సంగతులూ,సందర్భాలూ….

ఏప్రిల్ 8, 2007

జీవనాధారస్వరం!

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 11:13 సా.

వారాంతం వచ్చిందంటే నాకు ఎక్కడలేని ఆనందం ముంచుకొస్తుంది, నిద్ర రూపంలో. పనిరోజుల్లో పడుక్కుందామన్నా ప్రశాంతత కరువే ఈ నగరంలో. పొద్దున్న ఏడు గంటలనుంచీ మొదలయ్యే చిత్ర విచిత్ర రూపాలలో ఉండే ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాల రణగొణధ్వని ముందు విశ్వామిత్రుడి తపస్సైనా సరే భంగం కావలసిందే మరి. అందుకే నిద్ర అనే యోగసమాధిలో చిదానందపు అంచులు చూస్తూ పరవశంతో పడుక్కుని ఉన్నాను. 

 

ఇంతలో ఏదో మధురమైనా కల. నిజానికి కలో మెలకువో తెలియని స్థితి. ఏమిటో స్పష్టతలేని ఒక ఊహాతీతమైన సౌఖ్యభావన మనసుని ఊపెయ్యడంతో మెలకువవచ్చింది. “వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం…” అంటూ ఎక్కడనుంచో ఒక శ్రావ్యమైన సింధుభైరవి రాగం వినిపించింది. ఇంత అందంగా నాదస్వరంతో సుప్రభాతం పాడితే దేవుడే నిద్రలేస్తాడుకదా నాకు మెలకువ రావడంలో వింతేముంది అనిపించింది.

 

ఇంక పడుక్కోబుద్ధికాలేదు. “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది…” అని కూనిరాగం తీస్తూ బ్రష్షూ,పేస్టూ పట్టుకుని బాత్రూంలో దూరాను. ఇంతలో సన్నాయి శబ్దం మరింత దగ్గరైంది. పాట మారి,నగుమోము కనలేని నాజాలి తలచి…” అంటూ ఆభేరి రాగం మొదలైంది.నా ఆనందం రెట్టింపైంది.ఇంత పొద్దున్నే ఏమిటా ఇది, కొత్తగా వెలసిన అపార్ట్మెంట్లలో ఎవరిదేనా గృహప్రవేశమేమో అనుకున్నా. ఐనా ఇలా నాదస్వరం పెట్టించి త్యాగరాజ కృతులు వాయించమనేది ఎవరు ఈరోజుల్లో అనిపించింది మళ్ళీ. కొద్ది సేపటికి “ఎంతనేర్చినా, ఎంతచూసినా….కాంతదాసులే”  అంటూ శుద్ధ ధన్యాసి రాగం వినబడింది. అప్పుడు తట్టింది నాకు డోలు వాయిద్యం లేదేమిటా అని. సాధారణంగా నాదస్వరానికి డోలు పక్కవాయిద్యం ఉంటుంది కదా మరి. ఎక్సైట్మెంట్ ఎక్కువయ్యి గబగబా షవర్ తిప్పడం మొదలుపెట్టాను. నాదస్వరం మరింత దగ్గరై ఆనంద భైరవి రాగంలో “పలుకే బంగారమాయెనా…” అంటూ భద్రాచల రామదాసు కీర్తన పలుకుతోంది.

 

ఇంక నా వల్ల కాలేదు.పొడి తువ్వాలు చుట్టుకుని బాల్కనీలోకి పరిగెట్టాను. కిందకి చూద్దును కదా నా ఆశ్చర్యానికి అంతేలేదు. సుమారు ఇరవై సంవత్సారాలుంటాయేమో, ఒక యువకుడు తన్మయత్వంతో నాదస్వరం వాయిస్తూ ఒక్కడూ రోడ్డుమీద నడచి వెళ్తున్నాడు.  మధ్యలో ప్రతీ గేటు దగ్గరా ఒక నిముషం ఆగి ఏమైనా ఇస్తే తీసుకుంటున్నాడు.

మనస్సులో ఒక్కసారి ఎన్నో ప్రశ్నలు. ఎవరితను? ఇంత అందంగా, శాస్త్రీయంగా వాయిస్తున్న ఇతనికి ఏమిటీ ఖర్మ? ఏదో పాడుతూనో, గంగిరెద్దులని తీసుకొచ్చి సన్నాయి వాయిస్తూనో భిక్షకి రావడం మనదేశంలో కొత్త కాదు. కానీ అవి వినగానే ముష్టి వాయిద్యమని మనకి తెలిసిపోతుంది. ఇంత బాగా వాయించే శక్తి వాళ్ళకుండదు. ఎప్పుడో త్యాగరాజ స్వామి కాలంలో ఊంచ వృత్తినవలంబించారని విన్నాను కానీ ఈ రోజుల్లో ఏమిటితను?ఏమి కష్టంలో ఉన్నాడో పాపం? కనుక్కుని కుదిరినంత సాయం చెయ్యాలనుకున్నాను. ఆగమని అరుద్దామంటే నాగరికత అడ్డొచ్చింది. పరుగెట్టి కిందకెళ్దామంటే ఈ అవతారంతో ఎలా వెళ్ళడం.

 

చూస్తూ ఉండలేక లోపలకొచ్చి చేతికందిన బట్టలు వేగంగా తొడగడం మొదలెట్టాను. “నిధి చాల సుఖమా…” అంటూ కల్యాణి రాగం మొదలయ్యింది ఇంతలో. సన్నాయి శబ్దం దూరమవ్వడం ప్రారంభించింది.నేను కిందకెళ్ళేప్పటికి వినిపించటం ఆగిపోయింది. ఎటు వెళ్ళాడో ఆ యువకుడు జాడకూడా లేదు. నా నిస్సహాయతకి నా మీద నాకే జాలి వేసింది. దిగాలుగా మెట్లెక్కి వాకిట్లోని న్యూస్ పేపర్ తీసుకునొచ్చి సోఫాలో కూలబడ్డాను.

 

కద్రి గోపాలనాధ్ గారి సేక్సోఫోన్, రోనూ మజుందార్ గారి వేణువాదన జుగల్బందీ కచేరీ చౌడయ్య హాలులో. ప్రవేశ రుసుము తల ఒక్కింటికీ రెండొందల యాభై రూపాయలు మాత్రమే.

ప్రకటన చూసిన నాకు అప్రయత్నంగానే ఎందుకో ఒక్కసారి ముఖంలో చిరునవ్వు మొలిచింది.

ప్రకటనలు

9 వ్యాఖ్యలు »

 1. అద్భుతం గురువు గారూ, చాలా బాగా వ్రాసారు.

  వ్యాఖ్య ద్వారా నాగరాజా — ఏప్రిల్ 9, 2007 @ 7:54 ఉద. | స్పందించండి

 2. The Pied Piper of Bangalore!
  శ్రీరామా, చాలా బాగుంది. టైటిలు చూసి త్యాగరాజస్వామివారి బిలహరి కృతి గురించేమో ననుకున్నా. సందర్భోచితంగా చక్కటి కీర్తనల్ని రుచిచూపిస్తూ భలే రుచికరమైన కథ చెప్పావు.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — ఏప్రిల్ 9, 2007 @ 8:00 ఉద. | స్పందించండి

 3. పొద్దు పొద్దన్నే ఎంత మంచి పాటలు వింటూ నిద్రలేచారో.ధన్యజీవులండీ.

  వ్యాఖ్య ద్వారా radhika — ఏప్రిల్ 9, 2007 @ 8:49 సా. | స్పందించండి

 4. నాగరాజా గారూ…ధన్యవాదాలు. తెలుగుబ్లాగు లోకానికి ఆధ్యాత్మిక గురువులు మీరు, నన్ను గురువుగారూ అంటే ఏదోలా ఉంది.

  కొత్తపాళీ గారూ…ధన్యోస్మి. కధ-2005 వ్యాసం చదివిన తర్వాత కలిగే పరిణామాలను సోదాహరణంగా వివరించుము అన్న 5 మార్కుల ప్రశ్నకి ఇదే సమాధానం 🙂

  రాధికగారూ…మీరు కూడా వినచ్చు. ఇవన్నీ సిడిల రూపంలో దొరుకుతాయి.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 9, 2007 @ 10:07 సా. | స్పందించండి

 5. చాల చక్కగా చెప్పారు. శాస్త్రీయ సంగీతం అంటూనే పెళ్ళుమని కార్పొరేట్/కమర్షియల్ కొరడా విసిరనట్టయింది నాకు.

  విహారి

  వ్యాఖ్య ద్వారా విహారి — ఏప్రిల్ 10, 2007 @ 3:00 ఉద. | స్పందించండి

 6. సంగీతసరస్వతి కొందరు ధన్యజీవులను మత్రమే కరుణిస్తుంది,ఎంతొ మంది వెళ్తుంటారు సంగీత కళాశాలలకు కాని ఆ అందరికి సంగీత పరిజ్ఞానం అయితే వస్తుందేమో కాని ఆ మాధుర్యం,ఆ దైవత్వం రాకపొవచ్చు.సంగీతం శరీరం లొని ప్రతి అణువు అణువు నిండిపొయి,స్వరదార ఐ,ప్రవహమయ్, గుండెలొతుల్లొనుంచి పెల్లుబుకి పాట గా స్వరము గా,బైటకు వస్తుంది.అలాంటి ఒక ధన్యజీవి ని మీ కధ లొ చుపించటం బాగుంది శ్రీరాం

  వ్యాఖ్య ద్వారా Srujana — ఏప్రిల్ 10, 2007 @ 2:11 సా. | స్పందించండి

 7. ధన్య వాదాలు విహారి గారూ…నాణేనికి అటూ-ఇటూ… 🙂
  సృజన గారూ…ధన్యవాదాలు.మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకు కూడా.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 10, 2007 @ 3:53 సా. | స్పందించండి

 8. very well written..and trust me i was thinking it was all true..after reading the comments i guess its a story very well told!
  well composed posts and the links u give to actually hear the songs makes it even more intresting…
  good one!

  వ్యాఖ్య ద్వారా joshmybench — ఏప్రిల్ 11, 2007 @ 10:36 సా. | స్పందించండి

 9. Thanks Deepthi….Appreciate your comment and visit.
  Yes, it was a story, but there was a definite inspiration that prompted me to write this. I did encounter such a musician, though not exactly the same way.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 11, 2007 @ 10:45 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: