు ఈ రాగాన్ని ఇట్టే కనిపెట్టగలిగేలా చేస్తాయి. ఒక్కసారి “చిలకా! రామచిలకా” విని చూడండి మళ్ళీ.
శాస్త్రీయ సంగీతంలో ఈ రాగాన్ని బాగా ప్రాముఖ్యంలోకి తెచ్చింది త్యాగరాజస్వామేనని చెప్పాలి. నన్ను విడచి కదలకురా, ద్వైతము సుఖమా…అద్వైతము సుఖమా, రాగరత్నమాలికచే….లాంటి అద్భుతమైన కీర్తనలెన్నో స్వరపరిచారు ఈ రాగంలో. పైన ఉదహరించిన సుబ్బరాయశాస్త్రి గారి కీర్తన కూడా చాలా ప్రాముఖ్యం పొందినదే. రీతిగౌళ రాగంలోని శాస్త్రీయ సంగీతాన్ని ఇక్కడ వినచ్చు.

*కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3

సెప్టెంబర్ 19, 2007

హేపీ డేస్ – పాటల పరిచయం

తెలుగునాట మిగిలిన ఏకైక కళ సినిమా అంటూ వాపోయాడు రాకేశ్వరుడు ఈమధ్యే. ఐతే, ఈ సినిమా అనేది 64 కళల సమ్మేళనం అన్న విషయం తెలియని వాళ్ళందరూ సినిమాలు తీస్తుండడమే పెద్ద సమస్య అనిపిస్తుంది నాకు. తెలుగుసినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఈ విషయాన్ని కాస్త వంటబట్టించుకున్నది శేఖర్ కమ్ముల అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వేరే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సంగీతం విషయంలో మాత్రం తన ఉత్తమ అభిరుచిని శేఖర్ తన సినిమాల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆనంద్, గోదావరి – ఈ రెండు సినిమాలకీ సంగీతం అందించిన రాధాకృష్ణన్ శాస్త్రీయంగా సంగీతం నేర్చుకున్నవాడు. భారతీయ సంగీతం ఆధారంగా శాస్త్రీయ సంగీతపు రాగాలని వాడి మంచి సంగీతం అందించాడు. (more…)

సెప్టెంబర్ 15, 2007

వానపాటులు

మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత  చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ.  (more…)

ఆగస్ట్ 8, 2007

ఆపాతమధురం – 3

Filed under: సంగీతం,సినిమాలు — Sriram @ 12:20 ఉద.

వసంతగాలికి వలపులు రేగా, వరించు బాలిక మయూరి కాగా…“, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చిత్రంలోని ఈ పాటని బాలమురళీకృష్ణ గారూ, జానకి గారూ పాడారు. పెండ్యాల నాగేశ్వర్రావు గారి సంగీతం. పింగళి వారి అద్భుతమైన సాహిత్యానికి పెండ్యాలగారు అతి మధురమైన బాణీ కట్టారు. పెండ్యాల వారికి హిందూస్తానీ కళాకారుల సంగీతం ఎక్కువ ప్రేరణగా ఉండేదని చెప్పుకోడం విన్నాను. అందుకే కాబోలు ఈ పాట కూడా “కళావతి” అనే హిందూస్తానీ రాగంలో ఉంది. కర్ణాటక సంగీతంలో దీనికి సమానమైన రాగం పేరు “వలచి”. కానీ కర్ణాటక సంగీతంలో ఈ రాగం ఎక్కువ వినిపించదు. త్యాగరాజాదులు ఈ రాగంలో ఒక్క కృతి కూడా రాయకపోడం దీనికి కారణం కావచ్చు.

వలచి రాగంలో స్వరపరచబడిన మరో అందమైన పాట ప్రేమించిచూడు చిత్రంలోని “వెన్నెలరేయి ఎంతో చలి చలి…“. పీబీ శ్రీనివాస్ గారూ, సుశీలగారూ పాడారు. పీబీ గారి లలితమైన గాత్రం ఈ పాటకి ఎంత అందాన్ని తెచ్చిందో చెప్పలేను. భాగ్యజ్యోతి అనే కన్నడ చిత్రంలో “పంకజ నేత్రీ, మధుమయగాత్రీ…” అన్నపాటని పీబీ శ్రీనివాస్ గారు స్వయంగా సంస్కృతంలో రాసి పాడారు. ఈ పాట కూడా వలచి రాగంలోనే ఉంటుంది. కాళిదాసు రాసిన విక్రమోర్వశీయం ఆధారంగా రాసిన ఈ పాటకోసం నేను అంతర్జాలం అంతా వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు.

“ర”సాలూరి రాజేశ్వర్రావుగారు “చిలక గోరింక” చిత్రం కోసం స్వరపరచిన “నా రాణి కనులలోనే…” అన్నపాట కూడా ఈ రాగం ఆధారంగా చెయ్యబడినదే అనిపిస్తుంది నాకు. మధ్యమం అక్కడక్కడ వినిపించినా వలచి రాగ లక్షణమే  ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఈ పాటలో సాలూరి వారి సంగీతంలోని మాధుర్యానికీ శ్రీశ్రీ సాహిత్యంలోని అందానికీ పెద్ద యుద్ధమే జరుగుతుంది అనిపిస్తుంది నాకు. అసలు ఎర్రరంగు తలుచుకోగానే శ్రీశ్రీకి వెర్రెక్కిపోతుందేమో. అందుకే విప్లవం,కమ్యూనిజం వంటివాటిని గురించి మాత్రమే  కాదు, ప్రేమగురించి కూడా ఆయన అధ్బుతమైన పాటలు రాసాడు. ఒక్కసారి మనసున మనసై… గుర్తు తెచ్చుకోండి.

వలచి రాగంలో వచ్చిన ఇంకొక గొప్ప పాట ఉంది. కళాతపస్వి విశ్వనాధ్ గారి దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఒక ఎత్తైతే ఈ పాటకి సిరివెన్నెలగారి సాహిత్యం మరొక ఎత్తు. అదే స్వర్ణకమలం సినిమాలోని “శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వా…” అన్న పాట. ఈ పాటను విశ్లేషించే అంత శక్తి నాకు లేదు కానీ వలచి రాగంలో ఉంది అని మాత్రం చెప్పగలను.

ఇంక శాస్త్రీయ సంగీతం దృష్ట్యా చూస్తే ఇది చిన్న రాగమే.
ఆరోహణ: స గ3 ప ద2 ని2 స
అవరోహణ: స ని2 ద2 ప గ3 స

ఇందాక చెప్పినట్టుగా త్యాగరాజస్వామి, దీక్షితార్, శ్యామశాస్త్రి లలో ఎవరూ ఈ రాగంలో కృతులు స్వరపరచలేదు. ముత్తయ్య భాగవతార్ గారి కృతి “జాలంధర సుపీఠ స్థితే” చాలా గొప్పగా ఉంటుంది. ఏసుదాస్ గారు “నను బ్రోవ…” అన్న కృతిని చాలా అందంగా ఆలపించారు.

ఓలేటి వెంకటేశ్వర్లు గారికి ఈ రాగం ఎక్కువ ప్రీతి అనిపిస్తుంది. “కందర్పజనకా గరుడగమనా…” అన్న అన్నమయ్య కీర్తనని ఈ రాగంలోనే ఆయన స్వరపరిచారు. సదాశివబ్రహ్మేంద్రుల వారి “నహిరే” అన్న కీర్తనని కూడా ఓలేటివారు ఈ రాగంలో పాడారు.  

ఆభోగి రాగంలో మధ్యమంతో గ్రహభేదం చేస్తే వలచి రాగం వస్తుంది. దీని ఆధారంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఒక అద్భుతమైన రాగం తానం పల్లవి ఈ రెండు రాగాల్లో పాడారు (లంకె 5 రోజులు మాత్రమే పనిచేస్తుంది). విని తీరవలసిన ఆలాపన ఇది.

హిందూస్తానీ కచేరీలలో వలచి రాగం(కళావతి) ఎక్కువగానే వినిపిస్తుంది. కొన్ని ఇక్కడ వినచ్చు. అజయ్ చక్రవర్తి గారి ఆలాపన విన్న వాళ్ళు వాహ్! అనకుండా ఉండలేరు.

*కొత్తవారికోసం:ఆపాతమధురంఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!

ఫిబ్రవరి 15, 2007

ఆపాతమధురం

Filed under: సంగీతం,సినిమాలు — Sriram @ 8:01 సా.

ఏ ఆర్ రెహ్మాన్ అనగానే మీకేమి గుర్తొస్తుంది?  ‘ముక్కాలా ముకాబ్‌లా…’ నా లేక ‘ఓ చెలియా నా ప్రియసఖియా…’నా? అప్పట్లో యావద్భారతాన్నీ ఒక ఊపు ఊపిన ‘ముక్కాలా…’ పాట రెహ్మాన్ కి తెచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. అదొక ప్రభంజనం అప్పట్లో. కానీ ఇప్పటికీ ఆ సినిమాలో పాట జనాల నోళ్ళలో నలుగుతున్నదీ, టీవీ చానళ్ళలో అప్పుడప్పుడు మెరుస్తున్నదీ ఏదీ అంటే ‘ఓ చెలియా…’ పాటనే చెప్పుకోవాలి. దానికి కారణం బ్రహ్మరహస్యం ఏమీ కాదు. మాధుర్య ప్రధానమైన, వినడానికి హాయిగా ఉండే పాటలని సంగీతప్రియులు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు. ఇలాంటి పాట ఒకటి ఇప్పుడు విందాం.

“ఇద్దరు” సినిమాలో “శశివదనే శశివదనే…..” అన్న పాట విన్నారు కదా. ఈ పాట రాసింది సినీ కవితా చక్రవర్తి అనదగ్గ మన వేటూరి గారే ఐనా డబ్బింగ్ పాట కావడం వల్లనేమో దాని అర్ధం అంతగా బోధపడదు. కానీ వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది! ఆ హాయి ఆ పాటకి అద్దినది శాస్త్రీయ సంగీతమే. నాట రాగమే. వేటూరి గారు చిలిపి వారు కావడం వల్ల కాబోసు ఈ పాట ట్యూన్ తెలిసి ఉండి కూడా పాటలో నీలాంబరి, తోడి, మాండు, మోహనం అన్నారేగానీ ఎక్కడా నాట అన్న పదం వాడలేదు. ఇదొక చమత్కారం.

రెహ్మాన్ ఏదైనా శాస్త్రీయమైన రాగాన్ని వాడినా, అది చాలా లలితంగా ఉంటుంది. రాగఛాయలోకి వెళ్ళినట్టే వెళ్ళి బయటకు దూకుతూ ఉండడం, పక్క రాగాల వైపు క్రీగంట చూసి ఊరించడం ఆయనకి అలవాటు. కానీ మామ మహదేవన్ దగ్గర ఇలాంటి ఆటలు కుదరవు. “ప్రణతి ప్రణతి ప్రణతీ….” అంటూ ససాంప్రదాయంగా గౌరవించాల్సిందే. ఈ పాటలో సిరివెన్నెల వారి పదాల గాంభీర్యానికి మహదేవన్ నాట రాగపు గాంధారాన్ని పోటీ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు.

విన్నారుగా పాట, మరి ఇంత శాస్త్రీయమైన పాట పాడింది బాలూగారేనంటే ఆశ్చర్యమేస్తుంది. ఈయనేమో నేను శాస్త్రీయంగా ఏమీ నేర్చుకోనేలేదంటారు. మరి శాస్త్రీయ సంగీతం లొ ఉద్దండులైన నిత్యశ్రీ మహదేవన్, హరిహరన్ లు నాట రాగంలో పాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సరసకె బారో (సరసకు రారా…) అంటూ వీరు కన్నడంలో ఎలా పాడారో ఒకసారి వినండి. దీనికి సంగీత దర్శకుడు గురుకిరణ్ అన్నాయన. ఈ మధ్యనే తెలుగులో కూడా పని చేసినట్టున్నారు.

ఇంకొక్క సినిమా పాట కూడా విందాం. ఇది అవ్వడానికి సినిమా పాటే అయినా, నిజానికి శాస్త్రీయమైన కృతే. ఇళయరాజా నిమిత్తమాత్రుడే. యేసుదాస్ గారు సింధుభైరవి సినిమాలో పాడిన “మహాగణపతిం” అన్న కృతి దీక్షితార్ వారిది. సంగీతం నేర్చుకునేవారు కృతులలోకి అడుగుపెట్టాక నేర్చుకునే తొలి వాట్లలో ఇదీ ఒకటి. 

ఇప్పుటిదాక మనం విన్నవి ఒకెత్తూ, ఇప్పుడు వినబోయేది ఒక ఎత్తూ. శాస్త్రీయ సంగీత చరిత్రలో నాట రాగపు ధాటిని శాశ్వతం చేసిన ఘనత త్యాగరాజుల వారిదే. పంచరత్న కృతులలో మొదటిదైన “జగదానందకారకా….” అన్న కృతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో విన్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా….అంటూ మొదలుపెట్టిన త్యాగరాజు మొత్తం ఇటువంటి 108 నామాలతో ఈ కృతిని సమకూర్చిన తీరు అనితర సాధ్యం. అంతేకాదు ఈ కీర్తనలో రామాయణం మొత్తం ఇమిడి ఉంది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. ఈ పంచరత్నకృతుల విషయాలు ఎప్పుడైనా తీరికగా చెప్పుకోవలసినవే కానీ ఇలా టూకీగా తేలేవి కావు.

ఇక నాట రాగపు లక్షణాలేమిటో ఒకసారి చూద్దాం. ఈ రాగపు
ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స
అవరోహణ: స ని3 ప మ1 రి3 స
ఈ రాగ స్వరాలని పరిశిలిస్తే రి3,గ3 ఇంకా ద3,ని3 చాలా దగ్గరగా ఉండే స్వరాలు. గాత్రంలో ఈ తేడా చూపించడం కష్టం. ఇటువంటి రాగాలని వివాది రాగాలు అంటారు. సంగీత కచేరీలలో నాట రాగం సాధారణంగా మొదటి రెండు,మూడు కీర్తనలలోపే వస్తుంది. నాట రాగంలో ఉన్న మరిన్ని కృతులకై ఇక్కడ చూడండి. 

ఇప్పుడు చెప్పండి, ‘శశివదనే…’ పాటలోని అందానికే పొంగిపోయిన మనని, ‘జగదానందకారకా…’ లోని మాధుర్యం ఇంకెంత ఆనందింపచెయ్యగలిగిందో. శాస్త్రీయ సంగీతపు మహత్తే అది. ఈ రాగాలు అంతులేని బంగారు గనులు. తవ్విన కొద్దీ తన్మయత్వం పెరుగుతూ ఉంటుంది.   

(ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం నాకు తెలిసిన కొన్ని మంచి పాటలనీ, కృతులనీ నలుగురితో పంచుకుందామనే. సరిగమల గురించి రాసిన వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యల్లో చర్చ నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకునేలా చేసింది.నాకున్న సంగీత జ్ఞానం పూజ్యం. అందుచేత ఎక్కడైనా తప్పులు రాస్తే, అవి విజ్ఞులు సవరిస్తే నన్ను దిద్దుకోవచ్చని ఒక ఆశ. మీరు కూడా నేను ఇక్కడ రాసిన చెవాకుల మాట ఎలా ఉన్నా, పాటలు విని ఆనందిస్తారని ఇంకొక ఆశ.అందుకే ఈ పనికి పూనుకున్నది. ఇంకొక్క విషయం, ఈ వ్యాసాన్ని కేవలం చదవడం కాకుండా ఇక్కడ ఉదాహరణగా ఇచ్చిన పాటలన్నీ విని చూడండి. ఎక్కడైనా, ఎప్పుడైనా నాట రాగాన్ని చాలా సుళువుగా గుర్తించగలుగుతారు. రసాస్వాదనం చేయగలుగుతారు.)      

తర్వాత పేజీ »