సంగతులూ,సందర్భాలూ….

మార్చి 13, 2007

శ్రీనాధుని చమత్కారం

కవికీ కంసాలికీ సీసం లోకువంటారు. మరి కవిసార్వభౌముడైన శ్రీనాధుడికెంత లోకువో అనిపిస్తుంది ఈ సీస పద్యం చదివితే:
సీ: రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                       తలప నల్లయ వేమ ధరణి పతికి
     రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                       తలప నల్లయ వేమ ధరణి పతికి
     రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                        తలప నల్లయ వేమ ధరణి పతికి
     రాజనందన రాజ రాజాత్మజుల సాటి
                        తలప నల్లయ వేమ ధరణి పతికి

గీ: భావభవ భోగ సత్కళా భావములను
     భావభవ భోగ సత్కళా భావములను
     భావభవ భోగ సత్కళా భావములను
     భావభవ భోగ సత్కళా భావములను

శ్రీనాధుడు ఈ పద్యం ఉపయోగించి గౌడ డిండిమ భట్టుని ఎలా ఓడించాడో బాపూ గారి శ్రీనాధ కవిసార్వభౌముడు చిత్రంలో చూపించారు. అన్ని పాదాలూ ఒకేలా ఉన్న ఈ పద్యం యొక్క అర్ధం తెలుసుకోవాలంటే శబ్దరత్నాకరం భట్టీ వేసుండాలి. ఐనా కూడా తెలియదేమో.

ఉదాహరణకి రాజు అన్న పదానికి మన్మధుడు, ఇంద్రుడు, కుబేరుడు, క్షత్రియుడు ఇంకా ఇలా ఎన్నో అర్ధాలున్నాయి. అవన్నీ తెలుసుకుని ఇంకా ఇలాగే ఈ పద్యంలోని ఇతర పదాల నానార్ధాలు సమీకరించి, సమన్వయించుకుంటే తప్ప ఈ పద్యార్ధం బోధపడదు.  శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు ఇలా సమన్వయించి ఇచ్చిన అర్ధం ఇక్కడ చదవచ్చు(రానారెకు కృతజ్ఞతలు). 

పాండిత్య ప్రకటనకి ఇలాంటి పద్యాలు ప్రతీకలుగా ఉంటాయి కానీ నాకు మాత్రం “నల్లనివాడు పద్మనయనంబుల వాడు….” అంటూ మురిసిపోయిన పోతన గారి పద్యాలలోని అందం ఇంతకన్నా అపురూపం అనిపిస్తుంది.

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

 1. అవును పాండిత్య ప్రకర్ష లేకుండా, ఇంపైన మాటలతో పోతన భాగవతం వీనుల విందుగా ఉంటుంది ఎవరైనా చక్కగా చదువుతున్నప్పుడు.

  వ్యాఖ్య ద్వారా cbrao — మార్చి 13, 2007 @ 10:30 ఉద. | స్పందించండి

 2. శ్రీనాధునిది చమత్కారం, సమయస్ఫూర్తి ఐతే, పోతన గారిది భక్తి, నిరాడంబరత. హృదయాన్ని ఆకట్టుకునేది ఆ ప్రేమే కదా!!

  వ్యాఖ్య ద్వారా swathi — మార్చి 13, 2007 @ 11:36 ఉద. | స్పందించండి

 3. రావుగారూ… స్వాగతం.

  స్వాతిగారూ…మీ కవితా ధోరణిలో చక్కగా చెప్పారు 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 13, 2007 @ 10:17 సా. | స్పందించండి

 4. ఏదో చాటువుని (అది అసలు ఆయన చెప్పాడో లేదో అది కూడా అనుమానమే) తీసుకొచ్చి ఒక కావ్యంలో పద్యాలతో పోల్చి శ్రీనాథుని కవితలో గొప్ప లేదనడం అన్యాయం. పోలికలు కావాలంటే కవిసార్వభౌముని అనేక కావ్య గ్రంథాల్లోంచి పద్యాలు తీసుకురండి కావాలంటే. పోతన కవిత్వం మధురమే, కాని మాధుర్యమే కవిత్వ సౌందర్యానికి పరమావధి కాదు. నారికేళ పాకం అని ఉందిగదా!

  ఒక విషయంలో తప్పక ఏకీభవిస్తా – ఈ చాటు పద్యం “దీని అర్థం ఇలాగుట” అని చెప్పుకుని బుగ్గలు నొక్కుకోవటానికి తప్ప ఎందుకూ పనికీ రాదు – అందుకే రామకృష్ణుడు ‘మేక తోక”తో దాన్ని ఎద్దేవా చేశాడు.

  శ్రీరామా, ఈమాటలో ఈ పద్యం వివరణ ఉన్నదని చెప్పినందుకు థాంకులు.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మార్చి 14, 2007 @ 7:06 ఉద. | స్పందించండి

 5. శ్రీనాధుని కవిత్వంలో మాధుర్యంలేదనడం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదని మనవి. నా అభిప్రాయం ఇటువంటి పద్యాలపైన మాత్రమే.

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 14, 2007 @ 12:16 సా. | స్పందించండి

 6. శ్రీరాం గారు, ఈ పద్యం కచ్చితం గా శ్రీనాధులవారిదేనా? ఓ కవిపండితుడు రాయలవారి ఆస్థానానికి వచ్చి, మీ దగ్గర అష్ట దిగ్గజాలు ఉన్నారు కదా ..నేను ఒక పద్యం చెబుతాను -దానికి ఇంతవరకు ఎవరూ అర్ధం చెప్పలేకపోయారు- మీ దిగ్గజాలను అర్ధంచెప్పమనండి చూద్దాం అని ఈ పద్యం చెబుతాడు. దానికి ప్రతి గా తెనాలి రామకృష్ణ కవి “మేక తోక” పద్యం చెప్పి నువ్వు ఈ పద్యానికి అర్ధం చెప్పు- తర్వాత నీ పద్యానికి నేను చెబుతాను అంటాడు, అని చదివిన చలనచిత్రంలో చూసిన గుర్తు.

  వ్యాఖ్య ద్వారా vookadampudu — ఆగస్ట్ 30, 2007 @ 8:24 ఉద. | స్పందించండి

 7. ఊ.దం. గారూ, అన్ని చాటు పద్యాలలాగే ఇది కూడా ఖచ్చితంగా ఎవరిదీ అంటే చెప్పడం కస్టమేనేమో. తెనాలి రామకృష్ణ సినిమలో ఇది నరసరాజు అనే కవి చెప్పినట్టు చూపించారు. బాపుగారు తీసిన శ్రీనాధ కవి సార్వభౌమలో శ్రీనాధుడిది అని చూపించారు.

  నేను కూడా శ్రీనాధుడిదనే విన్నాను. వేటూరి ప్రభాకరశాస్త్రి గారి చాటుపద్యమణిమంజరిలో కూడా ఈపద్యం శ్రీనాధుడిపేరు మీదే ఉన్నట్టు గుర్తు.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఆగస్ట్ 30, 2007 @ 10:16 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: