సంగతులూ,సందర్భాలూ….

ఏప్రిల్ 20, 2007

అందమైన సమస్య!

Filed under: Uncategorized — Sriram @ 12:17 ఉద.

గత రెండు వారాలుగా స్వాతికుమారి గారిని తిట్టుకోని రోజు లేదు. ఏమి పని చేసారీవిడ? ఆ మాత్రం సామాజిక స్పృహ ఉండద్దూ? ఏదో కనిపించింది కదా అని లావణ్య కౌముది అనుకుంటూ అంతటి అందాన్ని పట్టుకొచ్చి కూడలిలో పెట్టెస్తే జరిగే పరిణామాలకి ఎవరిది బాధ్యత? ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు బయట ఎక్కడైనా ఇలాంటి ప్రమాదకరమైన హోర్డింగ్స్ ఉంటే వెంటనే తొలగిస్తారు. నేను కూడా ఇదే ముక్క వీవెన్ గారితో చెప్పి ఆ పోస్ట్‌ని తీయించెద్దామనుకున్నాను. గోరుచుట్టు మీద రోకటిపోటంటారే అలాగ సరిగ్గా అదే సమయానికి ఆయన ఊరికెళ్ళడం, కూడలి కదలకపోవడం లాంటి వన్నీ జరిగాయి. 

ఏం చెయ్యడానికీ లేకుండా తయారయ్యింది పరిస్తితి. అలాగని కూడలి చూడడం మానడం కుదరదు కదా. అది అంతకన్నా బాధ. రోజూ ఆ ఫోటో చూడడం తప్పక, చూసి మామూలుగా ఉండలేక, ఎంత యాతనో ఏమి చెప్పేది. అప్పుడెప్పుడో దూరదర్శన్ వారు సమస్యా పూరణం కార్యక్రమంలో ఇచ్చిన పాదం:

కలమా సాగదు నిద్రరాదు మన మా కాంతాలతాధీనమై !

అన్నది గుర్తొచ్చింది. ఎంత అందమైన సమస్య అనిపించింది వెంటనే. ఏమీ చెయ్యలేమని కూర్చుంటే ఇంకా బాధ కనక, ఈ పద్యాన్ని పూర్తి చెయ్యాలి ఎలాగైనా అని ప్రయత్నించాను. ఈ మత్తేభం ఇదిగో ఇలా తయారయ్యింది:

చల మా తొంగలి రెప్పలందమరు కంజాక్షద్వయాభాస, మం
దల మా మేను విరాజమానమగు సౌందర్యంబుకున్, నా మనో
బలమా చాలదు నిగ్రహాచరణకున్, భారంపు రేయందు  నా
కలమా సాగదు నిద్రరాదు మన మా కాంతాలతాధీనమై !   

(చలము=కదలాడునది;తొంగలి రెప్పలు=quivering eyelids ; కంజాక్షద్వయాభాసము=పద్మాల వంటి కన్నుల కాంతి;
అందలము=పల్లకి;మేను=శరీరము )

* ఈ పద్యం రాయడానికి కారణమైన  కొత్తపాళీగారికి, స్వాతిగారికి కృతజ్ఞతలు. సహపాఠి రానారెకు అభినందనలు.

14 వ్యాఖ్యలు »

  1. అహా..అద్భుతం గా వుందండి.కొత్తపాళీ గారు యువకవులను బాగా ప్రోత్సహిస్తున్నారన్నమాట.మొన్న రానారే.ఇప్పుడు మీరు.రేపు ఇంకెంతమందో?స్వాతి గారికి ఒక విన్నపం దయచేసి మరిన్ని లావణ్య కౌముదిలను చూపండి.

    వ్యాఖ్య ద్వారా radhika — ఏప్రిల్ 20, 2007 @ 2:13 ఉద. | స్పందించండి

  2. ఐతే ఆ దెబ్బకు మీకు నిద్రబట్టక ఏ అపరాత్రో కీబోర్డు కదిలించారన్నమాట. ఈ పద్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం గట్టిగా చేశాను. చూడండి బాగానే అర్థం చేసుకున్నానేమో.

    ఆ తొంగలిగొను (ప్రకాశించు) రెప్పలందు అమరిన కంజములవంటి(తామరలవంటి) అక్షద్వయపు (కన్నుల జత యొక్క) భాసము (కాంతి) చలము (తొణకుతున్నది).
    విరాజమానమగు (మిక్కిలి ప్రకాశించుచున్న) సౌందర్యమునకు ఆ మేను (శరీరము) అందలము (పల్లకీ అయి ఉన్నది).
    నిగ్రహ ఆచరణకు (నిగ్రహం పాటించడానికి) నా బలమా చాలదు.
    అటువంటి భారమైన రేయిలో నా కలమా సాగదు, నిద్ర కూడా రాదు. … ఏం పాపం, ఎందుకని!?
    మనము (మనస్సు) ఆ కాంతాలత ఆధీనం అగుట చేత (కాంత అంటే స్త్రీ). … అదన్నమాట, (లవులో పడ్డావా? yes yes I am in love – రమణగోగుల పాట)

    శ్రీరామ్‌గారు, మన క్లాసుకు మీరే లీడర్. మంచి ప్రయత్నం.

    ఒక సందేహం – కంజాక్షద్వయ+భాస=కంజాక్షద్వయాభాస అవుతుందా? ఎందుకంటే కంజాక్షద్వయాభాస=కంజాక్షద్వయ+అభాస కదా? అభాసము అంటే పాడుచేయడమని కదా!
    ఒక అభిప్రాయం – సౌందర్యంబుకున్ అనే పదానికి కాస్త మెరుగు అవసరమేమో అనిపిస్తూంది.

    మీరు ప్రాసకూడా తెచ్చారు పద్యంలో (నాలుగు పాదాల్లోనూ రెండో అక్షరం – ల). మత్తేభం అంటే సభరనమయవ తప్ప ఇంకేమీ తెలీదు.
    కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువమాట్లాడటం మంచిది కాదు.

    వ్యాఖ్య ద్వారా రానారె — ఏప్రిల్ 20, 2007 @ 3:21 ఉద. | స్పందించండి

  3. కొవ్వొత్తి తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిచ్చినట్టు(ఇక్కడ వర్తిస్తుందా? ఏమో)మీరూ అంత మధన పడీమంచి పద్యం రాసి మాకు ఆనదం పంచారు.
    మీరు మరీ ఎక్కువగా feel అవను అంటే ఒకమాట.
    ప్రబంధాలకేమాత్రం తీసిపోని వర్ణన లా ఉంది(అలా అని నేనెక్కువ ఏం చదవలేదు లెండి గ్రంధాలూ అవీ, ఏదొ నాకు తెలిసిన పరిధిలో).

    వ్యాఖ్య ద్వారా swathi — ఏప్రిల్ 20, 2007 @ 9:16 ఉద. | స్పందించండి

  4. చక్కగా వుంది పద్యము.
    వివరించిన రానారెకి కృతజ్ఞతలు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

    వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — ఏప్రిల్ 20, 2007 @ 7:12 సా. | స్పందించండి

  5. రాధికగారూ ధన్యవాదాలు. మీరు స్వాతిగారిని కోరిన కోరిక మరీ అన్యాయంగా ఉందని మాత్రం అనిపిస్తోంది.

    రానారె గారూ…చక్కగా అనువాదం చేసినందుకు కృతజ్ఞతలు.మీ మేలు మర్చిపోలేను 🙂
    ఇక మీరడిగిన ప్రశ్నల గురించి:
    కంజాక్షద్వయాభాసము అన్నది సంధిగా కాక సమాసము అన్న దృష్టితో చూస్తే సంస్కృత సమాసలలో ఇలా పూర్వపదాలకి దీర్ఘాలు వస్తాయి కాబట్టి సబబేనేమో అనుకుని రాసేసాను. నాకైతే అది తప్పో వొప్పో తెలీదు. తప్పని చెప్తే దిద్దుతాను.
    సౌందర్యంబుకున్ – ఔనండీ అంత అందంగా లేదు 🙂 చూస్తాను మార్చగలనేమో.

    సభరనమయవ – ప్రాస పాటించాలి- మొదటి అక్షరానికీ 14వ అక్షరానికీ యతి. ప్రాస యతి చెల్లదు. అంతే మత్తేభం నియమాలు.

    అన్నట్టు అధ్యక్షా…ఈ లీడర్ పదవికి కాస్త బలంగా ఉన్నవాళ్ళైతేనే బెటర్. నన్ను వదిలైండి 🙂

    స్వాతిగారూ…చేసినదంతా చేసి ఇలా కొవ్వొత్తీ అగ్గిపెట్టీ అంటూ కంటితుడుపు మాటలు మాట్లాడినంత మాత్రాన్న మిమ్మల్ని తిట్టుకోడం ఆగదు 🙂

    ధన్యవాదాలు ప్రసాద్ గారూ.

    వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 20, 2007 @ 10:37 సా. | స్పందించండి

  6. పద్యం రాసింది మీరు కాబట్టి చక్కగా అనువదించానని మీరంటే నాకు నమ్మకం కలిగినా, ఇంతకంటే బాగా దాని అర్థం చెప్పగలవారు ఏమంటారోనని(అంటే బాగుండునని) రాసినప్పటినుంచీ చూస్తున్నా. 1-14 అక్షరాలకు యతి ప్రతి పాదంలోనూ ఉండాలి, ఔనా? ఇంకో సందేహం – మత్తేభము, మత్తేభ విక్రీడితము రెండూ ఒకటేనా? సాదారణంగా విరహాన్ని వర్ణించడానికి మన ప్రాచీన కవులు మత్తేభాన్నే వాడతారేమో గమనించారా?

    వ్యాఖ్య ద్వారా రానారె — ఏప్రిల్ 20, 2007 @ 11:53 సా. | స్పందించండి

  7. హ హ హా..ఎదురుచూపులు ఫలించాలని కోరుకుంటున్నాను 🙂

    ఔను ప్రతి పాదంలోనూ ఉండాలి. మత్తేభము, మత్తేభ విక్రెడితము రెండూ ఒకటే. మత్తేభం అనేది కుదించిన పేరు.

    విరహాల సంగతి ఏమో కానీ, ఈ గజగామిని కి మత్తేభమే తగుననిపించింది 🙂

    నాకు తెలిసిన ఒక ప్రఖ్యాత పద్యం విరహం గురించి, “నలదమయంతులిద్దరు మనప్రభవానల బాధ్యమానలై…” అన్నది చంపకమాలలో ఉంది.

    వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 21, 2007 @ 12:15 ఉద. | స్పందించండి

  8. ఏమబ్బా రానారె, నువ్వు పొగడ్తలకి అలవాటు పడాల్నని చెప్పినానె అనుకో, మరీ ఇంత అలవాటు పడిపోవల్నా? 🙂

    శ్రీరాముని పద్యం చూసి ఎంత ముచ్చట పడ్డానో నీ భావానువాదం చూసీ అంత సంతోషించాను. ఇది తప్పేమో అని చూపిస్తే సరిపోదు. ఇకనించీ చూపెట్టిన తప్పుకి పరిష్కారం కూడా సూచించాలి – క్లాసులో కొత్త ఎసైన్మెంటిది! 🙂

    GOF అంటే Gang of Four (ఉత్పల, చంపక, శార్దూల, మత్తేభ) వృత్తాలకి రెండో అక్షరం ప్రాస తప్పని సరి. యతి స్థానం వరసగా 10, 11, 13, 14 అనుకుంటా.
    మనలో మాట – మహానుభావులు యతిని సమర్ధవంతంగానే నిర్వహించారుగానీ ఈ వృత్తాల్లో యతి కుదరనంత మాత్రాన ఊడిపోయేదేం లేదు అనిపిస్తుంది నాకైతే. సీసం, ఆవె తేగీ లాంటి పద్యాల కేసు వేరు.

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఏప్రిల్ 21, 2007 @ 1:02 ఉద. | స్పందించండి

  9. బాగుందండీ పద్యం.
    మీ అందమయిన సమస్య తొందర్లోనే తీరాలి మరి 🙂

    వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఏప్రిల్ 21, 2007 @ 1:53 ఉద. | స్పందించండి

  10. కొత్తపాళీగారూ ధన్యవాదాలు.
    ప్రవీణ్ గారూ… ధన్యవాదాలు. చూసారా తోటి మగపురుషుడిగా అర్ధంచేసుకున్న మీ వ్యాఖ్యకీ, పైన ఇద్దరు ఆడస్త్రీల వ్యాఖ్యకీ తేడా 🙂

    వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 21, 2007 @ 4:16 సా. | స్పందించండి

  11. telugu tution chepthara mastaru??!!! 😉

    వ్యాఖ్య ద్వారా joshmybench — ఏప్రిల్ 23, 2007 @ 7:46 ఉద. | స్పందించండి

  12. Bagundi Sriram nee padyam

    వ్యాఖ్య ద్వారా Srujana — ఏప్రిల్ 23, 2007 @ 4:52 సా. | స్పందించండి

  13. thanks deepthi, for having some confidence in my telugu. but i am a bad teacher make. also, its best to avoid such ventures in this state of my mind 🙂

    thanks srujana…

    వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 23, 2007 @ 11:02 సా. | స్పందించండి

  14. అందమైన పూరణ కూడా :):)

    వ్యాఖ్య ద్వారా ఊకదంపుడు — ఫిబ్రవరి 6, 2011 @ 1:40 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి