సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 25, 2020

తెనాలి రాముడి దేవీ ఉపాసన

పూర్వకవులలో అమ్మవారి సాక్షాత్కారం పొందినట్టుగా మనం చెప్పుకునేవాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరూ చాలా పేరు పొందినవాళ్ళే. ఒకరు సంసృతకవి కాళిదాసు కాగా ఇంకొకరు మన తెనాలి రాముడు.

వీళ్ళిద్దరూ రచించిన గ్రంధాలేవీ అమ్మవారికి సంబంధించినవి కావు. కానీ కాళిదాసు పేరువల్ల, రచించిన శ్యామలాదండకం, అశ్వధాటి, లఘుస్తుతి వంటివాటివల్ల ఆయన దేవీ ఉపాసకుడని మనకు కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. మరి తెనాలివారి సంగతి? ఈయన శైవుడా, వైష్ణవుడా – రామకృష్ణుడా లేక రామలింగడా అని కొంత చర్చ జరిగింది కానీ దేవీ ఉపాసన గురించిన విషయాలు ఎవరూ చర్చించినట్టులేదు. ఐతే అమ్మవారు కనిపించి పాలగిన్నా పెరుగుగిన్నా అని అడగడం, ఈయన రెండూ కలుపుకు తాగెయ్యడం కట్టుకధేనా? కధ సంగతి పక్కన పెట్టినా, అసలు ఈయన దేవీ ఉపాసకుడా కనీసం? చిన్న పరిశోధన చేద్దాం.

తెనాలి రాముడి కవిత్వం,పాండిత్యం ఎంత గొప్పవైనా ఆయన హాస్యచతురత ఇంకా ఎంత గొప్పదంటే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాతకూడా ఆయన హాస్యమే ప్రజలని ఆకర్షిస్తూ ఉంది. అమ్మవారే వికటకవిగా దీవించారని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఋజువుకావాలి?

ఐతే తెనాలి రాముని కవిత్వం, ఆయన రాసిన పాండురంగమహత్యం కొద్దిగా పరిశీలిస్తే ఆయన అద్వైతుడని వెంటనే తెలుస్తుంది. కావ్యారంభంలో లక్ష్మీ నారాయణులతో పాటు, శివపార్వతులని కూడా స్తుతించాడు. పైగా ఈయన ఎంత స్థితప్రజ్ఞుడంటే ప్రార్ధన కూడా, తనకోసం, తనకావ్యం కోసం చెయ్యలేదు. కృతి ఇచ్చిన విరూరు వేదాద్రి మంత్రి కోసం చేసాడు. ఈ వేదాద్రిగారు ఎవరయ్యా అంటే ఒక వ్రాయసకాడు. అంటే గ్రంధాలని తాటియాకుల మీద వ్రాసే పని చేసేవాడు. ఒక కృతిని అంకితం ఇవ్వడానికి ఇంతకన్నా అర్హుడు ఎవరుంటారు? ఐతే ప్రజలకి ఇందులో కూడా హాస్యమే కనపడింది. రాసేవాడికి అంకితం ఇస్తే ఆయనే బోలెడు ప్రతులు రాసిపెడతాడు కదా అని తెనాలి రాముడి ఆలోచన అన్నారు.

విషయానికి వస్తే, తెనాలి రాముడి దేవీ ఉపాసన గురించిన ఆధారం పాండురంగమహత్యం మొదటలోనే కనిపిస్తుంది. నాల్గవ పద్యం, ఈయన చేసిన సరస్వతీ ప్రార్ధన:

కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబినీ చంద్రికా
జిద్రూపాంచిత పద్మగర్భ ముఖ రాజీవావళీహంసి వ
ర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్షులన్!

తెనాలి రాముని కవిత్వంలో ఉన్న విశిష్టత మొత్తం ఈ పద్యంలొ చూడచ్చు. ఆయన వాడే ఉపమానాలు, ప్రయోగాలు చాల విశిష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి శివుడిని కద్రూజాంగదుడు అన్నాడు – కద్రువ పిల్లలు నాగులు, అవి అంగదములుగా అంటే ఆభరణాలుగా గలవాడు, శివుడు.

సరే పద్యానికి సారం ఏమిటంటే వేదాద్రి మంత్రికి శారదా దేవి విద్య, బుద్ధి, వాక్సిద్ధి ప్రసాదించుగాక అని. ఐతే ఇదేదో అల్లాటప్పా దీవెన పద్యం కాదు. శారదా స్వరూపాలలో
విద్యనిచ్చేది – సరస్వతీ దేవి
బుద్ధిని ప్రచోదనం చేసేది – గాయత్రీ దేవి
మాటకి సిద్ధి ఇచ్చేది – మంత్ర స్వరూపిణి శ్యామలా దేవి

ఈ ముగ్గురి తత్వాలని ఎలా చూపించాడో చూడండి. భాగవతం ప్రకారం బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టినప్పుడు నుదుటినుంచి రుద్రుడు పుట్టాడు, ఆ తర్వాత మనసు నుంచి సరస్వతీ దేవి పుట్టింది. అందుకే శివుడి తోబుట్టువు సరస్వతి గనుక, మొదటి పాదంలో అది గుర్తు చేసాడు. ఆవిడ శుద్ధమైన విద్యా/జ్ఞాన స్వరూపం గనక తెల్లని శరత్కాల మేఘాలతో పోలిక.

ఇంక రెండవపాదంలో పద్మగర్భ ముఖ రాజీవావళీ హంసి – బ్రహ్మగారి ముఖాలనే పద్మాలలో తిరిగే హంస అన్నాడు. బ్రహ్మగారి 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి కదా. ఆ వేదాలలో తిరిగే హంస గాయత్రీ శక్తి. బుద్ధిని ప్రచోదనం చేసేది ఈవిడే.

ఇక మూడవపాదంలో చెప్పినది, వర్ణద్రాక్షాఫలకీరి – అక్షరాలనే ద్రాక్ష పళ్ళని మెక్కే చిలుక(ఎంత ఆగుదామన్నా హాస్యప్రియత్వం దాగదు). అమంత్రమక్షరం నాస్తి అనికదా. అంటే అక్షరాలన్నీ మంత్రములే. పైగా ద్రాక్షపళ్ళతో పోలిక అంటే బీజములు/గింజలు ఉన్నవి బీజాక్షరాలకి సూచన కదా. గుత్తులుగా ఉండేవి, అంటే బీజాక్షరాల గుత్తులు – మంత్రాలు. ఆ మంత్రాలతో నిండిన స్వరూపమే శ్యామలాదేవి. పైగా చిలుక – ఈవిడకి సంకేతమే. శుకశ్యామల అని ఒక స్వరూపం కూడా ఉంది.

దీనిని బట్టి చూస్తే తెనాలి రామునికి శ్యామలా ఉపాసనా విషయాలమీద పరిజ్ఞానం ఎంత ఉందో తెలుస్తోంది. ఈయన పద్యాలలో చిలుకని ఎన్నిసార్లు ప్రస్తావిస్తారంటే తప్పక శుకశ్యామలా ఉపాసకుడేమో అనిపిస్తుంది. పార్వతీ ప్రార్ధన, పరమేశ్వర ప్రార్ధన కూడ మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఇంకోసారి.

ఇంకొక విషయం ఏమిటంటే, తెనాలి రాముడు రచించిన ఉద్భటాచార్య చరిత్ర అనే గ్రంధాన్ని యూరె దేచనమంత్రికి అంకితం ఇచ్చాడు. దేచనమంత్రి గొప్ప పండితుడు. శంకరాచార్యుల సౌందర్యలహరికి అధికారికమైన వ్యాఖ్యానం రాసిన లొల్ల లక్ష్మీధర పండితుడి శిష్యుడు. ఇలాంటి వారితో సాహచర్యం ఉన్న తెనాలి రాముడికి దేవీ ఉపాసనా రహస్యాలు తెలవడం విచిత్రమేమీ కాదు కదా.

మన కవుల ప్రజ్ఞా పాటవాలు ఎంతగొప్పవో ఇలాంటి ఒక్క పద్యం చూస్తే తెలుస్తుంది. ప్రయత్నించి అర్ధం చేసుకోగలగాలి కానీ ఎంతలోతుకెళ్ళినా అంతం ఉండదు. అందుకే అవి ఆలోచనామృతాలు.

ఆగస్ట్ 17, 2007

టెల్గూ అంత వీజీయా…!

Filed under: కబుర్లు,భాష — Sriram @ 12:44 సా.

చిన్నప్పటినుంచీ నేను ఎక్కువగా చదివిన వార్తాపత్రిక “ఈనాడు”. పత్రిక రాగానే మొదటి పేజీని ఒక చూపుచూసి వెంటనే వెనక్కి తిప్పి క్రీడా వార్తలు చదవడం నాకు అలవాటు. అప్పట్లో క్రికెట్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చే ఉండేది. దూరదర్శని మాధ్యమం ఇప్పట్లా అభివృద్ధి చెందలేదు కనక ఎక్కువగా వార్తలకోసం పత్రికల మీదే ఆధారపడేవాళ్ళం.

“పీకల్లోతు కష్టాల్లో భారత్”, “భారత్ ఘోర పరాజయం” వంటి వార్తలే ఐనా ఎంతో ఆసక్తిగా చదవడం అలవాటయ్యింది అలాగే. అదే అలవాటున ఈరోజు పత్రిక తిరగెయ్యగానే “చాలా వీజీగా…” అంటూ భారత్-స్కాట్లేండుల మధ్య జరిగిన పోటీ గురించిన వార్త కనపడింది.

ఏంటో కొంచెం తేడాగా అనిపించింది. ఈనాడేనా చదువుతున్నది అని ఒక సందేహం. ఇంతలో నాలోంచి ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చి ఒకళ్ళు కుడివైపు ఇంకొకళ్ళు ఎడమ వైపు నిలబడ్డారు.

కువ్య: అసలు ఏమిటీ ఘోరం? తెలుగు పత్రికేనా ఇది? అసలు పత్రికేనా అని! ఏమి భాష ఇది, వీజీ అంటే?

ఎవ్య: ఘోరంలేదు, ఏమీ లేదు.ప్రజలకి చేరువయ్యేదే నిజమైన  భాష.

కువ్య: చేరువవ్వడం అంటే? “సులువుగా” అని వాడితే చేరువవ్వదా? మాతృభాష చేరువవ్వదు కానీ పరభాష చేరువౌతుందా! ఐనా పత్రికల్లో భాషన్నాకా కాస్త ప్రమాణాలు ఉండద్దా? భాష పట్ల ఆ మాత్రం బాధ్యత లేదా వాళ్ళకి? 

ఎవ్య: ప్రజలు వాడట్లేదా “వీజీగా” అని? పత్రికలో వాడితే తప్పేంటి? మీ లాంటి ఛాదస్తపు వాళ్ళ వల్లే తెలుగు ప్రజలకి దూరమౌతోంది.

కువ్య: ఔనా! ప్రజలు వాడేవన్నీ పత్రికల్లో వాడేస్తారా? వ్యావహారికంలో అనేక పదాలుంటాయి. కొన్ని కొన్ని అసభ్య పదాలు కూడా విరివిగా వాడుతూ ఉంటారు. అవన్నీ పత్రికల్లో వాడేస్తారా? ఆంగ్లపత్రికల విషయంలో ఇలానే మాట్లాడతావా? ప్రజలు మాట్లాడే బూతులుబుంగ ఇంగ్లీషు, పత్రికల్లో వాడితే ఒప్పుకుంటారా? “ది హిందూ” ఐతే మంచి భాష వాడుతుంది అని తెగ ప్రశంసిస్తూ ఉంటావుగా ఎప్పుడూ. ఇంగ్లీషుకొక నీతి, తెలుగుకొక నీతీనా?   

ఎవ్య: అర్ధంలేని ఆరోపణలు చెయ్యకు. ఎప్పుడూ పాతచింతకాయ పచ్చడిలా ఆలోచిస్తావు. ప్రజలభాష వాడడంద్వారా ప్రజలని గౌరవిస్తున్నామని తెలుసుకో. నీకులా మడిగట్టుకు కూచోడం ప్రజలని అవమానించడమే ఔతుంది.

కువ్య: ఆహా! అసలు వీజీగా అన్నపదం ఎలా పుట్టిందో తెలుసా? చదువులేని వాళ్ళ భాషని వెక్కిరించడానికి కొంతమంది వెటకారంగా వాడడం మొదలెడితే అది మొత్తం అందరి నోళ్ళలోకీ వచ్చింది. ఆ పదం వాడి మీరు కూడా అదే పని చేస్తున్నారు. అది తెలుసుకో!

ఇంక నావల్ల కాలేదు, ఈ గోల భరించడం. ఇద్దరినీ చెరోచెయ్యీ పట్టుకుని లోపలికి లాగేసుకున్నా. నిన్నరాత్రి జీతెలుగు లో చూసిన “స రి గ మ ప” పాటలపోటీ కార్యక్రమం గుర్తొచ్చింది. జీవారు ఈ పోటీ అన్నిభాషలలోనూ నిర్వహిస్తున్నారు. పోటీ తర్వాత ఇద్దరు పోటీదారులని “డేంజర్ జోన్” లోకి పంపు తారు. జీతెలుగు లో నవగాయకుడు కారుణ్య దీనికి సూత్రధారి. నిన్న కార్యక్రమంలో “డేంజర్ జోన్” కి బదులు “ప్రమాద వలయం” అని వాడాడు. నాకు “భలే” అనిపించింది. ఈయన మధ్యమధ్య ఒకటి,రెండు ఇంగ్లీషు వాక్యాలు వాడతాడు కానీ చక్కని తెలుగు మాట్లాడుతాడు. మరి ప్రజలెంతవరకూ ఆదరిస్తారో!