సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 25, 2020

తెనాలి రాముడి దేవీ ఉపాసన

పూర్వకవులలో అమ్మవారి సాక్షాత్కారం పొందినట్టుగా మనం చెప్పుకునేవాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరూ చాలా పేరు పొందినవాళ్ళే. ఒకరు సంసృతకవి కాళిదాసు కాగా ఇంకొకరు మన తెనాలి రాముడు.

వీళ్ళిద్దరూ రచించిన గ్రంధాలేవీ అమ్మవారికి సంబంధించినవి కావు. కానీ కాళిదాసు పేరువల్ల, రచించిన శ్యామలాదండకం, అశ్వధాటి, లఘుస్తుతి వంటివాటివల్ల ఆయన దేవీ ఉపాసకుడని మనకు కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. మరి తెనాలివారి సంగతి? ఈయన శైవుడా, వైష్ణవుడా – రామకృష్ణుడా లేక రామలింగడా అని కొంత చర్చ జరిగింది కానీ దేవీ ఉపాసన గురించిన విషయాలు ఎవరూ చర్చించినట్టులేదు. ఐతే అమ్మవారు కనిపించి పాలగిన్నా పెరుగుగిన్నా అని అడగడం, ఈయన రెండూ కలుపుకు తాగెయ్యడం కట్టుకధేనా? కధ సంగతి పక్కన పెట్టినా, అసలు ఈయన దేవీ ఉపాసకుడా కనీసం? చిన్న పరిశోధన చేద్దాం.

తెనాలి రాముడి కవిత్వం,పాండిత్యం ఎంత గొప్పవైనా ఆయన హాస్యచతురత ఇంకా ఎంత గొప్పదంటే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాతకూడా ఆయన హాస్యమే ప్రజలని ఆకర్షిస్తూ ఉంది. అమ్మవారే వికటకవిగా దీవించారని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఋజువుకావాలి?

ఐతే తెనాలి రాముని కవిత్వం, ఆయన రాసిన పాండురంగమహత్యం కొద్దిగా పరిశీలిస్తే ఆయన అద్వైతుడని వెంటనే తెలుస్తుంది. కావ్యారంభంలో లక్ష్మీ నారాయణులతో పాటు, శివపార్వతులని కూడా స్తుతించాడు. పైగా ఈయన ఎంత స్థితప్రజ్ఞుడంటే ప్రార్ధన కూడా, తనకోసం, తనకావ్యం కోసం చెయ్యలేదు. కృతి ఇచ్చిన విరూరు వేదాద్రి మంత్రి కోసం చేసాడు. ఈ వేదాద్రిగారు ఎవరయ్యా అంటే ఒక వ్రాయసకాడు. అంటే గ్రంధాలని తాటియాకుల మీద వ్రాసే పని చేసేవాడు. ఒక కృతిని అంకితం ఇవ్వడానికి ఇంతకన్నా అర్హుడు ఎవరుంటారు? ఐతే ప్రజలకి ఇందులో కూడా హాస్యమే కనపడింది. రాసేవాడికి అంకితం ఇస్తే ఆయనే బోలెడు ప్రతులు రాసిపెడతాడు కదా అని తెనాలి రాముడి ఆలోచన అన్నారు.

విషయానికి వస్తే, తెనాలి రాముడి దేవీ ఉపాసన గురించిన ఆధారం పాండురంగమహత్యం మొదటలోనే కనిపిస్తుంది. నాల్గవ పద్యం, ఈయన చేసిన సరస్వతీ ప్రార్ధన:

కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబినీ చంద్రికా
జిద్రూపాంచిత పద్మగర్భ ముఖ రాజీవావళీహంసి వ
ర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్షులన్!

తెనాలి రాముని కవిత్వంలో ఉన్న విశిష్టత మొత్తం ఈ పద్యంలొ చూడచ్చు. ఆయన వాడే ఉపమానాలు, ప్రయోగాలు చాల విశిష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి శివుడిని కద్రూజాంగదుడు అన్నాడు – కద్రువ పిల్లలు నాగులు, అవి అంగదములుగా అంటే ఆభరణాలుగా గలవాడు, శివుడు.

సరే పద్యానికి సారం ఏమిటంటే వేదాద్రి మంత్రికి శారదా దేవి విద్య, బుద్ధి, వాక్సిద్ధి ప్రసాదించుగాక అని. ఐతే ఇదేదో అల్లాటప్పా దీవెన పద్యం కాదు. శారదా స్వరూపాలలో
విద్యనిచ్చేది – సరస్వతీ దేవి
బుద్ధిని ప్రచోదనం చేసేది – గాయత్రీ దేవి
మాటకి సిద్ధి ఇచ్చేది – మంత్ర స్వరూపిణి శ్యామలా దేవి

ఈ ముగ్గురి తత్వాలని ఎలా చూపించాడో చూడండి. భాగవతం ప్రకారం బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టినప్పుడు నుదుటినుంచి రుద్రుడు పుట్టాడు, ఆ తర్వాత మనసు నుంచి సరస్వతీ దేవి పుట్టింది. అందుకే శివుడి తోబుట్టువు సరస్వతి గనుక, మొదటి పాదంలో అది గుర్తు చేసాడు. ఆవిడ శుద్ధమైన విద్యా/జ్ఞాన స్వరూపం గనక తెల్లని శరత్కాల మేఘాలతో పోలిక.

ఇంక రెండవపాదంలో పద్మగర్భ ముఖ రాజీవావళీ హంసి – బ్రహ్మగారి ముఖాలనే పద్మాలలో తిరిగే హంస అన్నాడు. బ్రహ్మగారి 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి కదా. ఆ వేదాలలో తిరిగే హంస గాయత్రీ శక్తి. బుద్ధిని ప్రచోదనం చేసేది ఈవిడే.

ఇక మూడవపాదంలో చెప్పినది, వర్ణద్రాక్షాఫలకీరి – అక్షరాలనే ద్రాక్ష పళ్ళని మెక్కే చిలుక(ఎంత ఆగుదామన్నా హాస్యప్రియత్వం దాగదు). అమంత్రమక్షరం నాస్తి అనికదా. అంటే అక్షరాలన్నీ మంత్రములే. పైగా ద్రాక్షపళ్ళతో పోలిక అంటే బీజములు/గింజలు ఉన్నవి బీజాక్షరాలకి సూచన కదా. గుత్తులుగా ఉండేవి, అంటే బీజాక్షరాల గుత్తులు – మంత్రాలు. ఆ మంత్రాలతో నిండిన స్వరూపమే శ్యామలాదేవి. పైగా చిలుక – ఈవిడకి సంకేతమే. శుకశ్యామల అని ఒక స్వరూపం కూడా ఉంది.

దీనిని బట్టి చూస్తే తెనాలి రామునికి శ్యామలా ఉపాసనా విషయాలమీద పరిజ్ఞానం ఎంత ఉందో తెలుస్తోంది. ఈయన పద్యాలలో చిలుకని ఎన్నిసార్లు ప్రస్తావిస్తారంటే తప్పక శుకశ్యామలా ఉపాసకుడేమో అనిపిస్తుంది. పార్వతీ ప్రార్ధన, పరమేశ్వర ప్రార్ధన కూడ మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఇంకోసారి.

ఇంకొక విషయం ఏమిటంటే, తెనాలి రాముడు రచించిన ఉద్భటాచార్య చరిత్ర అనే గ్రంధాన్ని యూరె దేచనమంత్రికి అంకితం ఇచ్చాడు. దేచనమంత్రి గొప్ప పండితుడు. శంకరాచార్యుల సౌందర్యలహరికి అధికారికమైన వ్యాఖ్యానం రాసిన లొల్ల లక్ష్మీధర పండితుడి శిష్యుడు. ఇలాంటి వారితో సాహచర్యం ఉన్న తెనాలి రాముడికి దేవీ ఉపాసనా రహస్యాలు తెలవడం విచిత్రమేమీ కాదు కదా.

మన కవుల ప్రజ్ఞా పాటవాలు ఎంతగొప్పవో ఇలాంటి ఒక్క పద్యం చూస్తే తెలుస్తుంది. ప్రయత్నించి అర్ధం చేసుకోగలగాలి కానీ ఎంతలోతుకెళ్ళినా అంతం ఉండదు. అందుకే అవి ఆలోచనామృతాలు.

జూలై 21, 2007

ఆకాశదేశాన ఆషాఢమాసాన…

తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే.

ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక సాహిత్యం గూగుల్ గుంపులో అడిగేసరికి పద్మ గారు ఆ కావ్యం గురించిన వివరాలు అందచేసారు.

ఆవిడ మాటల్లో : “మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, “శ్రీకాళా” వ్యాఖ్య కూడా ఉంది. ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను ’98 లో అట్లాంటాలో జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో కూడా దొరకచ్చు.”

ఈ వివరం చూసి నేను ఆన్లైన్ గ్రంధాలయంలో వెతికితే శరత్బాబుగారి పుస్తకం దొరికేసింది.

మేఘదూతం కావ్యాన్ని చదవాలనీ, కాళిదాసు “ఉప్మా” రుచి చూడాలనీ ఆసక్తి ఉండి, సంస్కృతానికీ గ్రాంధికానికీ భయపడే నాలాంటి వాళ్ళకి గొప్ప కానుక ఈ పుస్తకం. ప్రతీ శ్లోకానికీ సరళమైన వ్యావహారిక భాషలో  అర్ధం,వ్యాఖ్యానం ఉన్నాయి. దీనివల్ల కావ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలగడమే కాక, మన భాషాజ్ఞానాన్ని కూడా  పెంచుకోగలుగుతాం. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలని నా ఆశ.