సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబర్ 26, 2007

పెళ్ళి తీర్చిన సమస్య!

కొంతమందికి పెళ్ళికాక సమస్య. చాలా మందికి పెళ్ళయ్యాకా ప్రతీదీ సమస్యే. మరి పెళ్ళివల్ల సమస్య తీరడం ఏమిటి అంటారా, నేను చెప్పేది లోకకళ్యాణం కోసం జరిగిన పెళ్ళిగురించి. అదే సీతారామకళ్యాణం.

అందుకే ఇప్పటికీ ఎవరికైనా సమస్యలొస్తే రాముడి గుడిలో కళ్యాణం చేయిస్తే తీరతాయి అని నమ్ముతారు. ఊకదంపుడుగారి దెబ్బకి నాకు కూడా నా బ్లాగులో ఇది జరపక తప్పలేదు. ఊకదంపుడు పేరే కానీ ఈయన పోటు చాలా గట్టిగా వేస్తారు. మచ్చుకి ఈయనిచ్చిన సమస్య చూడండి:

“ధరణీసుతగనెను పతిని తరుణుల మధ్యన్”

ఏకపత్నీవ్రతుడైన రాముడికి గట్టి పరీక్షే మరి. నేనేదో ఇలా తంటాలు పడ్డాను:

కం|| వరునిగ రాముని మిథిలలొ
      తరుణులు దీర్చగ సొగసులు తళుకుమనంగా
      మరగున అరవిరి గన్నుల
      ధరణీసుతగనెను పతిని తరుణుల మధ్యన్!

మిథిలలో రాములవారిని స్త్రీలందరూ కలిసి పెళ్ళికొడుకుని చేసారుట. సీతమ్మ వారు అరవిచ్చిన నేత్రాలతో చాటునుండి రామయ్యని ఆ స్త్రీల మధ్యలోంచి చూసారని కవిభావం. మరగున అంటే చాటున అనీ, ప్రేమతో అనీ కూడా అర్ధం చెప్పుకోచ్చు. ఇంకా పెళ్ళికాలేదు కదా అప్పుడే పతి ఎలా అయ్యాడంటారేమో, అప్పటికే ధనుర్భంగమూ వరమాలాధారణమూ అయ్యాయి కాబట్టి వాళ్ళిద్దరూ భార్యాభర్తల కిందే లెఖ్ఖ. ఐనా వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళాడేదేముందీ, మన ఛాదస్తం తప్ప. 

ఏమైనా ఊకదంపుడుగారీసారి కాస్త కరుణించారనే చెప్పాలి. క్రితంసారి ఈయన దెబ్బకి ఎక్కడాలేనిది శంతనుడి శోభనపు వర్ణన చెయ్యాల్సివచ్చింది నాకు. ఈసారి కాస్త పవిత్రమైన పనిని చేయించారు. ధన్యవాదాలండీ! నిద్రపోయిన నన్ను లేపిన చదువరిగారికి కూడా! 

ప్రకటనలు

41 వ్యాఖ్యలు »

 1. SahbhAsh!!

  వ్యాఖ్య ద్వారా teresa — సెప్టెంబర్ 27, 2007 @ 5:42 ఉద. | స్పందించండి

 2. శోభనం గదిలోకి లాగకుండా పెళ్ళిలోనే కార్యం జరిపించేశావన్న మాట. వాతలు “కీ”లెరిగి పెడుతున్నావని మరి ఊరికే అన్నారా?:-)

  హాస్యాలు పక్కన గానీ, ఈ పద్యం చాలా బాగుంది. లఘువుతో మొదలయ్యే కందం రాయడం కష్టం.

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — సెప్టెంబర్ 27, 2007 @ 6:34 ఉద. | స్పందించండి

 3. ఈ సమస్యను ఇటీవలే బ్లాగుల్లోనే ఎక్కడో చూశాను. శ్రీరామా, నీ సమయస్ఫూర్తికి జోహార్లు. పద్యం రాశామంటే రాశామనిగాక (నాలాగ), మంచి పద్యం రాశావు.
  (ఇప్పుడు రామాయణంలో పిడకలవేట: దీనిపైన కరుణానిధి కామెంటు రాస్తే ఎలా ఉంటుందో! 😉 ఆయన స్వతహాగా కవి అని విన్నాను.)

  వ్యాఖ్య ద్వారా రానారె — సెప్టెంబర్ 27, 2007 @ 11:09 ఉద. | స్పందించండి

 4. సీతా రాముల కళ్యాణం చాలా బాగా చేయించారు

  వ్యాఖ్య ద్వారా మాటలబాబు — సెప్టెంబర్ 30, 2007 @ 1:04 ఉద. | స్పందించండి

 5. @శ్రీరాం గారు,
  బానే కూర్చోపెట్టారు, బాలరాముడిని ఆడవాళ్ల మధ్య. నేను చెప్పాలనుకున్నది తెరస గారు, కొత్తపాళీ గారు చెప్పేశారు. పద్యం చాలా బాగుంది. ఉన్న కాస్త చింతల్లా – మొదటి పదం “వరునిగ”- నాలుగో పాదం లో – “పతి” లకి సరిపెట్టాటమెట్టా అని. దానీకీ మీరు గట్టి వివరణే ఇచ్చారు ..బహుశః మిధిలలో కాకుండా, పెళ్లి భద్రాచలం లో జరిపించి ఉంటే ఆ కాస్త వివరణా కూడా అవసరం ఉండేది కాదేమో.. నా సమస్య కి మీరు పూరణ ఎప్పుడు ప్రకటించినా, కొత్తాపాళీ గారు ఇటు రారేంటీ, ఈ పూరణ గురించి రెండు మంచి మాటలు చెప్పరేంటి అనుకునేవాడిని, ఈ సారి ఆ లోటు కూడా తీరింది.

  @రానారె గారు,
  అందరికీ, అన్నీ చూసే సదవకాశం ఉండదండీ, పెట్టిపుట్టాలి.. పొరపాటున ఇటు వైపు వస్తే బాల్యవివాహం కింద కేసు పెడతానంటాడు..
  ఐనా, వోటు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్ల గురించి, ఇంత మంచి టపాలో మాట్లాడటం కూడా పాపమేమో. ఏ దురహంకారిని తీసుకొచ్చి, ఆంధ్రా సియంని చేసినా నవమి నాడు నడుములొంచి భద్రాది వెళ్తాడు, స్వమతం ఏదైనా. అరవదేశం లోని వోటు రాజకీయాలకారణంగా ఈ మాటలు .. అంతే..

  వ్యాఖ్య ద్వారా vookadampudu — అక్టోబర్ 1, 2007 @ 12:47 సా. | స్పందించండి

 6. భేష్! పూరణ బాగుంది. (చెప్పొద్దూ.. నేనూ ప్రయత్నించాను -సీత లంకలో ఉండగా ఆమె మనసు విరిచేందుకు ‘రాముడు, చుట్టూ కాంతలతో కాలక్షేపం చేస్తున్నాడన్న భ్రాంతిని రావణుడు కలిగించాడ’నే ఊహతో) సొంతంగా పద్యం రాయడం కంటే సమస్యను పూరించడం కాస్తంత తేలిక అని నా ఉద్దేశ్యం. కానీ ఈ సమస్యను పూరించడంలో ఒక్క పాదం (అడుగు) కూడా ముందుకు పడలేదు. మీరు చక్కటి భావనతో, చక్కటి పద్యం చెప్పారు. రానారె అన్నట్టు.. పద్యం చెవడం కాదు, హృద్యంగా చెప్పడం గొప్ప!

  వ్యాఖ్య ద్వారా చదువరి — అక్టోబర్ 1, 2007 @ 1:49 సా. | స్పందించండి

 7. తెరెసా గారూ, మొదటగా మీ ఆశీర్వాదం పడ్డం వల్ల కాబోలు గురువుగారితో సహా అందరూ మెచ్చేసుకున్నారు 🙂 చాలా థేంక్స్!

  గురూగారూ, మీరు పద్యాన్ని ఓ పట్టాన మెచ్చుకోరు. అయాం సో హేపీ!

  రానారె, నెనర్లబ్బా!

  మాటలబాబు గారూ, ధన్యవాదాలు. మీరు కూడా మీ బ్లాగులో పూరణకి ప్రయత్నించడం చాలా ఆనందంగా ఉంది.

  ఊ.దం.గారూ ధన్యోస్మి! భద్రాచలంలో చేయించాలన్న ఆలోచన రాలేదండీ. ఈ సారి పోటు వెయ్యకుండా వదిలేసారు. పనిలో ఉన్నారో ఏమో!

  చదువరి గారూ, నెనరులు. మీ ఆలోచన చాలా బాగుంది. కాస్త చమత్కారంగా ప్రయత్నించారు మీరు. కాకపోతే ఇచ్చిన సమస్యలో కొంత చిక్కుంది. “పతినిగనె ధరణీ సుత…” అని మొదలయ్యి ఉంటే ముందరి పాదంలో “మాయా” అనో ఇంకోటో తగిలించెయ్యచ్చు. ఇక్కడ అది కుదరదు మరి. అందులోనూ కందం చిన్నది కదా, పెద్దభావనలు పట్టించడం కూడా కష్టం.

  వ్యాఖ్య ద్వారా Sriram — అక్టోబర్ 1, 2007 @ 3:31 సా. | స్పందించండి

 8. @చదువరి గారు,
  నిజానికి, ఈ సమస్యలో ఇంకో తేలికైన విరుపు ఉంది అని అనుకుంటున్నాను
  తరుణుల మధ్య ధరణీసుతను కూర్చుండబెట్టవచ్చు, నేను ప్రయత్నించాను చూడండి:
  శరణము కోరగ దశకం
  ధరుడు గడువిడిచనినంత, దశరధసుతునుం
  గరము ఒడిబడిన క్షణమున
  ధరణీసుతగనెనుపతిని తరుణుల మధ్యన్
  (రావణుడు గడువుపెట్టి వెళ్లిన తరువాత, (మారుతి చెట్టుపైనుండి విడువగా) తన వొడిలో రాముడి ఉంగరం పడగానే ఓ క్షణం పాటు – (రాక్షస) స్త్రీ ల మధ్య నున్న సీత రాముడిని దర్శించింది(ట).

  రావణుడు – రాముడు చుట్టూ కాంతలతో కాలక్షేపంచేస్తున్న భ్రాంతి కలిగించలేదు కానీయండి, మరణించాడని అబద్ధం చెప్పి రాముని రూపు పోలిన తల చూపించాడు, ఆ ఘట్టానికి కూడా ఈ సమస్యను అన్వయించవచ్చు..
  అలాగే, ఉత్తర రామాయణం లో అశ్వమేధమప్పుడు .. “సందేహింపకుమమ్మా”.. అన్నపుడు సీతశంకకు కూడా అన్వయించవచ్చు. మాటల బాబు గారు చెప్పిన సన్నివేశం చాలా బాగుంది. ఎటొచ్చీ చిన్ని మార్పులుచేసి, ఆ పద్యాన్ని కందచట్రంలో బిగించాలి.
  @శ్రీరాం గారు,
  పనిలో ఉన్న మాట వాస్తవమే కానీయండి, సమస్య కూడా సిద్ధంగానే ఉంది. పైగా చదువరి గారు ‘సమస్యలిచ్చువాడు’ అని చెప్పేశారు కాబట్టి, ఇంకా జంకవలసినపని కూడా లేదు.. కాకపోతే .. వేరే ఎవరైనా ఇస్తారేమో ఓ రోజు వేచి చూద్దాం.

  వ్యాఖ్య ద్వారా vookadampudu — అక్టోబర్ 1, 2007 @ 4:02 సా. | స్పందించండి

 9. ఊకదంపుడు గారూ, మీ విరుపుతో సమస్య కాస్త తేలిక పడ్డట్టే ఉంది. మీ పద్యమూ బావుంది. నేనూ కాస్త కష్టపడి పూరించాను..

  హరిపై మనసువిరిచి తా
  హరిసతి జేపట్టదలచి భ్రమ గల్పించెన్
  హరిరిపు మాయకు లోబడి
  ధరణీసుత గనెను పతిని తరుణుల మధ్యన్.

  వ్యాఖ్య ద్వారా చదువరి — అక్టోబర్ 1, 2007 @ 5:15 సా. | స్పందించండి

 10. తేడా జేసింది.. రెండో పాదంలో యతి తన్నింది. ముందు “హరిసతి జేపట్ట దలచి” బదులు “పరిణయ మాడతలచెను” అని రాసాను. అది మార్చాను గానీ, భ్రమను మరచాను. మళ్ళీ డ్రాయింగు బోర్డుకు వెళ్ళాలి. 😦

  వ్యాఖ్య ద్వారా చదువరి — అక్టోబర్ 1, 2007 @ 5:50 సా. | స్పందించండి

 11. కొద్ది సవరణలతో..
  హరిపై మనసు విరిచితా
  హరిసతి జేపట్ట దలచి అల్లెను జాలం!
  హరిరిపు మాయకు లోబడి
  ధరణీసుత గనెను పతిని తరుణుల మధ్యన్.

  వ్యాఖ్య ద్వారా చదువరి — అక్టోబర్ 1, 2007 @ 5:59 సా. | స్పందించండి

 12. ఊకదంపుడు, చదువరి గారల పూరణలు కూడా చాలా బాగున్నై.

  ఊద గారి పద్యంలో సంక్లిష్టమైన పాద విభజనని .. దశకం – థరుడు, సుతునుం – గరము .. అని సరసంగా సాధించడం మంచి చమత్కారం. సంక్లిష్టమైన పాద విభజన అంటే ఒక మాట పాదంతో పూర్తి కాకుండా తరువాత పాదంలోకి విస్తరించడం (నా నిర్వచనం). శ్రీరాముడు, చదువరి రాసిన పద్యాల్లో ప్రతి మాటా ఆయా పాదాల్లో ఒదిగి ఉన్నాయి, గమనించండి. సుతుని+ఉంగరము = సుతునుంగరము అవుతుందా అని తెలుగు వ్యాకరణం బాగా తెలిసిన వాళ్ళు చెప్పాలి కానీ, నాకు బాగానే ఉంది. ఇక సమస్యాపాదాన్ని సీత తానే తరుణుల మధ్య ఉన్నది అని అన్వయించడం ఈయన గడుసుదనం. పద్యం యధాలాభంగా చదివితే ఈ అన్వయం స్ఫురిస్తుందా అన్నది కొంచెం అనుమానమే. పూరణ పద్యాలకి వ్యాఖ్యానం తోడుండటం సహజమే కాబట్టి సరిపెట్టుకోవచ్చు. ఊద గారూ, పూరణలకి వ్యాఖ్యలు ఎందుకు రాయనో శ్రీరాముడికి బాగా తెలుసు 🙂 కానీ ఈ మూడు పద్యాలూ రాయిస్తున్నాయి.

  చదువరి గారి పద్యంలో .. ఘట్టంలో ఉన్న మూడు పాత్రలనీ “హరి”తో నిర్వచించి, పనిలో పనిగా ప్రాస సాధించడం మంచి చమత్కారం. ఈ సందర్భంలో బాగా పండింది, పూరణకి వన్నె తెచ్చింది. ఇటువంటి వాడుకలు పోతన భాగవతంలో కొల్లలుగా కనిపిస్తాయి. “మాయకు లోబడి” అనేప్పటికి ఒక చిన్న అపశృతి దొర్లింది. ఎట్లాగైతే రాముడు ఏకపత్నీవ్రతుడు అనే పాత్ర లక్షణాన్ని ఈ పూరణ సాధించడంలో గౌరవిస్తున్నామో, సీత మహా పతివ్రత అనే లక్షణాన్ని కూడా గౌరవించాలి. లేకపోతే పద్యంలో ఔచిత్యం దెబ్బతింటుంది. హరిరిపుడు సృష్టించిన మాయా దృశ్యంలో ఆవిడ చూసింది అంటే చాలు, మాయకు ఆవిడ “లోబడ”నక్కర్లేదు. చదువరి గారూ, అనతి కాలంలోనే కందం మీద మంచి పట్టు సాధించారు, ఈ చిన్ని సవరణ చెయ్యడం మీకొక పెద్ద సమస్య కాదనే అనుకుంటున్నాను.
  సమస్యా పరిష్కర్తలందరికీ అభినందనలు.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — అక్టోబర్ 1, 2007 @ 8:50 సా. | స్పందించండి

 13. ఇక్కడ సమస్యనిచ్చినవారూ పూరించినవారూ వ్యాఖ్యానించినవారూ అందరూ భక్తిభావంతో పద్యాలల్లారు. కాస్త భిన్నంగా ఉంటుందని ఇటీవలి వార్తల ఆధారంగా నేను మరొకలాగ సాహసించాను. ఇది మిమ్మల్ని నొప్పిస్తే దయతో నన్ను మన్నించాలి. కలతనిదురలో ఉన్న కరుణానిధి… రాముడు సురాపానం చేసి పరకాంతల మధ్య సీతమ్మ కంటబడ్డట్టుగా కలగన్నాడు… అనే ఊహతో హడావుడిగా ఒక కందం ప్రయత్నించాను.

  కరుణపయోనిధి ‘సురుడై’
  కరుణానిధి కలనుజేరి కలతనిదురలో
  జారపు ధవుడుగ మారగ
  ధరణీసుత గనెను పతిని తరుణుల మధ్యన్!

  వ్యాఖ్య ద్వారా రానారె — అక్టోబర్ 2, 2007 @ 2:52 ఉద. | స్పందించండి

 14. గత పద్యంలోని ఔచిత్యభంగాన్ని సవరిస్తూ..

  హరిపై మనసు విరిచి తా
  హరిసతి జేపట్ట దలచి అల్లెను జాలం!
  హరిరిపు జేసిన మాయన
  ధరణీసుత గనెను పతిని తరుణుల మధ్యన్.

  వ్యాఖ్య ద్వారా చదువరి — అక్టోబర్ 2, 2007 @ 2:08 సా. | స్పందించండి

 15. ఊ.దం గారూ, ఈసారికి వదిలేసి చూద్దాం అనుకున్నారన్నమాట. గురువుగారు చెప్పినట్టు మీ పూరణలో విరుపులు బాగున్నాయి. మీ ప్రత్యేకతే అది కదా!

  చదువరి గారూ, మీ పూరణా, దానికి మీరు అద్దిన మెరుగులూ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా “హరి” పదం పునరుక్తితో సాధించిన అందం. కానీ నాకు ఇంకొక ఈక పీకాలనిపిస్తోంది. “హరిరిపు” డనే నామవాచకం తర్వాతానూ, “తా” అనే సర్వనామం ముందూ వస్తోంది. ఇది ఓకేనా?

  గురువుగారూ, మీ వ్యాఖ్యలు చూసి పద్యంలోని గుణాలని ఎలా గుర్తించాలో తెలుసుకోవచ్చు. నెనరులు.

  రానారె, నీకు మంచి కామెడీ ఆలోచన వచ్చింది. కానీ పద్యం మొదటిపాదంలో కవి భావం ఏమిటీ అని?

  వ్యాఖ్య ద్వారా Sriram — అక్టోబర్ 2, 2007 @ 3:39 సా. | స్పందించండి

 16. తా అనే సర్వనామం ముందు రావడం ఓకేనే. కానీ మంచి పాయింటు.

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — అక్టోబర్ 2, 2007 @ 4:21 సా. | స్పందించండి

 17. చదువరిగారి ఫైనల్ సవరణ బ్రహ్మాండంగా ఉంది!

  వ్యాఖ్య ద్వారా teresa — అక్టోబర్ 2, 2007 @ 6:47 సా. | స్పందించండి

 18. పోతన భాగవతం నుండి … నరహరి శాంతింప జేయమని దేవతలు లక్ష్మీ దేవిని కోరిన వైనం

  హరికింబట్టవు దేవివి
  హరిసేవా నిపుణమతివి హరిగతివి సదా
  హరిరతివి నీవు సని నర
  హరి రోషము డింపవమ్మ హరివరమధ్యా

  ఊకదంపుడు గారు చెప్పిన పద్యానికి సంబంధించిన సన్నివేశం వాల్మీకి రామాయణం సుందరకాండ నుండి

  వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః
  రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం

  ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా
  సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి

  గృహిత్వాప్రేక్షమాణా సా భర్తుః కరవిభూషణమ్
  భర్తారమివ సంప్రాప్తా జానకీ ముదితా భవత్

  వ్యాఖ్య ద్వారా బ్లాగేశ్వరుడు — అక్టోబర్ 3, 2007 @ 2:20 ఉద. | స్పందించండి

 19. రాముడిని ‘కరుణాపయోనిధీ!’ అన్నాడు కదా దాశరథీ శతకకర్త కంచెర్లగోపన్న. నేను కరుణపయోనిధీ అన్నాను. దేవుడు రాముని రూపాన మానవుడై పుట్టి నాడంటారు కదా. ఆ మానవుడే కరుణానిధి చెప్పినట్లు సురాపానం చేసి (మస్తుగా తాగి) సురుడైనాడని … 🙂

  వ్యాఖ్య ద్వారా రాముడు — అక్టోబర్ 3, 2007 @ 4:09 ఉద. | స్పందించండి

 20. ఊక’దంపుడు’గారు కాస్త తెరపి ఇచ్చారు గనక, ఈసారి సమస్యను నేనిస్తున్నాను: “తాటక తనయుడు కర్ణుడు.” కందపద్యం కావాలి.

  వ్యాఖ్య ద్వారా రాముడు — అక్టోబర్ 3, 2007 @ 4:17 ఉద. | స్పందించండి

 21. తాటకి లేక తాటక

  వ్యాఖ్య ద్వారా బ్లాగేశ్వరుడు — అక్టోబర్ 3, 2007 @ 4:31 ఉద. | స్పందించండి

 22. […] ఈ టపా చూసిన తరువాత బ్లాగేశ్వరునికి ఎలా […]

  పింగ్ బ్యాక్ ద్వారా తూగులయ్య పదాలు « ఊక దంపుడు — అక్టోబర్ 11, 2007 @ 5:28 సా. | స్పందించండి

 23. శ్రీరాం గారు,
  బావున్నాయి మీ పద్యాలు..ఒక టపా తీగ కదిలిస్తే డొంక కదులుతోంది మీరు పొందుపరిచిన లంకెల వల్ల, తీరికగా వచ్చి మళ్ళి చదువుతాను. తెనాలిరామకృష్ణుడి మీద మీరు రాసిన టపా కూడా బావుంది. ఆక్కడ ఉంచిన పూరణ నేను రాఘవ గారి సైట్లో ఇంత క్రితమే చూసాను.

  ఇవీ, రాఘవగారి పద్యాలూ చదువుతుంటే ఒక పక్క ఆనందము, మరో పక్క తెలుగు పదజాలం పెంచుకోవాలనే ఆత్రమూ కలుగుతున్నాయి. నెనరులు!

  గిరి

  వ్యాఖ్య ద్వారా Giri — అక్టోబర్ 18, 2007 @ 8:52 సా. | స్పందించండి

 24. చదువరి గారు,
  మీరెవరోగానీ సామాన్యుడిలాలేరే !!! మరి దీని సంగతి చూడండి:
  చంద్రుడు కన్నుగొట్టెనని స్వామికి జెప్పెను గౌరి కోపమున్

  వ్యాఖ్య ద్వారా vookadampudu — మే 4, 2008 @ 4:44 సా. | స్పందించండి

 25. మిమునేనన్నాననికో
  పముతోనన్నీసమస్య బంధము నందుం
  చిమురియుదురె! సరి, తమ “పా
  దము”తో తల బాదుకునయినను పూరింతున్!

  వ్యాఖ్య ద్వారా చదువరి — మే 4, 2008 @ 6:09 సా. | స్పందించండి

 26. రెండు సమస్యలకీ నా పూరణలు:

  వరసోదర మధ్యమ్మున
  ధరణీసుత గనెను పతిని, తరుణుల నడుమన్
  ధరణిజను జూచె రాముడు
  సరసపు పూబంతులాట సందర్భమునన్!

  ఆంధ్రుల పిండివంటలవి యద్భుతమంచును పొట్ట నిండ కుం
  భేంద్ర ముఖుండు ప్రీతి భుజియింపగ జూచుచు గేలిసేయుచూ
  సంద్రపు బిడ్డ, మీరు మనసారగ నెత్తిని బెట్టుకొన్న ఆ
  చంద్రుడు కన్నుగొట్టెనని స్వామికి జెప్పెను గౌరి కోపమున్!

  వ్యాఖ్య ద్వారా కామేశ్వర రావు — మే 5, 2008 @ 8:38 సా. | స్పందించండి

 27. రెండో పూరణలో చిన్న సవరణలు:

  ఆంధ్రుల పిండివంటలవి యద్భుతమంచును బొజ్జ నిండ కుం
  భీంద్ర ముఖుండు ప్రీతి భుజియింపగ, జూచుచు గేలిసేయుచూ
  సంద్రపు బిడ్డ, మీరు మనసారగ నెత్తిని బెట్టుకొన్న ఆ
  చంద్రుడు కన్నుగొట్టెనని స్వామికి జెప్పెను గౌరి కోపమున్!

  వ్యాఖ్య ద్వారా కామేశ్వరరావు — మే 5, 2008 @ 10:24 సా. | స్పందించండి

 28. ఊ.దం. గారి పోటు మళ్ళీ మునుపటి ధాటి తో పడింది. చదువరి గారన్నట్టు, పాదం తో తలబాదుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అనుకున్నాను కానీ ఈయన విశ్వామిత్రుడు, భృగుమహర్షి కాదు.
  నేనైతే గురుభ్యోన్నమః అనేసి కూచుంటాను, ఏమైనా తడుతుందేమో…

  కామేశ్వర రావు గారూ, మీ పూరణలు నా పుస్తకంలో రాయడం అదృష్టమే. అందులో, మొదటి సమస్య నడ్డి విరవడం మంచి సొగసుగా ఉంది, రాముడు చేసిన ధనుర్భంగాన్ని గుర్తుకు తెస్తూ…ధన్యవాదాలు.

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 6, 2008 @ 10:34 సా. | స్పందించండి

 29. అయితే రెండో పూరణ అంతగా నచ్చలేదా:-) రెండో సమస్యకి మరొక పూరణ ఆలోచించాను కానీ, చాలామంది అలానే చేస్తారేమో కొద్దిగా వెరయిటీగా ఉంటుందని ఇలా చేసాను. చూద్దాం… మీరూ, చదువరిగారూ మీ పూరణలని రాసిన తర్వాత, నేనా రెండో పూరణని చెప్తాను.

  వ్యాఖ్య ద్వారా కామేశ్వరరావు — మే 7, 2008 @ 12:46 ఉద. | స్పందించండి

 30. హమ్మయ్య, ఓ పద్యాన్ని కుట్టగలిగాను.

  చంద్రుడు కన్నుగొట్టెనని స్వామికి జెప్పెను గౌరి కోపమున్
  సంద్రము రూపుదాల్చెనిట జాహ్నవి నీరము చిమ్ముచుండ, నా
  గేంద్రు విషాగ్నులా కొసన గ్రీష్మము మించెను -రెప్పలార్చ నా
  ఇంద్రుని కైన తప్పదని ఇందుడు వేడెను ఈశునాలినిన్

  వ్యాఖ్య ద్వారా చదువరి — మే 10, 2008 @ 1:00 ఉద. | స్పందించండి

 31. కామేశ్వర రావు గారూ, మీ పద్యపు ధారలో వంకలు పెట్టే సాహసమే? కానీ మీరు చెప్పిన పూరణ “కన్ను కుట్టడానికైతే” ఇంకా బాగుంటుంది అనిపించింది.
  ఐనా మీ రెండో పూరణ ఏంటో త్వరగా శలవియ్యండి, ఉత్సాహంగా ఉంది…

  అబ్బో చదువరి గారూ మీ వృత్తాలు చదవడం ఇదే మొదలు…మంచి ధారలో వచ్చింది. అసలు దేవతలని అనిమిషులు అని అంటారు కదా…అంటే రెప్పలు పడని వాళ్ళు అని. మీ నాల్గవ పాదం లో మరి ఏమిటీ చమత్కారం! 🙂

  అయ్యా, ఊ.దం. మహాశయా! ఎక్కడ మీరు?

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 11, 2008 @ 12:29 సా. | స్పందించండి

 32. చదువరిగారు కూడా సంసారపక్షంగా, కళ్ళు చెమర్చాయని చంద్రునిచేత సంజాయిషీ ఇప్పించేసారు. పైగా ఇంద్రునికైనా తప్పదట! అతనసలే సహస్రాక్షుడాయె, ఎంతమందికైనా ఒకే సారి కొన్నుగొట్టగల ఘనుడు:-)
  అయినా, అమ్మాయికి కొన్నుకొట్టేడంటే కాని మీరు సంతృప్తి పడేట్టులేరే;-) సరే అయితే, ఇదుగో ఆ పూరణ.

  ఇంద్రుని కొల్వులో వినుతికెక్కిన ధీమహిమాన్వితుండు, మౌ
  నీంద్రుడు నా బృహస్పతి వరించిన దారను, దార గాంచి దా
  సంద్రపు బిడ్డ మీరు మనసారగ నెత్తినపెట్టుకొన్న ఆ
  చంద్రుడు కన్నుకొట్టెనని స్వామికి జెప్పెను గౌరి కోపమున్!

  వ్యాఖ్య ద్వారా కామేశ్వరరావు — మే 11, 2008 @ 5:05 సా. | స్పందించండి

 33. శ్రిరాం గారు, నా సమస్య పోటు కన్నా, మీ వ్యాఖ్యా పోటు ఇంకా ధాటిగా ఉంది. దెబ్బకి గర్వ భంగమైంది. 🙂
  మీరు చెప్పినట్టు, నా సమస్య(ల)కు కామేశ్వరరావు గారు పూరణ ఇవ్వటం అదృష్టం.
  కామేస్వర రావు గారి రెండు పూరణ లు బావున్నాయి…
  నాలుగో పాదం లొ చంద్రు”డు” తెలుగు వాడే కాబాట్టి, ఆంధ్రుల పిండివంటలని మొదలు పెట్టటం బాగుంది.
  ఇక చదువరి గారి పూరణ చమత్కారం గా ఉంది. ఇక్కడ కూర్చొని నేను పడుతున్నా బాధలు ఏమిచెప్పమంటావు తల్లీ అనటం చమత్కారం. ఇక్కడ కూర్చుంటె ఇందృడైనా రెప్పలారుపుతాడు అనటం మంచి అభివ్యక్తి. చూడవలసిన విషయాలేమిటి అంటే, 1. అగ్ని గ్రీష్మతాపం లా ఉంటుందా, గ్రీష్మతాపం అగ్ని లా ఉంటుందా అని..
  2. కామేశ్వర రావు గారు చెప్పినాట్టు ఆయన సంద్రపు బిడ్డ, జాహ్నవి నీల్లు చిమ్మి సముద్రపు రూపు దాలిస్తే ఆయని సంతోషమే కదా?

  ఐతే, రెండు విరుద్ధ కారణాల వల్ల కాల్లు ఆర్పుతున్నాను తల్లీ – నా ప్రమేయం ఏమి లేదు అని అనటం నాకు నచ్చింది, నేనూహించని పూరణ ఇది.
  ఐటే, దీనిని కొత్తపాళి గారు పరిశీలించవలసి యున్నది. మళ్లి ఔచిత్యభంగం ఆంటారేమో. కామేశ్వర రావు గారి పూరణ చూడండి , ఆ కన్నుకొట్టాతాన్ని జరిగిన సన్నివేశానికో, తారకో ముడి పెట్టారు, కానీ చదువరి గారు గౌరీ దేవీ ఫిర్యాదు చేసినట్టే చెప్పారు. ఇది ఎంతవరకు సబబనెది ప్రశ్న.
  మొత్తానికి మంచి పూరణలే రాబట్టుకున్నాను. మీ పూరణ కూడా చూసి స్పందిద్దామనుకున్నాను కానీ, మీరు అవకాశం ఇచ్చేటట్టు కనపడటం లేదు.
  ఇదంతా తెలుసుకొనే ప్రయత్నం లో చెప్పిందె కాని, తెలిసి చెప్పింది కాదు.
  భవదీయుడు.
  ఉదం

  వ్యాఖ్య ద్వారా Vookadampudu — మే 11, 2008 @ 7:31 సా. | స్పందించండి

 34. అసలు కష్టపడకుండా, బుఱ్ఱని పెద్దగా వేడెక్కించకుండా,చదువరిలా చమత్కరించకుండా, కామేశ్వర రావుగారిలా ప్ర్రజ్ఞ కురిపించకుండా వ్రాసాను – చివరి రెండు నే నసలు సాధించగలనో లేదో అనే ప్రశ్నని మీరు అడగకుండా – నేను లాగించేసిన పూరణ చదవండి..నన్ను తూలనాడకండి 🙂

  చంద్రుడు, స్వామి, గౌరియను చక్కని చుక్కను చేర ప్రేమతో,
  చంద్రుని కయ్యె చుక్కెదురు, స్వామికి ఠక్కున చిక్కె మక్కువల్;
  చంద్రుని చెంప ఛెళ్ళుమన, సంగతి యేమని స్వామి వేడగా
  చంద్రుడు కన్నుకొట్టెనని స్వామికి చెప్పెను గౌరి కోపమున్

  వ్యాఖ్య ద్వారా Giri — మే 11, 2008 @ 9:27 సా. | స్పందించండి

 35. హ హ్హ హ్హ.. అన్నీ ఛాలా బావున్నై!!!
  కామేశ్వర్రావు గారూ, మునుపటి భువన విజయంలో చదువరి గారు వదు మొర్రో అంటే అల్ల”సాని” పీఠం మీద బలంతంగా కూర్చోబెట్టాము. ఇహ మీదట మాత్రం ఆ పీఠం మీదే 🙂

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — మే 14, 2008 @ 9:20 ఉద. | స్పందించండి

 36. అలా అయితే (మిగతావాటి సంగతెలా ఉన్నా…) రమణీ, ఆ రమణి ప్రియదూతిక తెచ్చి ఇచ్చే కప్పురవిడెమూ ఏర్పాటు చెయ్యాల్సుంటుంది మరి, చూసుకోండి:-)

  వ్యాఖ్య ద్వారా కామేశ్వర రావు — మే 14, 2008 @ 9:37 సా. | స్పందించండి

 37. కామేశ్వర రావు గారు,
  అంతేనా లేక ఉయ్యాల మంచము కూడ 😉 ఎర్పాటు చేయమంటారా?

  వ్యాఖ్య ద్వారా గిరి — మే 16, 2008 @ 6:39 ఉద. | స్పందించండి

 38. అసలేం జరిగిపోతోందిక్కడ? నేను ఎక్కడ ఎప్పుడు ఎలా తప్పిపోయానో తెలియడంలేదు. ప్చ్.

  అలాగే, కామేశ్వరరావుగారు అల్లసానివారైతే మాకూ సంతోషమే. మాకూ పిలుచుకోవడానికి ఒక “తాత” దొరికినట్టే! ఏమంటారు వికటకవీశా?

  ఇక సమస్యలా… అందరూ పూరించేశాక నాకేం మిగిలింది? అయినా వేరే పూరణలకై ప్రయత్నిస్తాను. త్వరలో పూరించే భాగ్యం కలగాలని మా రామచంద్రమూర్తిని ఒకసారి తలచుకొని మనసారా పూజించి ప్రారంభించాలి.

  వ్యాఖ్య ద్వారా రాఘవ — మే 16, 2008 @ 12:19 సా. | స్పందించండి

 39. రాఘవ గారు,
  భారతదేశం లో సమస్యలకి కొదవా? ఇది చూడండి

  గ్రహమునునిలిపె ప్రజగనగ కాంతామణియే

  వ్యాఖ్య ద్వారా vookadampudu — జూన్ 15, 2008 @ 4:28 సా. | స్పందించండి

 40. సమస్య నా మృత్తికామస్తిష్కానికి అర్థం కాలేనట్టుంది… కొంచెం వివరిద్దురూ.

  వ్యాఖ్య ద్వారా రాఘవ — జూన్ 15, 2008 @ 11:35 సా. | స్పందించండి

 41. రాఘవ గారు,
  ఐతే అది నా తప్పే.
  చూడండి నా మహిమ అని ఓ మహిళ ఇట్టాంటి
  (http://nagamurali.wordpress.com/2008/06/06/%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%a1%e0%b0%82/)
  గ్రహాన్ని ఒకదాన్ని స్తంభింపచేసిందిట మరి.

  గ్రహమును నిలిపె, ప్రజగనగ, కాంతామణియే!

  వ్యాఖ్య ద్వారా vookadampudu — జూన్ 21, 2008 @ 4:23 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: