సంగతులూ,సందర్భాలూ….

మే 9, 2007

ఫలరాజం!

Filed under: కబుర్లు,తెలుగు పద్యం — Sriram @ 12:20 సా.

వేసవికాలం వచ్చిందంటే చాలు, ఆంధ్రదేశంలో ఏ ప్రాంతం నుండి బయలుదేరే రైలు ఎక్కినా మనలని స్వాగతించేవి మామిడి పళ్ళ ఘుమఘుమలూ, బెర్తులమీద ఆవకాయ డాగులూ! విశ్వవ్యాప్తమైన తెలుగువాడి “వాడికి” ఈ రెండు పదార్ధాలూ ముఖ్యకారణమని నాకు అనిపిస్తుంది. “వాడి” సంగతేమో కానీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయని గిట్టనివాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు కానీ అది మనం పట్టించుకోవలసిన విషయం కాదు. ఈ విషయంలో నాకు మా పక్కింటి దివాకరం గాడు ఆదర్శం. ఒకేరోజు పరకన్నర మామిడి పళ్ళు ఫలహారం చేసిన రికార్డు మా ఊళ్ళో ఇంకా వాడి పేరు మీదే పదిలంగా ఉంది.

ఇంతకీ ఈ పరక అంటే ఏమిటన్న సందేహం కొంతమందికి రావచ్చు. కుదిరితే కొబ్బరి బొండాలు కూడా కేజీల లెక్కన అమ్ముదామని చూసే హైదరాబాదు లాంటి నగరాలలో ఈ పదం తెలియకపోవడం చిత్రమేమీ కాదనుకోండి. పరక అంటే పన్నెండు పళ్ళు. దానికి కొసరుగా రుచి చూడడానికి ఒక పండు. అంటే మొత్తం పదమూడు అన్నమాట. అసలు మామిడి పళ్ళు తినడమే కాదు, కొనడం కూడా మహా సరదాగా ఉండేది. వీధిని వచ్చిన ప్రతీ మామిడిపళ్ళ బుట్టనీ ఆపడం, వాడితో బేరాలు, తరవాత రుచి చూడడం కోసం పోటీలూ…అంతా అయ్యాకా ఎండవేడికి బాగా వేడెక్కిన ఆ పళ్ళు తీసుకొచ్చి నీళ్ళ తొట్టిలో వెయ్యడం…ఇదంతా అనుభవేకవేద్యమైన ఆనందం. 

ఇదికాక, ఇంట్లో మామిడి పళ్ళు ముగ్గించడం అనేది మరొక విశిష్టప్రక్రియ. కొట్టుగదినిండా గడ్డిపరచి, దాని మీద పొరలుగా మామిడికాయలూ, గడ్డీ పేర్చుకుంటూ వెళ్ళడం, తరువాత మామిడి పళ్ళు కుళ్ళిపోకుండా సరైన సమయంలో వాటిని బయటికి తియ్యడం అంతా ఒక పెద్ద శాస్త్రమే. పిల్లకాయలు మాత్రం అవి త్వరగాముగ్గాలని ఆ గది బయటే తపస్సు చేస్తూ ఉండడం బాల్యంలోనే ఒక మధురమైన విరహం,ఎదురుచూపు. 

ఇక ఈ మామిడిపళ్ళలో రకాలు ఇన్నీ అన్నీ కాదు.  హైదరాబాదులోనే కాక, విశ్వ విఖ్యాతమైన బంగినపల్లి మామిడిపండు గొప్పతనం నేను చెప్పక్కల్లేదు. విశాఖపట్నం బీచ్ లో కలెక్టరు మామిడి కాయ ముక్కలు కారంలో ముంచుకు తినడం, అదొక యోగం అనే చెప్పాలి. ఇంక దక్షిణ కోస్తా జిల్లాలలో దొరికినన్ని రకాలు ఇంకెక్కడా దొరకవేమో. నూజివీడు రసాలు, పెద్ద రసాలు, సువర్ణ రేఖ లాంటివే కాకుండా కొత్తపల్లి కొబ్బరి,పాపయరాజు గోవా,పంచదార కలశ లాంటి స్థానిక రకాలు నోరూరిస్తూ ఉంటాయి.

చిన్నప్పుడు మా మాస్టారు తీసుకెళ్ళిన క్విజ్ పోటీలో “రస రాజం అని దేనినంటారు?” అని అడగగానే నేను అత్యుత్సాహంతో బజర్ నొక్కి “మామిడి రసం” అని సమాధానం చెప్పగానే అందరూ నవ్వారు కానీ, మా మాస్టారు మాత్రం ఆ విషయంలో నా అజ్ఞానానికి ఆనందపడ్డట్టే నాకనిపించింది. రసరాజం సంగతి అలా ఉంచితే, కవులుఅందులోనూ తెలుగు కవులు మాత్రం మామిడిని ఫలరాజం అనే పొగిడారు. నా చిన్నప్పుడు నేర్చుకున్న ఈ మత్తేభ పద్యం చూడండి:

ఫలచూడామణి చూతమెల్లయెడలన్ భాసిల్ల జంబూఫలం

బులు నల్లబడె లజ్జ, కొబ్బరిఫలంబుల్ భీతి నీరయ్యెలో

పల వృక్షంబుల మీద నుండియున్, కోపస్ఫూర్తి శూలాళి రొ

మ్ముల జిందెన్ పనసంబు, దాడిమ ఫలంబుల్ వ్రక్కలయ్యెన్ హృదిన్!

పళ్ళలో చూడామణిగా మామిడి పండు ప్రసిద్ధి పొందడంతో నేరేడు పళ్ళు లజ్జతో ముఖం మాడ్చుకుని నల్లగా అయ్యాయిట. కొబ్బరి కాయ అంత ఎత్తున ఉండి కూడా లోపల నీరు కారిపోయిందిట. కోపమూ, అసూయ పెరిగి పనసపండు ఒళ్ళంతా శూలాలు గుచ్చుకుందిట. ఇంక దానిమ్మ పండు మధ్యలోకి బద్దలయ్యిందిట.(తెలియని పదాల అర్ధాలు తెలుసుకోడానికీ, మీ తెలుగుని మెరుగు పరుచుకోడానికీ, నేడే చూడండి! మీ అభిమాన ఆన్లైన్ వెర్షన్లో! బ్రౌన్ నిఘంటువు) 

పద్యంలో చమత్కారం బాగుంది కదూ! ఈ అందమైన పద్యం రాసింది వడ్డాది సుబ్బరాయ కవి గారు. ఈయన రాజమహేంద్రవరంలో ఉండేవారుట. భక్త చింతామణి అనే శతకం ఒకటి ఈయన రచించారని గుర్తు.

మామిడి పండుని తలుచుకోగానే ఇన్ని సంగతులు గుర్తొచ్చాయి. దాని మహిమ అలాంటిది. కానీ ఈ మధ్య సరైన మామిడిపండు తినే చాలారోజులైంది. ఈ సారైనా మంచిపళ్ళు మార్కెట్లోకి వస్తాయేమో చూడాలి. 

ప్రకటనలు

20 వ్యాఖ్యలు »

 1. అసలు ఎండాకాలం సందడంతా మామిడి పండుదేగా.
  రసాలు తినటం, ఇల్లంతా పూయటంలాంటి ఘన కార్యాలు గుర్తొస్తే బాగుంటుంది.

  వ్యాఖ్య ద్వారా swathi — మే 9, 2007 @ 2:35 సా. | స్పందించండి

 2. మీరిలా వూరిస్తే మేమెక్కడికెళ్ళి చావాలి? 😦

  ఈతపళ్ళు, రేగుపళ్ళు, పనస తొనలు, జామ పళ్ళు అయ్యొయ్యో నోరూరిపోతోందే!

  –ప్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — మే 9, 2007 @ 8:15 సా. | స్పందించండి

 3. భారతీయ మామిడి పళ్ళు ఇక త్వరలో అమెరికాలో దొరుకుతాయట!

  http://travel2.nytimes.com/2006/05/10/travel/10mumbailetter.html

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మే 9, 2007 @ 9:13 సా. | స్పందించండి

 4. శ్రీరామా, పద్యం నూజివీడు చిన్నరసమంత రుచిగా ఉంది. మా పిన్నీ వాళ్ళు ఆగిరిపల్లి (విజయవాడ నించి నూజివీడు వెళ్ళే దారిలో వస్తుంది) లో ఉండే వాళ్ళు. వాళ్ళింటో ఉండేది ఈ ఆచారం, టోకున కొని గదిలో మగ్గించడం. వేసవిలో వాళ్ళింటికో ట్రిప్పు గారంటి అన్నమాట. దక్షిణాదిన సేలం పళ్ళు అని ఒక వెరైటీ. మన రసాలకంటే కూడా చిన్నగా ఉన్నా, కండ పట్టి ఉఇంటుంది. మందపాటి ఆకుపచ్చ తోలు, లోపల కేసరి రంగు పండు. రుచికంటే కూడా సువాసన ఘుమఘుమలాడి పోతుంది. ఎన్నో తీపి (శ్లేష ఉద్దేశపూర్వకమే) గుర్తుల్ని రేపావు నీ ఈ టపాతో!

  డేవిడ్ డేవిడర్ అనే భారతాంగ్ల రచయిత నీలి మామిళ్ళ ఇల్లు (House of blue mangoes) అనే నవల రాశారు – మామిడి పండంతా రుచిగానూ ఉంటుంది.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మే 9, 2007 @ 9:26 సా. | స్పందించండి

 5. mugginchadam enti? magginchadam 😀

  వ్యాఖ్య ద్వారా chetana — మే 9, 2007 @ 10:46 సా. | స్పందించండి

 6. మీమీద చాల కోపం వచ్చేస్తుంది నాకు.ఎందుకు ఇలా మామిడిపళ్ళ తో పాటూ వేసవి జ్ఞాపకాలను కదిలిస్తున్నారు.ఇప్పటికే సగం కుళ్ళిపోయాను మామిడి పళ్ళు తినలేకపోతున్నాను అన్న బాధ తో. మీకో విషయం తెలుసా దొంగతనం గా చెట్టు నుండి కోసి తిన్న మామిడి కాయలు భలె రుచి గా వుంటాయి.

  వ్యాఖ్య ద్వారా radhika — మే 9, 2007 @ 10:58 సా. | స్పందించండి

 7. స్వాతిగారూ…నిజమే, భలే చిలిపి విషయాలు 🙂

  ప్రసాద్ గారూ…కొత్తపాళీగారు మీకు మంచి వార్తే వినిపించారు. నాకే భయమేస్తోంది, అమెరికాలోని తెలుగు జిహ్వలు పీల్చడం మొదలెడితే ఇక్కడ మాకు ఇంక ఏమీ మిగలవేమో అని… 🙂

  కొత్తపాళీగారూ…ఈ సేలంపళ్ళు పిడుచుకుతినేవా,కోసుకుతినేవా? 🙂
  పుస్తకాల దుకాణాల్లో ఈ పుస్తకం చాలా సార్లే చూసాను కానీ ఎప్పుడూ కొనే సాహసం చెయ్యలేదు. ఈ సారి ప్రయత్నిస్తాను.

  చేతనగారూ… మగ్గించడం వేరు. మామిడికాయలని ముగ్గవేయడం లేదా ముగ్గించడం అనే అంటారు. నాకు దన్నుగా బ్రౌణ్యం ఉంది 🙂
  ముగ్గవేయడం

  రాధిక గారూ…నాకూ ఇక్కడ మన రకాలేవీ దొరకవండీ…అందుచేత ఏదో ఇలా చెప్పుకుని ఆనందించడమే. అహ నా పెళ్ళంటలో కోట ని ఆదర్శంగా తీసుకుని. మరి ఇంక దొంగ పళ్ళ రుచి కూడా గుర్తు చేస్తే నేనేమి చెయ్యడం 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 9, 2007 @ 11:26 సా. | స్పందించండి

 8. chaka bhgundu kani pakka vadi tota palla ruci miss ayiindi

  వ్యాఖ్య ద్వారా veeraswamy — మే 10, 2007 @ 8:00 సా. | స్పందించండి

 9. సేలం పళ్ళు కోసుకు తినేవే. తొమ్మిదోక్లాసు పూర్తయ్యాక అనుకుంటా మొదటిసారి నేనొక్కణ్ణే సేలం వెళ్ళాను. నాతో ఒక డజను రసాలు పంపిస్తూ వీటిల్ని కొయ్యకూడదు, పిండుకు తినాలని చెప్పమని మా అమ్మ పదేపదే గుర్తుచేసింది బండెక్కేదాకా.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మే 10, 2007 @ 8:09 సా. | స్పందించండి

 10. వీరస్వామి గారూ…స్వాగతం!

  కొత్తపాళీ గారూ…ఈ పిండుకు తినడం మనకే సొంతం అనుకుంటా… 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 10, 2007 @ 10:38 సా. | స్పందించండి

 11. నేనిక్కడ ఒక పెద్ద వ్యాఖ్య రాశాను. Submit చేశాను. అది ఇక్కడ కనబడపోయేసరికి, మళ్లీ Submit చేశాను. Duplicate comment – అంది వర్డ్‌ప్రెస్సు. కానీ ఇక్కడ నేను రాసింది మాత్రం లేదు. 😦

  వ్యాఖ్య ద్వారా రానారె — మే 11, 2007 @ 8:48 సా. | స్పందించండి

 12. అయ్యో – ఏదో ఒక అద్భుతమైన వ్యాఖ్య కోల్పోయినట్టున్నాం మేమందరం. మీరు శ్రమ అనుకోక మళ్ళీ మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 12, 2007 @ 12:03 ఉద. | స్పందించండి

 13. man!! amma,avakaya anjali type loo– endakalam, mamidi pallu, kotta avakaya…mouth watering!
  nice read! vizag ni anavsaramga gurthu chesaru..( nenu marchi poledu anukondi!!).. i miss tati munjulu also!
  mmm pchhh..wat can we do?!!

  వ్యాఖ్య ద్వారా joshmybench — మే 12, 2007 @ 9:47 సా. | స్పందించండి

 14. hmm…what to do! even i am missing all these…anduke andaritO panchukODam.
  And yes, vizag summers were special indeed!those daily walks to beach road are unforgettable…

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 13, 2007 @ 12:28 ఉద. | స్పందించండి

 15. America ki mAmiDi paLLu egumati chEstunnaranTE murisi pOyAnu…EdI inkA kUDA mA vUriki rAlEdu. New Jersey lO vinna vArta EnTanTE Alphonso rakam mAtramE egumati ayyAyiTa, oka dozen 40$!!
  avi tinaDam kanTE nI blog chadivi tRpti paDatAnu lE…

  వ్యాఖ్య ద్వారా Sirisha — మే 19, 2007 @ 6:51 సా. | స్పందించండి

 16. Ahaa! Emi Ruchi anaraa maimarachi ani aa madhya edo cinemaalo vankaaya ni pogidaaru. Tvaralone maamidi palla meeda anta goppa paata raavaali.

  Maamidi pandu tina leka poyina mee posts chaduvutunte antaku minchi (maamidi)rasaanubhuti kalugutundi. Anduku meeku sata sahasra vandanaalarpistunnanu.

  వ్యాఖ్య ద్వారా BP — మే 20, 2007 @ 1:30 సా. | స్పందించండి

 17. Sirisha,
  “avi tinaDam kanTE nI blog chadivi tRpti paDatAnu lE…”
  oh! i am so glad…. 🙂

  BP,
  thank you!

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 20, 2007 @ 11:40 సా. | స్పందించండి

 18. malli post cheyyaledu?

  -c

  వ్యాఖ్య ద్వారా chetana — మే 23, 2007 @ 9:02 సా. | స్పందించండి

 19. Chetana garu…
  Hmm…Shall do it ASAP 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 23, 2007 @ 10:03 సా. | స్పందించండి

 20. శ్రీరాం గారు,
  మీ పాత టపాలు తిరగేస్తుంటే దీని పాల పడ్డాను. చదువుతున్నంత సేపు నోరూరుతూనే ఉంది. చరసాలగారు అన్నట్టు, ఇలాంటి టపాలు ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళ మీద వదలడం భావ్యం కాదు 🙂

  కొత్తపాళీ గారు,
  హౌస్ ఆఫ్ బ్లూ మాంగోస్ నేను ఐదేళ్ళ క్రితం చదివాను. పుస్తకం మొదట్లో చాలా బావున్నా, రాను రాను ‘పర్స్పెక్టివ్’ కొల్పోతుందని అనిపించింది నాకు.

  వ్యాఖ్య ద్వారా Giri — అక్టోబర్ 19, 2007 @ 10:31 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: