సంగతులూ,సందర్భాలూ….

అక్టోబర్ 21, 2007

శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం…

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 11:23 సా.

శ్రవణయంత్ర శాలల్లో శాస్త్రీయ సంగీతం లాగ…” అని మహాకవి వెక్కిరిస్తే వెక్కిరించాడు కానీ, ఆ ఆకాశవాణే కనక పోషించి ఉండకపోతే మన తెలుగునాట సంగీతమూ సంస్కృతీ ఈ మాత్రం కూడా నిలబడి ఉండే కావు అని నాకు అనిపిస్తుంది. ఐనా ఆ మాటకొస్తే భారతీయ సంగీతపు లోతులు తెలిసిన వాళ్ళకి దాని ముందు ఈ రేడియోలాంటివి ఏ మాత్రం గొప్ప అద్భుతాలు అనిపించక మానదు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే నాగరాజు మేస్టారుని సంప్రదించండి. అసలు అయనే ఒక వ్యాసం రాస్తే అందరికీ ఉపయోగమని నా అభిప్రాయమూ, రాయమని ప్రార్ధనాను.

విషయానికొస్తే, నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మని దర్శించుకుందామని విజయవాడ వెళ్ళిన నేను, బందరు రోడ్డులో ఉన్న ఆకాశవాణి కేంద్రం ముందునుంచి వెళ్ళడం జరిగింది. ఆ భవనం చూడగానే నాకెన్నో జ్ఞాపకాలూ, అనుభూతులూ. ఎందరో ఉద్దండులూ, కళామతల్లి ముద్దుబిడ్డలు నడయాడిన ప్రాంగణం ఇదేనన్న ఆలోచన రాగానే ఏదో తెలియని భావన, కళ్ళలో చెమ్మ.

ఆంధ్రదేశ సాంస్కృతిక రాజధానిగా విలసిల్లిన విజయవాడలోని ఆకాశవాణి కేంద్రం ఎందరో కళాకారులకి ఆతిధ్యమిచ్చింది. మంగళంపల్లి  బాలమురళీ కృష్ణ గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు లాంటి శాస్త్రీయ సంగీత దిగ్గజాలే కాకుండా బాలాంత్రపు రజనీకాంత రావు, చిత్తరంజన్ వంటి లలిత సంగీత కళాకారులెందరో ఈ కేంద్రం వల్ల వన్నెకెక్కారని చెప్పచ్చు.

“ఈ మాసపు పాట” పేరుతో ప్రతి నెలా ఒక అందమైన పాటని పరిచయం చెయ్యడం నాకు బాగా గుర్తు. మంగళంపల్లి వారు పాడిన “క్షణమైన నిను వీడి…” అన్న ఈ పాట వినండి. ద్విజావంతి రాగంలో ఈ పాట స్వరపరిచిందెవరో గానీ వారి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. ఇలాంటి కొన్ని మధురమైన పాటలు ఇక్కడ వినచ్చు.

అలాగే ఓలేటి వారు నిర్వహించే భక్తిరంజని కార్యక్రమంలో ఆయన స్వయంగా స్వరపరిచి ఆలపించే అన్నమయ్య కీర్తనలూ, రామదాసు భజనలూ, శివస్తుతులూ వంటివి ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా పులకరింపచేస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రసారమైన పాటలు కొన్ని ఇక్కడ వినచ్చు. కొన్ని సంగీత రూపకాలు కూడా.

ఇక ప్రతి సంవత్సరం డిసెంబరులో ప్రసారమయ్యే “అఖిల భారత సంగీత సమ్మేళన్” లో ప్రసారమయ్యే హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల కచేరీల కోసం రసికులు సంవత్సరమంతా వేచి ఉండే వారంటే అతిశయోక్తి కాదు.

కళాకారులకి ప్రజాదరణ కరువైన రోజుల్లో వారిని ఒక కాపు కాసిన ఆకాశవాణికి మనమందరం తప్పక కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

                                                             ***   ***    ***

ఈ సందర్భంగా సురస.నెట్ గురించి కొంత చెప్పాలి. ఆంధ్రదేశంలో అందునా భాగ్యనగరంలో నాకెక్కడా కనపడని తెలుగు సంస్కృతిని నాకు అంతర్జాలంలో పరిచయం చేసినది సురస.నెట్. అంతర్జాలం ఇంకా తొలి దశల్లో ఉన్న రోజుల్లోనే శ్రీ సుసర్ల సాయి గారు ఈ వెబ్ సైటు ద్వారా మన సంగీతాన్నీ, తెలుగు సాహిత్యాన్నీ అంతర్జాలంలో ప్రచారం చెయ్యడానికి చేసిన ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. తెలుగు సంగీత సాహిత్యాలకి ఇది ఒక నిధి అని చెప్పచ్చు. శాస్త్రీయ సంగీతమే కాక ఉషశ్రీ పురాణాలూ, కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథలూ, శ్రీరంగం గోపాలరత్నం గారి అన్నమయ్య కీర్తనలూ ఇలా ఎన్నో ఇక్కడ వినచ్చు.

నా బ్లాగు ముఖంగా సాయిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

ప్రకటనలు

21 వ్యాఖ్యలు »

 1. శ్రీరాం గారూ,

  దసరా శుభాకాంక్షలు. నవరాత్రుల్లోనే అమ్మవారి దర్శనం చేసుకునే అదృష్టం దక్కించుకున్నారనమాట.

  మీరు చెప్పింది నిజమే. నాకు అప్పట్లో బాలమురళి మరియు చిత్తరంజన్ గారి పాటలు బాగా గుర్తు. చిత్తరంజన్ గారి “పదములె చాలును రామా…” అని సురస లోనే ఉంది. వినిచూడండి. అద్భుతం. ఇంకా చాలా పాటలు ఆకాశవాణివి మనస్సులో నాటుకుపోయాయి అలా వినీవినీ. ఇకపోతే, విజయవాడ ఎప్పుడూ ఏదో మంచి అనుభూతి కలిగిస్తుంది. నేడు ఎంత పెద్ద నగరమయినా, చుట్టురా ఉన్న ఊళ్ళతో ఇంకా పాతకొత్త కాలాలకి వారధిగానే ఉంటుంది. నాకిష్టమయిన ప్రదేశాలలో అదొకటి.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — అక్టోబర్ 22, 2007 @ 12:22 ఉద. | స్పందించండి

 2. బాలమురళికృష్ణ గారి ‘క్షణమైన నిను వీడి మనజాలనె చెలి’ పాట చాలా బావుంది. మొదటి సారి వినడం, అయినా వెంటనే ఆకట్టుకుంది. పాట వినడానికి ఘజల్ లా లేదు?

  సురస.నెట్ తీగ ఎప్పుడో ఏదో వెతుకుతున్నప్పుడు తగిలింది కాని అలానే వదిలేసాను. ఇప్పుడు కాస్త పట్టించుకుని చూస్తాను.

  దసరా శుభాకాంక్షలతో,

  గిరి

  వ్యాఖ్య ద్వారా Giri — అక్టోబర్ 22, 2007 @ 2:14 ఉద. | స్పందించండి

 3. శ్రీరాం గారూ! విజయదశమి శుభాకాంక్షలు.మంచి వెబ్ సైటు ని పరిచయం చేసారు.నెనెర్లు.
  -నేనుసైతం

  వ్యాఖ్య ద్వారా నేనుసైతం — అక్టోబర్ 22, 2007 @ 4:31 ఉద. | స్పందించండి

 4. ఆశ్చర్యం…ఇద్దరికీ ఆకాశవాణి గురించి వ్రాయాలి అనిపించటం , ఒకే రోజు రాయటం , కాకతాళీయమా, ఇంకేదన్నానా…మొన్న నేను హైదరాబాదుకి వెళ్ళినప్పుడు అక్కడి ఆకాశవాణి కేంద్రం ముందు నుండి వెళ్ళినప్పుడు, ఒక పెళ్ళికి విజయవాడ కూడా వెళ్ళవలసివచ్చి …మీ లాగానే విజయవాడ ఆకాశవాణి కేంద్రం ముందు నుండి వెళ్ళినప్పుడే అనుకున్నా…కొంచెం తీరిక దొరికినప్పుడు వీటి గురించి రాద్దాము అని అనుకున్నా…ఏదయితేనేం , మంచి టపా…ఇలాగే రాస్తూ ఉండండి..

  వ్యాఖ్య ద్వారా Vamsi — అక్టోబర్ 22, 2007 @ 5:31 ఉద. | స్పందించండి

 5. నా టపా ఇక్కడ చూడండి…అయినా మీకన్నా ముందే ఆ ఛాన్సు కొట్టేసా…ఒకటే రోజు అనుకున్నా..నేను నిన్న రాసిన సంగతి మర్చిపోయి.. 😛

  http://janatenugu.blogspot.com/2007/10/blog-post_3041.html

  వ్యాఖ్య ద్వారా Vamsi — అక్టోబర్ 22, 2007 @ 5:40 ఉద. | స్పందించండి

 6. ఇంకో విషయమేమంటే,ఘంటసాల గారి గొంతుని ప్రపంచానికి పరిచయం చేసింది రజనీకాంత రావు గారే, వీరి సారధ్యం లో ఘంటసాల గారు చాలా లలితగీతాలు ఆకాశవాణికి పాడరు.
  ఇప్పుడు చెబితే అసభ్యం అంటారేమో కాని ‘ ఫక్కున నువ్వు నవ్వితే చాలు” అని ఒక లలితగీతం వుండేది.. అలాగే బాలాంత్రపు వారు విజయవాడపై రచించి స్వర పరిచిన ‘విజయవాటిక’ అని ఒక లలిత గీతం ఉండాలి, కొత్తపాళీ గారిని అడుగుదామనుకుంటే మీరు అవకాశం కలిపించారు.

  సురస లొ నా ప్రియమైన పాట “అమ్మదొంగా నిన్నుచూడకుంటే”..
  పాలగుమ్మి వారు, వాల్ల అమ్మాయికి పెళ్లయి కాపురానికివెళ్తే దిగులు పడి ఈ పాట రాసుకున్నారుట. దానికి వేదవతీ ప్రభాకర్ గారి రసపోషణ ..

  వంశి గారిది మంచి వ్యాసం. గొల్లపూడి వారిని మరిచారు. అలానే “వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ”ను..
  జగ్గయ్య గారు ఆకాశవాణి డిల్లీ లొ పనిచేశారుట. వారిది బహుముఖ ప్రఙ్న

  వ్యాఖ్య ద్వారా vookadampudu — అక్టోబర్ 22, 2007 @ 12:04 సా. | స్పందించండి

 7. మంచి టపా వేశారు, ఆకాశవాణి గురించి సురస గురించి
  కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథలు అత్యాద్భుతంగా ఉంటాయి. వారు చెప్పిన ఛలోక్తితొనే నేను బ్లాగు మొదలు పెట్టాను, ఆ సైటు నుండి చాలా విషయాలు తెలుసుకొన్నాను

  వ్యాఖ్య ద్వారా బ్లాగేశ్వరుడు — అక్టోబర్ 22, 2007 @ 3:16 సా. | స్పందించండి

 8. మంచి టపా. సురస వారికి ధన్యవాదాలు. నాకు సురస పరిచయం కాగానే మా స్నేహితులకూ పరిచయం చేశాను. చాల ఇష్ట పడ్డారు. ఎన్నో అరుదైఅన నిధులున్నాయి ఇక్కడ.

  ప్రస్తుతానికి టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన పాటలలో దేశ భక్తి గీతానికి నా బ్లాగులో (ప్రేరణ పేజీలో), మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ గీతానికి తెలుగు4కిడ్స్ లో లంకెలు ఇచ్చాను.

  ఒకప్పుడు ఆకాశవాణిలో ప్రసారమయిన సంగీత కార్యక్రమాలు రికార్డు చేసుకుని మళ్ళీ మళ్ళీ వినే వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు. మంచి జ్ఞాపకాలు గుర్తు చేశారు, మంచి విషయాలు తెలియ చేశారు. నెనర్లు.

  వ్యాఖ్య ద్వారా lalithag — అక్టోబర్ 22, 2007 @ 3:20 సా. | స్పందించండి

 9. బహుదూరపుబాటసారీ, రావోయిబంగారిమాఁవాఁ, అత్తలేనికోడలుత్తమురాలు, పోలీసెంకటసామి – వీటికోసం పదేపదే సురస.నెట్ సందర్శిస్తుంటాను. ఈ పాటలు ఆకాశవాణి కడప కేంద్రం వారు సాయంత్రం పూట ‘పొలం కబుర్లు’ కాగానే అప్పుడప్పుడూ వినిపించేవారు. ఆ మయమానికి చీకటిపడుతూ ఉంటుంది. ఆవులను మేతనుండి తోలుకొనివచ్చి, నీళ్లు తాపి గుంజలకు కట్టేసి, ఆరుబయట మంచాలెక్కి ఆకలిమొదలౌతుండగా … ఈ పాటలు … చివరి పాట పూర్తి కాకమునుపే ‘ఆకాశవాణి … వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్ …’ అని వినవస్తే, ప్రాణం తీసేసినట్లయ్యేది. ఆ పాట ఈ ప్రపంచంలోనే అత్యంత అమూల్యమైనదిగా కనిపించేది. కోరుకున్నప్పుడు వినగలిగే అవకాశం ఇప్పుడు కలిగినా ఆ అనుభూతే వేరు. మీ టపాతో చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. నెనరులు.

  వ్యాఖ్య ద్వారా రానారె — అక్టోబర్ 22, 2007 @ 8:04 సా. | స్పందించండి

 10. విజయవాడ ఆకాశవాణి అనగానే నాకు గుర్తుకు వచ్చేది “బావగారి కబుర్లు”. సాయంత్రం మూడవ ప్రసారం లో ఆరు గంటల పది నిమిషాలకు వచ్చే ఈ అయిదు నిమిషాల లోకాభినారాయణం నాకు చాలా ఇష్టం. నండూరి సుబ్బారావు గారు, ఇంకొకరు ( పేరు గుర్తు లేదు..క్షమించాలి)ఏమండోయ్ బావ గారూ…రావాలి,రావాలి అంటూ ఆనాటి వార్తలు,విశేషాలు ముచ్చటించుకునేవారు.ఆ ముచ్చట్లు మన పక్కింటి బాబాయి,మామయ్య మాట్లాడుకున్నట్లు అంత సహజంగా ఉండేవి.
  -నేనుసైతం

  వ్యాఖ్య ద్వారా నేనుసైతం — అక్టోబర్ 23, 2007 @ 3:56 ఉద. | స్పందించండి

 11. లోకాభినారాయణం కాదు..లోకాభిరామాయణం.తప్పు దొర్లినందుకు పెద్దలు క్షమించాలి.

  వ్యాఖ్య ద్వారా నేనుసైతం — అక్టోబర్ 23, 2007 @ 3:59 ఉద. | స్పందించండి

 12. లోకాభినారాయణం కాదు..లోకాభిరామాయణం.తప్పు దొర్లినందుకు పెద్దలు క్షమించాలి.

  వ్యాఖ్య ద్వారా నేనుసైతం — అక్టోబర్ 23, 2007 @ 4:00 ఉద. | స్పందించండి

 13. బావుంది శ్రీరాం. మధురమైన సంగీతపు గూటికి సరసమైన పరిచయం .. హృదయోల్లాసంగా ఉంది.

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — అక్టోబర్ 23, 2007 @ 5:24 ఉద. | స్పందించండి

 14. నాకు ఇవి ఏవీ తెలీదు…అదే ఆకాశవాణి లో వచ్చే పాటలు వగైరా…. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు….

  వ్యాఖ్య ద్వారా Sowmya — అక్టోబర్ 23, 2007 @ 7:36 ఉద. | స్పందించండి

 15. మా విజయవాడ ఆకశవాణి ని చాన్నాళ్ళకి గుర్తు చేశారు.చదువుకునే రోజుల్లో బస్ లో వెల్తుంటే కండక్టర్ “ఆకాశవాణీ” అని అరవగానే ఒకసారి కిటికీ లోంచి చూసి ఆ ప్రాగణం లో నడుస్తున్నవాళ్ళు ఎవరై ఉంటారబ్బా అని ఒక ఆసక్తి కలుగుతూ ఉండేది.

  వ్యాఖ్య ద్వారా swathi — అక్టోబర్ 23, 2007 @ 10:09 ఉద. | స్పందించండి

 16. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!

  వికటకవిగారూ, ఔనండీ విజయవాడ ఇప్పటికీ ఒక పెద్ద పల్లెటూరులా అనిపిస్తుంది నాకు కొన్ని ప్రాంతాలలో.

  గిరిగారూ, హిందూస్తానీ రాగం అవ్వడంవల్ల అలా అనిపించి ఉండచ్చు. సాహిత్యం కూడా అటువంటిదే. కానీ ఘజల్ నిర్వచనానికి సరిపోతుందో లేదో సినారె గారు చెప్పాలి.

  నేనుసైతంగారూ, నెనర్లు.

  వంశీ గారూ, స్వాగతం. మీరు కూడా మాగంటి డాట్ ఆర్గ్ ద్వారా చాలా కృషి చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ప్రేరణ పొందుతూ ఉంటా నేను.

  ఊ.దం. గారూ, తెలియని విషయాలు చెప్పినందుకు నెనర్లు.

  బ్లాగేశ్వరుడు గారూ, కోటవారి హరికధలు మీరూ విన్నారన్నమాట.

  లలిత గారూ, మీ దగ్గర ఉన్నాయా ఇప్పటికీ ఏమైనా రికార్డింగులు? సురసవారికి అందజేస్తే అందరికీ ఉపయోగం.

  రానారె, ఈ సారి ఈ విషయం మీద నీ దగ్గరనుంచి చూస్తుంటాను. మంచిపాటలు గుర్తు చేసావు.

  గురువుగారూ, ధన్యోస్మి.

  సౌమ్య గారూ, మీకు నచ్చుతాయనే అనుకుంటున్నా. విని చూడండి.

  అబ్బో స్వాతిగారే! బహుకాల దర్శనం. మీ ఊరే వెళ్ళొచ్చాను. అప్పుడప్పుడు కాస్త రాస్తుండండి.

  వ్యాఖ్య ద్వారా Sriram — అక్టోబర్ 23, 2007 @ 6:36 సా. | స్పందించండి

 17. నవంబరు ఒకటో తేదీన ఐ.ఐ.ఐ.టి, హైదరాబాదులో బాలమురళీగారి మ్యూసిక్ ఎప్రీసియేషన్ అనే అంశం మీద రెండుగంటల ఉపన్యాసం ఉంది (సాయంత్రం నాలుగునుంచి ఆరుదాకా. ఉదయం సెంట్రల్ యూనివర్సిటిలో కచేరీనో, ఉపన్యాసమో ఉందనుకొంటా). అందరూ ఆహ్వానితులే అని విన్నా.
  హైద్రాబాదు పోదామా?
  ఉపన్యాసాన్ని వీడియో, ఆడియో రికార్డింగ్ చేస్తారట – సౌమ్యగారేమైనా వాటిని మనకందించగలరేమో మరి..
  –నాగరాజు (సాలభంజికలు)

  వ్యాఖ్య ద్వారా నాగరాజు — అక్టోబర్ 24, 2007 @ 9:17 సా. | స్పందించండి

 18. మంచి సమాచారం అందజేసారు. నేను రెడీ!

  వ్యాఖ్య ద్వారా Sriram — అక్టోబర్ 25, 2007 @ 4:58 సా. | స్పందించండి

 19. మిత్రకేసరీ, ఈ వ్యాఖ్య చదువు.

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — నవంబర్ 4, 2007 @ 12:33 ఉద. | స్పందించండి

 20. శ్రీరామా, కొత్త టపా కోసం కొత్త (ఆంగ్ల) సంవత్సరం దాకా ఆగాల్సిందేనా?

  వ్యాఖ్య ద్వారా Vookadampudu — డిసెంబర్ 19, 2007 @ 1:33 సా. | స్పందించండి

 21. ఊ.దం. మహాశయా, సంవత్సరంతో ఏమీ సంబంధం లేదు. ఊరికే ఉండకుండా, ఉపయోగించేదేదీ చెయ్యకుండా[:)]…కుక్కకి పనీలేదు తీరుబడీలేదన్నట్టు…. అలా…అలా…అదన్నమాట సంగతి.

  త్వరలోనే మీ అందరి దర్శనం బ్లాగుముఖం ద్వారా చేసుకోవాలనే నా కోరిక కూడా!

  వ్యాఖ్య ద్వారా Sriram — డిసెంబర్ 19, 2007 @ 2:41 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: