సంగతులూ,సందర్భాలూ….

జూలై 5, 2007

తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…)

“కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్”
దోమ నోట్లో మదపుటేనుగులు దూరాయి అని దీనర్ధం. తెనాలి రామకృష్ణ సినిమా చూసిన తెలుగువారందరికీ ఈ సమస్య సుపరిచితమే. తెనాలి రాముడిని చూసి ఓర్వలేని కొంతమంది తోటి పండితులు ఒక కాపలా వాడిచేత ఈ సమస్యని అడిగిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేకపోతే ఆయన తెనాలిరాముడెందుకౌతాడు. అందుకే కాపలా వాడిని అడ్డంపెట్టి వాళ్ళని బండబూతులు తిడతాడు. గంజాయి తాగి నానా జాతులతోటీ కలిసి కల్లుతాగి పేలుతున్నావా లం*కొడకా, ఎక్కడరా దోమనోట్లో ఏనుగులు దూరాయి? అని ఇలా పూరించాడు:

కం: గంజాయితాగి తురకల
     సంజాతులగూడి కల్లు చవిగొన్నావా
     లం*లకొడకా! ఎక్కడ
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

దెబ్బకి కుళ్ళుకున్నవాళ్ళు నోళ్ళుమూసుకుని ఏడ్చుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. కానీ ఈ విషయం రాయలవారికి చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు కదా, ఇంత అందమైన సమస్య వ్యర్ధమైపొయిందే అని బాధపడి తెనాలి రాముడిని పిల్చి, ఇప్పుడు ఇదే సమస్య నేనిస్తున్నాను పూరించమని ఆజ్ఞాపిస్తాడు. మరి తెనాలిరాముడి నాలుకకి రెండుపక్కలా పదునే కదా, ఎంత సరసంగా పూరించాడో చూడండి:

కం: రంజనచెడి పాండవులరి
     భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!
     సంజయ! విధినేమందును
     కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్!

సంజయా! విధి ఎంత బలీయమైనదో చూసావా. పాండవులంతటివారు కూడా విరాటరాజు కొలువలో ఊడిగం చెయ్యాల్సివచ్చింది. ఏనుగులు వెళ్ళి దోమ నోట్లో దూరడం లాగ ఉంది ఇది అని మంచి సమయస్ఫూర్తితో పూర్తిచేసేప్పటికి రాయలవారు ఎంతో ఆనందించారుట.

ఇటువంటి పద్యాలూ, కధలూ తెనాలి రాముడిపేరు మీద ఎన్నో ఉన్నాయి. అవి నిజంగా జరిగినవా కావా అన్న వివాదాన్ని పక్కన పెడితే ఇంత మంచి సాహిత్య వారసత్వాన్ని మనకి అందజేసిన పెద్దవాళ్ళందరికీ మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని నేను అనుకుంటాను.

ఇంక  నా పైత్యం గురించి. తెనాలిరాముడి గురించి నేను రాసిన పోస్ట్ చూసిన స్వాతికుమారి గారు రాయలవారి వేషంవేసి, “శ్రీరాం! ఈ సమస్యని పూరించండి చూద్దాం” అంటూ దీన్ని నాకు గుర్తుచేసారు. నా శాయశక్తులా ప్రయత్నించి ఇలా పూర్తిచేసా:

కం: గింజలు పండక కర్షకు
    లంజలిపట్టిరి కొలువుల నడుగుచు దొరలన్!
    బంజరు లయ్యెను భూములు
    కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్!

ఎవరి దయాదాక్షిణ్యాలమీదా ఆధారపడక భూమితల్లిని నమ్ముకుని స్వతంత్రంగా మదపుటేనుగుల్లా ఎంతో స్వాభిమానంతో జీవించే శ్రమజీవులు మన రైతులు. కానీ ఈరోజుల్లో వారి పరిస్తితి ఎంత దయనీయంగా మారిందో మనం చూస్తున్నదే. వ్యవసాయాన్నీ భూములనీ వదులుకుని చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో యజమానుల దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్నారు. ఇది చూస్తే నాకు ఏనుగులు దోమనోట్లో దూరినట్టే అనిపించింది.

మరి నాపూరణ చూస్తే రాయలవారికేమనిపించిందో! 🙂

ప్రకటనలు

12 వ్యాఖ్యలు »

 1. ఆహా!! యాదృచ్ఛికమేమో కొన్ని గంటల క్రితమే ఈ సినిమా మరొక్కసారి చూశాను. ఈ సినిమా తమిళంలో కూడా శివాజీగణేశన్ని తెనాలిరామునిగా పెట్టి తీశారు. నిన్న ఒక తమిళ స్నేహితుడు ఆ సినిమా చూస్తున్నాడు. అందులో మన రాయలవారిని (రామారావును) చూసి నేనూ చూశాను. తరువాత అతనికి మన సినిమా చూపిస్తూ అందులోని పద్యాల అర్థాలు చెబుతూంటే అతడు ఆసక్తిగా వింటూ ఎంతో ఆనందించాడు. మీ పూరణ అదరహో! వర్తమానానికి సరిగ్గా నప్పింది. రాయలవారు తప్పక ఆనందించేవారు. తెనాలిరాముని మొదటి పూరణలో మూడో పాదంలో వచ్చిన మొదటి రెండక్షరాలూ శీరాముని పూరణలో రెండో పాదంలో రావడం యాదృచ్ఛికం. 🙂 “మీ బుద్ధికి రెండు ప్రక్కలా పదునే రామకృష్ణయ్యా” అనేది ఆ సినిమాలో కృష్ణదేవరాయని మాట. “నాలుకకు” అంటే అంత బాగలేదు.

  వ్యాఖ్య ద్వారా రానారె — జూలై 5, 2007 @ 1:54 సా. | స్పందించండి

 2. బెంగళూరు బ్లాగర్లు చాలా మందే ఉన్నట్టున్నారు…బెంగళూరు బ్లాగర్ల సమావేశం ఇటీవలే జరిగింది..విశేషాలు ఇక్కడ చదవండి: http://mpradeep.blogspot.com/2007/07/blog-post.html

  వీలుంటే..వచ్చేసారి హాజరు కావటానికి ప్రయత్నించండి

  వ్యాఖ్య ద్వారా gsnaveen — జూలై 5, 2007 @ 2:13 సా. | స్పందించండి

 3. మీ కవన పటిమ అధ్భుతం keep it up…….

  వ్యాఖ్య ద్వారా Manohar — జూలై 5, 2007 @ 8:46 సా. | స్పందించండి

 4. భలేభలే! లోకానికి అన్నదాతలైన రైతులు నేడు క్షుద్రరాజకీయులముందు అర్థులుగా మారిన వైనాన్ని ఆర్ద్రతతో వెల్లడించావు.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — జూలై 5, 2007 @ 11:50 సా. | స్పందించండి

 5. రానారె గారూ: తమిళులకి కూడా ఈ మహానుభావుడితో పరిచయం ఉందన్నమాట. మరి పద్యాలు అనువదించలేరు కనక దానికి ఏం చేసారో.

  నవీన్ గారూ: బెబ్లాస గురించి తెలుసండీ. నేను ఊళ్ళోలేకపోడంవల్ల రాలేకపోయాను. వచ్చేసారి తప్పక రావాలని అనుకుంటున్నా…

  మనోహర్గారూ: ధన్యవాదాలు.

  గురువుగారూ: ధన్యోస్మి 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 8, 2007 @ 10:57 సా. | స్పందించండి

 6. hi..i was thinking it was the same tenali rama post and wasnot reading the new part of it…
  was mistaken. nice way of putting the present problem into the poem..nice one.

  వ్యాఖ్య ద్వారా josh — జూలై 9, 2007 @ 8:28 సా. | స్పందించండి

 7. Thanks Deepti… 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 10, 2007 @ 12:21 ఉద. | స్పందించండి

 8. “అసలు అసలే. నకలు నకలే.” అన్నాను నా తమిళ మిత్రునితో. కానీ ఆ సినిమాలో మేక-తోక పద్యం స్థానే అర్థమంతమైన అలాంటి పద్యాన్నే చెప్పారని అతడన్నప్పుడు నా అభిప్రాయాన్ని సవరించుకోవలసి వచ్చింది.

  వ్యాఖ్య ద్వారా రానారె — జూలై 11, 2007 @ 10:49 ఉద. | స్పందించండి

 9. మీ పూరింపు కూడా బాగుంది. వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టింది. అదరహో!
  సోమ శంకర్

  వ్యాఖ్య ద్వారా kollurisomasankar — జూలై 11, 2007 @ 12:24 సా. | స్పందించండి

 10. raanaare: thats interesting!

  Somasankar gaaru: dhanyavaadaalu.

  వ్యాఖ్య ద్వారా Sriram — జూలై 12, 2007 @ 12:06 ఉద. | స్పందించండి

 11. మీ పూరణ చాలా బావుంది. గొప్పగా చెప్పారు.

  మీరు నమ్మరు, నిన్ననే నేను సంకా రామకృష్ణ గారు అంతర్జాలంలో పెట్టిన కొన్ని లంకెలు చదువుతూ ఉంటే ఇవే రెండు పద్యపూరణలూ తారసపడ్డాయి. చాలా సేపు నవ్వుకున్నాను.

  తెనాలిరామకృష్ణ చిత్రం నేను చూడలేదు, కొన్ని సన్నివేశాలు అక్కడ ఇక్కడా చూడడమే. కాని పైపద్యాలు ఆయన ఎలా చెప్పి ఉంటాడా అని ఊహించుకుంటుంటే మనసులో నాగేశ్వరరావు వదనమే మెదులుతోంది.

  ఇక ఈ సినిమా దొరికించుకునే ప్రయత్నాలలో ఉంటా మరి.

  వ్యాఖ్య ద్వారా Giri — అక్టోబర్ 19, 2007 @ 8:50 సా. | స్పందించండి

 12. edhi chala baga naku nachindhi

  వ్యాఖ్య ద్వారా nalla milli chinna reddy — అక్టోబర్ 24, 2011 @ 4:04 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: