సంగతులూ,సందర్భాలూ….

మే 29, 2007

తెనాలి రాముడి వికటకవిత్వం, నా పైత్యం!

తెనాలి రాముడి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి చిన్నప్పుడు విన్న చమత్కారపు కధలూ అందులోని హాస్యమూను. నిజానికి ఇలా పిల్లలని ఆకట్టుకునే చారిత్రక పాత్రలు మనకి చాలానే ఉన్నాయి. బీర్బల్, మర్యాద రామన్న వగైరాలు. కానీ తెనాలి రాముడి ప్రత్యేకత ఏమిటంటే ఆయన పిల్లలతో పాటు పెరుగుతూ వస్తాడు. అమ్మ వారి చేతుల్లోని రెండు గిన్నెల్లో పాయసమూ తాగేసిన కధ వినే వయసు దాటేసరికి గూని చాకలి వాడి కధ దొరుకుతుంది. ఇంకొంచెం పెద్దయ్యేప్పటికి భావతురంగం కధ ఆకట్టుకుంటుంది. ఇంక కధలు వినే వయసు దాటేసరికి ఆయన చాటువులు, సమస్యా పూరణలూ ఆస్వాదించమని ఆహ్వానిస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం అభిరుచి, చెప్పేవాళ్ళు ఉండాలి. ఇక ఈ స్థాయి దాటితే పాండురంగమహత్యం చదవచ్చు.

ఇలా ఆబాలగోపాలన్నీ ఆకట్టుకునే తెనాలి రాముడి వికటకవిత్వపు విన్యాసాలలో ఒక సమస్యా పూరణ నాకు ఈ మధ్య రాఘవ గారి బ్లాగు ద్వారా గుర్తొచ్చింది. ఇది ఏదో ఒక సినిమాలో కూడా విన్న గుర్తు (ఆదిత్య 369 అనుకుంటా). సమస్య ఏమిటంటే

బలరాముడు సీతజూచి ఫక్కున నగియెన్!

అడిగేవాడికి చెప్పే వాడు లోకువని కాకపోతే, ఎక్కడో త్రేతాయుగంలోని సీతమ్మవారిని ద్వాపరయుగంలోని బలరాముడు చూడడమేమిటి! పైగా చూసి ఫక్కుమని నవ్వేడు కూడాట. ఇదంతా ఎలా సరిపెట్టాలి? చూడటానికి అసంబద్ధంగా ఉన్నా ఈ సమస్యలో ఒక అందం ఉంది. అది కవికి మాత్రమే కనపడుతుంది. అందుకే తెనాలి రాముడు ఇలా పూర్తి చేసాడు:

లలనలు పాయస మానిన
కలుగుదురే బిడ్డలంచు క్ష్మాసుతనవ్వన్  
పొలమున దొరికెదరని ధీ
బలరాముడు సీత జూచి ఫక్కున నగియెన్!

చోద్యం కాకపోతే ఎక్కడైనా ఆడవాళ్ళు పాయసం తింటే పిల్లలు పుడతారా అని సీతమ్మవారు శ్రీరాముడిని వేళాకోళం చేస్తే, బుద్ధిబలుడైన రాముడు “కాదులే పొలాల్లో దొరుకుతారట” అని తానేమీ తక్కువ కాకుండా సమాధానం ఇచ్చాడుట.

ఇంత అందమైన భావనలతో హాస్యాన్ని పండిచాడుకనకనే ఆయన మన తెలుగు వారిలో హాస్యానికి మరో పేరుగా నిలిచిపోయాడు.

బలరాముడిని ధీబల రాముడి గా మార్చేసుకోడం కుదిరింది కాబట్టి ఆ పై మూడు పాదాల్లోనూ అద్భుతమైన భావాన్ని నింపి ఒక గొప్ప పద్యంగా ఆ సమస్యని పూరించాడు తెనాలి రాముడు.

ఐతే అన్నిసార్లూ ఇలాంటి వెసులుబాటు ఉండదు. ఉదాహరణకి రాఘవగారు ఈ మధ్య ఇచ్చిన సమస్య:

రావణు చెల్లి ద్రౌపదిని రాముడు యెత్తుకు పోయె చక్కగా

ఈ సమస్యని ఎలా మార్చినా ఒక అర్ధవంతమైన పద్యం చెప్పడం కష్టం. తెనాలి రాముడి లాంటి కవుల సంగతేమో కానీ నాబోటి వారి వల్ల అయ్యే పని కాదు. ఇలాంటప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునేది క్రమాలంకారం. ఉదాహరణకి నా పూరణ చూడండి:

కావరమొంది రామునికి కామము దెల్పినదెవ్వరు? ద్యుతిన్
పావకుడిచ్చెనెవ్వరిని పార్ధుని మామకు? కష్టమందు సు
గ్రీవుని గాచెనెవ్వరది?కృష్ణుడు రుక్మిణినేమి చేసెనో?
రావణుచెల్లి, ద్రౌపదిని, రాముడు, యెత్తుకు పోయె చక్కగా !

వరుసగా కొన్ని ప్రశ్నలు, అదే వరుసలో వాటికి సమాధానాలు.

ప్రశ్నలూ సమాధానాలూ చూడండి:

1. పొగరెక్కి శ్రీరాముడి వద్ద కామాన్ని కోరినది ఎవరు? రావణు చెల్లి (శూర్పణఖ)
2. పావకుడు (అగ్ని) మంచి కాంతితో, పార్ధుని (అర్జునుడి) మామగారికి ఎవరినిచ్చాడు? ద్రౌపదిని, ఆవిడ యజ్ఞగుండంలోంచి పుట్టింది.
3. సుగ్రీవుడు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసింది ఎవరు? శ్రీరాముడు
4. కృష్ణుడు రుక్మిణిని ఏమి చేసాడు? చక్కగా ఎత్తుకుపోయాడు

ఇలా ముప్పతిప్పలూ పడి ఈ ఉత్పలమాలని పూర్తి చెయ్యవలసి వచ్చింది. రాఘవగారికి నా పూరణ నచ్చుతుందని ఆశిస్తూ, తెనాలి రాముడి పద్యం కింద నా పద్యం రాసినందుకు ఆ మహాకవికి క్షమాపణలు తెల్పుకుంటున్నాను.

ప్రకటనలు

23 వ్యాఖ్యలు »

 1. బాగుందండీ మీ పూరణ.వికటకవికి ఏ మాత్రం తీసిపోలేదు.
  రాఘవ గారి మిగితా పూరణలు కూడా పూరించండి.

  వ్యాఖ్య ద్వారా Lalitha Sravanthi — మే 29, 2007 @ 10:12 ఉద. | స్పందించండి

 2. ఈ మధ్య తెనాలి రామలింగడి మీద తెలుగులొ ఒక మంచి పుస్తకం ఒచ్హిందని ది హిందులో సరొజిని ప్రేంచంద్ గారి పరిచయం చదివాను – మీరు ఇక్కడ చదవవొచ్హు:

  http://tinyurl.com/3bf2y2

  వ్యాఖ్య ద్వారా netizen — మే 29, 2007 @ 10:57 ఉద. | స్పందించండి

 3. మీరన్నట్లుగా నేనిచ్చిన సమస్యల్లాంటి వాటికి సమాధానం చెప్పి ఆదుకోగలిగినది క్రమాలంకారం తప్పితే వేరేదేదీ లేదని నా అభిమతం కూడాను. పూరణ బాగుంది. కాకపోతే ఒక్క అనుమానం — “ద్యుతిన్” అన్నది వేరే పదం (వేరే వాక్యం కూడా) కాబట్టి “ద్యు” ముందర వున్న “తెల్పినదెవ్వరు”లో “రు” గురువు కాదేమోనని. కానీ, చదువుతుంటే మాత్రం తేడా తెలియటం లేదు. బహుశా ఈ వెసులుబాటు తెలుగు చందస్సులో వుందేమో. ఏదేమైనా శ్లాఘనీయమైన ప్రయత్నం, చక్కటి పూరణ.

  వ్యాఖ్య ద్వారా రాఘవ — మే 29, 2007 @ 11:16 ఉద. | స్పందించండి

 4. baavundi :–)

  వ్యాఖ్య ద్వారా chetana — మే 29, 2007 @ 11:31 సా. | స్పందించండి

 5. i never knew the meaning of the first one even though i heard it a dozen times thru aditya 369.. that was a strong answwer! hmm and the second one was really an effort.. i don knw the technicalities in it..but sounds well knitted!

  వ్యాఖ్య ద్వారా joshmybench — మే 30, 2007 @ 12:19 ఉద. | స్పందించండి

 6. ఈ మద్య జరిగిన మేడసాని మోహన్‌గారి అవధానంలో కూడా ఇలాంటి సమస్యను, ఇలానే పూరించడం విన్నాను/చదివాను. సమస్యకూడా దాదాపు ఇలానే ఉంది. రావణుచెల్లితోనే మొదలవుతుంది, కాకపోతే మిగతా పదాలు కొంచం మార్పనుకుంటా..

  వ్యాఖ్య ద్వారా వెంకట రమణ — మే 30, 2007 @ 12:21 ఉద. | స్పందించండి

 7. లలితగారూ…ధన్యవాదాలు. అంత మాటకి అర్హతలేదు లెండి. తప్పక ప్రయత్నిస్తాను.

  నెటిజెన్ గారూ…మంచి లింక్ ఇచ్చారు. ధన్యవాదాలు.

  రాఘవ గారూ ధన్యోస్మి. మీరు చెప్పిన నియమం కేవలం రేఫకి(ర వత్తు) మాత్రమే అని విన్నాను. మిగిలిన వత్తులన్నింటికీ వేరే పదమైనా పర్లేదేమో. తప్పని తెలిస్తే దిద్దుకుంటాను.

  చేతన గారూ, దీప్తి గారూ….ధన్యవాదాలు

  వెంకటరమణ గారూ…..నాకీ సంగతి తెలీదు. మీ దగ్గర ఉంటే ఆ పూరణ మాతో దయచేసి పంచుకోండి.

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 30, 2007 @ 1:23 ఉద. | స్పందించండి

 8. పద్యం బాగుంది. ఉత్పలమాల పద్యం రాస్తూ ముందర ఉ|| అని రాస్తేకదా దానికొక మర్యాదామన్ననా!? 🙂
  ఈ మాలలూ, దూలాలు, మత్తేభాలు చూస్తే నాకు భయంగా ఉంటుంది.
  ఆడలేక మద్దెల ఓడు అనికాదుగానీ, చిన్న పద్యాలను చదివేటప్పుడు కనబడే సొగసు వీటిలో నాకు అందదు.
  ఐనా సరే, మీ స్ఫూర్తితో త్వరలో నేర్చుకుంటా. మీరే నేర్పాలి మరి.

  వ్యాఖ్య ద్వారా రానారె — మే 30, 2007 @ 6:05 ఉద. | స్పందించండి

 9. nice!

  వ్యాఖ్య ద్వారా chetana — మే 30, 2007 @ 8:21 ఉద. | స్పందించండి

 10. శ్రీరామ్‌గారు, ఇదిగోండి లంకె

  http://www.eenadu.net/archives/archive-27-3-2007/htm/weekpanel1.asp

  ఉదాహరణకు… ‘రావణుని పత్ని సీతమ్మ రాము చెల్లి’ ఈ సమస్యను రాళ్లబండి కవితాప్రసాద్‌ను అడిగారు. సీతమ్మ రావణుడికి భార్య, రాముడికి చెల్లెలూ అవుతుందా? అదెలా సాధ్యం? ఆ సమస్యను అవధాని చమత్కారంతో ఇలా మార్చేశారు.

  సీత రాకడ నెదిరించెనే తరుణియ?
  రామ కథలోని శక్తి యే లేమ చెపుమ?
  భరతు డమ్మాయి యైనచో వరుస వరుస –
  రావణుని పత్ని, సీతమ్మ, రాము చెల్లి

  వ్యాఖ్య ద్వారా వెంకట రమణ — మే 30, 2007 @ 9:31 ఉద. | స్పందించండి

 11. చాలా బాగా పూరించారండి.ఇంతకీ రాఘవగారి మనసులోని పూరణ ఏమిటో?

  వ్యాఖ్య ద్వారా radhika — మే 30, 2007 @ 7:43 సా. | స్పందించండి

 12. నేను చందస్సు శాస్త్రీయంగా యెవరివద్దనో నేర్వలేదు, అందువల్ల నాకు యిటువంటివాటిపై సంపూర్ణావగాహన లేదు. చందశ్శాస్త్రాధ్యయనం చేసినవారికి తెలియాలీ లోటుపాట్లు. అయినా,
  “… జిఘాం
  సానిరతప్రసూనశరచాపగుణధ్వనులో …”
  అని ఉత్పలమాలలో నంది తిమ్మయ ప్రయోగం కూడా వున్నందువల్ల, చందస్సులో శబ్దానికి చాలా ప్రాముఖ్యం వుందని తెలుస్తోంది.

  వ్యాఖ్య ద్వారా రాఘవ — మే 31, 2007 @ 9:07 సా. | స్పందించండి

 13. రానారె…ఈసారికి ఇలా వదిలెయ్యండి. చింతబర్ర తియ్యకుండా
  రమ్నణగారూ…మంచి లంకె. చాలా థాంకులు.
  రాధికగారూ…ధన్యవాదాలు. రాఘవగారి పూరణకోసం నేనూ చూస్తున్నా.
  రాఘవగారూ…శాస్త్రీయంగానో కాదో కానీ, నేను ఛందస్సులో కొన్ని కిటుకులు మా గురువు గారి దగ్గర నేర్చుకున్నా…మరేమిటో ఆయనేమీ మాట్లాడడంలేదు. రాయద్దంటే రాస్తున్నాడని కోపమేమో
  ఔనండీ…ఈ మధ్య సులక్షణసారం ఆంధ్రభారతి.కాం లో చదివాను. యతులు నియమాలూ అవీ చూస్తుంటే అనిపించింది, ఛందస్సంటే ఏదో అర్ధంలేని బంధం కాదు, ఎంతో శాస్త్రీయంగా భాషనీ, ధ్వనినీ అధ్యయనం చేసి రూపొందించిందీ అని.

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 31, 2007 @ 10:54 సా. | స్పందించండి

 14. నా పూరణకోసం చూస్తున్నానన్నారుగా. ఇదిగో నా పూరణ, కొంచెం తేడాగా వుంటుంది. ముందు నేను కూడా మీలాగే పదచ్ఛేదం చేశాను (సమస్య ఇచ్చేటప్పుడు). కానీ ఒకే భావాన్ని యిద్దరు రెండు రకాలుగా చెప్తే అంత బాగుండదేమో అనిపించి, వేరేలా పదచ్ఛేదం చేసి, ఆఖరికి యిలా పూరించాను.

  ఉ.దేవతలందరూ యెవని దైన్యము కోరిరి త్రేతయందు? కో
  కన్ వడినిచ్చి మాధవుడు కాచిన దేరిని? సీత భర్త? సం
  జీవని పర్వతంబు గని శీఘ్రమె మారుతి యేమిజేసెనో?
  రావణు, చెల్లి ద్రౌపదిని, రాముడు, యెత్తుకుపోయె చక్కగా.

  శ్రీరామ్‌గారిలా వ్రాయాలంటే,
  (1)త్రేతాయుగంలో దేవతలందరూ ఎవరి పతనాన్ని కోరారు? రావణాసురుని
  (2)శ్రీకృష్ణుడు సమయానికి వేగంగా స్పందించి చీరెనిచ్చి కాపాడినదెవ్వరిని? వరసకు చెల్లెలైన ద్రౌపదిని
  (3)సీతాదేవి భర్త ఎవరు? (చాలా సులభం) శ్రీ రాముడు
  (4)సంజీవనీ పర్వతాన్ని చూసి ఓషధి వెతకటానికి సమయం తక్కువ వుందని హనుమంతుడు వేగంగా చేసిందేమిటి? సంజీవనీ పర్వతాన్ని యెత్తుకుపోవటం!

  వ్యాఖ్య ద్వారా రాఘవ — జూన్ 1, 2007 @ 2:35 సా. | స్పందించండి

 15. సెహబాస్! మంచి తెలివైన పూరణ. నేను కూడా “సీత భర్త?” అని సరిగ్గా అదే ప్రాంతంలో వాడదామనుకున్నా ముందర 🙂
  ఒక సందేహం ఏమిటంటే, రెణ్డవ పాదంలో ద్రుతం వల్ల ప్రాస చెడినట్టా అని. మరి ఇది ఎవరినైనా అడగాలి.

  వ్యాఖ్య ద్వారా Sriram — జూన్ 2, 2007 @ 7:09 సా. | స్పందించండి

 16. enti? busy ga unnara? malli postE ledu?

  వ్యాఖ్య ద్వారా chetana — జూలై 3, 2007 @ 11:40 సా. | స్పందించండి

 17. […] తెనాలిరాముడి గురించి నేను రాసిన పోస్ట్ చూసిన స్వాతికుమారి గారు రాయలవారి […]

  పింగ్ బ్యాక్ ద్వారా తెనాలిరాముడి వికటకవిత్వం, నా పైత్యం (కొనసాగింపు…) « సంగతులూ,సందర్భాలూ…. — జూలై 5, 2007 @ 10:52 ఉద. | స్పందించండి

 18. నాకున్నూ ఛందస్సు తెలీదు కానీండి, రాఘవగారన్నట్టు ద్యు వల్ల రు గురువు కాదెమోఅనే అనుకుంటున్నాను.
  దెవ్వరే లేక దెవ్వరో అంటె వచ్చే ఇబ్బందీ లేదు. ఐతే కామము తెల్పినదెవ్వరు అంటె నాకు కొంచమ్ ఇబ్బంది గా అనిపించింది.ఈ నేపధ్యం( context ) లో బహుశః ‘తెల్పటానికి’ ‘వ్యక్తపరచటానికి’ – తేడాఉందేమో ..కావరమొంది రాఘవుని కౌగిలి కోరిన దెవ్వరో అనికూడా అనచ్చు అనుకుంటాను

  వ్యాఖ్య ద్వారా vookadampudu — జూలై 27, 2007 @ 1:16 సా. | స్పందించండి

 19. ammo, na peru tho moodu comments chesina ee rendo chetana evaru? cinemallo tappipoyina twin sister ni 20 yella tarvata modatisaari chusinattu ga undi.

  BTW, padyam, purana rendoo bagunnayi

  వ్యాఖ్య ద్వారా chetana — ఆగస్ట్ 4, 2007 @ 12:19 ఉద. | స్పందించండి

 20. ఊకదంపుడుగారూ, మీరు చెప్పిన మార్పు చాలా బాగుంది. ధన్యవాదాలు.

  chetanagaaru, thanks. btw, that other chetana garu is an acquaintace from some other forum.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 9, 2007 @ 11:33 సా. | స్పందించండి

 21. శ్రీరాం గారు మీకోసం ఓ సమస్య ( అందరికోసం కూడా అనుకోండి)
  గర్భము దాల్చెను పురుషుడు గంగలొ మునుగన్

  ఓ పురుషుడు గంగలోమునిగి గర్భం దాల్చాడుట. మీ శ్రమ తగ్గించటం కోసం కాపలావాడి దగ్గర పూరణ నేనే ఇస్తున్నాను. రాయలవారి వద్ద పూరణ మీరివ్వండి.

  దర్భతొ నాలుక జీరెద;
  కర్బనపు జలములద్రావు కల్లు మహిమె?సం
  దర్భమె? ఎటఎవ్వం?డే
  గర్భము దాల్చెను? పురుషుడు? గంగలొ మునుగన్?

  [*కర్బనపు జలములద్రావు కల్లు – సోడా కలిపిన కల్లు?]

  రాఘవ గారి పూరణ్లో కోకన్ వల్ల – ఇది గుర్తొచ్చింది:- ఈ మధ్య ఇలాంటి సమస్యే మేడసాని మోహన్ గారికి రాపాకవారిస్తే – ఆ సభలో అధ్యక్షులవారు క్లిష్ట ప్రాస అన్నట్టు వున్నారు. బిన్‍లాడన్ బుష్ కలిసి బీరు తాగారని సమస్య, ( కందం) బిన్‍లాడన్ లొ బి కి బీరు లొ బి కి యతి. పాదం చంధోబద్ధంగా గుర్తులేదు. సమస్య/పూరణ ఆ అవధానాన్ని చూసినవాళ్లెవరైనా చెప్పాలి.

  వ్యాఖ్య ద్వారా vookadampudu — ఆగస్ట్ 13, 2007 @ 1:13 సా. | స్పందించండి

 22. ఊ.దం. గారూ, తిన్నంగా ఉండక పద్యాలంటూ ప్రకటించేసినందుకు బాగా బుద్ధి వచ్చింది 🙂 ఇలాంటి దుష్కర ప్రాసలతో బాంబులు వెయ్యడం న్యాయమా?

  ఏమైనా, వెనక్కితగ్గడం ఆంధ్రుల లక్షణం కాదు. ఒకటి రెండు రోజులు గడువివ్వండి ప్రయత్నిస్తాను.

  కాపలా వాడిదగ్గర పూరణ అదరహో. కానీ “కర్బనపు” లో “భ” లేదుకదా.ప్రాస సరిపోతుందా అని సందేహం. నేనుకూడా ఇలా వాడుకోచ్చా?

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 13, 2007 @ 10:26 సా. | స్పందించండి

 23. […] ఊకదంపుడుగారు ఈ బాంబు పట్టుకొచ్చి నా బ్లాగులో పడేసారు. […]

  పింగ్ బ్యాక్ ద్వారా కొత్త సమస్యలు « సంగతులూ,సందర్భాలూ…. — ఆగస్ట్ 14, 2007 @ 4:14 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: