సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 15, 2007

ఆపాతమధురం

Filed under: సంగీతం,సినిమాలు — Sriram @ 8:01 సా.

ఏ ఆర్ రెహ్మాన్ అనగానే మీకేమి గుర్తొస్తుంది?  ‘ముక్కాలా ముకాబ్‌లా…’ నా లేక ‘ఓ చెలియా నా ప్రియసఖియా…’నా? అప్పట్లో యావద్భారతాన్నీ ఒక ఊపు ఊపిన ‘ముక్కాలా…’ పాట రెహ్మాన్ కి తెచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. అదొక ప్రభంజనం అప్పట్లో. కానీ ఇప్పటికీ ఆ సినిమాలో పాట జనాల నోళ్ళలో నలుగుతున్నదీ, టీవీ చానళ్ళలో అప్పుడప్పుడు మెరుస్తున్నదీ ఏదీ అంటే ‘ఓ చెలియా…’ పాటనే చెప్పుకోవాలి. దానికి కారణం బ్రహ్మరహస్యం ఏమీ కాదు. మాధుర్య ప్రధానమైన, వినడానికి హాయిగా ఉండే పాటలని సంగీతప్రియులు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు. ఇలాంటి పాట ఒకటి ఇప్పుడు విందాం.

“ఇద్దరు” సినిమాలో “శశివదనే శశివదనే…..” అన్న పాట విన్నారు కదా. ఈ పాట రాసింది సినీ కవితా చక్రవర్తి అనదగ్గ మన వేటూరి గారే ఐనా డబ్బింగ్ పాట కావడం వల్లనేమో దాని అర్ధం అంతగా బోధపడదు. కానీ వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది! ఆ హాయి ఆ పాటకి అద్దినది శాస్త్రీయ సంగీతమే. నాట రాగమే. వేటూరి గారు చిలిపి వారు కావడం వల్ల కాబోసు ఈ పాట ట్యూన్ తెలిసి ఉండి కూడా పాటలో నీలాంబరి, తోడి, మాండు, మోహనం అన్నారేగానీ ఎక్కడా నాట అన్న పదం వాడలేదు. ఇదొక చమత్కారం.

రెహ్మాన్ ఏదైనా శాస్త్రీయమైన రాగాన్ని వాడినా, అది చాలా లలితంగా ఉంటుంది. రాగఛాయలోకి వెళ్ళినట్టే వెళ్ళి బయటకు దూకుతూ ఉండడం, పక్క రాగాల వైపు క్రీగంట చూసి ఊరించడం ఆయనకి అలవాటు. కానీ మామ మహదేవన్ దగ్గర ఇలాంటి ఆటలు కుదరవు. “ప్రణతి ప్రణతి ప్రణతీ….” అంటూ ససాంప్రదాయంగా గౌరవించాల్సిందే. ఈ పాటలో సిరివెన్నెల వారి పదాల గాంభీర్యానికి మహదేవన్ నాట రాగపు గాంధారాన్ని పోటీ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు.

విన్నారుగా పాట, మరి ఇంత శాస్త్రీయమైన పాట పాడింది బాలూగారేనంటే ఆశ్చర్యమేస్తుంది. ఈయనేమో నేను శాస్త్రీయంగా ఏమీ నేర్చుకోనేలేదంటారు. మరి శాస్త్రీయ సంగీతం లొ ఉద్దండులైన నిత్యశ్రీ మహదేవన్, హరిహరన్ లు నాట రాగంలో పాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సరసకె బారో (సరసకు రారా…) అంటూ వీరు కన్నడంలో ఎలా పాడారో ఒకసారి వినండి. దీనికి సంగీత దర్శకుడు గురుకిరణ్ అన్నాయన. ఈ మధ్యనే తెలుగులో కూడా పని చేసినట్టున్నారు.

ఇంకొక్క సినిమా పాట కూడా విందాం. ఇది అవ్వడానికి సినిమా పాటే అయినా, నిజానికి శాస్త్రీయమైన కృతే. ఇళయరాజా నిమిత్తమాత్రుడే. యేసుదాస్ గారు సింధుభైరవి సినిమాలో పాడిన “మహాగణపతిం” అన్న కృతి దీక్షితార్ వారిది. సంగీతం నేర్చుకునేవారు కృతులలోకి అడుగుపెట్టాక నేర్చుకునే తొలి వాట్లలో ఇదీ ఒకటి. 

ఇప్పుటిదాక మనం విన్నవి ఒకెత్తూ, ఇప్పుడు వినబోయేది ఒక ఎత్తూ. శాస్త్రీయ సంగీత చరిత్రలో నాట రాగపు ధాటిని శాశ్వతం చేసిన ఘనత త్యాగరాజుల వారిదే. పంచరత్న కృతులలో మొదటిదైన “జగదానందకారకా….” అన్న కృతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో విన్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా….అంటూ మొదలుపెట్టిన త్యాగరాజు మొత్తం ఇటువంటి 108 నామాలతో ఈ కృతిని సమకూర్చిన తీరు అనితర సాధ్యం. అంతేకాదు ఈ కీర్తనలో రామాయణం మొత్తం ఇమిడి ఉంది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. ఈ పంచరత్నకృతుల విషయాలు ఎప్పుడైనా తీరికగా చెప్పుకోవలసినవే కానీ ఇలా టూకీగా తేలేవి కావు.

ఇక నాట రాగపు లక్షణాలేమిటో ఒకసారి చూద్దాం. ఈ రాగపు
ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స
అవరోహణ: స ని3 ప మ1 రి3 స
ఈ రాగ స్వరాలని పరిశిలిస్తే రి3,గ3 ఇంకా ద3,ని3 చాలా దగ్గరగా ఉండే స్వరాలు. గాత్రంలో ఈ తేడా చూపించడం కష్టం. ఇటువంటి రాగాలని వివాది రాగాలు అంటారు. సంగీత కచేరీలలో నాట రాగం సాధారణంగా మొదటి రెండు,మూడు కీర్తనలలోపే వస్తుంది. నాట రాగంలో ఉన్న మరిన్ని కృతులకై ఇక్కడ చూడండి. 

ఇప్పుడు చెప్పండి, ‘శశివదనే…’ పాటలోని అందానికే పొంగిపోయిన మనని, ‘జగదానందకారకా…’ లోని మాధుర్యం ఇంకెంత ఆనందింపచెయ్యగలిగిందో. శాస్త్రీయ సంగీతపు మహత్తే అది. ఈ రాగాలు అంతులేని బంగారు గనులు. తవ్విన కొద్దీ తన్మయత్వం పెరుగుతూ ఉంటుంది.   

(ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం నాకు తెలిసిన కొన్ని మంచి పాటలనీ, కృతులనీ నలుగురితో పంచుకుందామనే. సరిగమల గురించి రాసిన వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యల్లో చర్చ నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకునేలా చేసింది.నాకున్న సంగీత జ్ఞానం పూజ్యం. అందుచేత ఎక్కడైనా తప్పులు రాస్తే, అవి విజ్ఞులు సవరిస్తే నన్ను దిద్దుకోవచ్చని ఒక ఆశ. మీరు కూడా నేను ఇక్కడ రాసిన చెవాకుల మాట ఎలా ఉన్నా, పాటలు విని ఆనందిస్తారని ఇంకొక ఆశ.అందుకే ఈ పనికి పూనుకున్నది. ఇంకొక్క విషయం, ఈ వ్యాసాన్ని కేవలం చదవడం కాకుండా ఇక్కడ ఉదాహరణగా ఇచ్చిన పాటలన్నీ విని చూడండి. ఎక్కడైనా, ఎప్పుడైనా నాట రాగాన్ని చాలా సుళువుగా గుర్తించగలుగుతారు. రసాస్వాదనం చేయగలుగుతారు.)      

11 వ్యాఖ్యలు »

 1. అభినందనలు.
  బ్లాగులు ఎంత గొప్ప పని చేస్తున్నాయో చెప్పడానికి మీ బ్లాగు, నాగారాజు బ్లాగు వుదహరిస్తే చాలేమొ!
  ఆయన సాహిత్యపు అంచులు చూపిస్తుంటే మీరు సంగీతపు రుచి చూపిస్తున్నారు.
  చక్కగా సినీ సంగీతంతో మొదలెట్టి, పంచ రత్నాలవరకూ వివరించారు. ఇలాగే మీరు మరిన్ని రాగాల గురించి ఇంకా వీలయితే సంగీత పాఠాలు కూడా చెబితే బాగుంటుంది.
  –ప్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — ఫిబ్రవరి 16, 2007 @ 2:40 సా. | స్పందించండి

 2. చాలా మంచి ప్రయత్నం.ఇలానే మరిన్ని అందించండి.

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 16, 2007 @ 7:48 సా. | స్పందించండి

 3. రాధిక గారూ, కృతజ్ఞతలండీ…
  ప్రసాద్ గారూ, అంత మాటకి అర్హుడిని కాదు. చాలా మంది పెద్దలున్నారు….

  ఈ వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 17, 2007 @ 7:17 సా. | స్పందించండి

 4. శ్రీరామ్‌గారూ, మీరు ఈ టపాలో చూపిన పాటలు విని, నాటరాగంలోని ఇంకో పాటకోసం ఆలోచించాను. ఈ క్రింద పాటలో నాటరాగఛ్ఛాయలున్నాయా తెలియజేయగలరు http://www.dishant.com/jukebox.php?songid=28684

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 18, 2007 @ 11:12 సా. | స్పందించండి

 5. మంచి సంగీతం వినిపించినందుకు అభినందనలు!

  వ్యాఖ్య ద్వారా డా.ఇస్మాయిల్ పెనుకొండ — ఫిబ్రవరి 19, 2007 @ 10:41 సా. | స్పందించండి

 6. నెమలికి నేర్పిన నదకలివీ…పాట విని చూసను. నాకు తెలిసి ఇందులో నాట రాగం వాడినట్టు లేదు. కొంతమంది మిత్రులని కూడా అడిగి చూసాను. వారూ అలాగే అన్నారు. ఈ పాటలో బహుసా శంకరాభరణమో లేక దాని జన్యమో వాడబడింది అని అనుమానం.

  ఇస్మాయిల్ గారూ, ధన్యవాదాలు.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 20, 2007 @ 12:26 సా. | స్పందించండి

 7. ధన్యవాదాలు. మీకు తెలిసి ఇంకో సినిమా పాటేదైనా వుందా (నాటరాగంలో స్వరపరచబడినది)?

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 21, 2007 @ 10:41 ఉద. | స్పందించండి

 8. రానారె గారూ, నాట రాగం నాకు తెలిసి సినిమా సంగీత దర్శకులు ఎక్కువ వాడలేదు. కారణం బహుశా అది అంత సులువుగా కొరుకుడు పడే రాగం కాకపోవడం అయ్యుండచ్చు.వివాది రాగం అవడం వల్ల కావచ్చు. నాకు ఏదైనా వేరే పాట వినపడితే తప్పక మీ చెవిన వేస్తాను.

  మీరు ఇతర భాషల పాటలు కూడా వింటారు కాబట్టి, నాకు తెలిసిన ఈ తమిళ ఇళయరాగం విని చూడండి.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 22, 2007 @ 11:45 సా. | స్పందించండి

 9. […] *కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….! […]

  పింగ్ బ్యాక్ ద్వారా ఆపాతమధురం - 3 « సంగతులూ,సందర్భాలూ…. — ఆగస్ట్ 8, 2007 @ 12:23 ఉద. | స్పందించండి

 10. […] *కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3 వ్యాఖ్యానించండి […]

  పింగ్ బ్యాక్ ద్వారా ఆపాతమధురం…4(రీతిగౌళ రీతులు) « సంగతులూ,సందర్భాలూ…. — మార్చి 6, 2010 @ 5:37 సా. | స్పందించండి

 11. […] *కొత్తవారికోసం:ఆపాతమధురం,  ఆపాతమధురం(కొనసాగింపు…),  శారదా….!,  ఆపాతమధురం – 3 […]

  పింగ్ బ్యాక్ ద్వారా ఆపాతమధురం: ‘కారుణ్య’ వాణి | సంగతులూ,సందర్భాలూ…. — జూన్ 16, 2017 @ 3:43 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: