సంగతులూ,సందర్భాలూ….

ఫిబ్రవరి 1, 2007

ఏమున్నది గర్వకారణం(కొనసాగింపు…)!

Filed under: సినిమాలు — Sriram @ 6:40 సా.

తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా రాసిన పోస్ట్‌కి ప్రసాద్ గారి స్పందన చూసి నాకు ఇది రాయడం అవసరం అనిపించింది.

ముందుగా ఒక చిన్న విన్నపం. నాకున్న సినిమా పరిజ్ఞానం చాలా తక్కువ. ఏమైనా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే అది నా అజ్ఞానంగా భావించి తెలియచేయండి. నేను ఏ హీరోకీ ఫాన్ నీ, ఏసీనీ కాదు.

నా ముందరి పోస్ట్‌లో నేను రాసిందల్లా తెలుగు సినిమాకి గుర్తింపు ఎందుకు రావడం లేదు అని మాత్రమే. దానికి ప్రేక్షకులు కారకులా లేక సినిమా పరిశ్రమ వారా అన్న విషయం నేను చర్చించనేలేదు. ఇలా హైదరాబాదులో ఒకళ్ళ వీపు ఒకళ్ళు గోకుకోవడం వల్ల ఇది సాధ్యపడదన్నది మాత్రమే దాని సారాంశం. ఈ విషయం  మర్చిపోయి మేము గొప్ప అని గొంతెత్తి అరవడం అనుచితం అని నేను భావించానంతే.

మంచి చిత్రాలే ఎందుకు తియ్యలి? నిజమే, సెన్సార్ వాళ్ళకి బాధలేనంతవరకూ ఏదైనా తీసుకోవచ్చు. ప్రేక్షకులు ఆదరిస్తే డబ్బులూ సంపాదించుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు గురించి మాత్రం అడగకూడదు అంతే. ఇదేమీ తప్పు కూడా కాదు. వ్యాపార లక్షణమే. కానీ నేను ఒప్పుకోనిదేమిటంటే కళాత్మకమైన, అర్ధవంతమైన చిత్రాలు ఆర్ధికంగా నష్టపోతాయన్నదానిని. అలాంటి చిత్రాలని ప్రేక్షకులు ఆదరించరనడం ఒక పసలేని వాదన. ఉదాహరణకి బొమ్మరిల్లు, గోదావరి, ఆనంద్, రోజా లనే తీసుకోండి. ఒక్క నిర్మాతైనా నష్టపోయాడా? గత రెండు సంవత్సరాలుగా ఫ్యాక్షన్, విపరీతపు హింస పట్టుకు వేలాడిన కధానాయకుల,  నిర్మాతల పరిస్థితి ఏమిటి? 

మన ప్రేక్షకులు ఒకప్పుడు శృంగారానికి మొహంవాచి ఉండి ఉందురేమో, ఈ రోజుల్లో కాదు. రేప్‌సీన్ల కోసం, జయమాలిని మార్కు నృత్యాల కోసం ఈ రోజుల్లో టీవీ పెట్టుకుంటే చాలు కదా.

అందు చేత హింసవల్ల, ఇలాంటి చవకబారు అశ్లీలతవల్ల సినిమా హిట్ ఔతుందనుకుంటే అది భ్రమ మాత్రమే. ఈ రకంగా చేతులు కాల్చుకున్న నిర్మాతలు ఈ మధ్యకాలంలో చాలామందే ఉన్నారు. ఇక్కడ నేను పేర్లు ఎత్తదలుచుకోలేదు.

ఒక మంచి చిత్రం ఎప్పుడు వచ్చినా ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన బొమ్మరిల్లు, గోదావరి లాంటి చిత్రాలే ఉదాహరణ. చిన్న లెక్కవేసి చూడండి, ఎన్ని శాతం మంచి చిత్రాలు నష్టపోయాయి మరి ఎన్ని శాతం చెత్త చిత్రాలు హిట్ అయ్యాయి అని. మీకే తెలిసిపోతుంది. మరి ఎందుకు ఈ మిధ్యాజలాల వెనుక పరుగు? ఒక్కటే కారణం. మంచి సినిమా తియ్యడం కష్టం.నైపుణ్యం ఉన్న సాంకేతిక వర్గం కావాలి. ఎంతో మేధోమధనం జరగాలి. చక్కటి నటీ నటులు కావాలి. ఇంతటి ఓపిక ఎవరికీ లేదు. కష్టపడి గుర్తింపు పొందడం ఇప్పుడు ఫ్యాషన్ కాదు. పెట్టుబడి పెట్టగల ప్రతివాడి పుత్రుడూ హీరో అయిపోవాలి.

టీవీ చానల్స్ లో రోజూ రాత్రులు చూపించే సినిమా రౌండప్ కార్యక్రమం చూసిన వాళ్ళెవరైనా చెప్తారు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఆ ప్రెస్‌మీట్లు. డైరెక్టరని చెప్పుకునే కొంతమందికి ఒక వాక్యం సరిగ్గా చెప్పడం రాదు. ఇక మిగతా వాళ్ళ సంగతి చెప్పేదేముంది.

రాజకీయాల వల్ల,  లాబీయింగ్ వల్ల తెలుగు సినిమాలకి అన్యాయం జరిగింది ఇదివరలో, నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక శంకరాభరణం లాంటి సినిమాని ఇవేమి చెయ్యగలిగాయి? రోజులు మారాయి. ఇప్పుడు తెలుగు సినిమాకి ఈ సమస్యలని ఎదుర్కునే దన్ను పుష్కలంగా ఉంది.

సత్యజిత్ రే తీసిన సినిమాల్లాంటివి తియ్యమని నేను అనడం లేదు. కాస్త అర్ధవంతమైన సినిమాలు తియ్యమంటున్నానంతే! లగాన్ నే తీసుకోండి. కనీసం అలాంటి సినిమాలు తియ్యలేరా మనవాళ్ళు? కష్టపడి తీస్తే తప్పక తియ్యగలరు.  

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. అయ్యొయ్యో! శ్రీరాం గారూ మిమ్మల్ని నా స్పందనతో బాధపెట్టానా ఏమిటి?
  అయితే క్షమించండి. మీరు సినిమా వాళ్ళ తప్పేంటో చెబితే నేను ప్రేక్షకుల తప్పేంటో చెప్పాను అంతేనండీ, నా స్పందన మిమ్మల్ని ఖండించడం కాదు జోడించడం. మీరు చెప్పిందీ వాస్తవమే ఇక నేను ప్రేక్షకుల ఆదరణ గురించి చెప్పింది వాస్తవమే కదా! ప్రయోగం చేసి చెయ్యి కాల్చుకునే కన్నా స్టాండర్డ్ మసాలా పెట్టి స్టాండర్డ్ లాభాలు గడిస్తే చాలుననే స్వభావమున్నంత కాలం వైవిద్యమున్న సినిమాలు రావు.
  నేనూ ఎవరీ ఫ్యానూ కాదు అంతో ఇంతో కమల్ హాసన్, క్.విశ్వనాధ్, మణి రత్నం సినిమాలైతే చూస్తాను.
  –ప్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా Prasad Charasala — ఫిబ్రవరి 1, 2007 @ 8:35 సా. | స్పందించండి

 2. మంచి అభిరుచిగల వాళ్లు దర్శక నిర్మాతలైతే సినీమాత సంతోషించే సినిమాలొస్తున్నాయి. ఏదో ఒక తప్పుడుమార్గంలో నాలుగురాళ్లు సంపాదించిన ప్రతివాడూ నిర్మాతైపొతున్నపుడు వారి సంస్కారానికి, అభిరుచికి తగిన సినిమాలే వస్తున్నాయి.

  వ్యాఖ్య ద్వారా రానారె — ఫిబ్రవరి 1, 2007 @ 11:17 సా. | స్పందించండి

 3. టెక్నికల్ గాను,కధాపరం గాను దిగజారిపోతూ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టేసి హాలివుడ్ స్తాయికి ఎదిగిపోతున్నమని సంబర పడిపోయినంత కాలం మన సినిమాలు ఇలానే ఏడుస్తాయి.

  వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 2, 2007 @ 12:10 ఉద. | స్పందించండి

 4. ప్రసాద్ గారూ, బాధపడడానికేముందండీ అందులో…మంచి సినిమాలు తీస్తే నిర్మాతలు నష్టపోరు అని చెప్పడం గురించే ఇది రాసింది.
  రానారె గారూ, మీరు చెప్పింది నిజంఏ అనిపిస్తోంది.

  రాధిక గారూ, ఔనండీ, అదే సమస్య.

  వ్యాఖ్య ద్వారా Sriram — ఫిబ్రవరి 2, 2007 @ 6:02 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: