సంగతులూ,సందర్భాలూ….

ఆగస్ట్ 23, 2007

ఇత్యర్ధలు కూరా, ఇతిభావలు పులుసూ…

అనగనగా గోదావరీ తీరాన ఒక గ్రామంలో ఒక వేదపండితుడు. మహా జ్ఞాని. పొద్దునే లేచి స్నానం,సంధ్యా కానిచ్చి అనుష్ఠానం,స్వాధ్యాయం(సెల్ఫ్ స్టడీ) చేసుకోడం – ఆ తర్వాత విద్యార్ధులకి వేదమూ, “ఇత్యర్ధః (ఇదీ దీని అర్ధం), ఇతి భావః (ఇదీ దీని భావము)” అంటూ దానికి అర్ధమూ పాఠాలు చెప్పుకోడం – ఇదీ ఆయన దైనందిక జీవితం.  

ఉన్న కాస్త భూమిలో పండే గింజలూ, పెరట్లో పండే కూరలూ ఆ కుటుంబానికి భోజ్యం.

ఎప్పుడూ బయటకెళ్ళి రూపాయి సంపాదించిన వ్యక్తి కాదు. ఆయనకి అవసరం కూడాలేదు.

కానీ భార్యకి మాత్రం కాస్త బాధగా ఉండేది. ఔను మరి ఇంట్లో ఏ పూటకి ఏముంటుందో కూడా తెలీదు, ఈవిడేగా అవన్నీ పడవలసింది. ఆయనకేమీ పట్టదాయె.

ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఇంటిల్లాలు వాకిట్లో ముగ్గు వేస్తుండగా మన పండితులుంగారు సరసంగా అరుగుమీద నిలబడి “ఈ పూట వంటకాలేమిటోయ్” అంటూ ప్రశ్నించారు. మంచి విసుగులో ఉందేమో ఆవిడ, ” ఏముందీ, ఇత్యర్ధలు కూరా ఇతిభావలు పులుసూ” అని పెడసరంగా సమాధానం చెప్పిందిట. 

పాపం ఈయనకి కలుక్కుమంది. ఔరా! భార్య చేత ఇంత మాట పడ్డాను కదా అనుకుని, దగ్గరకు పిలిచి – నీకేవో కోరికలున్నట్టున్నాయి, ఏం కావాలో చెప్పమని అడిగాడుట. పాపం ఆ వెర్రి ఇల్లాలు చేతులో ఉన్న ముగ్గు చెంబు ఈయన చేతిలో పెట్టి దీన్నిండా బంగారపు కాసులు తెచ్చిపెట్టండి, ఇంకేమీ అడగను అన్నదిట.

సరే అని మర్నాడు ఆ ముగ్గు చెంబుతో బయల్దేరాడీయన. రాజధానికి వెళ్ళేసరికి అక్కడ రాజుగారు ఏదో సమస్యలో ఉన్నారు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకున్న సమయంలో ఈయనకున్న శాస్త్రజ్ఞానాన్ని అన్వయించి ఇట్టే చిక్కుముడి విడగొట్టాడు.

రాజుగారు ఉబ్బితబ్బిబ్బై ఏం కావాలో కోరుకోమన్నారు. ఈయన వెంటతెచ్చిన ముగ్గు చెంబు రాజుగారి చేతిలో పెట్టి దీన్నిండా బంగారు కాసులు కావాలి అని అడిగాడు. రాజుగారు ఇదేం కోరికయ్యా ఏ అగ్రహారాలో కోరుకోక అని అనేసరికి ఈయన మహాప్రభో! ఇది నా భార్య కోరిక గానీ నాకేమీ కోరికలు లేవు అని చెప్పి ఆ చెంబుడు కాసులు పట్టుకొచ్చి భార్యకిచ్చాడుట.

ఇది చిన్నప్పుడు విన్న కధ. ఈ వారం ఈనాడులో వేదాన్ని తెలుగులో అనువదించిన దాశరధి రంగాచార్యులు గారి గురించిన వ్యాసం చదివినప్పుడు ఇది మళ్ళీ గుర్తొచ్చింది.

ఈ కధలో వినడమే కాదు, నేను ప్రత్యక్షంగా చూసిన చాలా మంది వేదపండితులు “ఇత్యర్ధలు కూర, ఇతిభావలు పులుసూ” గా కాలక్షేపం చేసిన వాళ్ళే.

అందుకే, దాశరధిగారు ఆయన అనువాదం ఎందుకు చేసానో చెప్తూ, “వేదం ఒక వర్గానికి ఉపాధి, అందులో ఆధిపత్యం పోతుందని భయం” కనకనే అందరికీ వేదం నేర్పలేదంటూ చేసిన వ్యాఖ్యలు నన్ను కాస్త బాధ పెట్టాయి.

నా అభ్యంతరమల్లా, వేదం జీవనోపాధికి మార్గమా అని? వేదపండితులంటే పెళ్ళిళ్ళు చేయించే పురోహితులూ, ఆలయాల్లో అర్చకులూ కాదే! ఈ సంగతి ఆచార్యుల వారికి తెలియదా?  కేవలం వేదాధ్యయనం వల్ల ఎటువంటి డబ్బు సంపాదన చెయ్యగలరు?

ప్రతిచోటా మంచీ చెడూ ఉంటాయి. మనసంస్కృతి కూడా అంతే. కానీ నేను గర్వపడే విషయాల్లో మన సత్సంప్రదాయాల్లో ముఖ్యమైనది ఒకటుంది. జ్ఞానము, అన్నము – ఈ రెండింటినీ అమ్ముకోడం పాపం. మనదేశంలో జరిగినంత విద్యాదానం, అన్నదానం ప్రపంచంలో ఎక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

మరి వేదమంటే కేవలం జ్ఞానమే! దానిని డబ్బు సంపాదనకి వాడడం మన పూర్వీకులు మహాపరాధమని భావించారే! అలాంటి వేదాన్ని జీవనోపాధి అనడం సబబు కాదని అనిపించింది. 

వేదాన్ని అందరికీ బోధించకపోడానికి ఏమి కారణమో నాకు ఖచ్చితంగా తెలీదు. నా అభిప్రాయం ఇదివరకు ఒకసారి రాసాను. వేదపండితులంతా చెడ్డవాళ్ళూ, బిల్ గేట్స్ లాంటి వాళ్ళూ అని అన్నా నేను అది ఆయన అభిప్రాయం అని ఊరుకుందును. కానీ వేదవిద్య ఇలా డబ్బు సంపాదనకి మార్గం కాదని మాత్రం చెప్పగలను.   

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః   

ప్రకటనలు

16 వ్యాఖ్యలు »

 1. తేనెతుట్టెను కదిపావా శ్రీరామా,

  ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట కొందరికి అప్పటి వర్ణ వ్యవస్థలో వేదాధ్యయన అర్హత నిరాకరించారని ఇప్పుడు అందరికీ ఆ అర్హత కల్పించారుకదా. కానీ మీ తాతగారు చెప్పినట్లు, ఆ అర్హతకి కేవలం అక్షరాలు చదివటం వస్తే సరిపోదు. సవాలక్ష ఇతర నియమాలున్నాయి, తినే తిండి, ఆచారాలు, మడి, మైలలు, చేసే పనులు వగైరా … అప్పటి రోజుల్లో ఆ నియమాలకో అర్థం ఉండేది. ఎందుకంటే ఈ మంత్రాలు అన్నీ యజ్ఞ యాగాదుల్లో ఉపయోగించేవాళ్ళు కదా. కానీ ఇప్పటి అవసరం కేవలం ఏముందో తెలుసుకోవటం వరకే. ఇదివరకు చదవనీయలేదు కనక ఇప్పుడు చదవాలన్న కోరిక వరకే. కాబట్టి ఎవరు చదివినా పెద్దగా ఒరిగేదేమీలేదు.

  అయినా శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు, కొందరు కొన్ని పనులు చేయాలి అని నా అభిప్రాయం. నాకు కులం, మతం పట్టింపు లేదు. అన్ని రకాల స్నేహితులూ ఉన్నారు, అయినంత మాత్రాన “సత్యనారాయణ వ్రతం” చేసుకోవాలంటే, నేను ఖచ్చితంగా బ్రాహ్మణుడితోనే జరిపిస్తాను. దానికి నేను పైన చెప్పిన కొన్ని కారణాలున్నాయి.

  ఇక వేదాలు, ఉపాధి అంటావా, నేను నీతో ఏకీభవిస్తున్నా. సోషలిజానికి, వేదానికీ పెట్టిన అసంబధ్ధమైన లింకు లాగానే ఉంది ఈ పాయింట్.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 23, 2007 @ 4:08 ఉద. | స్పందించండి

 2. మీరు చెప్పినదానితో, నేను పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను.. దాశరధి వారు అన్న “వేదం ఒక వర్గానికి ఉపాధి, అందులో ఆధిపత్యం పోతుందని వారి భయం” అనే దాన్ని డబ్బు సంపాదించే భావం లో చూడకూడదు అని అనిపిస్తుంది.. అక్కడ డబ్బు సంపాదించడం కన్నా, వాళ్ళ గొప్పతనం కోల్పోవడం అని.. అందరికి తెలిసిన పని చేస్తే గొప్ప ఏమీ లేదు.. నలుగురికి తెలియనిది చేయడమే గొప్ప.. పూర్వ కాలం లో, వేదం తెలిసిన వాళ్ళని చాలా గౌరవించే వారు.. వాళ్ళు డబ్బు సంపాదించే వాళ్ళా కాదా అనేది అప్రస్తుతం.. నాణేనికి రెండు వైపులు ఉంటాయి.. ఎంతో విద్వత్తు ఉన్నవాళ్ళలో,”ఇత్యర్ధలు కూరా ఇతిభావలు పులుసూ” అని ఉన్నవాళ్ళు ఉన్నారు, అలా కాకుండా దాన్ని కేవలం వాళ్ళ వర్గ ఆధిపత్యంగా భావించే వాళ్ళు ఉన్నారు..దీనికి ఉదాహరణ, మా తాతయ్య గారు, మొదటి రకానికి చెందిన వారు, అదే కుటుంబం లో పుట్టిన, మా మామయ్య గారు రెండవ రకానికి చెందిన వారు..

  వ్యాఖ్య ద్వారా medha — ఆగస్ట్ 23, 2007 @ 9:32 ఉద. | స్పందించండి

 3. వికటకవిగారూ, తేనెతుట్ట కదిలించే ఉంది. నేనూ ఒక రాయి వేసానంతే 🙂
  మీ వ్యాఖ్యకి కృతజ్ఞతలు.

  మేధ గారూ, స్వాగతం.
  మీరు చెప్పినదానితో నేనూ ఏకీభవించలేకపోతున్నా. ఉపాధి అన్నమాటకి జీవనాధారం అన్న అర్ధం మాత్రమే ఉంది. “గౌరవం కోల్పోవడం” అన్న అర్ధంలో ఎలా తీసుకోమంటారు? క్షమించాలి. నేను ఒప్పుకోలేను.
  పూర్వకాలంలో అందరికీ అన్ని పనులూ తెలియవండీ. ఎవరిపని వాళ్ళే చేసేవారు. అందుచేత ఎవరిగొప్ప వాళ్ళదే.
  నాణేనికి రెండు వైపులే ఉంటాయి. మనుషుల్లో నలభై రకాలుంటారు. అది కాదు ఇక్కడ విషయం. వేదవిద్య అనేది ధనార్జనకి సంబంధించినది కాదు అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నది. మీరు చెప్పిన విషయాలగురించి ఎన్ని రోజులైనా చర్చించవచ్చు. అది సుఖసుఖాల తేలే విషయం కాదు. నేను చర్చించదలచిన విషయం కూడా కాదు.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 23, 2007 @ 11:03 ఉద. | స్పందించండి

 4. ఎప్పుడైతే వాణిజ్య దృక్పదం ప్రవేశిస్తుందో దాని అసలు ఉద్దేశ్యం మరుగున పడుతుంది…వినాశనం అక్కడినుంచే మొదలవుతుంది

  ఈ వేద విద్య ను మనలో ఎంత మంది నేర్చుకున్నాం,మన పిల్లలకు నేర్పిస్తాం..
  చాలా తక్కువ శాతం,నేర్చుకున్నా అది మనకు ఆశక్తి వల్లే
  దాని వల్ల ఏదో ఆదాయం వస్తుందా,రాదా అన్న తర్కం మొదలైంది
  commercialisation has overtaken the very purpose
  నేను చెప్పేది ఏంటి అంటే…ఏదైనా విద్య ను కేవలం దాని కోసం నేర్చుకోండి,దాని వల్ల ఏదో వస్తుంది అన్న కోణం నుంచీ కాదు
  ఈ ఙ్ఞానసముపార్జన వ్యాపరం కాదు…..బార్టర్ పద్ధతీ కాదు….

  వ్యాఖ్య ద్వారా Lalitha Sravanthi — ఆగస్ట్ 23, 2007 @ 11:24 ఉద. | స్పందించండి

 5. కం. వేదము జదివిన జాలునె?
  మాదాకవళంబటంచు మన్నగ తగునే?
  వాదము వ్యర్ధము రయమున
  శ్రీదేవిని చేత బట్ట చింతలు దీరున్! 🙂

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — ఆగస్ట్ 23, 2007 @ 6:19 సా. | స్పందించండి

 6. స్రవంతి గారూ, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  గురూజీ, పురాణాలూ పుస్తకాలూ అని తిరుగుతున్న త్రివిక్రముడికి మీరేనా ఈ సలహా ఇచ్చింది? 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 23, 2007 @ 7:29 సా. | స్పందించండి

 7. ఎబ్బే, ఆయన నా సలహా ఏం లేకుండా స్వయంప్రపత్తితోనే సాధించిన ఘనకార్యమది. శుభలేఖ చూశాక ఆ పాదం నా మదిలో మెరవటం నిజం.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఆగస్ట్ 23, 2007 @ 10:08 సా. | స్పందించండి

 8. కూడలిలో ఈ కందపద్యం చూసి ఇది త్రివిక్రముడి బ్లాగులో రాశారేమో అనుకున్నాను. ఇంతకీ పద్యం కొత్తదేనా గురూగారూ?

  వ్యాఖ్య ద్వారా రానారె — ఆగస్ట్ 23, 2007 @ 10:30 సా. | స్పందించండి

 9. రాంనాథా, ఆహా, అది మనకవిత్వమే! 🙂

  వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — ఆగస్ట్ 24, 2007 @ 3:34 ఉద. | స్పందించండి

 10. “అయినా శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు, కొందరు కొన్ని పనులు చేయాలి అని నా అభిప్రాయం. నాకు కులం, మతం పట్టింపు లేదు. అన్ని రకాల స్నేహితులూ ఉన్నారు, అయినంత మాత్రాన “సత్యనారాయణ వ్రతం” చేసుకోవాలంటే, నేను ఖచ్చితంగా బ్రాహ్మణుడితోనే జరిపిస్తాను.”

  వికట కవి గారూ, మీ మాటకు చేతకూ పొంతన కుదరటం లేదండి.
  కులం, మతం పట్టింపు లేదంటూనే “సత్యనారాయణ వ్రతం” బ్రాంహ్మణుడితోనే చేయించుకుంటాను అనడం ఏమిటండి? “బ్రాహ్మణుడు” అంటే మీ వుద్దేశ్యంలో ఏ కులంలో పుట్టినా “బ్రాహ్మనాచారాలు” పాటిస్తున్నవాడు అనా? లేక పుట్టుకతో బ్రాహ్మణుడు అనా?

  –ప్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — ఆగస్ట్ 25, 2007 @ 12:56 ఉద. | స్పందించండి

 11. “జ్ఞానము, అన్నము – ఈ రెండింటినీ అమ్ముకోడం పాపం.”
  Modern civilization has come a long way ! God save the world.

  వ్యాఖ్య ద్వారా రాకేశ్వర రావు — ఆగస్ట్ 25, 2007 @ 8:11 సా. | స్పందించండి

 12. Well said raak!

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 25, 2007 @ 9:51 సా. | స్పందించండి

 13. ప్రసాద్ గారు,

  ఆలస్యంగా చూసాను మీ కామెంట్ ని.

  ఈ క్షణానికి నా సమాధానం పుట్టుకతోనే అని. అయితే కారణం కులం కాదు. కలిసి పడుకొని కలిసి భోజనం చేయగా లేని బాధ వైదిక కర్మలో ఎందుకంటే,ఆ కర్మలను అనుసరించాల్సిన వారు తీసుకోవలసిన మరియు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు మరియు నియమాలు. అన్నిటినీ మించి మంత్రాలు స్పష్టంగా, ఉచ్చారణాలో దోషాలు లేకుండా చదవాలి. నాకు, ఆ కర్మలని ఆచరించే బ్రాహ్మణేతరులైన వ్యక్తులు (పౌరోహిత్యం చేసేవాళ్ళల్లో) ఇంతవరకు ఎవరూ తారసపడలేదు. పై జాగ్రత్తలు పాటించే బ్రాహ్మణేతరుడు నాకు ఎదురైన రోజున, వెంటనే పరిగెత్తి చేయించుకుంటాను అని (ఈ వాదన గెలవటం కోసం) అనలేను గాని, నాకుగా అతనిపై నమ్మకం కలిగిననాడు ఆ వ్యక్తితో చేయిస్తాను. ఉదా: నా బ్రాహ్మణేతరులైన మిత్రుల్లో దాదాపు ఎవరికీ ఇంట్లో “మైల” అంటే ఏమిటి మరియు ఎందుకు అన్నది తెలియదు.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 29, 2007 @ 1:05 ఉద. | స్పందించండి

 14. <>

  పుట్టుకతో అంటావ్, మళ్ళీ కులం అంటావ్ అని మళ్ళీ అడుగుతారని కొంచం వివరణ. పుట్టినప్పటినుంచి ఒక వాతావరణంలో పెరగటంవల్ల, ఆ ఆచారాలు, నియమాలు ఆచరించటం సులభం అని చెప్పటం నా ఉధ్ధేశ్యం ఇక్కడ.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 29, 2007 @ 1:44 ఉద. | స్పందించండి

 15. […] రసజ్ఞులకి ఈయనికి మాటామాటా రావచ్చు, నీ ఇత్యర్ధం పులుసు, ఇతి భావం కూరాకి మళ్ళీ ప్రియ దూతిక కూడనా అని […]

  పింగ్ బ్యాక్ ద్వారా తాంబూలం « ఊక దంపుడు — జనవరి 14, 2008 @ 9:06 సా. | స్పందించండి

 16. వేదాన్ని మిగతా కులాలతో ఎందుకు పంచుకోలేదనే దానికి మా గురువు గారి సమాధానం ఇది
  ఈ రోజు విద్యా విధానంలో మెడికల్,ఫార్మసీ,ఇంజనీరింగ్ లాంటి వృత్తి విద్యలున్నాయి సమాజంలో అందరూ అన్నీ ఎందుకు నేర్చుకోవట్లేదు.కొందరు నేర్చుకుంటే సరిపోతుంది కనుక.అదే విధంగా ఆనాడూ.కానీ ఆ కొందరు బ్రాహ్మలే ఎందుకయ్యారంటే.వెద విద్య ఎన్నో వేల ఏళ్ళ నుండి కేవలం ఒక నోటి నుండి ఇంకొక నోటికి అన్న పద్ధతిలో లిఖిత వాఙ్మయావసరం లేకుండా వస్తోంది.దాన్ని అలా కాపాడేందుకు మనవాళ్లు తీసుకున్న ఎన్నో జాగ్రత్తలలో ఒకటి కులం అని పిలవబడుతున్న జెనెరిక్ గ్రూప్ చేతికి ఆ బాధ్యతని అప్పగించడం.పైగా వాళ్లకి జెనెటిక్ గా సంక్రమించే లక్షణాలతో పాటూ కొన్ని నైతిక సామాజిక ఆహారాది నియమాలను కూడా వేద రక్షణకు అనుకూలంగా విధించారు

  వ్యాఖ్య ద్వారా సంతోష్ సూరంపూడి — ఏప్రిల్ 21, 2009 @ 7:37 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: