సంగతులూ,సందర్భాలూ….

ఆగస్ట్ 17, 2007

టెల్గూ అంత వీజీయా…!

Filed under: కబుర్లు,భాష — Sriram @ 12:44 సా.

చిన్నప్పటినుంచీ నేను ఎక్కువగా చదివిన వార్తాపత్రిక “ఈనాడు”. పత్రిక రాగానే మొదటి పేజీని ఒక చూపుచూసి వెంటనే వెనక్కి తిప్పి క్రీడా వార్తలు చదవడం నాకు అలవాటు. అప్పట్లో క్రికెట్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చే ఉండేది. దూరదర్శని మాధ్యమం ఇప్పట్లా అభివృద్ధి చెందలేదు కనక ఎక్కువగా వార్తలకోసం పత్రికల మీదే ఆధారపడేవాళ్ళం.

“పీకల్లోతు కష్టాల్లో భారత్”, “భారత్ ఘోర పరాజయం” వంటి వార్తలే ఐనా ఎంతో ఆసక్తిగా చదవడం అలవాటయ్యింది అలాగే. అదే అలవాటున ఈరోజు పత్రిక తిరగెయ్యగానే “చాలా వీజీగా…” అంటూ భారత్-స్కాట్లేండుల మధ్య జరిగిన పోటీ గురించిన వార్త కనపడింది.

ఏంటో కొంచెం తేడాగా అనిపించింది. ఈనాడేనా చదువుతున్నది అని ఒక సందేహం. ఇంతలో నాలోంచి ఇద్దరు వ్యక్తులు బయటకి వచ్చి ఒకళ్ళు కుడివైపు ఇంకొకళ్ళు ఎడమ వైపు నిలబడ్డారు.

కువ్య: అసలు ఏమిటీ ఘోరం? తెలుగు పత్రికేనా ఇది? అసలు పత్రికేనా అని! ఏమి భాష ఇది, వీజీ అంటే?

ఎవ్య: ఘోరంలేదు, ఏమీ లేదు.ప్రజలకి చేరువయ్యేదే నిజమైన  భాష.

కువ్య: చేరువవ్వడం అంటే? “సులువుగా” అని వాడితే చేరువవ్వదా? మాతృభాష చేరువవ్వదు కానీ పరభాష చేరువౌతుందా! ఐనా పత్రికల్లో భాషన్నాకా కాస్త ప్రమాణాలు ఉండద్దా? భాష పట్ల ఆ మాత్రం బాధ్యత లేదా వాళ్ళకి? 

ఎవ్య: ప్రజలు వాడట్లేదా “వీజీగా” అని? పత్రికలో వాడితే తప్పేంటి? మీ లాంటి ఛాదస్తపు వాళ్ళ వల్లే తెలుగు ప్రజలకి దూరమౌతోంది.

కువ్య: ఔనా! ప్రజలు వాడేవన్నీ పత్రికల్లో వాడేస్తారా? వ్యావహారికంలో అనేక పదాలుంటాయి. కొన్ని కొన్ని అసభ్య పదాలు కూడా విరివిగా వాడుతూ ఉంటారు. అవన్నీ పత్రికల్లో వాడేస్తారా? ఆంగ్లపత్రికల విషయంలో ఇలానే మాట్లాడతావా? ప్రజలు మాట్లాడే బూతులుబుంగ ఇంగ్లీషు, పత్రికల్లో వాడితే ఒప్పుకుంటారా? “ది హిందూ” ఐతే మంచి భాష వాడుతుంది అని తెగ ప్రశంసిస్తూ ఉంటావుగా ఎప్పుడూ. ఇంగ్లీషుకొక నీతి, తెలుగుకొక నీతీనా?   

ఎవ్య: అర్ధంలేని ఆరోపణలు చెయ్యకు. ఎప్పుడూ పాతచింతకాయ పచ్చడిలా ఆలోచిస్తావు. ప్రజలభాష వాడడంద్వారా ప్రజలని గౌరవిస్తున్నామని తెలుసుకో. నీకులా మడిగట్టుకు కూచోడం ప్రజలని అవమానించడమే ఔతుంది.

కువ్య: ఆహా! అసలు వీజీగా అన్నపదం ఎలా పుట్టిందో తెలుసా? చదువులేని వాళ్ళ భాషని వెక్కిరించడానికి కొంతమంది వెటకారంగా వాడడం మొదలెడితే అది మొత్తం అందరి నోళ్ళలోకీ వచ్చింది. ఆ పదం వాడి మీరు కూడా అదే పని చేస్తున్నారు. అది తెలుసుకో!

ఇంక నావల్ల కాలేదు, ఈ గోల భరించడం. ఇద్దరినీ చెరోచెయ్యీ పట్టుకుని లోపలికి లాగేసుకున్నా. నిన్నరాత్రి జీతెలుగు లో చూసిన “స రి గ మ ప” పాటలపోటీ కార్యక్రమం గుర్తొచ్చింది. జీవారు ఈ పోటీ అన్నిభాషలలోనూ నిర్వహిస్తున్నారు. పోటీ తర్వాత ఇద్దరు పోటీదారులని “డేంజర్ జోన్” లోకి పంపు తారు. జీతెలుగు లో నవగాయకుడు కారుణ్య దీనికి సూత్రధారి. నిన్న కార్యక్రమంలో “డేంజర్ జోన్” కి బదులు “ప్రమాద వలయం” అని వాడాడు. నాకు “భలే” అనిపించింది. ఈయన మధ్యమధ్య ఒకటి,రెండు ఇంగ్లీషు వాక్యాలు వాడతాడు కానీ చక్కని తెలుగు మాట్లాడుతాడు. మరి ప్రజలెంతవరకూ ఆదరిస్తారో!   

ప్రకటనలు

21 వ్యాఖ్యలు »

 1. నేను అనుకున్నదంతా ఇక్కడ వ్రాసెసారే

  వ్యాఖ్య ద్వారా స్వేచ్ఛా విహంగం — ఆగస్ట్ 17, 2007 @ 2:41 సా. | స్పందించండి

 2. టెల్గు వీజీ నే అండి.

  నాకు తెల్సిన కన్నడ స్నేహితులు అదే చెప్పారు మరి. అందుకే ఆ మాట చెప్పేసి నేను కన్నడ నేర్చుకోకుండా ఇన్నాళ్ళు రోజులు దొర్లించాను. 🙂
  నాకు తెల్సినంత వరకు ఈనాడు లొ మంచి తెలుగు use చేస్తారు.
  ఐనా మీరు అలా దుర్భిణి తో వెతికేస్తే పాపం పత్రిక ల వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. 🙂

  వ్యాఖ్య ద్వారా Aruna Gosukonda — ఆగస్ట్ 17, 2007 @ 5:37 సా. | స్పందించండి

 3. కు.వ్య – ఎ.వ్య వాగ్వాదం చాలా బావుంది. వీళ్ళని ఒక రెగ్యులర్ ఫీచర్ చెయ్యొచ్చేమో. కొన్ని విషయాలు ఒక సారి మననం చేసుకుంటే మంచిదేమో
  1) అతిగా నియంత్రించబడిన భాష వాడుకలోంచి తొలిగిపోతుంది – ఉదా. సంస్కృతం, లాటిన్
  2) భాష సజీవమైనది – మార్పులు చేర్పులు సహజం
  3) స్వఛ్ఛమైన భాష అంటూ లేదు గానీ, చక్కని భాష అనేది ఉంది. అది వార్తాపత్రికల్లో కనబడ్డం కష్టం, కనబడాలని ఆశించడం వ్యర్ధం.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఆగస్ట్ 17, 2007 @ 5:50 సా. | స్పందించండి

 4. “వ్యావహారిక పదకోశం” అని చెప్పి వ్యవహారంలోనూ, పత్రికల్లోనూ వాడే పదాలతో ఒక పదకోశం బూదరాజు రాధాకృష్ణ గారి సారధ్యంలో ఈనాడు వారు ముద్రించిన ఒక పుస్తకంలో ఇలాంటి పదాలు ఉన్నాయి.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 17, 2007 @ 5:53 సా. | స్పందించండి

 5. ఇంక ఈనాడు చాలా మెరుగండి. నేనూ ప్రొద్దుట చదివానుగాని, ఈనాడు కాబట్టి మాఫీ చేసా. లేక కొంపదీసి ఈ విషయాన్ని నేను మననం చేసుకున్నానా ? 🙂

  వ్యాఖ్య ద్వారా రాకేశ్వర రావు — ఆగస్ట్ 17, 2007 @ 7:14 సా. | స్పందించండి

 6. కుంబ్లే అదరహో, ధోనీ ఢమాల్ ఢమాల్ … దినపత్రికలలో ఇవి చూడలేదా మీరు? కొంతవరకూ నయమే. ఇరగదీసిన ఇర్ఫాన్, సావగొట్టిన సెహ్వాగ్ లాంటివి రాయలేదు. మాస్ సినిమాల్లో పరుచూరి సోదరులు రాసే చౌకబారు సంభాషణల్లాగా దినపత్రికలుకూడా అలాంటి భాషనుపయోగిస్తేనే ప్రజలకు దగ్గరౌతామనుకుంటే ప్రామాణికమైన భాషకు మార్గదర్శనం అనేది ఉండదు. పత్రికల భాష కంటే ఇప్పుడు టీవీల భాష ప్రామాణికమైపోయింది. దీన్నెవరు అరికడతారు? కాబట్టి, జాతస్యహి ధృవో మృత్యుః … అని తెలుసుకోవలసిందే!

  వ్యాఖ్య ద్వారా రానారె — ఆగస్ట్ 18, 2007 @ 2:08 ఉద. | స్పందించండి

 7. స్వేచ్ఛావిహంగం గారూ, స్వాగతం.

  అరుణగారూ, కన్నడ వాళ్ళకి తెలుగెంత వీజీయో, మనకి కన్నడం కూడా అంతే 🙂
  దుర్భిణీ ఎందుకండీ, అంత పెద్ద అక్షరాలతో ఎదురుగుండా కనపడుతుంటే! ఈనాడు వాడే తెలుగు సాధారణంగా బానే ఉంటుంది. ఇంత దారుణంగా వాడడం ఇదే చూడడం.

  గురువుగారూ, ధన్యవాదాలు. ఈరోజుల్లో ప్రజలు చదువుతున్నది ఏమైనా మిగిలిందీ అంటే అవి ఈ పత్రికలే కదండీ. అందులోనైనా చక్కని భాష వాడాలని నా ఆక్రోశం అంతే.

  వికటకవి గారూ…బూదరాజుగారి పేరు విన్నాను. ఆయన భాషా సేవ చాలాచేసారని. కానీ ఈ “వీజీ” కూడా అందులో ఉందంటే నమ్మబుద్ధి కావట్లేదు.

  రాక్, వెల్కం బేక్! ఈనాడు కనకనే నేనూ అంటున్నది. సాధారణంగా ఇంతలా వాడడం నేను చూడలేదు.

  రానారె, “ధోనీ ధూం ధూం” “హింగిస్ కు సానియా షాక్” లాంటివాటికి అలవాటు పడ్డాను కానీ మరీ ఈ స్థాయికి కాదు. ఐనా ప్రామాణిక భాష అనడానికే ఇప్పుడు భయమేస్తోంది. దానిలోనూ ఇప్పుడు రకరకాల ఇజాలూ, వాదాలూ…

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 18, 2007 @ 1:01 సా. | స్పందించండి

 8. శ్రీకర్ గారు,

  పొరపడ్డారు. నా ఉధ్ధేశ్యం అలాంటి పదాలు అని, అంతే గాని అవే పదాలని కాదు.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 18, 2007 @ 5:57 సా. | స్పందించండి

 9. తిలా పాపం,తలా పిడికేడు అంటే ఇదేనేమో…

  అంతో ఇంతో తెలుగు నిలబెట్టే ప్రయత్నం చెయ్యాల్సిన దిన పత్రికలే తెలుగు భాషను తెంగ్లీషు చేస్తున్నాయి.
  ఇక సినిమా,టీ,వీ వారి సంగతీ అంతే…
  చక్కటి తెలుగు పదం అందుబాటులో ఉండి కూడా,ఆంగ్ల పద ప్రయోగం చేస్తుంటే ఎం చెప్పగలం?
  ఈ విషయం లో నాకు కన్నడా,తమిళ వారు మేలని పిస్తుంది
  వారి పత్రికల్లో చాలా తక్కువ చోట్ల ఆంగ్ల పదాలు వాడతారు
  వారికున్న భాషాభిమానం లో ఒక్క శాతం మనకున్నా,ఈ రోజు మన తెలుగు తల్లి మంచి బట్ట కట్టి ఉండేదేమో…

  మన 10వ తరగతి తెలుగు పద్యభాగం లో ” స్ట్రీట్ చిల్డ్రన్ ” అని ఉంది….. దాన్ని తొలగించమని ప్రభుత్వానికి ఎన్ని సార్లు ఆర్జీలు పెట్టినా పట్టించుకున్న దిక్కు లేదు

  ఈ పరిస్థితే కొనసాగితే,చాలా తెలుగు పదాలు కనుమరుగయ్యే స్థితి వస్తుంది.రేపటి తరానికి మన భాషా సౌందర్యమే తెలియదేమో..

  వ్యాఖ్య ద్వారా Lalitha Sravanthi — ఆగస్ట్ 18, 2007 @ 9:50 సా. | స్పందించండి

 10. ఈ పోష్టును http://eenadu.net/contact.htm లోని mailids కి పంపుతున్నాను, మన feedback వింటారేమో చూద్దాం.

  వ్యాఖ్య ద్వారా వెంకట రమణ — ఆగస్ట్ 18, 2007 @ 11:35 సా. | స్పందించండి

 11. nice post…
  the conversation was well established..
  good one..and did u notice not even a single program’ name in the so-called telugu channels in telugu..!
  jara masti jara dhoom! something..something lo chinna break!!!
  but the telugu i tried to solve and learnt was from eenadu..the pada vinodam in eenadu used to be good.
  one question if i can ask here- tell me a word in english for “NIKSHEPANGA”.is it nikshyapanga..or nikshepamga??
  just one word.

  వ్యాఖ్య ద్వారా joshmybench — ఆగస్ట్ 19, 2007 @ 11:10 ఉద. | స్పందించండి

 12. అయ్యా వికటకవిగారు, “విజీ” లేదా ఈ బ్లాగులో, “ఈనాడు” వారు ఉపయోగించిన పదం, బూదరాజు గారి ‘సంకలనం” లో ఉందా?
  చూసి చెప్పండి.

  వ్యాఖ్య ద్వారా netizen — ఆగస్ట్ 19, 2007 @ 11:48 ఉద. | స్పందించండి

 13. “…ఇలాంటి పదాలు ఉన్నాయి.” అని అనొద్దు! ఎందుకండి ఆ పెద్ద మనిషిని లాగుతారు.

  వ్యాఖ్య ద్వారా netizen — ఆగస్ట్ 19, 2007 @ 11:52 ఉద. | స్పందించండి

 14. పత్రిక ల కన్నా టివీ వాళ్లు ఇంకా ఘోరం. ఇవాళ, తెలుగు వార్తలని వార్తలు అనే వాడు లేడు. శాసననభ, ముఖ్యమంత్రి, శాసనసభ్యుడు ఇలాంటి పదాలు ఏ న్యూస్ ఛానల్లొ వెతికినా కనపడవు.
  చిత్రమేమిటంటే, దిన వారి ఇల రాసే,చదివే వీళ్లు, తెలుగు భాషా దినోత్సవమో, మాతృ భాషా దినోత్సవమో రాగనే వాళ్లేదో భాషను ఉద్ధరిస్తున్నట్టు చూపించుకుంటారు.

  వ్యాఖ్య ద్వారా vookadampudu — ఆగస్ట్ 19, 2007 @ 1:34 సా. | స్పందించండి

 15. ” తిలా పాపం,తలా పిడికేడు ” ఈ మధ్య ఇది ఒకటి దొరికింది అందరికి. అవకాశం ఉన్నచటాల్లా నాకు తెలుగు వచ్హు అని దీన్నిన వాడేస్తున్నారు.అలాగే ఇంకొకటి ఉంది – “అలతి అలతి పదాలతో / భావాలతో” దాన్ని కూడా మర్డర్ చేసేస్తున్నారు.

  వ్యాఖ్య ద్వారా netizen — ఆగస్ట్ 19, 2007 @ 5:01 సా. | స్పందించండి

 16. @Venkataramana garu

  Manchi pani chesaru.
  Actually, for an e-magazine I sent a mail asking them to stop one of their serial as it was too vulgar.

  I thought about the way to inform the eenadu people this morning. I didnt know that a feed back email id exists for it. 🙂

  వ్యాఖ్య ద్వారా Aruna Gosukonda — ఆగస్ట్ 19, 2007 @ 6:44 సా. | స్పందించండి

 17. @netizen garu,
  క్షమించాలి. ఆయన్ని లాగటమంటే నాకర్థం కాలేదు. వారి “సారధ్యం” అనే అన్నాను కాని వారి “సంకలనం” అనలేదు. అంచేత ఒక వేళ ఈ పదO అందులో ఉన్నా అది వారి తప్పు కాదు. ఆయన సంపాదకుడు మాత్రమే. ఈ క్షణంలో ఆ పుస్తకం నా దగ్గర లేదు. వీలైనంత త్వరలో తెప్పించుకొని చూస్తాను.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 19, 2007 @ 10:10 సా. | స్పందించండి

 18. వికటకవి గారు, సంశయం తీర్చినందుకు కృతజ్ఞతలు. నా పేరు శ్రీరామ్.

  లలిత గారూ, కన్నడిగుల విషయంలో నేను చూసాను. నేర్చుకోవల్సింది ఎంతైనా ఉంది.

  వెంకటరమణగారూ, ధన్యవాదాలు. మీ ఆశావాదం నాకు కొంత అప్పివ్వండి సార్ 🙂

  జోష్ దీప్తి గారూ, టీవీలగురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ తెలుగు మాట్లాడుకోచ్చు 🙂
  ఇంక నిక్షేపం అంటే పాతిపెట్టబడింది అని. పూర్వకాలంలో పాతిపెట్టినవి ఎక్కడకీ పోవు చాలా క్షేమంగా ఉంటాయని నమ్మకం. అందుకే నిక్షేపంలా ఉంది అంటే చాలా క్షేమంగా ఉంది అని అర్ధం. దీనిని మక్కికి మక్కీ ఆంగ్లీకరిస్తే స్థానికత(నేటివిటీ) దెబ్బతింటుందేమో. యాజ్ సేఫ్ యాజ్ ఎ ట్రెజర్ అనచ్చేమో. ఆ మధ్య ఏదో బ్లాగులో చదివాను. పక్క భాష ఇడియంలూ పక్క డాబా వడియంలూ ఒక పట్టాన అందవుట 🙂
  అన్నట్టు మీరు పొద్దు(poddu.net) లో గడి చూడండి, ఇంకా బాగుంటుంది.

  నెటిజన్ గారూ, కవి గారు క్లేరిఫై చేసారని భావిస్తా.

  ఊ.దం. గారూ, మీరు 9 పీయెం విత్ డేష్ డేష్ లాంటివి మర్చిపోయారు 🙂

  అరుణగారూ, అప్పుడేమైంది? ఎవరైనా పలికారా?

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 20, 2007 @ 4:33 సా. | స్పందించండి

 19. hahaha.. nice rhyming there!
  well i knew the meaning for it as i use it almost everyday! but din get the history or translation of it! thanks for the details..
  thanks for the puzzle site.

  వ్యాఖ్య ద్వారా josh — ఆగస్ట్ 20, 2007 @ 11:37 సా. | స్పందించండి

 20. వీజీ జిందాబాద్ !

  వ్యాఖ్య ద్వారా chavakiran — ఆగస్ట్ 21, 2007 @ 4:30 సా. | స్పందించండి

 21. @Sriram garu

  CheppaDaaniki baadha ga inkoncham naamoshi ga vundi anDi.
  nenu 2 times mail send chEsina kuDa serial aapaledu aa e-magazine.
  KakapotE alanTivi tarvata malli andulo raaledu chaala kaalam.(prastuta paristhiti telidu.) Bahusa naalanTi chala mandi mails icharo leka vallaki alanTi chetta story malli dorakaledEmo anipinchindi. edaina ayyi vunDachu. [:)]

  వ్యాఖ్య ద్వారా Aruna Gosukonda — ఆగస్ట్ 21, 2007 @ 7:54 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: