సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబర్ 26, 2007

పెళ్ళి తీర్చిన సమస్య!

కొంతమందికి పెళ్ళికాక సమస్య. చాలా మందికి పెళ్ళయ్యాకా ప్రతీదీ సమస్యే. మరి పెళ్ళివల్ల సమస్య తీరడం ఏమిటి అంటారా, నేను చెప్పేది లోకకళ్యాణం కోసం జరిగిన పెళ్ళిగురించి. అదే సీతారామకళ్యాణం. (more…)

ప్రకటనలు

సెప్టెంబర్ 2, 2007

క్రమాలంకారం కాళ్ళు మళ్ళీ పట్టుకుని…

తాంత్రిక శాస్త్రం చదువుకునే రోజుల్లో మా కళాశాల విద్యార్ధులందరికీ గౌతమ బుద్ధుడు ఆదర్శం. నిజమైన జ్ఞానం చెట్టుకిందే లభిస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళం. అందుకే ఎక్కువ సమయం కళాశాల ఆవరణలో మా విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న చెట్టుకింద గడిపేవాళ్ళం. (more…)

ఆగస్ట్ 14, 2007

కొత్త సమస్యలు

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం.

కొత్తపాళీగారిని చూసి నేను పద్యాలు రాయడం.

రాసిన తర్వాత దురదకొద్దీ వాటిని బ్లాగడం.

పర్యవసానంగా ఊకదంపుడుగారుబాంబు పట్టుకొచ్చి నా బ్లాగులో పడేసారు. మిడతంభొట్లు మీ చేతిలో చిక్కేసాడండీ అని పేరు చెప్పి శరణు కోరడానికి అహం అడ్డు. ఏమిటి కర్తవ్యం?

పోరాడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. తప్పదు, మీరు భరించాల్సిందే!

సమస్య:

“గర్భముదాల్చెను పురుషుడు గంగలొ మునగన్”

నా పూరణ:

కం|| గర్భాధానపు తంతును
      నిర్భీతిగ శంతనుండు నీటనె నెరపెన్
      గర్భము పండగ గంగకు 
      గర్భము దాల్చెను, పురుషుడు గంగలొ మునగన్!

(మహాభారతంలో భీష్ముడి తండ్రి శంతన మహారాజు, గంగను వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. వాళ్ళు కాపరం ఎక్కడ చేసారో నేను చూడలేదు కానీ, మన సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఇంట్లోనే ఈ గర్భాధానపు తంతు జరుగుతుంది.)

(From Brown: పురుషుడు (p. 0776) [ puruṣuḍu ] purushuḍu. [Skt.] n. A man. A husband)

జూలై 5, 2007

తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…)

“కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్”
దోమ నోట్లో మదపుటేనుగులు దూరాయి అని దీనర్ధం. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన తెలుగువారందరికీ ఈ సమస్య సుపరిచితమే. తెనాలి రాముడిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి పండితులు ఒక కాపలా వాడిచేత ఈ సమస్యని అడిగిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతే ఆయన తెనాలిరాముడెందుకౌతాడు. అందుకే కాపలా వాడిని అడ్డంపెట్టి వాళ్ళని బండబూతులు తిడతాడు. గంజాయి తాగి నానా జాతులతోటీ కలిసి కల్లుతాగి పేలుతున్నావా లం*కొడకా, ఎక్కడరా దోమనోట్లో ఏనుగులు దూరాయి? అని ఇలా పూరించాడు:

కం: గంజాయితాగి తురకల
     సంజాతులగూడి కల్లు చవిగొన్నావా
     లం*లకొడకా! ఎక్కడ
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

దెబ్బకి కుళ్ళుకున్నవాళ్ళు నోళ్ళుమూసుకుని ఏడ్చుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. కానీ ఈ విషయం రాయలవారికి చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు కదా, ఇంత అందమైన సమస్య వ్యర్ధమైపొయిందే అని బాధపడి తెనాలి రాముడిని పిల్చి, ఇప్పుడు ఇదే సమస్య నేనిస్తున్నాను పూరించమని ఆజ్ఞాపిస్తాడు. మరి తెనాలిరాముడి నాలుకకి రెండుపక్కలా పదునే కదా, ఎంత సరసంగా పూరించాడో చూడండి:

కం: రంజనచెడి పాండవులరి
     భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!
     సంజయ! విధినేమందును
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

సంజయా! విధి ఎంత బలీయమైనదో చూసావా. పాండవులంతటివారు కూడా విరాటరాజు కొలువలో ఊడిగం చెయ్యాల్సివచ్చింది. ఏనుగులు వెళ్ళి దోమ నోట్లో దూరడం లాగ ఉంది ఇది అని మంచి సమయస్ఫూర్తితో పూర్తిచేసేప్పటికి రాయలవారు ఎంతో ఆనందించారుట.

ఇటువంటి పద్యాలూ, కధలూ తెనాలి రాముడిపేరు మీద ఎన్నో ఉన్నాయి. అవి నిజంగా జరిగినవా కావా అన్న వివాదాన్ని పక్కన పెడితే ఇంత మంచి సాహిత్య వారసత్వాన్ని మనకి అందజేసిన పెద్దవాళ్ళందరికీ మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని నేను అనుకుంటాను.

ఇంక  నా పైత్యం గురించి. తెనాలిరాముడి గురించి నేను రాసిన పోస్ట్ చూసిన స్వాతికుమారి గారు రాయలవారి వేషంవేసి, “శ్రీరాం! ఈ సమస్యని పూరించండి చూద్దాం” అంటూ దీన్ని నాకు గుర్తుచేసారు. నా శాయశక్తులా ప్రయత్నించి ఇలా పూర్తిచేసా:

కం: గింజలు పండక కర్షకు
    లంజలిపట్టిరి కొలువుల నడుగుచు దొరలన్!
    బంజరు లయ్యెను భూములు
    కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్!

ఎవరి దయాదాక్షిణ్యాలమీదా ఆధారపడక భూమితల్లిని నమ్ముకుని స్వతంత్రంగా మదపుటేనుగుల్లా ఎంతో స్వాభిమానంతో జీవించే శ్రమజీవులు మన రైతులు. కానీ ఈరోజుల్లో వారి పరిస్తితి ఎంత దయనీయంగా మారిందో మనం చూస్తున్నదే. వ్యవసాయాన్నీ భూములనీ వదులుకుని చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో యజమానుల దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్నారు. ఇది చూస్తే నాకు ఏనుగులు దోమనోట్లో దూరినట్టే అనిపించింది.

మరి నాపూరణ చూస్తే రాయలవారికేమనిపించిందో! 🙂

మే 29, 2007

తెనాలి రాముడి వికటకవిత్వం, నా పైత్యం!

తెనాలి రాముడి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి చిన్నప్పుడు విన్న చమత్కారపు కధలూ అందులోని హాస్యమూను. నిజానికి ఇలా పిల్లలని ఆకట్టుకునే చారిత్రక పాత్రలు మనకి చాలానే ఉన్నాయి. బీర్బల్, మర్యాద రామన్న వగైరాలు. కానీ తెనాలి రాముడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన పిల్లలతో పాటు పెరుగుతూ వస్తాడు. అమ్మ వారి చేతుల్లోని రెండు గిన్నెల్లో పాయసమూ తాగేసిన కధ వినే వయసు దాటేసరికి గూని చాకలి వాడి కధ దొరుకుతుంది. ఇంకొంచెం పెద్దయ్యేప్పటికి భావతురంగం కధ ఆకట్టుకుంటుంది. ఇంక కధలు వినే వయసు దాటేసరికి ఆయన చాటువులు, సమస్యా పూరణలూ ఆస్వాదించమని ఆహ్వానిస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం అభిరుచి, చెప్పేవాళ్ళు ఉండాలి. ఇక ఈ స్థాయి దాటితే పాండురంగమహత్యం చదవచ్చు.

ఇలా ఆబాలగోపాలన్నీ ఆకట్టుకునే తెనాలి రాముడి వికటకవిత్వపు విన్యాసాలలో ఒక సమస్యా పూరణ నాకు ఈ మధ్య రాఘవ గారి బ్లాగు ద్వారా గుర్తొచ్చింది. ఇది ఏదో ఒక సినిమాలో కూడా విన్న గుర్తు (ఆదిత్య 369 అనుకుంటా). సమస్య ఏమిటంటే

బలరాముడు సీతజూచి ఫక్కున నగియెన్!

అడిగేవాడికి చెప్పే వాడు లోకువని కాకపోతే, ఎక్కడో త్రేతాయుగంలోని సీతమ్మవారిని ద్వాపరయుగంలోని బలరాముడు చూడడమేమిటి! పైగా చూసి ఫక్కుమని నవ్వేడు కూడాట. ఇదంతా ఎలా సరిపెట్టాలి? చూడటానికి అసంబద్ధంగా ఉన్నా ఈ సమస్యలో ఒక అందం ఉంది. అది కవికి మాత్రమే కనపడుతుంది. అందుకే తెనాలి రాముడు ఇలా పూర్తి చేసాడు:

లలనలు పాయస మానిన
కలుగుదురే బిడ్డలంచు క్ష్మాసుతనవ్వన్  
పొలమున దొరికెదరని ధీ
బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్!

చోద్యం కాకపోతే ఎక్కడైనా ఆడవాళ్ళు పాయసం తింటే పిల్లలు పుడతారా అని సీతమ్మవారు శ్రీరాముడిని వేళాకోళం చేస్తే, బుద్ధిబలుడైన రాముడు “కాదులే పొలాల్లో దొరుకుతారట” అని తానేమీ తక్కువ కాకుండా సమాధానం ఇచ్చాడుట.

ఇంత అందమైన భావనలతో హాస్యాన్ని పండిచాడుకనకనే ఆయన మన తెలుగు వారిలో హాస్యానికి మరో పేరుగా నిలిచిపోయాడు.

బలరాముడిని ధీబల రాముడి గా మార్చేసుకోడం కుదిరింది కాబట్టి ఆ పై మూడు పాదాల్లోనూ అద్భుతమైన భావాన్ని నింపి ఒక గొప్ప పద్యంగా ఆ సమస్యని పూరించాడు తెనాలి రాముడు.

ఐతే అన్నిసార్లూ ఇలాంటి వెసులుబాటు ఉండదు. ఉదాహరణకి రాఘవగారు ఈ మధ్య ఇచ్చిన సమస్య:

రావణు చెల్లి ద్రౌపదిని రాముడు యెత్తుకు పోయె చక్కగా

ఈ సమస్యని ఎలా మార్చినా ఒక అర్ధవంతమైన పద్యం చెప్పడం కష్టం. తెనాలి రాముడి లాంటి కవుల సంగతేమో కానీ నాబోటి వారి వల్ల అయ్యే పని కాదు. ఇలాంటప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునేది క్రమాలంకారం. ఉదాహరణకి నా పూరణ చూడండి:

కావరమొంది రామునికి కామము దెల్పినదెవ్వరు? ద్యుతిన్
పావకుడిచ్చెనెవ్వరిని పార్ధుని మామకు? కష్టమందు సు
గ్రీవుని గాచెనెవ్వరది?కృష్ణుడు రుక్మిణినేమి చేసెనో?
రావణుచెల్లి, ద్రౌపదిని, రాముడు, యెత్తుకు పోయె చక్కగా !

వరుసగా కొన్ని ప్రశ్నలు, అదే వరుసలో వాటికి సమాధానాలు.

ప్రశ్నలూ సమాధానాలూ చూడండి:

1. పొగరెక్కి శ్రీరాముడి వద్ద కామాన్ని కోరినది ఎవరు? రావణు చెల్లి (శూర్పణఖ)
2. పావకుడు (అగ్ని) మంచి కాంతితో, పార్ధుని (అర్జునుడి) మామగారికి ఎవరినిచ్చాడు? ద్రౌపదిని, ఆవిడ యజ్ఞగుండంలోంచి పుట్టింది.
3. సుగ్రీవుడు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసింది ఎవరు? శ్రీరాముడు
4. కృష్ణుడు రుక్మిణిని ఏమి చేసాడు? చక్కగా ఎత్తుకుపోయాడు

ఇలా ముప్పతిప్పలూ పడి ఈ ఉత్పలమాలని పూర్తి చెయ్యవలసి వచ్చింది. రాఘవగారికి నా పూరణ నచ్చుతుందని ఆశిస్తూ, తెనాలి రాముడి పద్యం కింద నా పద్యం రాసినందుకు ఆ మహాకవికి క్షమాపణలు తెల్పుకుంటున్నాను.

తర్వాత పేజీ »