సంగతులూ,సందర్భాలూ….

ఆగస్ట్ 8, 2007

ఆపాతమధురం – 3

Filed under: సంగీతం,సినిమాలు — Sriram @ 12:20 ఉద.

వసంతగాలికి వలపులు రేగా, వరించు బాలిక మయూరి కాగా…“, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చిత్రంలోని ఈ పాటని బాలమురళీకృష్ణ గారూ, జానకి గారూ పాడారు. పెండ్యాల నాగేశ్వర్రావు గారి సంగీతం. పింగళి వారి అద్భుతమైన సాహిత్యానికి పెండ్యాలగారు అతి మధురమైన బాణీ కట్టారు. పెండ్యాల వారికి హిందూస్తానీ కళాకారుల సంగీతం ఎక్కువ ప్రేరణగా ఉండేదని చెప్పుకోడం విన్నాను. అందుకే కాబోలు ఈ పాట కూడా “కళావతి” అనే హిందూస్తానీ రాగంలో ఉంది. కర్ణాటక సంగీతంలో దీనికి సమానమైన రాగం పేరు “వలచి”. కానీ కర్ణాటక సంగీతంలో ఈ రాగం ఎక్కువ వినిపించదు. త్యాగరాజాదులు ఈ రాగంలో ఒక్క కృతి కూడా రాయకపోడం దీనికి కారణం కావచ్చు.

వలచి రాగంలో స్వరపరచబడిన మరో అందమైన పాట ప్రేమించిచూడు చిత్రంలోని “వెన్నెలరేయి ఎంతో చలి చలి…“. పీబీ శ్రీనివాస్ గారూ, సుశీలగారూ పాడారు. పీబీ గారి లలితమైన గాత్రం ఈ పాటకి ఎంత అందాన్ని తెచ్చిందో చెప్పలేను. భాగ్యజ్యోతి అనే కన్నడ చిత్రంలో “పంకజ నేత్రీ, మధుమయగాత్రీ…” అన్నపాటని పీబీ శ్రీనివాస్ గారు స్వయంగా సంస్కృతంలో రాసి పాడారు. ఈ పాట కూడా వలచి రాగంలోనే ఉంటుంది. కాళిదాసు రాసిన విక్రమోర్వశీయం ఆధారంగా రాసిన ఈ పాటకోసం నేను అంతర్జాలం అంతా వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు.

“ర”సాలూరి రాజేశ్వర్రావుగారు “చిలక గోరింక” చిత్రం కోసం స్వరపరచిన “నా రాణి కనులలోనే…” అన్నపాట కూడా ఈ రాగం ఆధారంగా చెయ్యబడినదే అనిపిస్తుంది నాకు. మధ్యమం అక్కడక్కడ వినిపించినా వలచి రాగ లక్షణమే  ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఈ పాటలో సాలూరి వారి సంగీతంలోని మాధుర్యానికీ శ్రీశ్రీ సాహిత్యంలోని అందానికీ పెద్ద యుద్ధమే జరుగుతుంది అనిపిస్తుంది నాకు. అసలు ఎర్రరంగు తలుచుకోగానే శ్రీశ్రీకి వెర్రెక్కిపోతుందేమో. అందుకే విప్లవం,కమ్యూనిజం వంటివాటిని గురించి మాత్రమే  కాదు, ప్రేమగురించి కూడా ఆయన అధ్బుతమైన పాటలు రాసాడు. ఒక్కసారి మనసున మనసై… గుర్తు తెచ్చుకోండి.

వలచి రాగంలో వచ్చిన ఇంకొక గొప్ప పాట ఉంది. కళాతపస్వి విశ్వనాధ్ గారి దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఒక ఎత్తైతే ఈ పాటకి సిరివెన్నెలగారి సాహిత్యం మరొక ఎత్తు. అదే స్వర్ణకమలం సినిమాలోని “శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వా…” అన్న పాట. ఈ పాటను విశ్లేషించే అంత శక్తి నాకు లేదు కానీ వలచి రాగంలో ఉంది అని మాత్రం చెప్పగలను.

ఇంక శాస్త్రీయ సంగీతం దృష్ట్యా చూస్తే ఇది చిన్న రాగమే.
ఆరోహణ: స గ3 ప ద2 ని2 స
అవరోహణ: స ని2 ద2 ప గ3 స

ఇందాక చెప్పినట్టుగా త్యాగరాజస్వామి, దీక్షితార్, శ్యామశాస్త్రి లలో ఎవరూ ఈ రాగంలో కృతులు స్వరపరచలేదు. ముత్తయ్య భాగవతార్ గారి కృతి “జాలంధర సుపీఠ స్థితే” చాలా గొప్పగా ఉంటుంది. ఏసుదాస్ గారు “నను బ్రోవ…” అన్న కృతిని చాలా అందంగా ఆలపించారు.

ఓలేటి వెంకటేశ్వర్లు గారికి ఈ రాగం ఎక్కువ ప్రీతి అనిపిస్తుంది. “కందర్పజనకా గరుడగమనా…” అన్న అన్నమయ్య కీర్తనని ఈ రాగంలోనే ఆయన స్వరపరిచారు. సదాశివబ్రహ్మేంద్రుల వారి “నహిరే” అన్న కీర్తనని కూడా ఓలేటివారు ఈ రాగంలో పాడారు.  

ఆభోగి రాగంలో మధ్యమంతో గ్రహభేదం చేస్తే వలచి రాగం వస్తుంది. దీని ఆధారంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఒక అద్భుతమైన రాగం తానం పల్లవి ఈ రెండు రాగాల్లో పాడారు (లంకె 5 రోజులు మాత్రమే పనిచేస్తుంది). విని తీరవలసిన ఆలాపన ఇది.

హిందూస్తానీ కచేరీలలో వలచి రాగం(కళావతి) ఎక్కువగానే వినిపిస్తుంది. కొన్ని ఇక్కడ వినచ్చు. అజయ్ చక్రవర్తి గారి ఆలాపన విన్న వాళ్ళు వాహ్! అనకుండా ఉండలేరు.

*కొత్తవారికోసం:ఆపాతమధురంఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!

20 వ్యాఖ్యలు »

 1. యథా ప్రకారం టపా చాలా మధురంగా ఉంది శ్రీరామా!:-)
  నువ్వు చెప్పిన సినిమాపాటలేవీ నాకు తెలీవు – లంకెలిచ్చావు కనక ఇంటికెళ్ళి వింటాను. ఓలేటి పాడిన అన్నమయ్య కీర్తన బాగా ఎరుకనే – ఆయన హిందుస్తానీ బాణీలో పాడారు అనిపిస్తుంది. లాల్గూడి వారిది ఒక వర్ణం ఉంది “చలము సేయ” అని – వారి శిష్యులు ఎక్కువగా పాడతారు, బావుంటుంది మంచి వడిగా సాగే గమకాలతో. నా దగ్గరున్న కేసెట్టు మీద “వలజి” అని చదివిన గుర్తు, నూకల వారి రాగాల పుస్తకంలో చూడాలి పేరు ఏమని రాశారో.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఆగస్ట్ 8, 2007 @ 3:11 ఉద. | స్పందించండి

 2. అబ్బ! ఎంత చక్కని పాటలు, ఎంత మంచి వ్యాసం! మంచి పాటలు గుర్తు చేసారు; లింకులు కూడా ఇచ్చారు. ధన్యవాదాలు. btw “వసంతగాలికి ..” పాట బాలమురళీకృష్ణ పాడిన అతి తక్కువ
  సినిమా పాటల్లో ఒకటి, అందులోనూ యుగళ గీతాల్లో ఒకటి (నర్తనశాలలో “సలలిత రాగ సుధారససారం.. మినహాయిస్తే) also btw, ఆ పాటలోది, వలచిన బాలిక కాదు, వరించిన బాలికే! (.. వరించు బాలిక మయూరి కాగా..) 🙂

  వ్యాఖ్య ద్వారా పద్మ ఇం. — ఆగస్ట్ 8, 2007 @ 3:56 ఉద. | స్పందించండి

 3. నమస్కారం. మొదటిసారి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మళ్ళీ రప్పించేంతగా ఉంది మీ బ్లాగు. ఈ విధంగా నైనా కొంత సరిగమల సుస్వరాల గురించి తెలుసుకుంటాను. మంచి పని చేస్తున్నారు.

  వ్యాఖ్య ద్వారా వికటకవి — ఆగస్ట్ 8, 2007 @ 4:55 ఉద. | స్పందించండి

 4. chala information undi indulo..thanks 🙂

  వ్యాఖ్య ద్వారా deepthi — ఆగస్ట్ 8, 2007 @ 10:15 ఉద. | స్పందించండి

 5. బాగుంది శ్రీరామ్. మీ వ్యాసం ’వలజి’గిబిగి లో ఇరుక్కుపోయాను. మంచిపాటలు గుర్తు చేశారు. ఆభోగి, వలజి, శ్రీరంజని, భాగేశ్రీ దగ్గర దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ ఆ’పాత’ మధుర వ్యాసాలు కూడా ఇప్పుడే చదివాను. కృతజ్ఞ్నతలు.

  వ్యాఖ్య ద్వారా కిరణ్ — ఆగస్ట్ 8, 2007 @ 12:26 సా. | స్పందించండి

 6. sriram garu, naa peru kuda sriram. dhanyavaadalu. mee vyasam adhbutham.dayachesi raastune undandi.marosari kruthagnathalu.
  SRIRAM VELAMURI

  వ్యాఖ్య ద్వారా sriram velamuri — ఆగస్ట్ 8, 2007 @ 3:56 సా. | స్పందించండి

 7. ధన్యోస్మి గురూజీ, పాటలు విని మీకు నచ్చాయో లేదో చెప్పండి. ఔను వోలేటి వారు హిందూస్తానీ బాణీలోనే పాడారు. కొంత మిశ్రం కూడా చేసారు. నహిరే అన్న కృతిలో అవరోహణలో రిషభం వినిపిస్తూ ఉంటుంది. లాల్గుడి వారి వర్ణం గురించి మర్చిపోయాను నిజంగానే, చాలా బాగుంటుంది. ఈ రాగం పేరు “వలచి” అనే నా నమ్మకం. బాలమురళీ గారు పల్లవిలో “వలచి” అనే వాడారు. తమిళంలో పరుషాలు లేకపోటంవల్ల వాళ్ళ నోళ్ళలో ఇది వలజి అయ్యి ఉండచ్చు.

  పద్మగారూ, ధన్యవాదాలు. ఔనండీ బాలమురళీ గారు యుగళగీతాలు పాడడం నేనిదే వినడం. బాలికని వలచడం వరకూ ఓకే కానీ వరించడం నాకు ఎబ్బెట్టుగా తోచిందేమో ఆ ముక్క అలా పడింది, కానీ మీరు చెప్పాకా ఆంధ్ర మహావిష్ణువు కాలంలో బాలికలనే వరించేవారేమో అని సద్ది చెప్పుకున్నా….అప్పటికి శారదా బిల్లు కూడాలేదు కదా 🙂

  వికటకవి గారూ స్వాగతం. వస్తూ ఉండండి అప్పుడప్పుడు… 🙂

  దీప్తిగారూ, థేంక్స్.

  కిరణ్గారూ, ధన్యవాదాలండీ.

  మరో శ్రీరాం గారూ, స్వాగతం. అప్పుడప్పుడు వస్తూ ఉండండి.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 8, 2007 @ 6:27 సా. | స్పందించండి

 8. ప్రస్తుతం వినే అవకాశం, తీరిక లేకపోయినా గుర్తు తెచ్చుకుని సంతోషించా.

  వ్యాఖ్య ద్వారా swathi — ఆగస్ట్ 9, 2007 @ 9:55 ఉద. | స్పందించండి

 9. చాల బాగున్నాయి. విలువైన బ్లాగ్‍లు.

  వ్యాఖ్య ద్వారా vookadampudu — ఆగస్ట్ 9, 2007 @ 10:01 ఉద. | స్పందించండి

 10. nice post… heard some good music..thanks to u..

  వ్యాఖ్య ద్వారా josh — ఆగస్ట్ 9, 2007 @ 9:10 సా. | స్పందించండి

 11. నూకల వారి రాగాల పుస్తకంలోనూ valaji అని రాశారు.
  చాలా చోట్ల చ, జ, శ, స – ఒకదానికొకటి వాడినా ఇబ్బందేమీ లేనట్లుగా ఉంటాయి కాబట్టి ఇదో పెద్ద విషయం కాదు. పైగా తెలుగులో పాట రాస్తున్నప్పుడు “వలచి” అనే చక్కటి మాటగా రాగం పేరుని ఉపయోగించుకోవటానికి సరిపోతుంది కూడాను. నీ టపా చూశాక లాల్గూడి వర్ణం బాంబే జయశ్రీ పాడింది ఒక సారి మాళ్ళీ విన్నాను, అందులో కూడా పల్లవి రెండో వరుస వలచి అని మొదలౌతుంది. Looks like composers couldn’t resist the usage of this word:-))

  అన్నట్టు పైన నువ్వు ఉదహరించిన సుబ్బరాయ శాస్త్రి కృతి “జాలంధర సుపీఠ స్థితే” అని నూకల వారు సెలవిచ్చారు. ఇక్కడ నీ పొరబాటు నిజంగా తమిళ సోదరుల “గజడదబ” మహత్యమే! చదువరి గారి “పీడ” గుర్తొచ్చింది :-))

  నువ్విచ్చిన లంకెల్లో పాటలు విన్నప్పుడు “వసంతగాలికి” “వెన్నెల రేయి” కీ ఉన్న సంగీత సామీప్యత గమనించి ఆశ్చర్యపోయాను. సినిమా బాణీలు శాస్త్రీయంగా పాడిన పద్ధతినించి చాలా భిన్నంగా ఉన్నాయి. ఇట్లాంటి విభిన్నత మోహనంలో గమనించాను. హిందోళం ఏ పద్ధతిలో పాడినా టక్కున తెలిసిపోతుంది, అలాగే హంసధ్వని కూడా. కానీ ననుపాలింప లో మోహనమూ భవనుతలో మోహనమూ చాలా వేరుగా అనిపిస్తాయి. నువ్వు రుచి చూపించిన వలజి కూడా ఇన్ని రకాల హొయలూ కురిపించి “ఔరా!” అనిపించింది.
  బాలమురళి రాగద్వయ ఆర్టీపి అద్భుతం. పంచుకున్నందుకు ఇదే నా ఆశీర్వచనం – నువ్వు కలకాలం ఆ సంగీత సరస్వతి కృపారసంలో తేలియాడుతూ – ఇలా అప్పుడప్పుడూ మాక్కూడా రుచి చూపిస్తూ ఉందువు గాక!

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఆగస్ట్ 9, 2007 @ 9:34 సా. | స్పందించండి

 12. Very nice.
  Nagaraju gari blog to prarambhinchi ikkaDa telaanu. Post chusaka evari blog ayyi vunTundaa anukunnanu. Ashadhamasam, Aavarana book gurunchi samiksha chusaka koncham flash veligindi. tira chuste Sriram gari blog sumi.. [:)]

  manchi manchi songs chepparu. Thanks anDi.

  వ్యాఖ్య ద్వారా Aruna — ఆగస్ట్ 10, 2007 @ 10:19 సా. | స్పందించండి

 13. స్వాతిగారూ, అసలు ఇలా ఒక లుక్కేసారు. అదే పదివేలు 🙂

  ధన్యవాదాలు ఊకదంపుడుగారూ..

  గురూజీ, నిజమే యతిమైత్రి కుదిరితే ఓకే 🙂
  చూసారా, అసలు ఆలోచించలేదు, ఈ పీడ ఏమిటా అని. తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. ఇంక పాపం హిందోళం చాలా ముద్దరాలు. కపటాలు తెలీవు. మోహనం పేరుకి తగ్గట్టుగానే మోహినీ అవతారపు లక్షణాలున్నది మరి 🙂 మీ ఆశీస్సులకి మరొకసారి వందనాలు.

  అరుణగారూ స్వాగతం. ఇలా ఎప్పుడో ఒకసారి కాక తరచు వస్తూ ఉండండి 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 10, 2007 @ 11:24 సా. | స్పందించండి

 14. ఆహా అద్భుత మైన బ్లాగు . నేను ఈమధ్యలో నే తెలుగు బ్లాగు లు వెతకడం మొదలు పెట్టాను. సంగీత ప్రియులకు అద్భుత కానుక. కృతజ్ఞతలు

  వ్యాఖ్య ద్వారా గోపీ చంద్ — ఆగస్ట్ 17, 2007 @ 5:43 సా. | స్పందించండి

 15. athbutha vishayaalu andangaa chepparu , paamarulanu paavanam chesaru

  వ్యాఖ్య ద్వారా koresh — సెప్టెంబర్ 5, 2007 @ 4:40 సా. | స్పందించండి

 16. సంగీతానికి పామరులూ పండితులూ అనే భేదం లేదండీ. శిశుర్వేత్తి పశుర్వేత్తి కదా. నచ్చినందుకు సంతోషం.

  వ్యాఖ్య ద్వారా Sriram — సెప్టెంబర్ 6, 2007 @ 4:27 సా. | స్పందించండి

 17. […] అంటూ.బాబు, రాంగ్ నంబర్, ఇది ఊకదంపుడు, సంగతులూ సందర్భాలు కాదూ అని మొత్తుకోలు పెట్టి,ఫోన్ […]

  పింగ్ బ్యాక్ ద్వారా ఆదివారం అగచాట్లు « ఊక దంపుడు — అక్టోబర్ 11, 2007 @ 5:36 సా. | స్పందించండి

 18. namastE Sreeraam garu ___/\___

  mee sangeetaanubhavam chadivi manasuparavasinchipOyindi.
  sangeetam nErchukonE mundi
  sangeetam gurinchi vinaDamE tappa
  maLLi chaalaa rOjula taruvaata
  sangeetam gurinchi chadavaDam nijangaa
  manasu paravaSinchipOtundi meeru raasina okkO padam ANimutyalai prakaasinchaayi
  nEnU EdO kaasta sangeetam nErchukonnaanu
  mee anta anubhavam lEkapOyinaa
  rOjuku naalugu keertanalu vinadE nidrapaTtani
  paristiti:)
  ilaagE inkaa sangeetam gurinchi
  bOlEDu raayaalani kOrutu :)……………

  వ్యాఖ్య ద్వారా sunderpriya — ఫిబ్రవరి 1, 2008 @ 9:25 సా. | స్పందించండి

 19. […]  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3 […]

  పింగ్ బ్యాక్ ద్వారా ఆపాతమధురం…4(రీతిగౌళ రీతులు) « సంగతులూ,సందర్భాలూ…. — మార్చి 6, 2010 @ 5:37 సా. | స్పందించండి

 20. […] *కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3 […]

  పింగ్ బ్యాక్ ద్వారా ఆపాతమధురం: ‘కారుణ్య’ వాణి | సంగతులూ,సందర్భాలూ…. — జూన్ 16, 2017 @ 3:43 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: