నేను రాసిన దాన్ని చూసి గురువుగారు ఒవైసీని సమర్ధిస్తున్నట్టు ఉందోయ్ అన్నారు. అందుకే ఈ వివరణ. నేను అనేది ఏమిటంటే ఒవైసీయే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా అదే పని చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటినుంచీ హైదరాబాదు ప్రాంతాలలో మజ్లిస్ ఏ ప్రాతిపదికన గెలుస్తోంది? కేవలం మతం అడ్డుపెట్టుకు నెగ్గుకొస్తోంది తప్ప, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది? మతం వారికి బంగారు గుడ్లు పెట్టే బాతు. దానిని వాడుకుంటున్నారు. ఇది కేవలం మజ్లిస్ కే పరిమితం కాదు. మన దేశం మొత్తం మీద ఉన్న పరిస్థితి ఇదే. మన కులం వాడనో, మన మతం వాడనో, మన ప్రాంతం వాడనో తప్పితే, అభ్యర్ధి నిజమైన అర్హత ఉన్నవాడా కాదా అన్నది ఎవరకీ అక్కర్లేదు. అభ్యర్ధులని నిలబెట్టే విషయంలో కూడా పార్టీలు ఇవే విషయాలు ఆలోచిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.
ఒవైసీ గారికి కూడా అదే నమ్మకం. అందుకే ఈ పని చేస్తే తప్పకుండా నెగ్గుతాననుకున్నాడు. చేసాడు. ఈ సారి భారీ మెజారిటీతో మజ్లిస్ గెలుపు ఖాయం చూస్కోండి.
అంతే కాదు, తామేం చేసినా ఎవరూ ఏమి చెయ్యలేరనీ, ప్రభుత్వానికి తామంటే భయమనీ ఈయన విశ్వాసం. అది నిజమేనని మనకి ఋజువయ్యింది కూడా. ఇంక ఆయన దేనికి వెనకాడాలి?
నా ఉద్దేశంలో కాంగ్రెస్సు వాళ్ళూ, వారికి మద్దతిస్తోన్న వామపక్షాల వాళ్ళూ దీనికి అసలైన కారకులు. మైనారిటీలని ఓటుబేంకుగా వాడుకుంటూ ఇలాంటి నాయకులని నెత్తికెక్కించుకుని వాళ్ళు ఆడినది ఆటగా జరగనిచ్చింది వీళ్ళే. ప్రభుత్వం ఎంత లోకువకాకపోతే మజ్లిస్ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించగలిగారు. తమనోటికొచ్చినట్టు మాట్లాడి ఇంకా ధైర్యంగా స్వేచ్చగా తిరుగుతున్నారంటే, ప్రభుత్వం చేతకానితనం కాదా? ఇప్పుడు వీళ్ళని ఖాసిం రజ్వీ వారసులంటూ వ్యాసాలు రాస్తున్న వామపక్షాలవాళ్ళకి ఇప్పటిదాకా ఈ విషయం గుర్తులేదా? అందుకే నాకు ఒవైసీలోకన్నా వాళ్ళకి లోకువైన వీళ్ళలోనే ఎక్కువ తప్పు కనిపించింది. దీనిగురించే నేను నఫీసా ఆలీ గారిని చూసి నవ్వుకున్నది. అంతేకానీ ఒవైసీ పనిని సమర్ధించి కాదు.
గత రెండు వారాలుగా స్వాతికుమారి గారిని తిట్టుకోని రోజు లేదు. ఏమి పని చేసారీవిడ? ఆ మాత్రం సామాజిక స్పృహ ఉండద్దూ? ఏదో కనిపించింది కదా అని లావణ్య కౌముది అనుకుంటూ అంతటి అందాన్ని పట్టుకొచ్చి కూడలిలో పెట్టెస్తే జరిగే పరిణామాలకి ఎవరిది బాధ్యత? ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు బయట ఎక్కడైనా ఇలాంటి ప్రమాదకరమైన హోర్డింగ్స్ ఉంటే వెంటనే తొలగిస్తారు. నేను కూడా ఇదే ముక్క వీవెన్ గారితో చెప్పి ఆ పోస్ట్‌ని తీయించెద్దామనుకున్నాను. గోరుచుట్టు మీద రోకటిపోటంటారే అలాగ సరిగ్గా అదే సమయానికి ఆయన ఊరికెళ్ళడం, కూడలి కదలకపోవడం లాంటి వన్నీ జరిగాయి.
ఏం చెయ్యడానికీ లేకుండా తయారయ్యింది పరిస్తితి. అలాగని కూడలి చూడడం మానడం కుదరదు కదా. అది అంతకన్నా బాధ. రోజూ ఆ ఫోటో చూడడం తప్పక, చూసి మామూలుగా ఉండలేక, ఎంత యాతనో ఏమి చెప్పేది. అప్పుడెప్పుడో దూరదర్శన్ వారు సమస్యా పూరణం కార్యక్రమంలో ఇచ్చిన పాదం:
కలమా సాగదు నిద్రరాదు మన మా కాంతాలతాధీనమై !
అన్నది గుర్తొచ్చింది. ఎంత అందమైన సమస్య అనిపించింది వెంటనే. ఏమీ చెయ్యలేమని కూర్చుంటే ఇంకా బాధ కనక, ఈ పద్యాన్ని పూర్తి చెయ్యాలి ఎలాగైనా అని ప్రయత్నించాను. ఈ మత్తేభం ఇదిగో ఇలా తయారయ్యింది:
చల మా తొంగలి రెప్పలందమరు కంజాక్షద్వయాభాస, మం
దల మా మేను విరాజమానమగు సౌందర్యంబుకున్, నా మనో
బలమా చాలదు నిగ్రహాచరణకున్, భారంపు రేయందు నా
కలమా సాగదు నిద్రరాదు మన మా కాంతాలతాధీనమై !
(చలము=కదలాడునది;తొంగలి రెప్పలు=quivering eyelids ; కంజాక్షద్వయాభాసము=పద్మాల వంటి కన్నుల కాంతి;
అందలము=పల్లకి;మేను=శరీరము )
* ఈ పద్యం రాయడానికి కారణమైన కొత్తపాళీగారికి, స్వాతిగారికి కృతజ్ఞతలు. సహపాఠి రానారెకు అభినందనలు.
ఆమధ్య ఈ పుస్తకం గురించి రాసిన వ్యాసంలోని లింకు పని చెయ్యటంలేదంటూ కొంతమంది మిత్రులు అడిగారు. ఆర్కైవె.ఆర్గ్ లోని లింకు నాకు మళ్ళీ దొరికింది. ఇక్కడ నుంచి ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు .