సంగతులూ,సందర్భాలూ….

మార్చి 27, 2010

ఎంత అజ్ఞానం!

పెళ్ళికి ముందు శృంగారం తప్పుకాదంటూ గౌరవనీయులైన సర్వోత్తమ న్యాయస్థానమూర్తులుంగారు తమ అభిప్రాయం వ్రాక్కుచ్చి ఊరుకుంటే బాగుండేది కానీ మధ్యలో రాధాకృష్ణుల సంగతి ఎందుకు తెచ్చారంటూ చాలామంది హిందువులు నొచ్చుకుంటుండగా అది కేవలం వ్యాఖ్యమాత్రమేనని పెళ్ళివినా సహజీవనం హైందవ సంస్కృతికి విరుద్ధం కాదని వక్కాణించడానికి వాడిన ఉదాహరణ మాత్రమేనని కొంతమంది విశాలహృదయులు సర్ది చెప్తున్నారు.

ఈ సంగతులెలా ఉన్నా, ఇవన్నీ చూసిన పెళ్ళికాని యువకులెవరైనా శ్రీకృష్ణునికున్న అష్టభార్యలనుదహరిస్తూ హిందూ వివాహచట్టాన్ని బహుభార్యాత్వానికి అనుకూలంగా సవరించాలని ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలుచేసి సఫలీకృతులైతే వారి అజ్నానంవల్ల పుట్టిన అత్యాశకి వారే మూల్యం చెల్లించుకోవాలని మాత్రం హెచ్చరిస్తున్నాను.

నాకు మాత్రం తాతయ్య మా చిన్నప్పుడు చెప్పిన కధొకటి గుర్తొస్తోంది.

ఆదిశంకరులు శిష్యబృందంతో కలిసి భిక్షాటన చేస్తుండగా దారిలో ఒక కల్లుపాక ఎదురయ్యిందిట. శంకరులు వెళ్ళి భిక్షాందేహీ అన్నారుట. పాపం ఆ కల్లుపాకవానికి ఆ రోజు ఇంకా బోణీ కాలేదుట. అయ్యా! నా దగ్గర కల్లుతప్ప ఇంకేమీ లేదని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడుట. అది చూసి చలించిన శంకరులు ఆ కల్లే పొయ్యమని భిక్షాపాత్ర పట్టారుట. అతను మహదానందంగా సమర్పించుకోగా గటగటా శంకరులు ఔపోసన పట్టేసారుట. అయితే ఇది చూసిన కొంతమంది శిష్యపరమాణువులు గురువుగారు తాగితే లేని తప్పు తాము తాగితే ఏముందనిచెప్పి ఆ సాయంత్రం వెళ్ళి పూటుగా పుచ్చుకుని రావడం చూసిన శంకరులు వారి అజ్నానాన్ని పోగొట్టాలని చెప్పి మరునాడు బిక్షాటనకి ఒక కమ్మరి దుకాణం వద్దకు తీసుకెళ్ళారుట. భిక్షాందేహీ అన్న శంకరులని చూసి దుకాణదారు, స్వామీ! ఉన్న ద్రవ్యమంతా ఇప్పుడే లోహం కొనడానికి ఖర్చు చేసాను, కొలిమిలో కాగుతున్న సీసం తప్పితే నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడుట. శంకరులు అదే పొయ్యవయ్యా అనడంతో వాడు సలసల కాగుతున్న సీసాన్ని బిక్షగా పొయ్యగా ఈయన అదే ధారగా తాగేసి శిష్యులకేసి చూసి మీరూ తాగుతారా అని అడిగారుట. తమ తప్పుతెల్సుకున్న శిష్యులు ఆయన కాళ్ళమీద పడ్డారుట.

అందుచేత పిల్లలూ, గురువుగారు చుట్టతాగేరని మేమూ తాగుతామనడం, కృష్ణుడు వెన్నదొంగతనం చేస్తే లేని తప్పు మేము సున్నుండలు దొబ్బితే ఏమిటనడం లాంటివి అజ్ఞానపు మాటలని చెప్పి మా తాతయ్య ముక్తాయించేవాడు.

ఔను మరి, పదహారువేలమందిని పెళ్ళాడాడని శ్రీకృష్ణుడిని వెక్కిరించడానికి తయారయ్యే మన మేధావులకి, ఆయన ఏకకాలంలో పదహారువేలరూపాలలో గడపగలిగిన వాడని మాత్రం గుర్తుండదు. మహాభక్తులకి సైతం ఎంతో సాధన వల్లకానీ అర్ధంకాని కృష్ణతత్వం గురించి నోటికొచ్చినట్టల్లా మాట్లాడకూడదన్న కనీస జ్నానం ఈ మేధావులకి లేకపోవడం వారి ప్రారబ్దం అనుకోవచ్చు కానీ, ఇలాంటివాళ్ళ నోరుమూయించే శక్తి హిందూసమాజానికి లేకపోవడం మాత్రం శోచనీయమైన విషయం (హిందూ పురాణపాత్రలగురించి, వాటి నిగూఢార్ధం గురించీ నేనీమధ్య చదివిన ఈ మంచి వ్యాసాన్ని ఆసక్తి ఉన్నవారు చూడండి).

భారతీయులందరూ అనాదిగా పరమ పవిత్రులనీ, మన సమాజంలో వివాహేతర సంబంధాలు ఉండేవే కావనీ నేను అనట్లేదు. మన పిత్రుస్వామ్య వ్యవస్థలో పురుషులు, ముఖ్యంగా కాస్త ధనవంతులు స్త్రీలను ’ఉంచుకోవడం’ వందల ఏళ్లుగా జరిగిన వ్యవహారం. అయితే, మధ్యయుగపు సంధికాలంలో ప్రబలిన ఈ వ్యవహారాన్ని సమాజం నిరసించడమూ, ఇటువంటి సంబంధాలవల్ల కలిగిన సంతానం సమాజంలో వివక్షకి గురికావడమూ జరిగింది కానీ ఇలా శాస్త్ర సమ్మతమంటూ తీర్పులిచ్చినవాళ్ళెవరూ లేరు. కాలక్రమేణా భారతీయసమాజం లో జరిగిన మార్పులూ సంస్కరణల ఫలితంగా ఇలాంటి అవాంఛనీయపోకడలు బాగా తగ్గుముఖం పట్టడం మన అద్రుష్టమనే చెప్పాలి. ఇప్పటికే వివాహవ్యవస్థ బాగా దెబ్బతిన్న పాశ్చాత్యదేశాలలో ప్రబలిన పెళ్ళికాని జంటల వల్ల ఎన్ని దుష్ప్రభావాలు కలుగుతున్నాయో చూసి కూడా కేవలం విశాలహ్రుదయులుగా, హిందూవ్యతిరేకులుగా తద్వారా లౌకిక వాదులుగా గుర్తింపబడడం కోసం ఇటువంటి పోకడలని సమర్ధించే కుహనామేధావులనీ, సంస్కర్తలనీ సమాజం తిరస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

19 వ్యాఖ్యలు »

 1. నిజమే!
  పురాణాల్లో తప్పితే ఇంకెక్కడా రాముడి ప్రస్తావన లేదు కాబట్టి అసలు రాముడు అనేవాడే లేడు అన్నారప్పుడు…
  ఇప్పుడేమో, మరి అదే పురాణాల్లో రాధా-కృష్ణుల సహజీవనం గురించి మాట్లాడుతున్నారు!
  సమస్యల్లా ఎక్కడ అంటే, విషయం మొత్తం తెలుసుకోకుండా, ఎక్కడో ఒక చోట ఇలాంటి ప్రస్తావన ఉంది, మనకి అనుకూలంగా ఉంది కాబట్టి వాడేసుకుందామనే ఆలోచనల వల్ల..

  కృష్ణుడు ఏకకాలంలో పదహారు వేల రూపాల్లో ఉన్నాడు అంటే ఒప్పుకోరు కానీ, పదహారు వేల పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మాత్రం తయారు గా ఉంటారు, పైగా దాన్ని దీనితో పోల్చి సమర్ధింపులు…

  వ్యాఖ్య ద్వారా మేధ — మార్చి 27, 2010 @ 1:14 సా. | స్పందించండి

 2. తాతయ్య గారు మంచి పాయింటు చెప్పేరండి. మనక్కావలసిన విషయాలైతే పురాణాల్లోంచి వాడేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే పుక్కిటి పురాణాలని కొట్టి పారేయ వచ్చు. ఎంత అలుసై పోయాయండీ మన పురాణాలు! న్యాయమూర్తి స్థానానికి వచ్చాకా కొంత లోకఙ్ఞానం, కొంత అనుభవం, కొంత పరిపక్వత లేకపోతే ఎలాగండీ బాబూ!

  వ్యాఖ్య ద్వారా మందాకిని — మార్చి 27, 2010 @ 1:26 సా. | స్పందించండి

 3. మూర్ఖత్వం తలకెక్కినప్పుడు ,పిచ్చిముదిరినప్పుడు ఉఛ్ఛనీచాలు తెలియవు. ఆశ్థితిలో ఉన్నవానికి పరమాత్మ తత్వం ఎలా అర్ధమవుతుంది ? ఇలాంటి వ్యాఖ్యానాలకు కూడా దిగజారుతారు. ఎంత ఎదిగినా అంతే ? ఏస్థానం లో కూర్చున్నా అంతే.

  వ్యాఖ్య ద్వారా durgeswara — మార్చి 27, 2010 @ 1:33 సా. | స్పందించండి

 4. ** ఇలాంటివాళ్ళ నోరుమూయించే శక్తి హిందూసమాజానికి లేకపోవడం మాత్రం శోచనీయమైన విషయం **

  శక్తి లేక పోవడం కాదు, పందితో పోరాడటమంటే అశుద్ధం అంటకుండా వుండటం కుదురుతుందా?

  కూడలిలో ఓ పంది రావడంతో భావసారూప్యం కలిగిన బ్లాగరులు అకర్షితులైనారు.
  తమ బ్లాగుల్లో రామాయణాలు ఉటంకిస్తూనే, అక్కడ అశుద్ధాన్ని ఆస్వాదించడం తమ స్వేచ్చావాదానికి గురుతు అంటూ , ఆ పందిని విమర్శించడం మహా పాపమని , అ విమర్శకులవైపు నిరంకుశంగా వ్యవహరించాలని కూడా ప్రవ చించిరి.

  వ్యాఖ్య ద్వారా నిరంకుశుడు — మార్చి 27, 2010 @ 2:34 సా. | స్పందించండి

 5. టపా బాగుంది. దానితో పాటు ఇచ్చిన లింకులు బాగున్నాయి. కలి అవతారం పుట్టేదాకా ఈ ధర్మం మీద ఇలా దాడులు జరుగుతోనే ఉంటాయేమో.

  వ్యాఖ్య ద్వారా శ్రీవాసుకి — మార్చి 27, 2010 @ 5:44 సా. | స్పందించండి

 6. ఆఖరికి మన న్యాయమూర్తులు కూడా తలకుమాసినవారే అని నిరూపించుకుంటున్నారు. రాథా తత్వం, కృష్ణ తత్వం తెలిసినవారెవరూ ఇటువంటి అసందర్భపు ఉదాహరణలు ఇవ్వరు.

  వ్యాఖ్య ద్వారా సాయికిరణ్ — మార్చి 27, 2010 @ 5:59 సా. | స్పందించండి

 7. మనకి ఈ శాస్తి జరగాల్సిందేనేమో. వాడి ఖర్మన వాడేపోతాడని ఇలా హిందూధర్మాన్ని ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పనందుకు. అది బ్లాగుల్లో సహా ప్రపంచం అంతటా జరుగుతున్నదే. ద్రౌపదికీ, కృష్ణుడికీ ఒకాయన గొప్ప “థీసిస్” రాసి అవార్డు పుచ్చుకుంటున్నాడు, బ్లాగుల్లో మరొకరు లౌకికత్వం/మానవత్వం పేరిట నానా చెత్త రాస్తున్నారు. ఇహ జడ్జీలు రాధాకృష్ణులకి కొత్త అర్ధాలు చెప్తున్నారు. మనం అసమర్ధులం కాకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? అంతెందుకు, బ్లాగుల్లోనే ఎందరు ఆ లౌకికత్వ చెత్తని చెత్త అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు? ఈ లెఖ్ఖన మరో వందేళ్ళకి రామాయణం మొత్తం ఖూనీ అయిపోయి మరో కొత్త వర్షన్ తరవాతి తరాలకి అందినా ఆశ్చర్యం లేదు.

  వ్యాఖ్య ద్వారా రమణ — మార్చి 28, 2010 @ 3:12 ఉద. | స్పందించండి

 8. nice article. I would like to write on similar topic. Could you tell me how to type in Telugu in WordPress?

  వ్యాఖ్య ద్వారా atluris — మార్చి 28, 2010 @ 12:30 సా. | స్పందించండి

 9. వ్యాఖ్యాతలందరికీ నెనర్లు.
  అట్లూరిగారు:మీరు తెలుగులో రాయడానికి లేఖిని ని వాడచ్చు.

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 29, 2010 @ 6:34 ఉద. | స్పందించండి

 10. nice post. I am unaware of such a thing happening. But I really felt hurt when I saw similar crap of a famous painter’s Hindu paintings and his depiction of gods. High time we speak up against such stupidity.

  వ్యాఖ్య ద్వారా JOSH — మార్చి 29, 2010 @ 5:47 సా. | స్పందించండి

 11. ఇది నా మొదటి ‘టపా’సు. మీ వంటి వారు చదివీ, మీ ఉద్దేశ్యం తెలిపితే ప్రోత్యాహంగా వుంటుంది. http://gireesam.wordpress.com/

  వ్యాఖ్య ద్వారా atluris — మార్చి 31, 2010 @ 8:50 ఉద. | స్పందించండి

 12. “ఇలాంటివాళ్ళ నోరుమూయించే శక్తి హిందూసమాజానికి లేకపోవడం మాత్రం శోచనీయమైన విషయం .”

  ఆర్యా !

  మీరన్న యీ క్రింది పదాలే అన్నింటికీ మూలకారణాలూ,పరిష్కారానికి పర్యవసానమున్నూ.
  ముందు వైష్ణవ,శైవ,బౌధ్ధ,జైన వంటి మతాలను ఏకం చేసే ప్రయత్నం చేయండి.ఒకరిపై ఒకరు అవాకులూ చవాకులూ ప్రేలకుండా మతాభివ్రుద్ధి వైపు ద్రుష్టి సారించి, కుల వ్యవస్తపేరిట తమలో పేరుకు పోయిన
  క్రుళ్ళులో కుములుతు అదే మహోన్నతమని భావిస్తూ,నిమ్న కులాలవారు ఎల్లకాలం అలాగే బ్రతకాలని నిర్దేసించి మతం నుంచి దూరం చేసి, ఆర్ధిక వెసులు బాటు కొరకు, సాంఘిక గౌరవం కొరకు వేరె మతాలవైపు పరిగె ట్టేలా,ఆయా మతాలను ఆశ్రయించేలా చేసి,…ఎన్నడైనా ఎందుకు వారు ఆ మతాల వైపు ఆకర్షించ బడుతున్నారు? అని ఆలోచన వచ్చిందా? వారిని ఆపే ప్రయత్నమే చేయలేని హిందూ మత వాదులు, వారిని ఆదరించి వెనుకకు మళ్ళించలేని హిందూ మత వాదులు, భావసారూప్యతలేని సిద్ధాంతాలతో,ఏక త్రాటి పైకి రాలేని హిందూ మతవాదులు, తమలోని క్రుళ్ళును కడుక్కోవడానికి ప్రయత్నించలేని హిందూమత వాదులు,……

  ఆనాడు మహా రాజుల ప్రాపకాన్ని కోరి ఆ రాజ్యాధినాధుల ఆనందం కొరకు రచించ బడిన కథలను ఒక న్యాయస్థానం వుటంకించగానే ,వుదాహరించగానే, వులిక్కిపడి,వుద్రేకపడిపోయి మా పవిత్ర గ్రంధాలు ,పవిత్ర పాత్రలు అపవిత్రమయ్యాయనే ఆక్రోశాలు… మనకున్న వాత్సాయనుణ్ణి, మను శాస్త్రాన్నీ గౌరవించే మనం ,చాణుక్యుడి అర్ధ శాస్త్రాన్ని గౌరవిస్తూనే అప్పటి సామాజిక పరిస్థితుల్ని గౌరవించే మనం ,స్త్రీ మనో భావాలను గౌరవించడానికి సిద్ధంగా లేని మనం , స్త్రీ విద్యాధిక్యతపొంది, పురుషునికన్న ఆర్ధికంగా స్వావలంబన పొంది కుటుంబ అవసరాలు తీర్చుతున్నా,….పిల్లల పెంపక భారాన్ని, వంటింటి భాధ్యతలనూ పంచుకోవడానికి సిద్ధంగా లేని మనం మగవాడు యితర స్త్రీ సాంగత్యాలు పెట్టుకోవచ్చు ,కాని తమ స్త్రీలు యితర పురుషులతో మాట్లాడితేనే ద్వేషించే మనం,ఆర్ధిక, సామాజిక ,రాజకీయ,కుటుంబ జీవన స్థితిగతుల కనుగుణంగా స్రుష్టిత మైన పరిస్థితులను స్వాగతించలేని మనం, అందుకు అనుగుణంగా మసలుకోలేని మనం,క్రుళ్ళి,మురిగి, కంపుకొడుతున్న భావజాలాన్ని,వదలుకోలేని మనం, మనలను మనం సంస్కరించుకోలేని మనం , కాలక్షేపం కోసం మనలను మనం వుద్రేకపరుచుకోవడం, స్యయం సాంత్వనకొరకు చేసె యత్నం లాటిది. చేయగలిగితే హిందూ మతంలోని భావ వైరుధ్యాలను తొలగించండి. కులవ్యవస్తలో నిమ్నత తొలగించి మానవత్వ సమభావన ఆర్ధిక సమ తుల్యత కొరకు ప్రయత్నించండి.
  మన సామాజిక వర్గాలను సమాజిక గౌరవాన్నందించి మనకు దూరం కాకుండా కాపాడు కోండి. కుల వర్గ వ్యవస్తను నిర్మూలించండి.మనం మనలను ప్రపంచ మార్గదర్శకులుగా తీర్చిదిద్దుకోండి.అప్పుడు యీ విషయాల గురించి వ్యాకులత చెందుదాం. ……..గిజిగాడు

  వ్యాఖ్య ద్వారా Nutakki raghavendra Rao — మార్చి 31, 2010 @ 12:49 సా. | స్పందించండి

 13. Correct, Judges should not use radha krishna example to support live in relation. But the judgement given by them may be correct . I am not understanding what is the wrong when two matured couples staying in same room ? Matured couple means , if one of the couple marrying any third person, they should be in a position to tell the truth to the third person (They had live in relation)

  వ్యాఖ్య ద్వారా Sekhar — ఏప్రిల్ 3, 2010 @ 5:50 ఉద. | స్పందించండి

 14. హిందూ మతాన్ని బ్రష్టు పట్టిస్తుంది కోర్టులు మాత్రమే కాదు. దొంగ బాబాలు కూడా. నీను ఈ రోజే ఒక వ్యాసం రాశాను. http://gireesam.wordpress.com/
  మీ ఉద్దేశ్యం తెలుప గలరు

  వ్యాఖ్య ద్వారా atluris — ఏప్రిల్ 8, 2010 @ 10:49 ఉద. | స్పందించండి

 15. వ్యాఖ్యాతలందరికీ నెనర్లు.
  రాఘవేంద్రరావు గారూ, హిందూమతం మీరుచెప్పినంత కుళ్ళులో మగ్గుతోందని నేను అనుకోవట్లేదు. మీరు చెప్పిన చాలా విషయాలు హిందూ మతానికి సంబధంలేనివి కూడాను. ఈ విషయాలపై ఇంకోసారి ఎప్పుడైనా…

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 18, 2010 @ 7:06 ఉద. | స్పందించండి

 16. very very nice post sir . u expalnation is very good

  వ్యాఖ్య ద్వారా Aditya — ఏప్రిల్ 22, 2010 @ 10:29 సా. | స్పందించండి

 17. బ్రహ్మోపదేశం

  బ్రహ్మోపదేశం అంటే కేవలం మూడు పోగుల నూలు మెడలో వేయటం మాత్రమే కాదు. ఈ రెండు కళ్లే కాదోయ్, మూడవ కన్నున్నది. అది. ఆత్మ.జ్ఞాననేత్రం. దాన్ని తెరచి స్వరూపాన్ని గుర్తించు అని.గురువు బోధించటం.అన్నారు. దానికి కావలసిన సూక్ష్మంలో మోక్షం’ ఉంది సాధన నేర్పి, బ్రహ్మోపదేశం చేసి, జోలె కట్టి, భిక్షమెత్తమంటారు. మాతృభిక్షే ప్రథమభిక్ష. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు పిడికెళ్ల బియ్యం భిక్ష పెడుతుంది. అంటే తండ్రి చేసిన ఉపదేశం మననం చేసే నిమిత్తం భిక్షాటన వల్ల కుక్షి నింపుకుని, గురుకులవాసం చేసి, జ్ఞాననేత్రం తెరచి ఆత్మానుభూతిని పొందాలనేది ఉపనయనం యొక్క తాత్పర్యం. ప్రస్తుతం ఆ విషయం మరచి ప్రాణాయామమంటే వేళ్లతో ముక్కుమూసి అభినయించుటగాను, బ్రహ్మోపదేశమంటే కొత్త ధోవతి ముసుగుకప్పి, చెవులో గుసగుసలాడటంగాను, భిక్షంటే రూకలతో జోలె నింపటంగాను పరిణమించింది. అసలు ఉపనయన తత్త్వం గురించి ఉపదేశం చేసే తండ్రికి, చేయించే పురోహితునికి తెలియనప్పుడు బిడ్డలకేం చెప్తారని కూడా ప్రశ్నిస్తారు.

  ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, … మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా . ఋషులూ తెలుసుకున్నారు
  మానవ జీవితాన్ని మన పెద్దలు బ్రహ్మచర్యం, గార్హస్త్యం, వానప్రస్థం, సన్యాసంగా వివరించారు. ఐదేళ్లు నిండిన బాలుడిని ఊరికి దూరంగా ఉన్న గురుకులానికి జ్ఞానార్జన కోసం పంపేవారు. అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు గడిపాక స్వగృహానికి వచ్చేవాడు. కొన్నాళ్ల తరవాత కాశీయాత్రకు బయలు దేరేవాడు. కొందరు వచ్చి మా కూతురునిచ్చి పాణిగ్రహణం చేస్తాం రమ్మని ఆహ్వానించేవారు. అతడు విరాగియైతే కాశీకి వెళ్లిపోయేవాడు, నచ్చితే వచ్చి కన్యాదానం గ్రహించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి, పిల్లలను కని, పెంచి పోషిస్తూ, తల్లిదండ్రులకు సంఘానికి సేవ చేస్తూ దాదాపు యాభై సంవత్సరాల వయసు వచ్చేవరకు గృహస్థుగా గడిపి ఆ తరవాత తన భార్య తోడురాగా వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించి, చివరగా సన్యసించేవాడు. ఇప్పుడు అవన్నీ మరచిపోయారు. అర్థవంతమైన జీవితాన్ని మన భావితరాలవారికి అందించాలి. మన వ్యవస్థలు, ఆచారవ్యవహారాలు యావత్ప్రపంచానికి ఆదర్శం కావాలి.
  పరమాత్ముడిని స్థూల నేత్రాలతో చూడలేం. జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకొనగలం. పురాణాల్లో పరమాత్ముని జ్ఞానాన్ని, శక్తులను దేవతల రూపంలో చూపించారు. … మనో నిగ్రహ లక్షణాంతాః వ్యాసభగవానుడు అన్నాడు. అంటే సర్వ వ్యవస్థలయందును, సర్వకాలముల యందును మనస్సు’ను నిగ్రహించుకొనుట అనే లక్షణం ఉత్తమమైనది. ఆధ్యాత్మిక సాధనకు మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం అత్యంతవసరం

  వ్యాఖ్య ద్వారా rathnamsjcc — జూన్ 20, 2011 @ 3:12 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: