సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 25, 2020

తెనాలి రాముడి దేవీ ఉపాసన

పూర్వకవులలో అమ్మవారి సాక్షాత్కారం పొందినట్టుగా మనం చెప్పుకునేవాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరూ చాలా పేరు పొందినవాళ్ళే. ఒకరు సంసృతకవి కాళిదాసు కాగా ఇంకొకరు మన తెనాలి రాముడు.

వీళ్ళిద్దరూ రచించిన గ్రంధాలేవీ అమ్మవారికి సంబంధించినవి కావు. కానీ కాళిదాసు పేరువల్ల, రచించిన శ్యామలాదండకం, అశ్వధాటి, లఘుస్తుతి వంటివాటివల్ల ఆయన దేవీ ఉపాసకుడని మనకు కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. మరి తెనాలివారి సంగతి? ఈయన శైవుడా, వైష్ణవుడా – రామకృష్ణుడా లేక రామలింగడా అని కొంత చర్చ జరిగింది కానీ దేవీ ఉపాసన గురించిన విషయాలు ఎవరూ చర్చించినట్టులేదు. ఐతే అమ్మవారు కనిపించి పాలగిన్నా పెరుగుగిన్నా అని అడగడం, ఈయన రెండూ కలుపుకు తాగెయ్యడం కట్టుకధేనా? కధ సంగతి పక్కన పెట్టినా, అసలు ఈయన దేవీ ఉపాసకుడా కనీసం? చిన్న పరిశోధన చేద్దాం.

తెనాలి రాముడి కవిత్వం,పాండిత్యం ఎంత గొప్పవైనా ఆయన హాస్యచతురత ఇంకా ఎంత గొప్పదంటే, ఇన్ని వందల సంవత్సరాల తర్వాతకూడా ఆయన హాస్యమే ప్రజలని ఆకర్షిస్తూ ఉంది. అమ్మవారే వికటకవిగా దీవించారని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఋజువుకావాలి?

ఐతే తెనాలి రాముని కవిత్వం, ఆయన రాసిన పాండురంగమహత్యం కొద్దిగా పరిశీలిస్తే ఆయన అద్వైతుడని వెంటనే తెలుస్తుంది. కావ్యారంభంలో లక్ష్మీ నారాయణులతో పాటు, శివపార్వతులని కూడా స్తుతించాడు. పైగా ఈయన ఎంత స్థితప్రజ్ఞుడంటే ప్రార్ధన కూడా, తనకోసం, తనకావ్యం కోసం చెయ్యలేదు. కృతి ఇచ్చిన విరూరు వేదాద్రి మంత్రి కోసం చేసాడు. ఈ వేదాద్రిగారు ఎవరయ్యా అంటే ఒక వ్రాయసకాడు. అంటే గ్రంధాలని తాటియాకుల మీద వ్రాసే పని చేసేవాడు. ఒక కృతిని అంకితం ఇవ్వడానికి ఇంతకన్నా అర్హుడు ఎవరుంటారు? ఐతే ప్రజలకి ఇందులో కూడా హాస్యమే కనపడింది. రాసేవాడికి అంకితం ఇస్తే ఆయనే బోలెడు ప్రతులు రాసిపెడతాడు కదా అని తెనాలి రాముడి ఆలోచన అన్నారు.

విషయానికి వస్తే, తెనాలి రాముడి దేవీ ఉపాసన గురించిన ఆధారం పాండురంగమహత్యం మొదటలోనే కనిపిస్తుంది. నాల్గవ పద్యం, ఈయన చేసిన సరస్వతీ ప్రార్ధన:

కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబినీ చంద్రికా
జిద్రూపాంచిత పద్మగర్భ ముఖ రాజీవావళీహంసి వ
ర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్షులన్!

తెనాలి రాముని కవిత్వంలో ఉన్న విశిష్టత మొత్తం ఈ పద్యంలొ చూడచ్చు. ఆయన వాడే ఉపమానాలు, ప్రయోగాలు చాల విశిష్టంగా ఉంటాయి. ఇక్కడ చూడండి శివుడిని కద్రూజాంగదుడు అన్నాడు – కద్రువ పిల్లలు నాగులు, అవి అంగదములుగా అంటే ఆభరణాలుగా గలవాడు, శివుడు.

సరే పద్యానికి సారం ఏమిటంటే వేదాద్రి మంత్రికి శారదా దేవి విద్య, బుద్ధి, వాక్సిద్ధి ప్రసాదించుగాక అని. ఐతే ఇదేదో అల్లాటప్పా దీవెన పద్యం కాదు. శారదా స్వరూపాలలో
విద్యనిచ్చేది – సరస్వతీ దేవి
బుద్ధిని ప్రచోదనం చేసేది – గాయత్రీ దేవి
మాటకి సిద్ధి ఇచ్చేది – మంత్ర స్వరూపిణి శ్యామలా దేవి

ఈ ముగ్గురి తత్వాలని ఎలా చూపించాడో చూడండి. భాగవతం ప్రకారం బ్రహ్మగారు సృష్టి మొదలుపెట్టినప్పుడు నుదుటినుంచి రుద్రుడు పుట్టాడు, ఆ తర్వాత మనసు నుంచి సరస్వతీ దేవి పుట్టింది. అందుకే శివుడి తోబుట్టువు సరస్వతి గనుక, మొదటి పాదంలో అది గుర్తు చేసాడు. ఆవిడ శుద్ధమైన విద్యా/జ్ఞాన స్వరూపం గనక తెల్లని శరత్కాల మేఘాలతో పోలిక.

ఇంక రెండవపాదంలో పద్మగర్భ ముఖ రాజీవావళీ హంసి – బ్రహ్మగారి ముఖాలనే పద్మాలలో తిరిగే హంస అన్నాడు. బ్రహ్మగారి 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి కదా. ఆ వేదాలలో తిరిగే హంస గాయత్రీ శక్తి. బుద్ధిని ప్రచోదనం చేసేది ఈవిడే.

ఇక మూడవపాదంలో చెప్పినది, వర్ణద్రాక్షాఫలకీరి – అక్షరాలనే ద్రాక్ష పళ్ళని మెక్కే చిలుక(ఎంత ఆగుదామన్నా హాస్యప్రియత్వం దాగదు). అమంత్రమక్షరం నాస్తి అనికదా. అంటే అక్షరాలన్నీ మంత్రములే. పైగా ద్రాక్షపళ్ళతో పోలిక అంటే బీజములు/గింజలు ఉన్నవి బీజాక్షరాలకి సూచన కదా. గుత్తులుగా ఉండేవి, అంటే బీజాక్షరాల గుత్తులు – మంత్రాలు. ఆ మంత్రాలతో నిండిన స్వరూపమే శ్యామలాదేవి. పైగా చిలుక – ఈవిడకి సంకేతమే. శుకశ్యామల అని ఒక స్వరూపం కూడా ఉంది.

దీనిని బట్టి చూస్తే తెనాలి రామునికి శ్యామలా ఉపాసనా విషయాలమీద పరిజ్ఞానం ఎంత ఉందో తెలుస్తోంది. ఈయన పద్యాలలో చిలుకని ఎన్నిసార్లు ప్రస్తావిస్తారంటే తప్పక శుకశ్యామలా ఉపాసకుడేమో అనిపిస్తుంది. పార్వతీ ప్రార్ధన, పరమేశ్వర ప్రార్ధన కూడ మంత్రశాస్త్ర పరిజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటి గురించి ఇంకోసారి.

ఇంకొక విషయం ఏమిటంటే, తెనాలి రాముడు రచించిన ఉద్భటాచార్య చరిత్ర అనే గ్రంధాన్ని యూరె దేచనమంత్రికి అంకితం ఇచ్చాడు. దేచనమంత్రి గొప్ప పండితుడు. శంకరాచార్యుల సౌందర్యలహరికి అధికారికమైన వ్యాఖ్యానం రాసిన లొల్ల లక్ష్మీధర పండితుడి శిష్యుడు. ఇలాంటి వారితో సాహచర్యం ఉన్న తెనాలి రాముడికి దేవీ ఉపాసనా రహస్యాలు తెలవడం విచిత్రమేమీ కాదు కదా.

మన కవుల ప్రజ్ఞా పాటవాలు ఎంతగొప్పవో ఇలాంటి ఒక్క పద్యం చూస్తే తెలుస్తుంది. ప్రయత్నించి అర్ధం చేసుకోగలగాలి కానీ ఎంతలోతుకెళ్ళినా అంతం ఉండదు. అందుకే అవి ఆలోచనామృతాలు.

మార్చి 27, 2010

ఎంత అజ్ఞానం!

పెళ్ళికి ముందు శృంగారం తప్పుకాదంటూ గౌరవనీయులైన సర్వోత్తమ న్యాయస్థానమూర్తులుంగారు తమ అభిప్రాయం వ్రాక్కుచ్చి ఊరుకుంటే బాగుండేది కానీ మధ్యలో రాధాకృష్ణుల సంగతి ఎందుకు తెచ్చారంటూ చాలామంది హిందువులు నొచ్చుకుంటుండగా అది కేవలం వ్యాఖ్యమాత్రమేనని పెళ్ళివినా సహజీవనం హైందవ సంస్కృతికి విరుద్ధం కాదని వక్కాణించడానికి వాడిన ఉదాహరణ మాత్రమేనని కొంతమంది విశాలహృదయులు సర్ది చెప్తున్నారు.

ఈ సంగతులెలా ఉన్నా, ఇవన్నీ చూసిన పెళ్ళికాని యువకులెవరైనా శ్రీకృష్ణునికున్న అష్టభార్యలనుదహరిస్తూ హిందూ వివాహచట్టాన్ని బహుభార్యాత్వానికి అనుకూలంగా సవరించాలని ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలుచేసి సఫలీకృతులైతే వారి అజ్నానంవల్ల పుట్టిన అత్యాశకి వారే మూల్యం చెల్లించుకోవాలని మాత్రం హెచ్చరిస్తున్నాను.

నాకు మాత్రం తాతయ్య మా చిన్నప్పుడు చెప్పిన కధొకటి గుర్తొస్తోంది.

ఆదిశంకరులు శిష్యబృందంతో కలిసి భిక్షాటన చేస్తుండగా దారిలో ఒక కల్లుపాక ఎదురయ్యిందిట. శంకరులు వెళ్ళి భిక్షాందేహీ అన్నారుట. పాపం ఆ కల్లుపాకవానికి ఆ రోజు ఇంకా బోణీ కాలేదుట. అయ్యా! నా దగ్గర కల్లుతప్ప ఇంకేమీ లేదని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడుట. అది చూసి చలించిన శంకరులు ఆ కల్లే పొయ్యమని భిక్షాపాత్ర పట్టారుట. అతను మహదానందంగా సమర్పించుకోగా గటగటా శంకరులు ఔపోసన పట్టేసారుట. అయితే ఇది చూసిన కొంతమంది శిష్యపరమాణువులు గురువుగారు తాగితే లేని తప్పు తాము తాగితే ఏముందనిచెప్పి ఆ సాయంత్రం వెళ్ళి పూటుగా పుచ్చుకుని రావడం చూసిన శంకరులు వారి అజ్నానాన్ని పోగొట్టాలని చెప్పి మరునాడు బిక్షాటనకి ఒక కమ్మరి దుకాణం వద్దకు తీసుకెళ్ళారుట. భిక్షాందేహీ అన్న శంకరులని చూసి దుకాణదారు, స్వామీ! ఉన్న ద్రవ్యమంతా ఇప్పుడే లోహం కొనడానికి ఖర్చు చేసాను, కొలిమిలో కాగుతున్న సీసం తప్పితే నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడుట. శంకరులు అదే పొయ్యవయ్యా అనడంతో వాడు సలసల కాగుతున్న సీసాన్ని బిక్షగా పొయ్యగా ఈయన అదే ధారగా తాగేసి శిష్యులకేసి చూసి మీరూ తాగుతారా అని అడిగారుట. తమ తప్పుతెల్సుకున్న శిష్యులు ఆయన కాళ్ళమీద పడ్డారుట.

అందుచేత పిల్లలూ, గురువుగారు చుట్టతాగేరని మేమూ తాగుతామనడం, కృష్ణుడు వెన్నదొంగతనం చేస్తే లేని తప్పు మేము సున్నుండలు దొబ్బితే ఏమిటనడం లాంటివి అజ్ఞానపు మాటలని చెప్పి మా తాతయ్య ముక్తాయించేవాడు.

ఔను మరి, పదహారువేలమందిని పెళ్ళాడాడని శ్రీకృష్ణుడిని వెక్కిరించడానికి తయారయ్యే మన మేధావులకి, ఆయన ఏకకాలంలో పదహారువేలరూపాలలో గడపగలిగిన వాడని మాత్రం గుర్తుండదు. మహాభక్తులకి సైతం ఎంతో సాధన వల్లకానీ అర్ధంకాని కృష్ణతత్వం గురించి నోటికొచ్చినట్టల్లా మాట్లాడకూడదన్న కనీస జ్నానం ఈ మేధావులకి లేకపోవడం వారి ప్రారబ్దం అనుకోవచ్చు కానీ, ఇలాంటివాళ్ళ నోరుమూయించే శక్తి హిందూసమాజానికి లేకపోవడం మాత్రం శోచనీయమైన విషయం (హిందూ పురాణపాత్రలగురించి, వాటి నిగూఢార్ధం గురించీ నేనీమధ్య చదివిన ఈ మంచి వ్యాసాన్ని ఆసక్తి ఉన్నవారు చూడండి).

భారతీయులందరూ అనాదిగా పరమ పవిత్రులనీ, మన సమాజంలో వివాహేతర సంబంధాలు ఉండేవే కావనీ నేను అనట్లేదు. మన పిత్రుస్వామ్య వ్యవస్థలో పురుషులు, ముఖ్యంగా కాస్త ధనవంతులు స్త్రీలను ’ఉంచుకోవడం’ వందల ఏళ్లుగా జరిగిన వ్యవహారం. అయితే, మధ్యయుగపు సంధికాలంలో ప్రబలిన ఈ వ్యవహారాన్ని సమాజం నిరసించడమూ, ఇటువంటి సంబంధాలవల్ల కలిగిన సంతానం సమాజంలో వివక్షకి గురికావడమూ జరిగింది కానీ ఇలా శాస్త్ర సమ్మతమంటూ తీర్పులిచ్చినవాళ్ళెవరూ లేరు. కాలక్రమేణా భారతీయసమాజం లో జరిగిన మార్పులూ సంస్కరణల ఫలితంగా ఇలాంటి అవాంఛనీయపోకడలు బాగా తగ్గుముఖం పట్టడం మన అద్రుష్టమనే చెప్పాలి. ఇప్పటికే వివాహవ్యవస్థ బాగా దెబ్బతిన్న పాశ్చాత్యదేశాలలో ప్రబలిన పెళ్ళికాని జంటల వల్ల ఎన్ని దుష్ప్రభావాలు కలుగుతున్నాయో చూసి కూడా కేవలం విశాలహ్రుదయులుగా, హిందూవ్యతిరేకులుగా తద్వారా లౌకిక వాదులుగా గుర్తింపబడడం కోసం ఇటువంటి పోకడలని సమర్ధించే కుహనామేధావులనీ, సంస్కర్తలనీ సమాజం తిరస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఆగస్ట్ 23, 2007

ఇత్యర్ధలు కూరా, ఇతిభావలు పులుసూ…

అనగనగా గోదావరీ తీరాన ఒక గ్రామంలో ఒక వేదపండితుడు. మహా జ్ఞాని. పొద్దునే లేచి స్నానం,సంధ్యా కానిచ్చి అనుష్ఠానం,స్వాధ్యాయం(సెల్ఫ్ స్టడీ) చేసుకోడం – ఆ తర్వాత విద్యార్ధులకి వేదమూ, “ఇత్యర్ధః (ఇదీ దీని అర్ధం), ఇతి భావః (ఇదీ దీని భావము)” అంటూ దానికి అర్ధమూ పాఠాలు చెప్పుకోడం – ఇదీ ఆయన దైనందిక జీవితం.  

ఉన్న కాస్త భూమిలో పండే గింజలూ, పెరట్లో పండే కూరలూ ఆ కుటుంబానికి భోజ్యం.

ఎప్పుడూ బయటకెళ్ళి రూపాయి సంపాదించిన వ్యక్తి కాదు. ఆయనకి అవసరం కూడాలేదు.

కానీ భార్యకి మాత్రం కాస్త బాధగా ఉండేది. ఔను మరి ఇంట్లో ఏ పూటకి ఏముంటుందో కూడా తెలీదు, ఈవిడేగా అవన్నీ పడవలసింది. ఆయనకేమీ పట్టదాయె.

ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఇంటిల్లాలు వాకిట్లో ముగ్గు వేస్తుండగా మన పండితులుంగారు సరసంగా అరుగుమీద నిలబడి “ఈ పూట వంటకాలేమిటోయ్” అంటూ ప్రశ్నించారు. మంచి విసుగులో ఉందేమో ఆవిడ, ” ఏముందీ, ఇత్యర్ధలు కూరా ఇతిభావలు పులుసూ” అని పెడసరంగా సమాధానం చెప్పిందిట. 

పాపం ఈయనకి కలుక్కుమంది. ఔరా! భార్య చేత ఇంత మాట పడ్డాను కదా అనుకుని, దగ్గరకు పిలిచి – నీకేవో కోరికలున్నట్టున్నాయి, ఏం కావాలో చెప్పమని అడిగాడుట. పాపం ఆ వెర్రి ఇల్లాలు చేతులో ఉన్న ముగ్గు చెంబు ఈయన చేతిలో పెట్టి దీన్నిండా బంగారపు కాసులు తెచ్చిపెట్టండి, ఇంకేమీ అడగను అన్నదిట.

సరే అని మర్నాడు ఆ ముగ్గు చెంబుతో బయల్దేరాడీయన. రాజధానికి వెళ్ళేసరికి అక్కడ రాజుగారు ఏదో సమస్యలో ఉన్నారు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకున్న సమయంలో ఈయనకున్న శాస్త్రజ్ఞానాన్ని అన్వయించి ఇట్టే చిక్కుముడి విడగొట్టాడు.

రాజుగారు ఉబ్బితబ్బిబ్బై ఏం కావాలో కోరుకోమన్నారు. ఈయన వెంటతెచ్చిన ముగ్గు చెంబు రాజుగారి చేతిలో పెట్టి దీన్నిండా బంగారు కాసులు కావాలి అని అడిగాడు. రాజుగారు ఇదేం కోరికయ్యా ఏ అగ్రహారాలో కోరుకోక అని అనేసరికి ఈయన మహాప్రభో! ఇది నా భార్య కోరిక గానీ నాకేమీ కోరికలు లేవు అని చెప్పి ఆ చెంబుడు కాసులు పట్టుకొచ్చి భార్యకిచ్చాడుట.

ఇది చిన్నప్పుడు విన్న కధ. ఈ వారం ఈనాడులో వేదాన్ని తెలుగులో అనువదించిన దాశరధి రంగాచార్యులు గారి గురించిన వ్యాసం చదివినప్పుడు ఇది మళ్ళీ గుర్తొచ్చింది.

ఈ కధలో వినడమే కాదు, నేను ప్రత్యక్షంగా చూసిన చాలా మంది వేదపండితులు “ఇత్యర్ధలు కూర, ఇతిభావలు పులుసూ” గా కాలక్షేపం చేసిన వాళ్ళే.

అందుకే, దాశరధిగారు ఆయన అనువాదం ఎందుకు చేసానో చెప్తూ, “వేదం ఒక వర్గానికి ఉపాధి, అందులో ఆధిపత్యం పోతుందని భయం” కనకనే అందరికీ వేదం నేర్పలేదంటూ చేసిన వ్యాఖ్యలు నన్ను కాస్త బాధ పెట్టాయి.

నా అభ్యంతరమల్లా, వేదం జీవనోపాధికి మార్గమా అని? వేదపండితులంటే పెళ్ళిళ్ళు చేయించే పురోహితులూ, ఆలయాల్లో అర్చకులూ కాదే! ఈ సంగతి ఆచార్యుల వారికి తెలియదా?  కేవలం వేదాధ్యయనం వల్ల ఎటువంటి డబ్బు సంపాదన చెయ్యగలరు?

ప్రతిచోటా మంచీ చెడూ ఉంటాయి. మనసంస్కృతి కూడా అంతే. కానీ నేను గర్వపడే విషయాల్లో మన సత్సంప్రదాయాల్లో ముఖ్యమైనది ఒకటుంది. జ్ఞానము, అన్నము – ఈ రెండింటినీ అమ్ముకోడం పాపం. మనదేశంలో జరిగినంత విద్యాదానం, అన్నదానం ప్రపంచంలో ఎక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

మరి వేదమంటే కేవలం జ్ఞానమే! దానిని డబ్బు సంపాదనకి వాడడం మన పూర్వీకులు మహాపరాధమని భావించారే! అలాంటి వేదాన్ని జీవనోపాధి అనడం సబబు కాదని అనిపించింది. 

వేదాన్ని అందరికీ బోధించకపోడానికి ఏమి కారణమో నాకు ఖచ్చితంగా తెలీదు. నా అభిప్రాయం ఇదివరకు ఒకసారి రాసాను. వేదపండితులంతా చెడ్డవాళ్ళూ, బిల్ గేట్స్ లాంటి వాళ్ళూ అని అన్నా నేను అది ఆయన అభిప్రాయం అని ఊరుకుందును. కానీ వేదవిద్య ఇలా డబ్బు సంపాదనకి మార్గం కాదని మాత్రం చెప్పగలను.   

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః   

జూలై 5, 2007

తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…)

“కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్”
దోమ నోట్లో మదపుటేనుగులు దూరాయి అని దీనర్ధం. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన తెలుగువారందరికీ ఈ సమస్య సుపరిచితమే. తెనాలి రాముడిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి పండితులు ఒక కాపలా వాడిచేత ఈ సమస్యని అడిగిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతే ఆయన తెనాలిరాముడెందుకౌతాడు. అందుకే కాపలా వాడిని అడ్డంపెట్టి వాళ్ళని బండబూతులు తిడతాడు. గంజాయి తాగి నానా జాతులతోటీ కలిసి కల్లుతాగి పేలుతున్నావా లం*కొడకా, ఎక్కడరా దోమనోట్లో ఏనుగులు దూరాయి? అని ఇలా పూరించాడు:

కం: గంజాయితాగి తురకల
     సంజాతులగూడి కల్లు చవిగొన్నావా
     లం*లకొడకా! ఎక్కడ
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

దెబ్బకి కుళ్ళుకున్నవాళ్ళు నోళ్ళుమూసుకుని ఏడ్చుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. కానీ ఈ విషయం రాయలవారికి చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు కదా, ఇంత అందమైన సమస్య వ్యర్ధమైపొయిందే అని బాధపడి తెనాలి రాముడిని పిల్చి, ఇప్పుడు ఇదే సమస్య నేనిస్తున్నాను పూరించమని ఆజ్ఞాపిస్తాడు. మరి తెనాలిరాముడి నాలుకకి రెండుపక్కలా పదునే కదా, ఎంత సరసంగా పూరించాడో చూడండి:

కం: రంజనచెడి పాండవులరి
     భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!
     సంజయ! విధినేమందును
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

సంజయా! విధి ఎంత బలీయమైనదో చూసావా. పాండవులంతటివారు కూడా విరాటరాజు కొలువలో ఊడిగం చెయ్యాల్సివచ్చింది. ఏనుగులు వెళ్ళి దోమ నోట్లో దూరడం లాగ ఉంది ఇది అని మంచి సమయస్ఫూర్తితో పూర్తిచేసేప్పటికి రాయలవారు ఎంతో ఆనందించారుట.

ఇటువంటి పద్యాలూ, కధలూ తెనాలి రాముడిపేరు మీద ఎన్నో ఉన్నాయి. అవి నిజంగా జరిగినవా కావా అన్న వివాదాన్ని పక్కన పెడితే ఇంత మంచి సాహిత్య వారసత్వాన్ని మనకి అందజేసిన పెద్దవాళ్ళందరికీ మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని నేను అనుకుంటాను.

ఇంక  నా పైత్యం గురించి. తెనాలిరాముడి గురించి నేను రాసిన పోస్ట్ చూసిన స్వాతికుమారి గారు రాయలవారి వేషంవేసి, “శ్రీరాం! ఈ సమస్యని పూరించండి చూద్దాం” అంటూ దీన్ని నాకు గుర్తుచేసారు. నా శాయశక్తులా ప్రయత్నించి ఇలా పూర్తిచేసా:

కం: గింజలు పండక కర్షకు
    లంజలిపట్టిరి కొలువుల నడుగుచు దొరలన్!
    బంజరు లయ్యెను భూములు
    కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్!

ఎవరి దయాదాక్షిణ్యాలమీదా ఆధారపడక భూమితల్లిని నమ్ముకుని స్వతంత్రంగా మదపుటేనుగుల్లా ఎంతో స్వాభిమానంతో జీవించే శ్రమజీవులు మన రైతులు. కానీ ఈరోజుల్లో వారి పరిస్తితి ఎంత దయనీయంగా మారిందో మనం చూస్తున్నదే. వ్యవసాయాన్నీ భూములనీ వదులుకుని చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో యజమానుల దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్నారు. ఇది చూస్తే నాకు ఏనుగులు దోమనోట్లో దూరినట్టే అనిపించింది.

మరి నాపూరణ చూస్తే రాయలవారికేమనిపించిందో! 🙂

మే 29, 2007

తెనాలి రాముడి వికటకవిత్వం, నా పైత్యం!

తెనాలి రాముడి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి చిన్నప్పుడు విన్న చమత్కారపు కధలూ అందులోని హాస్యమూను. నిజానికి ఇలా పిల్లలని ఆకట్టుకునే చారిత్రక పాత్రలు మనకి చాలానే ఉన్నాయి. బీర్బల్, మర్యాద రామన్న వగైరాలు. కానీ తెనాలి రాముడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన పిల్లలతో పాటు పెరుగుతూ వస్తాడు. అమ్మ వారి చేతుల్లోని రెండు గిన్నెల్లో పాయసమూ తాగేసిన కధ వినే వయసు దాటేసరికి గూని చాకలి వాడి కధ దొరుకుతుంది. ఇంకొంచెం పెద్దయ్యేప్పటికి భావతురంగం కధ ఆకట్టుకుంటుంది. ఇంక కధలు వినే వయసు దాటేసరికి ఆయన చాటువులు, సమస్యా పూరణలూ ఆస్వాదించమని ఆహ్వానిస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం అభిరుచి, చెప్పేవాళ్ళు ఉండాలి. ఇక ఈ స్థాయి దాటితే పాండురంగమహత్యం చదవచ్చు.

ఇలా ఆబాలగోపాలన్నీ ఆకట్టుకునే తెనాలి రాముడి వికటకవిత్వపు విన్యాసాలలో ఒక సమస్యా పూరణ నాకు ఈ మధ్య రాఘవ గారి బ్లాగు ద్వారా గుర్తొచ్చింది. ఇది ఏదో ఒక సినిమాలో కూడా విన్న గుర్తు (ఆదిత్య 369 అనుకుంటా). సమస్య ఏమిటంటే

బలరాముడు సీతజూచి ఫక్కున నగియెన్!

అడిగేవాడికి చెప్పే వాడు లోకువని కాకపోతే, ఎక్కడో త్రేతాయుగంలోని సీతమ్మవారిని ద్వాపరయుగంలోని బలరాముడు చూడడమేమిటి! పైగా చూసి ఫక్కుమని నవ్వేడు కూడాట. ఇదంతా ఎలా సరిపెట్టాలి? చూడటానికి అసంబద్ధంగా ఉన్నా ఈ సమస్యలో ఒక అందం ఉంది. అది కవికి మాత్రమే కనపడుతుంది. అందుకే తెనాలి రాముడు ఇలా పూర్తి చేసాడు:

లలనలు పాయస మానిన
కలుగుదురే బిడ్డలంచు క్ష్మాసుతనవ్వన్  
పొలమున దొరికెదరని ధీ
బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్!

చోద్యం కాకపోతే ఎక్కడైనా ఆడవాళ్ళు పాయసం తింటే పిల్లలు పుడతారా అని సీతమ్మవారు శ్రీరాముడిని వేళాకోళం చేస్తే, బుద్ధిబలుడైన రాముడు “కాదులే పొలాల్లో దొరుకుతారట” అని తానేమీ తక్కువ కాకుండా సమాధానం ఇచ్చాడుట.

ఇంత అందమైన భావనలతో హాస్యాన్ని పండిచాడుకనకనే ఆయన మన తెలుగు వారిలో హాస్యానికి మరో పేరుగా నిలిచిపోయాడు.

బలరాముడిని ధీబల రాముడి గా మార్చేసుకోడం కుదిరింది కాబట్టి ఆ పై మూడు పాదాల్లోనూ అద్భుతమైన భావాన్ని నింపి ఒక గొప్ప పద్యంగా ఆ సమస్యని పూరించాడు తెనాలి రాముడు.

ఐతే అన్నిసార్లూ ఇలాంటి వెసులుబాటు ఉండదు. ఉదాహరణకి రాఘవగారు ఈ మధ్య ఇచ్చిన సమస్య:

రావణు చెల్లి ద్రౌపదిని రాముడు యెత్తుకు పోయె చక్కగా

ఈ సమస్యని ఎలా మార్చినా ఒక అర్ధవంతమైన పద్యం చెప్పడం కష్టం. తెనాలి రాముడి లాంటి కవుల సంగతేమో కానీ నాబోటి వారి వల్ల అయ్యే పని కాదు. ఇలాంటప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునేది క్రమాలంకారం. ఉదాహరణకి నా పూరణ చూడండి:

కావరమొంది రామునికి కామము దెల్పినదెవ్వరు? ద్యుతిన్
పావకుడిచ్చెనెవ్వరిని పార్ధుని మామకు? కష్టమందు సు
గ్రీవుని గాచెనెవ్వరది?కృష్ణుడు రుక్మిణినేమి చేసెనో?
రావణుచెల్లి, ద్రౌపదిని, రాముడు, యెత్తుకు పోయె చక్కగా !

వరుసగా కొన్ని ప్రశ్నలు, అదే వరుసలో వాటికి సమాధానాలు.

ప్రశ్నలూ సమాధానాలూ చూడండి:

1. పొగరెక్కి శ్రీరాముడి వద్ద కామాన్ని కోరినది ఎవరు? రావణు చెల్లి (శూర్పణఖ)
2. పావకుడు (అగ్ని) మంచి కాంతితో, పార్ధుని (అర్జునుడి) మామగారికి ఎవరినిచ్చాడు? ద్రౌపదిని, ఆవిడ యజ్ఞగుండంలోంచి పుట్టింది.
3. సుగ్రీవుడు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసింది ఎవరు? శ్రీరాముడు
4. కృష్ణుడు రుక్మిణిని ఏమి చేసాడు? చక్కగా ఎత్తుకుపోయాడు

ఇలా ముప్పతిప్పలూ పడి ఈ ఉత్పలమాలని పూర్తి చెయ్యవలసి వచ్చింది. రాఘవగారికి నా పూరణ నచ్చుతుందని ఆశిస్తూ, తెనాలి రాముడి పద్యం కింద నా పద్యం రాసినందుకు ఆ మహాకవికి క్షమాపణలు తెల్పుకుంటున్నాను.

తర్వాత పేజీ »