సంగతులూ,సందర్భాలూ….

ఏప్రిల్ 26, 2007

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

Filed under: కబుర్లు — Sriram @ 11:25 సా.

వారాంతం శలవులలో ఇంటికి వెళ్ళిన నాకు ఆదివారం నాడు ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాలు చూసి చూసి తల వేడెక్కడంతో కాస్త చల్లగాలి పీల్చుకుందామని డాబా ఎక్కాను. దూరంగా అవధాన్లు తాతయ్య వాళ్ళింటి అరుగు మీద జంధ్యాలు వడుకుతూ కనిపించాడు. పలకరింపుగా నవ్వాను. ఈ మధ్య ఇంతే, దూరంగా చూసి నవ్వడమే కానీ దగ్గరకి వెళ్ళట్లేదు. ఆయన వేసే ప్రశ్నలకి జవాబు చెప్పడమే కష్టమైతే దానికి తోడు ఈ మధ్య వినికిడి కూడా తగ్గడంతో గట్టిగా అరవవలసి వస్తోంది. ఇదంతా పడలేక ఏదో పనిలో ఉన్నట్టుగా నవ్వి వెళ్ళిపోడమే తప్ప ఆగి మాట్లాడటంలేదు. కానీ ఈసారి ఆయనని చూడగానే బ్లాగులోకంలో జరుగుతున్న వేదాలగురించిన చర్చ గుర్తొచ్చింది. ఈ మధ్య కొత్తగా తెలుసుకున్న విషయాలు ఆయనమీద ప్రయోగించి ఆయనని తప్పనిపించాలి అన్న బుద్ధి పుట్టడంతో మెట్లుదిగి వాళ్ళింటికి బయల్దేరాను.

తాతయ్యతో మా వీధి కుర్రవాళ్ళందరికీ చిన్నప్పటినుంచీ దోస్తీ. చీకటి పడుతుండగా ఆటలు ముగించి వాళ్ళ అరుగు మీద చేరిన మా అందరికీ సాయంత్రపు సంధ్యావందనం, అర్చన ముగించుకొచ్చిన తాతయ్య పెట్టే పటికబెల్లం పలుకులూ, అంతకన్న తియ్యగా ఉండే కధలూ, కబుర్లూ మంచి కాలక్షేపంగా ఉండేవి. పెద్దవాళ్ళమయ్యే క్రమంలో ఎంసెట్లూ వగైరాలు మొదలయ్యాక ఆటలతో పాటు ఈ కాలక్షేపం కూడా ఆగిపోయింది. ఎప్పుడైనా తాతయ్యతో మాట్లాడినా, ఆయన అడిగే ప్రశ్నలూ, చెప్పే కబుర్లూ నచ్చకపోవడం మొదలవ్వడంతో ఆయన దగ్గరకి వెళ్ళడమే తగ్గిపోయింది. ఆయనకీ కొత్త స్నేహితులు వచ్చారు, మా తరువాత పుట్టినవాళ్ళు.

దగ్గరకెళ్ళి తాతయ్యా బాగున్నావా అని పలకరించాను. ఆయన ఒక నవ్వు నవ్వి, ఒరేయ్ విభూతి డబ్బా లోపల మర్చిపోయాను కొంచెం తెచ్చి పెడుదూ అన్నాడు. డబ్బా తెచ్చి చేతికిచ్చాను. విభూతి చేతికి రాసుకుని ఏరా మనదేశంలోనే ఉన్నావా? ఈ మధ్య బొత్తిగా కనపడటమే లేదు అని అడిగాడు. ఒక వెర్రి నవ్వు నవ్వి, పని ఎక్కువగా ఉంటోందని సంజాయిషీ ఇచ్చుకున్నాను. ఆలస్యంచేస్తే ఈయన మాటలు ఎటువైపు మళ్ళిస్తాడో అని ఇలా మొదలెట్టాను:

“తాతయ్యా! మీ వేదాలలో సైన్సు ఉందట నిజమేనా?”

“సైన్సా? అంటే మీ స్కూళ్ళలో సామాన్య శాస్త్రం అని బోధిస్తుంటారే అదేనా? కామన్సెన్సురా, దానికి వేదాలెందుకూ?” కాస్త వెటకారంగా వచ్చింది సమాధానం.

“తాతయ్యా! సైన్సు అంటే విజ్ఞాన శాస్త్రం, కామన్సెన్సు కాదు.”

“ఓహో విజ్ఞానమా! ఆ విజ్ఞానశాస్త్రం అంటే ఏంటో నాకు తెలీదు కానీ మా వేదాలలో మీకు తెలియని విజ్ఞానం చాలా ఉంది. దేనికోయ్ ఇప్పుడు?”

నాకు వళ్ళు మండిపోయింది. “మీరు ఏమీ అర్ధంతెలీకుండా బండ భట్టీయం వేసిన ఆ సంస్కృతపు వాక్యాలలో మాకు తెలియనిది విజ్ఞానం ఉందా? ఇది ఒకటి వచ్చు మీకు, ఏమి చెప్పినా అన్నీ వేదాలలోనే ఉన్నాయిష అనడం” అన్నాను.

“ఏం ఎందుకనకూడదు? మా వేదాలలో ఉన్న విజ్ఞానం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోడం తప్పా?”

“ఏముంది మీ వేదాలలో సైన్సు? ఒక విమానం కాదు కదా కనీసం ఒక సైకిలు తయారు చెయ్యి చూద్దాం వేదంతో, ఏమి సైన్సు ఉందో తెలిసిపోతుంది”.

“ఇదే మీతో వచ్చింది. మా వేదంగురించే కాదు, మీ చదువు గురించి కూడా సరిగా తెలీదు. పరీక్ష పేసు చదువులు ఇలాగే ఉంటాయి. సైన్సు వేరు, ఇంజనీరింగ్ వేరు. సైకిలు లాంటివన్నీ యంత్ర శాస్త్రం, తంత్ర శాస్త్రం లోకి చేరుతాయి. వాటి కధ వేరు. కాకపోతే వీటికి మూలమైన విజ్ఞానం మా వేదాలలో ఉంది”.

“తాతయ్యా! నాది పరీక్ష పేసు చదువుకాదు. మా క్లాసులో మొదటి రేంకు ఎప్పుడూ నాదే. ఐనా ఇప్పటి ఈ ఇంజనీరింగ్ అద్భుతాలన్నీ ఐన్‌స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రంలో చేసిన కృషివల్ల సాధ్యపడ్డాయి కానీ మీ వేదాల వల్ల కాదు”.

“ఓహో! మొదటి రేంకు వాడి జ్ఞానమే ఇలా ఉంటే ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటో. ఐనా ఏమిటి కనిపెట్టాడు అంత గొప్ప విషయం ఐన్‌స్టీన్”

“ఏం తాతయ్యా! ఇన్ని కబుర్లు చెప్తావు, ఈ ఈజీక్వల్టూ ఎంసీ స్క్వేర్ తెలీదా నీకు. పదార్ధాన్ని శక్తిగా మార్చవచ్చని కనుక్కున్నది ఆయనే”

“ఈ విషయం ఖచ్చితంగా మా వేదాలలో ఉంది”.

“నాకు సంస్కృతం రాదు కదా అని ఏవో కల్లబొల్లి శ్లోకాలు రెండు అల్లి చెప్తావు నువ్వు. నేనెలా నమ్మేది?”

“ఇదొక సమస్య, మీకు తెలియనివన్నీ తప్పులే మీకు. సరే నీకు తెలిసిందే చెబుతాలే. నువ్వు చిన్నప్పుడు అన్నం తినక గోల చేస్తుంటే నేనేం చెప్పేవాడినో గుర్తుందా”.

“ఆ ఉందిలే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని బలవంతంగా నోట్లో కుక్కించే వాడివి. ఐనా అన్నం దేవుడేవిటి, తెలీక వినేవాడిని కానీ…”

“ఇప్పుడేమో అతి తెలివి వచ్చింది! నేను అన్నం రాముడనో కృష్ణుడనో చెప్పానా? పరబ్రహ్మ స్వరూపం అంటే ఈ సకల జీవ జాలంలోనూ ఉన్న చైతన్యం. అదే ప్రాణశక్తి. మనం తీసుకున్న ఆహారమే ఈ ప్రాణశక్తిగా మారుతోందని మా వేదం ఎప్పుడో ఘోషిచింది. మనం తీసుకునే ఆహారం మన స్వభావాన్ని నిర్దేశిస్తుంది. దాని మీదే మన ప్రవర్తన, ప్రవర్తన మీద జీవనం ఆధారపడి ఉంటాయి. ఈ మధ్యనే మీ సైన్సు వాడే ఎవడో శాకాహారులకి తెలివితేటలెక్కువని కనుక్కున్నాట్ట. అందుకే భోజనం చెయ్యడానికి, పదార్ధాలు తయారు చెయ్యడానికీ వేదంలో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. వాటి నుంచి శుచి శుభ్రాల కోసం ఏర్పడినవే మడులు వగైరా. ఇవేవీ తెలీవు కానీ మడి కట్టుకున్న అమ్మమ్మని ముట్టుకుంటానని ఆటపట్టించడం తెలుసు మీకు. సరేలే, విషయానికి వస్తాను. ఈ సృష్టిలోని సమస్తమైన పదార్ధాలలోనూ మా వేదాలు ఆ అనంత చైతన్యాన్ని, శక్తినీ చూసాయి. రోజూ సంధ్యావందనం చేసేటప్పుడు “…సదా సర్వభూతాని చరాణి స్థావరాణిచ సాయంప్రాతర్నమస్యంతీ…” అంటూ నేను చదివే మంత్రార్ధం తెలుసా నీకు? చరములు, స్థావరములు అనగా జీవములు, నిర్జీవములు ఐన సమస్త భూతములలోనూ నిబిడీ కృతమై ఉన్న ఆ శక్తికి నేను నమస్కరిస్తున్నాను అన్న వేద వాక్యం మీ ఐన్‌స్టీన్ చెప్పినదానికి సరిపోయిందా లేదా?”

నాకు ఏం చెప్పాలో తెలియలేదు. ఇంత దెబ్బ కొడతాడనుకోలేదు ఈయన. ఉక్రోషం పొడుచుకొచ్చి ఎలాగైనా ఎదురుదాడి చెయ్యాలని మొదలెట్టాను.

“నువ్వు చెప్పినదే నిజమైతే మీ వేదాలని నలుగురికీ పంచడానికి ఏమిటి అభ్యంతరం? విజ్ఞానం ప్రజలందరికోసం కాదా? ఏదో కొంతమంది సొత్తుగా ఎందుకుండిపోవాలి?”

“అణు విజ్ఞానం ఉగ్రవాదుల చేతికి ఎందుకు వెళ్ళకూడదు? అందుకే ఇదీను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటూ కొత్తగా అరుస్తున్నారే మీ సాఫ్టువేరు వాళ్ళందరూ, మరి అంత గొప్ప శక్తినిచ్చే వేదవిజ్ఞానం ఉన్నవాడికి ఎంత బాధ్యత ఉండాలి? బాధ్యతలేని శక్తి ఎంత ప్రమాదకరం! పాత్రత ఉన్నవాడికే విద్యగరపాలని మా సనాతన ధర్మ నియమం. అందుకే మా వేదాలు ప్రపంచ శాంతిని కోరాయి, మీ సైన్సు వల్ల ఆటంబాంబు పుట్టింది.”

“పాత్రత అంటే కులమా? మొన్న మా ఆఫీసు కొచ్చిన ఒక ఇంగ్లాండువాడు మన కులాల గురించి అడుగుతుంటే ఎంత సిగ్గేసిందో తెలుసా నాకు?”

“ఆహా! వాడు వాళ్ళ దేశంలో లార్డో కామనో కనుక్కోపోయావ్! గాంధీ గారిని రైల్లోంచి తోసేసింది వీడి తాతో ముత్తాతో అయ్యుంటాడు.”

“మనలో ఉన్న లోపానికి సమాధానం ఎదుటివాడిలో లోపం వెతకడంకాదు”.

“ఒరేయ్! ఈ ప్రపంచకం పుట్టిన దగ్గర నుంచీ ఈ అసమానతలూ, అణచివేతలూ అన్ని చోట్లా ఉన్నాయి. జుట్టు అందిన వాడిని మొత్తడం మానవ నైజం. దానికీ మతానికీ ముడిపెట్టకు. ఐనా బుద్ధుడి మొదలు ఏ ప్రవక్తనీ ఈ దేశంలో శిలువ వెయ్యలేదు. అసలు నా సనాతన ధర్మం గురించి నేను గర్వపడేదేమిటో తెలుసా? ఆటవికజాతుల లాగ బలవంతుడికో, లేక పాశ్చాత్యదేశాలలో లాగ రాజులూ భూస్వాములకో అగ్రత్వం ఇవ్వలేదు. విజ్ఞానానికున్న విలువ గ్రహించి ఆ జ్ఞానాన్ని పెంచుతూ రక్షించే వేదవిద్యా పారంగతులకి గౌరవం కట్టబెట్టింది. ఆ జ్ఞానాన్ని పొందడానికి అనేక నియమాలు పెట్టి వారిలో బాధ్యత పెంచింది. భిక్షాటన చేసుకుని బతకమని చెప్పింది. అంతేకానీ మీ సైంటిస్టులలాగ, సాఫ్టువేరు నిపుణులలాగ జ్ఞానంతో పాటు సంపాదన పెంచుకోమని చెప్పలేదు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని బట్టి గౌరవించింది కానీ కులాన్ని బట్టి కాదు. ఐనా ఈ అగ్రకులమన్నమాటే వేదాలలో ఎక్కడా లేదు. సమాజంలోని వివిధ వర్గాలని శరీరంలోని వివిధ భాగాలతో పోల్చింది వేదం. శరీరంలో ఏ భాగం ఎక్కువ గొప్ప అంటే ఏమి చెప్తావ్? కాకపోతే కొంతమంది ప్రబుద్ధులు ఇందులో కూడా తప్పుడర్ధాలు వెతికే వాళ్ళున్నారు, శిరస్సుకి అగ్రత్వాన్నీ కాళ్ళకి తక్కువతనాన్నీ కట్టబెట్టి చొప్పదంటు ప్రశ్నలు వేసేవారు. శిరస్సు మేధకి సంకేతమనీ, కాళ్ళు శ్రమకి గుర్తనీ ఇందులో ఒకటిగొప్ప ఇంకొకటి తక్కువా ఏమీ లేదన్న విషయాన్ని గ్రహించుకోక ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఎలా? ”

“మరి రాముడు శంభూకుడిని ఎందుకు చంపాడు? శూద్రుడనే కదా?”

“వాడు శూద్రుడని కాదు. క్షుద్రుడని. కులాన్ని బట్టి కాదు గుణాన్ని బట్టి. వాడి ప్రవర్తన ప్రజా శ్రేయస్సుకి వ్యతిరేకంగనుక.”

“ఇది నీ కల్పన. నువ్వు చూసావా అతడు క్షుద్రుడని?”

“అక్కడే నాకు కోపమొస్తుంది. నమ్మితే మొత్తం నమ్మాలి. నీకు నచ్చింది నమ్ముతావు నచ్చనిది నమ్మవు. సరే నిన్ను ఒప్పిస్తాను. అసలు రాముడు ఎందుకు పుట్టాడో చెప్పు?”

“రావణబ్రహ్మని చంపడానికి.”

“చూసావా నీ నోటితో నువ్వే చెప్పావు. రావణబ్రహ్మ అనే బ్రాహ్మణుడు వాడి ప్రవర్తనవల్ల రావణాసురుడిగా మారితే వాడిని చంపడానికి కదా పుట్టాడు. మరి కేవలం పుట్టిన కులమాధారంగా ఆలోచించేవాడైతే రావణుడిని చంపుతాడా? బ్రాహ్మణుడైన రావణుడిని చంపినందుకు బ్రాహ్మలెవరూ ఆయనని పూజించకూడదా? ఇవేవీ ఆలోచించరు మీరు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఏదైనా చిన్న విషయం కనపడితే అది పట్టుకు కూచుంటారు. అష్టాదశ పురాణాలూ నైమిశారణ్యంలో బోధించిన సూత మహాముని పుట్టుకతో శూద్రుడనీ, ఐనప్పటికీ ఆయన బుర్ర బద్దలుకొట్టిన బలరాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందన్న విషయమూ తెలుసా నీకు?”

నాకేమి మాట్లాడాలో తెలీలేదు. బిక్కమొహం వేసి కూచున్నాను. పాపం చిన్నవాడని జాలిపడ్డాడో ఏమో మళ్ళీ ఆయనే “మరీ అంత బిక్కమొహం వెయ్యకురా! ఇంత మాత్రానికే మీ సైన్సు వోడిపోయిందనీ నేను గెలిచేసాననీ అనుకోకు. ఎప్పుడూ కూడా వాది దోషమేకానీ వాదనలో దోషం ఉండదని ఒక సూక్తి ఉంది సంస్కృతంలో. వాదించే వాడి సమర్ధతని బట్టి తిమ్మి బమ్మి ఔతుంది. మీ ఐన్‌స్టీన్ లాంటివాడొచ్చి వాదిస్తే నేనూ చేతులెత్త వలసిందే. గుర్తుపెట్టుకో, బ్రహ్మము మాత్రమే సత్యం. మిగిలినదంతా మాయే. అందుకే మన మన సమర్ధతని బట్టి సత్యమనీ అసత్యమనీ ఋజువు చేసెయ్యచ్చు. నీకు వేదమూ తెలీదు. నీ పరీక్ష పేసు చదువుల వల్ల మార్కులొచ్చాయికానీ మీ సైన్సూ తలకెక్కలేదు. నాతో ఏమి వాదిస్తావ్ ఇంక?” అంటూ నవ్వేసాడు.

“ఐతే ఇప్పుడేమంటావ్, సైన్సు గొప్పా మీ వేదాలు గొప్పా? ఏమిటి నీ అభిప్రాయం?” కాస్త ధైర్యం కూడదీసుకుని అడిగా.

“ఒరేయ్! ఇలాంటి వాదాల వల్లే అసలు సమస్యలన్నీ. ఆధునిక విజ్ఞానం వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంకా జరుగుతాయి. అవి మనందరికీ అవసరం కూడా. కానీ ఆ వ్యామోహంలో పడి వేదాలు ఎందుకూ కొరగానివిగా భావించి అవహేళన చెయ్యడం చాలా తప్పు. వేరే ఏ దేశప్రజలకీ లేని వారసత్వ సంపద ఇది. అందులో ఉన్న విజ్ఞానం ఎంతో మంది మహాద్రష్టల తపోఫలం. ప్రతివ్యక్తిలోనూ దాగి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోడానికి అవసరమైన మార్గం. ప్రపంచ శాంతికీ, సుభిక్షతకీ సైన్సు కన్నా ఎక్కువ అవసరమైన జ్ఞానం ఇది. అది గుర్తు పెట్టుకో చాలు. ఈ విషయం చెప్పడానికే నేను నీతో వాదన చేసింది. నిజానికి వేదాలలో సైన్సు లేకపోయినా నాకు నష్టం లేదు. వేదాల స్థాయి, దృక్పధం వేరు. సైన్సు సంగతి వేరు. సరే మరి నేనింక సంధ్యావందనానికి లేస్తాను. ఈ రోజు నా స్నేహితులు స్పైడర్మేన్ సినిమా పట్టుకొస్తామన్నారు. వాళ్ళతో కలిసి అది చూడాలి” అంటూ తాతయ్య లేచాడు.

నవ్వుకుంటూ నేను ఇంటి ముఖం పట్టాను. “విత్ గ్రేట్ పవర్ కంస్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ” అన్న పీటర్ పార్కర్ డైలాగ్ ఎందుకో పదే పదే గుర్తొచ్చింది.

39 వ్యాఖ్యలు »

 1. అయ్యా. మహానుభావా, మార్తాండతేజా. ఈమధ్య బ్లాగుల్లో చెలరేగిన వేదఘోషలకి బహు నాటకీయంగా, సమర్ధవంతంగా జవాబిచ్చారు. మంచి టపా.

  వ్యాఖ్య ద్వారా సత్యసాయి — ఏప్రిల్ 27, 2007 @ 4:03 ఉద. | స్పందించండి

 2. తాతయ్యగారూ చాలా సందేహాలు తీర్చారు.రావణుడు రావణా బ్రహ్మ అని తెలుసు కానీ బ్రాహ్మణుడు రాక్షసుడయిన వైనం ఇదేవినడం.

  వ్యాఖ్య ద్వారా radhika — ఏప్రిల్ 27, 2007 @ 4:51 ఉద. | స్పందించండి

 3. శ్రీరాం గారు,

  చాలా బాగా చెప్పారు. నా “ఘోష” కు కొంచెం శాంతి లభించింది ఇప్పుడు. ఇలా చెప్పగలిగే వారుంటే వినేవారికి అపార్థాలు కలగవు కదా.

  ధన్యవాదాలు.

  లలిత.

  వ్యాఖ్య ద్వారా lalitha — ఏప్రిల్ 27, 2007 @ 6:38 ఉద. | స్పందించండి

 4. శ్రీరామా, కొత్త బిరుదొచ్చిందే?
  నీ ఆశయం నెరవేరినట్టుంది సభ్యుల వ్యాఖ్యలు చూస్తుంటే. సంతోషం.
  ఇప్పుడు కాస్త ఎగస్పార్టీవాళ్ళు కూడా శ్రమ చేసుకుని వొచ్చి ఒక కితాబిస్తే …

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఏప్రిల్ 27, 2007 @ 7:23 ఉద. | స్పందించండి

 5. చాలా బాగా చెప్పారు. మీ తాతాయ్య గారి కబుర్లు బావున్నాయి. వేదాలను సైన్సు కు ముడిపెట్టి సామాజికతలను స్పృశించిన తీరు నచ్చింది. అబినందనలు.

  ప్రసాదం

  వ్యాఖ్య ద్వారా ప్రసాదం — ఏప్రిల్ 27, 2007 @ 7:40 ఉద. | స్పందించండి

 6. మీ కధ చదువుతుంటే ఒక్కసారిగా నాకు నండూరి వారు రాసిన విశ్వదర్శనం గుర్తుకువచ్చింది..
  మంచి విశదీకరణ తో ముందుకు వచ్చింది మీ కధ
  మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో నిబిడీక్రుతమైన దేవరహస్యాలన్నింటిని ఇలా మా ముందు పొందు పరిచినందుకు మీకు మనసార క్రుతజ్ణతలు

  వ్యాఖ్య ద్వారా Srujana — ఏప్రిల్ 27, 2007 @ 9:17 ఉద. | స్పందించండి

 7. maaku mee vadana andu loni nizam baaga nachindi aite nenu modati saariga ee vishayam blog dwara choostunna. manchi sambhashana chaturyam mecha dagindi
  pratap

  వ్యాఖ్య ద్వారా pratap kanduri — ఏప్రిల్ 27, 2007 @ 11:31 ఉద. | స్పందించండి

 8. ఏమీ తెలియనట్టే ఎన్ని విషయాలు చెప్పేశారు.
  ఇదివరికి బ్లాగుల్లో జరిగిన చర్చ నేను చూడలేదు కానీ ఈ ఒక్క వ్యాసం చదివితే అదేం చూడనవసర్లేదేమో అనిపిస్తుంది.

  వ్యాఖ్య ద్వారా swathi — ఏప్రిల్ 27, 2007 @ 12:59 సా. | స్పందించండి

 9. “యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సమన్విత నమస్తస్యై నమస్తస్యై నమో నమః ”
  –> “కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జి ”

  మీ వ్యాసం చదువుతున్నంత సేపూ తాత్తయ్య దగ్గర నేర్చుకున్నట్టే ఉంది

  రెండు వైపులనూ న్యాయం గా ముగించడం చాలా బాగుంది.

  వ్యాఖ్య ద్వారా Lalitha Sravanthi — ఏప్రిల్ 27, 2007 @ 7:31 సా. | స్పందించండి

 10. చాలా అద్భుతంగా రాశారు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది మీ వివరణ.
  దేనినయినా విమర్శనాత్మక దృష్టితో చూడడం అవసరమే కానీ ఆ దృష్టి మాత్రమే ఉంటే మంచిది కాదనే అంతర్లీన వాదన కూడా నాకు చాలా బాగా నచ్చింది.
  భేష్ !

  వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఏప్రిల్ 27, 2007 @ 8:41 సా. | స్పందించండి

 11. వావ్! అద్భుతమైన సంభాషణ. రెండు వైపులా వాదన పకడ్బందీగా జరిగింది. మనవడు వేసిన ప్రశ్నలు సూటిగా వున్నాయి. తాత జవాబులు లౌక్యంగానూ ఆలోచింపజేసేవిగానూ వున్నాయి.

  నాకు మన పెద్దలంటే ముచ్చట ఎందుకేస్తుందంటే ఇలాంటి తాతలను చూసే! మన పాత రాతల్లో ఎంత చింతకాయ పచ్చడున్నా దానికి భాష్యం ఎప్పటికెయ్యది ప్రస్తుతమొ అన్నట్లు చెబుతారు. మన సమాజం శాంతి కాముకంగా, సహన భూయిష్టంగా వుండటానికి ఇదొక కారణం.
  స్పష్టంగా కృష్ణుడు బందువులనీ, అయిన వారనీ, పెద్ద వారనీ చూడక యుద్దం చేయి అన్నా…ఆ యుద్దం చెడుమీదనే గానీ మనుషుల మీద చేయమనలేదు అని మన తాతలు భాష్యాలు చెబుతారు గనుకనే బిన్ లాడెన్ ఇక్కడ పుట్టలేదు! యుద్దం చెయ్యమని చెప్పిన గీతనే (దుర్మార్గులతోనే అనుకున్నా) తన అహింసా వాదానికి తోడుగా తెచ్చుకున్నాడు మహాత్ముడు. (అదే గీతలో వర్ణాంతరం కూడదని చెప్పినదానికి ఏం భాష్యం చెబుతారో ఈ తాతలు)

  వేదాల్లో వున్నవి వేదాల్లో వున్నాయి. సైన్సులో వున్నది సైన్సులో వుంది. అలా ఒప్పుకోక ఇప్పటి ఆధునిక విజ్ఞానమంతా ఆనాటి వేదాల్లోనే వుంది అనడంతోనే చిక్కంతా!
  తాతగారు విమానానికి, సైకిలుకు వున్న విజ్ఞానమూలం వేదాలలో వుంది అన్నారు. అయితే సాధారణంగా మూలం అని ఎప్పుడంటాం? అందునుంచి లభించే ప్రాధమిక జ్ఞానం ఆ తర్వాత ఒక వస్తువును కనిపెట్టడంలో సహాయం చేస్తేనే గదా? ఇక్కడ “అన్నం పర బ్రంహ్మ స్వరూపం” అనడంలో అన్నం నుంచే సర్వశక్తులూ జీవులకు వస్తున్నాయి అనుకునేంతవరకు ఫర్వాలేదు. అయితే ఆ జ్ఞానం అంతకు మించి ఏమయినా నేర్పిందా? అన్నాన్ని పూజించడం, కళ్ళకు అద్దుకోవడం తప్పించి?
  అలాగే సూర్యుడినుంచే సర్వప్రాణులకూ శక్తి అందుతోందనీ మన పూర్వులకు తెలుసు. ఇప్పటి వారికీ తెలుసు! అయితే ఆ సూర్యున్ని కొలిస్తే, పొద్దున్నే సూర్య వందనాలు చేస్తే దాన్ని వుపయోగించుకోవడం తెలిసిందనుకోవాలా వారికి? అసలు వాళ్ళకి ఏం తెలుసో మనం తెలుసుకోవాలంటేనే మళ్ళీ ఇప్పుడు తెలిసిన విజ్ఞానపు అద్దాలతోనే చూస్తున్నాం!
  చాతుర్వర్ణాలనీ “గుణకర్మ విభాగహ” అని చెప్పాడని “గుణ, కర్మ” లని బట్టి మనుషులని వర్గీకరించారని మనకున్న ఇప్పటి జ్ఞానాన్ని బట్టి భాష్యం చెబుతున్నాం. అయితే అదే జ్ఞానం అప్పుడూ వుండివుంటే పుట్టుకను బట్టే గుడ్డివాడైనా దృతరాష్ట్రుడు రాజెలా అయ్యాడు? మళ్ళి ఇది వేదాల్లో లేదు అంటారు. భారతం పంచమ వేదం కదా? ఆటంబాంబుకు మూలం వేదంలో వుండి వేదానికి భాష్యం అని, పంచమ వేదమనీ కీర్తించబడ్డ భారతంలో లేక పోవడం విచిత్రం కదా? కావున మనం ఇప్పటి తెలివితో భాష్యం చెప్పకుండా అప్పటి తెలివితో ఆలోచిస్తే “గుణ కర్మలను బట్టి నాలుగు వర్ణాలు, అవి పుట్టుకతో లేదా పూర్వ జన్మ ఫలంతో నిర్ణయించబడతాయి” అని చెప్పారనుకోవాలా?

  ఇప్పుడు మన తాత శంభూకుడి తల తెగ్గొట్టడానికి కారణం తన శూద్రత్వం కాదుగానీ “క్షుద్రత్వమే”నని ప్రాసాసహితంగ చెబుతున్నారే అదే సత్యమయితే మరి ఆ గ్రందాలలోనే తాత చెప్పినట్లే చెప్పక శూద్రుడని ఎందుకు చెప్పినట్లు? “శూద్ర యోనిలో” జన్మించిన వాడని వాల్మీకి రామాయణమే చెబుతుందట కదా? (కాదా?) పోనీ అతని క్షుద్ర పనులకే ఆ శిక్ష వేశారని అనుకున్నా ఇంతకీ ఏది క్షుద్రత్వమని నిర్ణయింపబడింది ఆరోజుల్లో! రామున్ని తప్ప అన్యుల దలవని సీతనే అనుమానించి, అవమానించి, చూలాలని కూడా అడవులకు పంపటమే ధర్మమయిన రోజుల్లో, ఒక శూద్ర పుట్టుక బుట్టిన వాడు వేదాలు చదవడం, యజ్ఞాలు చేయడం ఎంతో క్షుద్ర పని కాకపోయి వుంటుందా? ఇంతకు ముందొక చోట రాధిక గారన్నట్లు “ఆనాటి ధర్మమది” అంటారా? అనండి. కానీ ఈనాటి ధర్మాలూ, విజ్ఞానం అన్నీ ఆనాడే వున్నాయంటే (వేదాలు కావచ్చు, ఇతిహాస పురాణాలు కావచ్చు)ఎలా నమ్మడం?
  చావుబతుకులకు తెగించి కాపాడినవాడు ఎదుట నుండగా “దేవుడా నీవే రక్షించావు” అని పైకి చూసి మొక్కాడట ఒక భక్తుడు! అలాగే వుంది ఐన్‌స్టిన్‌ను ఆయన ఎ=ం*చ్*చ్ ను హేళన చెయ్యడం! పదార్థానికి, శక్తికీ సంబందం వుందని అందరూ అన్నవాళ్ళే! ఇదిమిద్దంగా ఇదీ అని చెప్పింది మాత్రం ఆయనే కదా! “ఆమెకూ ఆయనకూ సంబందం వుంది” అని చెప్పడానికీ అది “అన్నాచెల్లి సంబందమో, మొగుడు పెళ్ళాల సంబందమో” చెప్పడానికీ తేడా లేదూ?
  భాద్యత గలవాడి దగ్గరే శక్తీ వుండాలనడం సందేహాతీతం! కానీ ఇన్ని యుగాలు బాద్యత గలవారి దగ్గరుండీ సాధించిందేవిటి? పుట్టుకతో వచ్చే వర్ణాంతరాలు, వేశ్యలూ, అస్పృశ్యతలూ, అయినవాడి కానివాడి దండయాత్రలూ, దాస్యమూ తప్ప!

  మనవడు అడిగిన ప్రశ్న “మనలో ఉన్న లోపానికి సమాధానం ఎదుటివాడిలో లోపం వెతకడంకాదు” బాగానే వుంది. కానీ అందుకు తాతయ్య సమాధానం మాత్రం ఎప్పటిలానే వుంది. మా నాన్నా ఇలాగే అనే వాడు “ఒకచేతి వేళ్ళే సమంగా లేవు” అని. ఇంకా “గడియారం ముళ్ళు చూడు అన్నీ ఒకే కొలతలతో వుండి, ఒకే వేగంతో తిరిగితే పని అవుతుందా?” అని. అసమానతలూ, అణచివేతలూ అన్ని చోట్లా అన్నికాలాల్లోనూ వున్నాయి, వుంటాయి అయితే అవి గుణాన్నీ, కర్మనూ బట్టి గాకుండా పుట్టుకను బట్టి రావడంతో కదా సమస్య! వేదవిద్యా పారంగతులకు గౌరవం ఇవ్వడం మెచ్చదగిందే అయితే మన ముట్టు గుడ్డలు వుతికే చాకలికి, కాలు కందకుండా చెప్పు కుట్టే మాదిగకీ గౌరవం ఇవ్వకపోతేమానె, కనీసం జంతువుగానైనా ఎందుకు చూడలేదో! శరీరభాగాలన్నిటికీ తాతగారు సమాన గౌరవం ఇవ్వడం బాగానే వుంది. ఇంతకీ ఎడమచేతితో మనవడు రాస్తుంటే రాయనిచ్చారా? ఏనాడైనా దళితున్ని ఈంటికి పిలిచి తనతో కూర్చోబెట్టుకొని తిన్నారా? నీతి అందరూ చెబుతారు, పాటించాలి కదా?
  రావణుడి ప్రవర్తన పుట్టుకతోనే సరిగా లేదా? రావణుడి తల్లి రాక్షసి అయినందుకు కాదా ఆయన రాక్షసుడయ్యింది? పోనీ రావణుడు చేసిన అఘాయిత్యాలకు రాముడు ఆయన్ని చంపితే మరి బలి చక్రవర్తిని ఏం పాపం చేశాడని వామనుడు పాతాళానికి తొక్కేశాడు? వాలి ఏం పాపం చేశాడని రాముడు చెట్టు చాటునుండి బాణం వేసి చంపాడు? అంజని కోతి అయినందుకు వాయుదేవుడికి పుట్టినా ఆంజనేయుడు కోతి అయ్యాడు. అలాగే సూర్య, ఇంద్రులకు పుట్టినా కోతి తల్లులకు పుట్టినందుకు సుగ్రీవ, వాలులు కోతులయ్యారు. తల్లి కుంతి(మనిషి) అయినందులకు తండ్రులు దేవతలయినా పాండవులు మనుషులే అయ్యారు. రావణుడి తల్లి రాక్షసి గనుకా రాక్షసికి పుట్టినవాడు రాక్షసుడే అయ్యాడు, రావణడు. బ్రంహ్మవిద్యా కోవిదుడైనా, మహా బల పరాక్రమవంతుడైనా దేవతలంతా కుట్ర చేసి చంపించారు రావణున్ని. ఒక స్త్రీని బలాత్కరంగా ఎత్తుకు పోయినా తన సమ్మతి లేనిదే తాకకూడదని నియమం పాటించిన రావణబ్రంహ్మని రాక్షస స్త్రీకి జన్మించిన కారణంగానే హత్య చేశారన్నది తెలియటం లేదూ తాత గారికి?
  సరే “వేదాల దృక్పధం వేరు, స్థాయి వేరు” కదా! మరక్కడే నిలబడక ప్రతి ఆధునిక విజ్ఞానమూ వేదాల్లో వుందని బాకా వూదడం ఎందుకు? ఆ వేదాలు నెలకొల్పిన శాంతి ఒక్క భారత దేశంలోనే ఏకాలంలోనూ లేనప్పుడు అవింక ప్రపంచంలో ఏం సుఖసంతోషాలను నింపుతాయో చూడాల్సిందే!

  వేదాలలో అన్నీ లేవు అనేవాళ్ళంతా స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసేవాళ్ళో, పశ్చిమ సంస్కృతికి అలవాటు పడ్డవాళ్ళొ అనుకోవడం ఒక భ్రమ! మన పెరట్లో పాముందని చెప్పిన వాళ్ళంతా మన శత్రువులో, ఎదురింటివాళ్ళో కానక్కరలేదు!

  –ఫ్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — ఏప్రిల్ 27, 2007 @ 10:34 సా. | స్పందించండి

 12. తాతా, నమోన్నమః
  కూడలి వ్యాఖ్యలలో చూసి ఇటువచ్చాను. సంగతులూ సందర్భాలూ కొత్తపాళీగారి బ్లాగు అనుకొని చదివాను. లలితగారి వ్యాఖ్య(3) చూసి ఆమె పొరబడ్డారనుకున్నాను. వెంటనే కొత్తపాళిగారి వ్యాఖ్య చూశాక ఈ లోకంలోకొచ్చాను. దీని లింక్ నా బ్లాగులో పెడుతున్నాను. విషయము, కథనము రెండూ అద్బుతం. ఇందాక మధ్యాహ్నభోజన సమయంలో నా మలయాళ మిత్రునితో – వేదాలు-శాస్త్రవిజ్ఞానం మీద తెలుగు బ్లాగోళంలో వాదాలు, వివాదాల నేపథ్యంలో ఈ తాతయ్య చెప్పినకబుర్లు – ఈ విషయం వివరిస్తుండగా దీన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలన్న ఆలోచన వచ్చింది. అందరికీ ఉపయోగపడే మాటలు కదా. “ఇదొక సమస్య, మీకు తెలియనివన్నీ తప్పులే మీకు. సరే నీకు తెలిసిందే చెబుతాలే.” – అని మెత్తగా మొట్టి కూర్చోబెట్టి సావకాశంగా వివరించి, అంతమాత్రాన చిన్నబుచ్చక, వాది దోషమేగాని వాదనలో దోషముండదని చెప్పి, పెద్దరికం పెద్దరికమే అనిపించారు. “తెలియనివన్ని తప్పులని దిట్ట తనాన పలుకగ రాదు రోరి పలుమారు పిశాచపు పాడెగట్ట, నీ పలికిన నొట దుమ్ముబడ, భావ్యమెరుంగువు పెద్దలైనవారల నిరసింతువా” – అని యువకవి తెనాలిరామకృష్ణయ్యలాగా కొపంతెచ్చుకోకుండా.

  వ్యాఖ్య ద్వారా రానారె — ఏప్రిల్ 27, 2007 @ 11:40 సా. | స్పందించండి

 13. ప్రసాద్ గారు,
  ఎందుకండీ ఇంత కక్ష వేదల మీద?

  ఇలాగే సాంకేతిక జ్ఞానాన్నీ, విజ్ఞానాన్నీ విమర్శించే వారు కూడా కనపడతారు.

  దూర దర్శనాల వల్ల, ఆధునిక రవాణా సౌకర్యాలు కలుగ చేసే కాలుష్యం వల్ల, కొంత మంది స్వార్థ పరులు విజ్ఞానాన్ని ఉపయోగించుకునే తీరు వల్ల నష్టపోయే వారు ఎందరో.

  మనం ఎప్పుడూ వింటుంటాము పరికరానిది తప్పు కాదు, దానిని తప్పుగా వాడే వాడిది అని. గాంధీ గారు భగవద్గీతను అహింసా ప్రచారానికి వాడుకుంటే అది ఆయన చేసిన తప్పా? ఐన్స్టీను భగవద్గీత చదివాక మిగిలినవన్నీ అనవసరం అని చెప్పాడంటే అది ఆయన అవివేకమా?

  ఇంకా రాయాలని ఉంది. ప్రతి లైనూ చదివితే కొన్ని నేను చెప్పదల్చుకున్న దానికి కొంచెం వేరుగా ఉన్నాయి. అయినా సందేశం, సందేశం అందించిన తీరు చాలా బాగుందనిపించింది.

  తీరిక చేసుకని మళ్ళొకసారి వ్యాఖ్యానిస్తాను.

  లలిత.

  వ్యాఖ్య ద్వారా lalithag — ఏప్రిల్ 28, 2007 @ 12:27 ఉద. | స్పందించండి

 14. @సత్యసాయిగారూ…పెద్దవారూ,ఆచార్యులూ మీరు. నాకులాంటి వాడిని అలా పిలవడం సమంజసం కాదు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  @రాధిక గారూ…ధన్యవాదాలు.

  @లలితగారూ…మీ అందరి వ్యాసాలు చదివాకా నా అంతర్మధనాన్ని అందరితో పంచుకోవాలన్న ప్రయత్నమే ఇది. ధన్యవాదాలు.

  @కొత్తపాళీ వారూ…బిరుదులు పుచ్చుకునే అంత ప్రజ్ఞ నాకు లేదని మీకు తెలుసు లెండి. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

  @ప్రసాదంగారూ….స్వాగతం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  @సృజన గారూ…ధన్యవాదాలు. మీరు చెప్పిన పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తాను.

  @ప్రతాప్ గారు….ధన్యవాదాలు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండీ ఇటువైపు.

  @స్వాతిగారూ…మీరు ఒకసారి నాగాయణం బ్లాగు చూడండి. మొత్తం తెలుస్తుంది.

  @లలితాశ్రవంతి గారూ…మంచి శ్లోకం చెప్పారు. ధన్య వాదాలు.

  @ప్రవీణ్ గారూ…ధన్యవాదాలు. అంతర్లీనమైన భావన మీకు అర్ధమైందంటే నాకు ఆనందం అనిపించింది.

  @ప్రసాద్ గారూ…ముందుగా మీరు అన్న “మనవడు వేసిన ప్రశ్నలు సూటిగా వున్నాయి. తాత జవాబులు లౌక్యంగానూ ఆలోచింపజేసేవిగానూ వున్నాయి” ఈ వాక్యం చాలా ఆనందాన్నిచ్చింది. ధన్యవాదాలు.
  ఇంక మీరు చెప్పిన పురాణాలలోని అనేక విషయాల గురించి మీతో వాదించను నేను. చాలా మటుకు మీరు వేరేగా రాసారు. ఉదాహరణకి రావణుడు సీతమ్మను ముట్టుకోకపోడానికి కారణం వాడికున్న శాపం వల్ల కానీ నిగ్రహం వల్ల కాదు. ఇలాంటివే అన్నీ. కానీ నేను చర్చించదలచుకున్నది అది కాదు.
  వేదాల యొక్క ఔన్నత్యాన్ని చెప్పి, దానిని సైన్సుతో పోల్చి తృణీకరించడం తప్పు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్న విషయం.
  సమాజంలోని వివిధ అసమానతలకి మతం కారణం అని ప్రతీదానికీ ధర్మాన్నే తప్పుబట్టడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఇంతకన్నా వాదన పొడిగించదలుచుకోలేదు. దాని వల్ల ఉపయోగం కూడాలేదని నా అభిప్రాయం. మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి.

  @రానారె గారూ…ధన్యోస్మి. మీరు ఆంగ్లంలో తర్జుమా చెయ్యడం నా వ్యాసానికి గౌరవంగా భావిస్తాను. నాకు ఇష్టమైన పద్యం చెప్పారు. మా తాతయ్య తెనాలి రాముడంతటి వాడే. కానీ నేను ప్రగడ రాజు నరసరాజుని కాదు కాబట్టి ఇలా కరుణించేసాడు 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 28, 2007 @ 1:56 ఉద. | స్పందించండి

 15. ఇది శ్రీరాముని రచనపై వ్యాఖ్య కాదు – పైనెవరో దేవీ శ్లోకాన్ని తప్పుగా ఉదహరించారు. సరైన శ్లోకం ఇది.
  “యా దేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః ”
  దేవిని అనేక మౌలికరూపాలలో ఊహిస్తూ స్తుతించే శ్లోకమాలికలో భాగం ఇది. భగవంతుని “సర్వాంతర్యామి” గుణాన్ని ప్రబోధిస్తుంది.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఏప్రిల్ 28, 2007 @ 2:09 ఉద. | స్పందించండి

 16. “ఇంతకన్నా వాదన పొడిగించదలుచుకోలేదు. దాని వల్ల ఉపయోగం కూడాలేదని నా అభిప్రాయం.”
  That’s a wise decision. I think I too have said enough, at least for now.

  lalitha.

  వ్యాఖ్య ద్వారా lalithag — ఏప్రిల్ 28, 2007 @ 5:55 ఉద. | స్పందించండి

 17. a reminder to myself.

  http://onamaalu.wordpress.com/2007/04/06/vyarthakalahampenchabokoyi/

  lalitha.

  వ్యాఖ్య ద్వారా lalithag — ఏప్రిల్ 30, 2007 @ 6:42 ఉద. | స్పందించండి

 18. మన యువతరానికి ఉన్న పెద్ద జాడ్యం ఎంటయ్యా అంటే..
  మనకి ఎదీ పుర్తిగా తెలియదు మిడి మిడి జ్ణానం తో వాదించేస్తూ ఉంటాం.
  అయినా ఆ తప్పు ఉంది ఈ తప్పు ఉంది అనుకొకపొతే కనపడ్డ మంచి ని తీసుకొని అక్కర్లేని చెడు ని వదిలి వేయడమే మంచిదెమో
  శ్రిరాం మీ ఈ ప్రయ్థ్నం నాకు మహా బాగా నచ్చింది
  ఇరు వైపుల సంబాషనను బహు చక్కాగా అక్షరీకరించారు

  వ్యాఖ్య ద్వారా Srujana — ఏప్రిల్ 30, 2007 @ 10:09 ఉద. | స్పందించండి

 19. సరే నేను నా మూర్ఖపు వాదనలతో చాలా మందిని క్షోభ పెడుతున్నట్లున్నాను. క్షమించండి.
  నా ఈ చివరి ముక్తాయింపుతో “ఇంతకన్నా వాదన పొడిగించదలుచుకోలేదు. దాని వల్ల ఉపయోగం కూడాలేదని నా అభిప్రాయం.” అన్న శ్రీరామ్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ నేనూ ఈ వాదనను ఇంతటితో ముగిస్తున్నాను.

  లలిత గారూ,
  “ఎందుకండీ ఇంత కక్ష వేదాల మీద?” అని మీరన్నారు. “ఎందుకండీ అంత ప్రేమ వేదాల మీద?” అంటే మీరేం చెబుతారు? నాకు వేదాల మీద వున్నది కక్షా కాదు ప్రేమా కాదు. వాటిని వున్నదున్నట్లు అంగీకరిద్దాం అనే భావన. అందులో మంచీ వుంది, చెడూ వుంది. వేల ఏళ్ళ నాటి మానవుడి అమాయకత్వమూ వుంది అని చెప్పాలనేది నా తాపత్రయం. నేను ఎన్నోసార్లు అరిచి గీ పెట్టినట్టే మళ్ళి చెబుతున్నది ఏమిటంటే “అన్నీన్నీన్నీ (అన్నీ ని ఒత్తి పలకాలని) వేదాల్లో వున్నాయి” అనడంతోనే నాకొచ్చిన చిక్కంతా. ఏవీ లేవు అనిగాని, ఇప్పుడు ఆధునిక విజ్ఞానమంతా అందులో వుండాలని గానీ నేనటం లేదు.

  శ్రీరామ్ గారూ,
  రావణుడికి శాపం వున్న సంగతి నాకు తెలిసినా శాపాన్నీ, వరాన్ని నమ్మని నా తత్వం అలా రాయించింది. రాముడు ఏక పత్నీవ్రతుడుగా వుండటానికి అతని వ్రతమో, నిగ్రహమో కారణమయి, రావణుడు సీతను తాకకపోవడానికి శాపం కారణమని రావణున్ని చిన్న చేయడానికి వుద్దేశించిందనే తప్ప నాకు నోటిమాటతో ఇచ్చే శాపాలు, వరాల మీద నమ్మకం లేదు.
  కాబట్టి నా మూల నమ్మకాల ఆధారంగా మన పురాణ కథలను చదివితే నాకు అవి మరోలా కనిపించడంలో విచిత్రమేముంది?
  “వేదాల యొక్క ఔన్నత్యాన్ని చెప్పి, దానిని సైన్సుతో పోల్చి తృణీకరించడం తప్పు ” — మీ ఈ అభిప్రాయమే నాది కూడాను కొద్దిగా అటుఇటుగా! “వేదాలు వేదాలే, సైన్సు సైన్సే ఈ రెంటిని కలపకండి. అన్నీ వేదాల్లోనే వున్నాయని అనకండి” అనే కదా నేను మొత్తుకుంటున్నది.
  సమాజంలోని ప్రతి దానికి ధర్మాన్ని తప్పుబట్టాలని నాకూ లేదండి. కానీ మనం దర్మంగా నెత్తుకెత్తుకున్న దాంట్లోనే మన సమస్యలున్నపుడు వాటిని ఏరివేసే ప్రయత్నం చెయ్యక వాటిని ఎత్తిచూపెట్టినవాడు దుర్మార్గుడన్నట్లు చూస్తే తప్పుకదా!
  ఇలాంటి వాదనలు ఎంతో మంది ఎన్నో యుగాలుగా చేస్తూనే వున్నారు అయినా ఏమయింది. ఏమీ అవదు. నిజమే మన నమ్మకాలు కలవని సమాంతర రేఖలు అయినప్పుడు వాదించకుండా మిన్నకుండటమే హితవైన పని.

  సృజన గారూ,
  మన యువతరానికి ఏదీ పూర్తిగా తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో వాదిస్తారని మనమనుకుంటాం గానీ అదే మిడిమిడి జ్ఞానంతో సమర్థిస్తూ వాదిస్తామని తెలుసుకోం! మిడిమిడి జ్ఞానంతో వ్యతిరేకించడం ఎంత తప్పో, సమర్థిస్తూ మాట్లాడటమూ అంతే తప్పు కదా!

  చివరిగా మీ నమ్మకాలని హేళన చేయడం నా వుద్దేశ్యం కాదు, నా నమ్మకాలను వ్యక్త పరచుకోవడమే నా అభిప్రాయం. అయితే దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని బాధపడకూడదని నా మనవి. ఒక హంతకుడి తరపున వాదిస్తున్న న్యాయవాది హంతకుడు కాదు. అతనికి నిందితుడు హంతకుడు అని తెలియకే వాదిస్తున్నాడనేది గుర్తుంచుకోవాలి. “వాది దోషమే గానీ వాదన దోషం కాదు” అనేది కూడా నాకు అభ్యంతరంగా వుంది. హంతకుడి తరపున వాదిస్తున్న లాయరుది దోషమెలా అవుతుంది అతని వాదనదే దోషమవ్వాలి గాని.

  మిమ్మల్నెవ్వరిని నొప్పిపంపడం నా అభిమతం కాదని మరొక్కసారి వేడుకుంటూ …

  –ఫ్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — ఏప్రిల్ 30, 2007 @ 7:17 సా. | స్పందించండి

 20. లలిత గారూ, సృజన గారూ…ధన్యవాదాలు.

  ప్రసాద్ గారూ…నేనందుకే పురాణాల గురించి మీతో వాదించలేదు. మీరు కొన్ని నిశ్చితమైన ఆలోచనలు, నమ్మకాలూ ముందుగానే స్థిరపరచుకుని పురాణాలు చదివితే అది అలాగే ఉంటుంది. రావణుడు నిగ్రహం పాటించాడని చెప్పిన పురాణమే రంభ శాపం గురించి కూడా చెప్పింది. నమ్మకపోతే మొత్తం మానెయ్యాలి లేకపోతే లేదు. ఇటువంటప్పుడు మీరూ నేనూ వాదించుకుని ప్రయోజనం లేదనే నేను అలా అన్నది.

  అన్నీ వేదాలలోనే ఉన్నాయిష అని అనవలసిన పరిస్థితి ఎందుకొచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం. సమస్య ధర్మంలో ఉందా లేక దానిని సరిగా ఆచరించడంలో ఉందా అన్నది కూడా.

  ఏమైతేనేం ఇక్కడ ఒకరు మూర్ఖులూ ఇంకొకరు విజ్ఞులూ అని నేను అనుకోవట్లేదు. సిద్ధాంతాలలోని విభేదాన్ని వ్యక్తిగతస్థాయికి దిగజార్చే సంస్కారం కాదు మీది అని కూడా తెలుసు. కానీ వాదన మొదలైతే ఎటువైపైనా వెళ్తుంది. నా మీద నాకే నమ్మకం లేదు. మీలాంటి మిత్రుడితో నాకది ఇష్టంలేదు. అందుకే అలా అన్నది.

  ఇంక “వాది దోషమే గానీ వాదన దోషం కాదు” అన్నదాని అర్ధం ఏమిటంటే ఏదైనా సిద్ధాంతం ఒక వాదనలో ఓడిపోయిందంటే అది వాదించిన వాడి తప్పు కానీ, నిజానికి ఒక సిద్ధాంతం గొప్ప ఇంకొకటి తక్కువ అని లేదు అని.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 30, 2007 @ 11:18 సా. | స్పందించండి

 21. hmmm.. nice discussion on board.. well read it a couple of days back..but cudnt comment. both the sides argued the best and the ending shud have been the same as no one can come to a stand point of which is better.. i knew most of the things but learned a few too. i am surprised how most of us have such discussions..well i used to argue with my granny- but my granny is not as smart as ur granpa! so the discussion always ended as ” peddalu cheparu.. enduku,emiti adaga koodadu”..

  వ్యాఖ్య ద్వారా joshmybench — మే 2, 2007 @ 7:45 ఉద. | స్పందించండి

 22. @Prasad
  Speaking Frankly my comments are not specific to anyone…
  Nor even to u…
  I was just telling tht..lets accept if we feel good and lets reject if we feel it bad..
  No issues..
  thts what i meant..
  Because everyone has complete freedom to feel what wanna feel…

  వ్యాఖ్య ద్వారా Srujana — మే 2, 2007 @ 9:38 ఉద. | స్పందించండి

 23. @ ప్రసాద్ గారూ, నోటిమాట శాపాలని ఎంత తేలిగ్గా తీసేయగలిగారు? మీకు తెలియదా మాటే మంత్రము అని. ఏ మాటనైనా specific vibration తో ఉచ్ఛరిస్తే అదే మంత్రము. అందుకనేగా కొన్ని రాగాలతో వర్షాలు కురిపించడం వగైరా వగైరాలు. కాదన గలరా?

  వ్యాఖ్య ద్వారా kamesh — మే 3, 2007 @ 8:01 సా. | స్పందించండి

 24. deepthi, thanks for the comment.

  “but my granny is not as smart as ur granpa”….well thats what makes the difference . it always depends on how well you can articulate your opinions. and thats what i wrote also.

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 4, 2007 @ 10:57 ఉద. | స్పందించండి

 25. ఇప్పటి దాకా నేను మీ అందరి టపాలూ ఎక్కువగా చదవ లేదు. మీ వెబ్ సైట్లు చూస్తుండగా ఈ ఒక్క టపా నన్ను ఆకట్టుకుంది. శ్రీరాం గారూ, మీరు వ్రాసినది అమోఘం. దానికి తగ్గ ప్రసంశలూ మీకు అందాయి. ఇంత మంచి విషయాన్ని చెప్పినందుకు మీకు శతకోటి వందనాలు. ఈ విషయం నాకు పూర్తిగా తెలియనిది కాదు కానీ, మీ వ్యాసం చదవముచ్చటగా ఉంది, ఒకటి. రెండవది, ఇంత మంచి విషయాన్ని ఒకరు ఇలా రాస్తున్నారన్న సంతోషాన్నీ వ్యక్తం చెయ్యడానికి నాకు మాటలు రావడం లేదు.

  ఎందరో మహాను భావులు. మీ అందరికీ వందనములు.(అందరికీ పేరు పేరునా)

  వ్యాఖ్య ద్వారా Syam — మే 7, 2007 @ 1:36 సా. | స్పందించండి

 26. శ్యాం గారూ…ధన్యవాదాలు. ఇలా వందన స్వీకరణ చేసేటంత అర్హత నాకు లేదండీ…నాకు తోచిందేదో రాసానంతే…

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 7, 2007 @ 5:37 సా. | స్పందించండి

 27. my GOD, i am not able to believe seeing so much of discussion and debate,that too in “telugu”. good job guys keep it up…next time i will post my comments in telugu…”telugu lo vradam, telugu lo mataladudam, telugu ni bratikinchukundam”…

  వ్యాఖ్య ద్వారా prasad — మే 8, 2007 @ 4:34 ఉద. | స్పందించండి

 28. ప్రసాద్ గారూ…స్వాగతం. మన తెలుగుబ్లాగులోకంలోకి ఇంకొక ప్రసాద్ అన్నమాట. తెలుగులో రాయడానికి మీరు lekhini.org వాడవచ్చు.

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 8, 2007 @ 10:18 ఉద. | స్పందించండి

 29. శ్రీరామా, తియ్యటి తెలుగులో చిక్కైన విషయాని గురించి సమగ్రంగా రాసావు. భేష్!!!

  సైన్సు గొప్పా మీ వేదాలు గొప్పా అనే అసంబద్ధమైన ప్రశ్నకి “నిజానికి వేదాలలో సైన్సు లేకపోయినా నాకు నష్టం లేదు. వేదాల స్థాయి, దృక్పధం వేరు. సైన్సు సంగతి వేరు” అని యుక్తిగా చెప్పావు.

  ద్వే విద్యే వేదితవ్యే…పరా చైవాపరా చ…అతః పరా యయా తద్ అక్షరం అధిగమ్యతే అంటుంది మూండకోపనిషత్తు.
  (రెందు విద్యలు ఉన్నాయి…’అపరా’ అనే సామాన్యమైన విద్య మరియు ‘పరా’ అనే శ్రేష్టమైన విద్య…అక్షరమైన బ్రహ్మతత్వాన్ని గ్రహింపచేసేది ఉన్నతమైన పరా విద్య; మిగతావి సామాన్యమైన అపరా విద్యలు)

  యజ్ఞాలు, వ్యాకరణం, నిరుక్తం వంటివి అశాశ్వతమైన స్వర్గ సుఖాలని మాత్రమే ఇవ్వగలవు కాబట్టి అవి సామాన్యమైన అపరా విద్యలు అని అంటుంది మూండకం. భవసాగరంలో ముణిగిపోతున్న మనకి సైన్సు వంటి శాస్త్రాలు ఇచ్చే చేయూత తప్పక అవసరమే. కానీ వాటి కంటే పరమైనది ఇంకేమీ లేదు అనుకుంటే మనము కూపస్థ మండూకాలమే.

  ‘కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి ‘ అని పరిశోధించి ‘సర్వం ఖల్విదం బ్రహ్మ ‘ అని నిర్ధారించిన వేదానికీ ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష ‘ అనే పోలాయ్ మాటలకీ మధ్య స్వానుభవం అనే వ్యత్యాసం ఉంది. చెప్పాల్సిన పరమార్ధాన్ని వేదం నిష్కర్షగా చెప్పింది. ఎంత చెట్టుకి అంత గాలి అన్న చందంగా గ్రహించే వారి సామర్ధ్యాన్ని పట్టి ఆ తత్వగాంభీర్యం గ్రాహ్యం అవుతుంది. అందుకే అన్నమయ్య అన్నాడు ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమె నీవు అని.

  బ్లాగ్ క్రింది వాఖ్యానాలలో పురాతన కాలం నించి ఉన్న మన సామాజిక (దు)స్థితులకి వేదధర్మమే కారణమైనట్టుగా కువిమర్శించారు. ఆచరించేవారి ఆచరణ లోపాలని ధర్మం పైన రుద్దడం అధ్యారోప అపవాదం అవుతుంది (false superimposition). జంధ్యపు పోగు వేసుకున్న ప్రతివాడూ బ్రాహ్మణుడైన ఈ కలికాలంలో ధర్మాన్ని వాడుకునేవాడే కానీ ధర్మాన్ని ఆదుకునేవాడూ అర్ధంచేసుకుని ఆచరించేవాడెవడు? ధర్మాన్ని అలక్ష్యం చేసి స్వార్ధానికి వక్రీకరించే ప్రబుద్ధులు ఇప్పుడే కాదు ప్రతి కాలంలోనూ ఉంటారు. అందుకే పరమాత్మ ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అన్నాడు. స్వార్ధంతో, కులమత జాఢ్యంతో రగిలిపోతున్న ప్రపంచానికి ‘సహనా వవతు సహనౌ భునక్తు…’ అన్న వేదమే శరణం ఉపశమనం.

  సహనా వవతు సహనౌ భునక్తు
  సహవీర్యం కరవావహైః
  తేజశ్వినావధీతమస్తు మావిద్విషావహైః
  ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

  వ్యాఖ్య ద్వారా ~antahprajna~ — మే 20, 2007 @ 7:33 ఉద. | స్పందించండి

 30. మిత్రమా అంతఃప్రజ్ఞా! నేను రాసింది నచ్చినందుకు కృతజ్ఞతలు.
  ఈ వ్యాఖ్యతో నా పోస్ట్‌కి ధన్యత కలిగింది.ధన్యవాదాలు…

  వ్యాఖ్య ద్వారా Sriram — మే 21, 2007 @ 11:04 ఉద. | స్పందించండి

 31. […] నాకు ఖచ్చితంగా తెలీదు. నా అభిప్రాయం ఇదివరకు ఒకసారి రాసాను. వేదపండితులంతా చెడ్డవాళ్ళూ, బిల్ […]

  పింగ్ బ్యాక్ ద్వారా ఇత్యర్ధలు కూరా, ఇతిభావలు పులుసూ… « సంగతులూ,సందర్భాలూ…. — ఆగస్ట్ 23, 2007 @ 1:11 ఉద. | స్పందించండి

 32. ఓహ్హ్! గొప్ప జాబునిన్నాళ్ళూ చూడలేకపోయానే!!
  ఓ వారం కిందట మా పిల్లలకు చతుర్యుగాల గురించి మాట్టాడేటపుడు, కలియుగపు కాల నిర్ణయ ఖచ్చితత్వాన్ని వివరిస్తూ వేదాల గురించి కూడా చెప్పాను (నాకు తెలిసిన అణువులో పరమాణువంత). అప్పటికి ఈ వ్యాసం చూసుండుంటే మరింత బాగుండేది. ఇంకా బాగా చెప్పగలిగేవాణ్ణి.

  ఇక, విమర్శలు.. వేదాలను విమర్శించే వారంతా వాటిని చదవకనే చేస్తారాపని. పైగా “మన” అనేటప్పటికి మనాళ్ళకి చిన్నచూపు; అది మన ఖర్మ, అంతే!

  శ్రీరామ్ గారూ.. రత్నం లాంటి వ్యాసమిది!

  వ్యాఖ్య ద్వారా చదువరి — ఆగస్ట్ 24, 2007 @ 2:47 సా. | స్పందించండి

 33. వేదాలకు సంబంధించి రాసిన వాటిల్లో ఇంత కన్నా మించిన టపాని ఊహించుకోలేకపోతున్నాను. వావ్… హాట్సాఫ్ కామ్రేడ్.
  (చదువరి గారి వ్యాఖ్యకు థాంక్స్)

  వ్యాఖ్య ద్వారా నాగరాజా — ఆగస్ట్ 25, 2007 @ 1:42 ఉద. | స్పందించండి

 34. నేను చాలా లేటుగా చూస్తున్నా ఈ టపాను..నేను వనవాసంలో ఉన్న కాలంలో వచ్చినట్టుంది.
  తాతయ్య, శ్రీరాం ఇద్దరూ సూపర్..చాలా కృతజ్ఞతలు

  వ్యాఖ్య ద్వారా రవి వైజాసత్య — ఆగస్ట్ 25, 2007 @ 7:41 సా. | స్పందించండి

 35. చదువరిగారూ, ధన్యవాదాలు. ఇలాంటి విషయాలు ఒకసారి చెప్తే అయ్యేవి కాదు కదా. మీలాంటి వాళ్ళు పిల్లలకి చెప్తూనే ఉండాలి.
  నాగరాజాగారూ, రవిగారూ…ధన్యవాదాలు.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 25, 2007 @ 9:57 సా. | స్పందించండి

 36. Hello Sriram gaaru,

  oka old hindi song kosam search chestu ila mee blog chusi, chaduvuthu naa work and song download gurinchi kuda marchipoyanu…

  very nice article and mana puranaalu, veedala gurinchi chala bhaga narrate chesaru…

  regards,

  Bala Kishore Ruttala

  వ్యాఖ్య ద్వారా Bala Kishore Ruttala — ఫిబ్రవరి 3, 2009 @ 10:50 ఉద. | స్పందించండి

 37. chala bagundhi andi me vivarana,
  adi tata, manavadi la tho mudi petti vedalu, science gurinchi varnincharu choodandai, adi chala bagundhi…..
  naku poorvam inni vishayalu teliyavu, me blog valla telusukunnau, chala thanks andi.

  వ్యాఖ్య ద్వారా sujana — ఫిబ్రవరి 8, 2009 @ 12:23 ఉద. | స్పందించండి

 38. ఎందరో మహాను భావులు. మీ అందరికీ వందనములు.(అందరికీ పేరు పేరునా)

  Really excellent article. Wow! Wonderful.

  Hats of to you for excellent article and good discussion.

  We want to these kind of articles more and more for to reveal the great Indian history.

  వ్యాఖ్య ద్వారా lak — మార్చి 27, 2010 @ 1:09 సా. | స్పందించండి

 39. […] తాతయ్య […]

  పింగ్ బ్యాక్ ద్వారా భోగిమంటలూ – భూతాపమూ ! | సంగతులూ,సందర్భాలూ…. — జనవరి 15, 2020 @ 2:56 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: