సంగతులూ,సందర్భాలూ….

మార్చి 9, 2007

త్యాగరాజ స్వామి గడుసుతనం!

Filed under: కబుర్లు,సంగీతం — Sriram @ 12:36 ఉద.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు….తెలుగు వారందరికీ సుపరిచితమైన కృతి ఇది. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులులో ఐదవది. మంగళకరమైన శ్రీ రాగంలో ఉండడం వల్ల కాబోలు దీనిని ఆఖరున పాడతారు.

ఈ కృతి గురించి ప్రచారంలో ఉన్న విషయం ఆసక్తికరమైనది. త్యాగరాజ స్వామి గురువు గారైన శొంఠి వెంకటరమణయ్య పంతులు గారి సమక్షంలో సంగీత విద్వత్సభ జరిగినప్పుడు, గురువు గారి ప్రతినిధిగా త్యాగరాజుల వారు తమ విద్వత్తు ప్రదర్శించవలసిన సందర్భంలో ఈ కృతి ని రచించి పాడారనీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరి పైన విజయం సాధించారని చెప్పుకుంటారు.

ఐతే నేనిక్కడ రాయబోయే విషయం ఈ కృతిలోని ఒక పాదానికి సంబంధించినది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు…అంటూ మొదలుపెట్టిన త్యాగరాజ స్వామి అనుపల్లవిలో:

“చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారు…

ఎందరో మహానుభావులు”

అంటారు. ఇక్కడే వచ్చింది తిరకాసంతా. మనందరికీ తెలిసిన విషయం రాముడు నీలమేఘ శ్యాముడు అని, అంటే నీలి మబ్బుల రంగులో ఉండేవాడు కదా. మరి చంద్రుని రంగులో ఉండడం ఏంటి? ఈ విషయమే సాహిత్యం గూగుల్ గుంపులో ఎవరో ఈ మధ్య అడిగారు.

దీని గురించి నేను శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి పుస్తకంలో చదవి ఉండడం వల్ల అక్కడ సమాధానం ఇచ్చాను. వర్ణము అంటే రంగు,కులము అనే అర్ధాలతో పాటు గుణము అనే అర్ధం ఉంది (వర్ణో ద్విజాది శుక్లాది యజ్ఞే గుణ కధాసు చ – వర్ణమనగా బ్రాహ్మణాది కులాలు, తెలుపు మొదలైన రంగులు, యజ్ఞము, గుణము-ఇన్ని అర్ధాలున్నాయి). రాముడు చంద్రుని మల్లే చల్లని చూపులతో ప్రకాశవంతంగా ఉంటాడు కనక అలా పోల్చవచ్చు. అందుకే వాల్మీకి మహాముని రాముని “సోమవత్ ప్రియదర్శనః” అని కీర్తించారు.

తరువాత అలోచిస్తే త్యాగరాజ స్వామి చేసినది చాలా చిలిపి పనిగా అనిపించింది. మనకి అందరికీ వర్ణము కి తెలిసిన అర్ధాలు రంగు ఇంకా కులము. రాముడు చంద్రునిలా తెల్లగా ఉండడు. పైగా రామునిది సూర్యవంశం. మరి పని గట్టుకుని చంద్రుని లాగుకు రావడం, వర్ణము అనడం,  పైగా అందచందాల గురించి ప్రస్తావించడం అంతా పనిగట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుంది. చంద్రుని వర్ణంలో ఉండేవాని అందచందాలు చూడడం  అనగానే ఎవరికైనా రంగు అనే అర్ధమే కదా గుర్తొస్తుంది. ఇలా మనని తప్పుదోవ పట్టించవలసిన అవసరం ఆయనకేమిటి? కేవలం ప్రాస కోసం ఇంత పని చేసుంటారా?

నాకు తోచిన సమాధానం ఏంటంటే ఇక్కడ త్యాగరాజ స్వామి తప్పుదోవ పట్టించినది కావాలనే. ఆ రోజుల్లో విద్వత్సభల్లో నెగ్గుకు రావడానికి ఇలాంటి కిటుకులు చాలా అవసరంగా ఉండేవని నేను విన్నాను. ఎందుకంటే ప్రతీ చోటా దుష్ట శంకలు చేసే మిడిమిడి జ్ఞానపు పండితులు చాలా మందే ఉండేవారు. తప్పులు పట్టడం వీరి పని.అజ్ఞానం వీరి లక్షణం. ఈ కృతి సభలో పాడగానే వీరికి ఇది వెంటనే దొరుకుతుంది. వెంటనే రాముని వర్ణం కూడా మీకు తెలీదంటూ మొదలు పెడతారు. ఇంత పండితుడికి,భక్తుడికి ఈ మాత్రం తెలియదా, ఏదో అర్ధం ఉండే ఉంటుందని కూడా ఆలోచించరు. దెబ్బకి ఈయన చేతిలో చిక్కుతారు. అర్ధం చెప్పగానే నోరుముయ్యవలసిందే కదా. ఇంక మరి మాట్లాడరు. ఇలాంటి వారి కోసమే త్యాగరాజ స్వామి ఈ ఎర విసిరారేమో అనిపిస్తుంది నాకు.

మహాకవి శ్రీనాధుడు కూడా గౌడ డిండిమ భట్టుని ఓడించే సందర్భంలో “రాజనందన రాజ రాజాత్మజులు సాటి….” అంటూ రాజ శబ్దానికి ఉన్న వివిధ అర్ధాల ఆధారంగా ఒక పద్యం చెప్పి ప్రతిపక్షులని బోల్తా కొట్టించడం మనకి తెలిసిన విషయమే. బాపూ గారి సినిమాలో కూడా చూపించారు. 

కానీ త్యాగరాజుల వారు శ్రీనాధుని కన్నా చాలా మెత్తన. నిజానికి మనం కొద్దిగా నిదానించి చూస్తే త్యాగరాజ స్వామి ఎరలో చిక్కుకోకుండా బయటకి రావచ్చు. మరొక్కసారి చూడండి, అంద చందమును కళ్ళతో చూసి అనలేదు హృదయంలో చూసి అని కదా వాడారు. మరి మనం హృదయంతో చూసేవి గుణగణాలేకానీ రంగులు కాదు కదా. పైగా ఆ చూసినవారు “బ్రహ్మా”నందం పొందుతారని కూడా అన్నారు. అంటే ఏమిటన్నమాట, ఆత్మ సాక్షాత్కారమే కదా. మరి అటువంటి జ్ఞానులకి బాహ్య సౌందర్యంతో పనేముంది. ఇప్పుడు మరొక్కసారి ఆ అనుపల్లవి చూస్తె “పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరాముని గుణగణాలను హృదయమనే పద్మంలో చూసి చిదానంద స్థితిని పొందే మహానుభావులకి వందనం” అన్న అర్ధం గోచరిస్తుంది. తరచి చూస్తే ఈ పాదంలో వేదాంత పరమైన ఇంత అర్ధం ఉంది.  
 
త్యాగరాజ స్వామి కృతిలోని ఒక్క అనుపల్లవి గురించి నాబోటి వాడు ఇంత రాయగలిగితే, సమర్ధులైన వారు ఒక్కొక్క కృతి మీదా పీహెచ్‌డీ చెయ్యవచ్చనిపిస్తుంది నాకు.
 

ప్రకటనలు

12 వ్యాఖ్యలు »

 1. మంచి విశ్లేషణాత్మకయిన టపా. మనసులో ఉన్న మాటలని, భావావేశాన్ని అందంగా కూర్పు చేసినప్పుడు ఆ వాక్యార్ధ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. అలా చేసిన పని ఈ టపాలో స్వచ్చంగా కనపడుతోంది. అందుకోండి అభినందనలు

  వ్యాఖ్య ద్వారా Thyaga — మార్చి 9, 2007 @ 5:16 ఉద. | స్పందించండి

 2. శ్రీరామా, చాలా బాగుందయ్యా నీ వ్యాఖ్య. ఇంచుమించు ఆ కీర్తన అంత అందంగానూ ఉంది.
  కానీ మధ్యలో – “రాజనందన రాజ ..” పద్యమూ, శ్రీనాథుడూ, బాపుసినిమా గొడవ ఏమిటి?
  కాస్త వివరించు – వీలుంటే మరో టపాలో వివరంగా!
  ఈ కీర్తనలో పదో ఎన్నో చరణాలు ఉంటై కదా. నాకు చివరలో వచ్చే ‘భాగవత రామాయణ గీతాది ..” అనే చరణమంటే చాలా ఇష్టంగా ఉండేది చాన్నాళ్ళు. 1985 ప్రాంతంలో “గానం’ అని ఒక మళయాళం-తెలుగు డబ్బింగ్ సినిమా చూశాను. అందులో బాలమురళీ గొంతుతో హీరో ఈ కీర్తన కొద్ది చరణాలు పాడతాడు. “పరమ భాగవత” అనే చరణంతోనే ముగిస్తాడు. ఆ చరణం చాలా అద్భుతంగా వచ్చింది.
  ఈ పాటని ఎం.డి. రామనాథన్ విడమరిచి పాడగా వినడం కూడా ఇంకో మరువలేని అనుభవం.

  వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — మార్చి 9, 2007 @ 9:00 సా. | స్పందించండి

 3. ఆహా! త్యాగరాజుల వారి ఆశీర్వాదం మొదటి వ్యాఖ్యలోనే వస్తుందనుకోలేదు 🙂
  త్యాగ గారూ, కృతజ్ఞతలు.

  కొత్తపాళీ వారు ఇలాగేదో తిరకాసు పెడతారు:) ఆ సీస పద్యం శ్రీనాధ కవి సార్వభౌముడు అన్న బాపూ గారి సినిమాలో ఉందండీ. శ్రీనాధుడు రాసింది ఇది, కాశీ ఖండం లోది అనుకుంటా.

  వేరే పోస్ట్ రాయమని మీ భావం అనిపించింది. తప్పక రాస్తాను.

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 9, 2007 @ 10:37 సా. | స్పందించండి

 4. ఈ అనుపల్లవిని నా మలయాళం మిత్రుడు పదేపదే అప్రయత్నంగా పాడుకొంటూ ఉంటాడు – మన మంగళంపల్లి వారి శైలిలో. దీని అర్థం మీవల్ల తెలిసింది. ధన్యవాదాలు.
  “తెనాలి రామకృష్ణ” సినిమాలో ఒక కవిపండితుడు “అలవేమారెడ్డిని ప్రశంసిస్తూ మేం ఒక పద్యం చెప్పాం. దానికి అర్థం వివరించగలవారెవ్వరూ తారసపడలేదు” అని రాజనందనరాజ పద్యం చెప్పి విసిరిన సవాలు ను మేకతోక పద్యంతో వాలుగా తప్పించుకొంటాడు వికటకవి. మీరు చెప్పేదాకా అది శ్రీనాథుని పద్యమని తెలియదు. దానిగురించిన మరిన్ని వివరాలు: http://eemaata.com/em/issues/200605/84.html

  వ్యాఖ్య ద్వారా రానారె — మార్చి 10, 2007 @ 3:16 ఉద. | స్పందించండి

 5. రానారె గారూ…చక్కని వివరాలున్నాయి ఆ లింకులో. నాకు తెలియని వివరాలు కూడా.ధన్యవాదాలు.

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 12, 2007 @ 11:33 సా. | స్పందించండి

 6. చాలా అద్భుతంగా చెప్పారు. మీనుంచి మరికొన్ని ఆశించగలము

  వ్యాఖ్య ద్వారా rajesh — మార్చి 24, 2007 @ 10:07 సా. | స్పందించండి

 7. ధన్యవాదాలు! తప్పక ప్రయత్నిస్తాను…

  వ్యాఖ్య ద్వారా Sriram — మార్చి 30, 2007 @ 1:32 సా. | స్పందించండి

 8. awesome…
  adbhutamga vivarincharu…
  intha mandi pandithulu blog chestunnarani ee roje telisindi…
  meeku sangeetam meeda intha knowledge ela undi??

  వ్యాఖ్య ద్వారా joshmybench — ఏప్రిల్ 2, 2007 @ 9:09 ఉద. | స్పందించండి

 9. Thanks Deepthi, panditulu anedi pedda padam. idi kevalam naa paithyam 🙂

  వ్యాఖ్య ద్వారా Sriram — ఏప్రిల్ 2, 2007 @ 4:22 సా. | స్పందించండి

 10. Loving Sairam ,
  respected Sir, Thank you for all these.Can you give us Telugu script the Keertan composed and sung by Thyagaraja Swamy..it goes like this…Lakshmanudu kolachuna..sushma buddigala Bharathudu mrokkuna..Lakkshmi Devi…(may be not in order).Thank you.Loving Sairam & warm regards from M.Seshadri Reddy

  వ్యాఖ్య ద్వారా MANNEM SESHADRI REDDY — సెప్టెంబర్ 9, 2012 @ 10:15 ఉద. | స్పందించండి

 11. Thank you so much for this explanation… nenu innaallu… naku peddaga sangeetam lo pravesam ledu.. alaage telugu bhasha lo kuda..

  ee kirtana naaku chala istam.. ee line vinnappudalla.. sri ramudu chinnappudu ,, chandrudini addham lo chusi aanandapaddaadu kada..

  anthati devudu kuda ,, chilla pillaaadu ga unnapudu.. chandrudu ni chusi abbura paddaadu ,,, aa leela chusi/ vini.. tyagayya gunde nindi ila raasaru ani anukunaanu…

  naadi alachana tappu ani idi chadivina tarvata telisindi.. ika paina ayina.. sangeetam vinetappudu.. bhaavam kuda telusukuntaanu..

  వ్యాఖ్య ద్వారా suma — సెప్టెంబర్ 15, 2012 @ 11:37 ఉద. | స్పందించండి

 12. బావుందండీ మీ బ్లాగు. ఇప్పుడే మొదటిసారి చూసి, ఇన్నాళ్ళూ చూడకపోతినే అనుకున్నా.

  వ్యాఖ్య ద్వారా వానా — నవంబర్ 27, 2014 @ 12:31 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: