సంగతులూ,సందర్భాలూ….

సెప్టెంబరు 15, 2007

వానపాటులు

ప్రచురించిన వర్గము కబుర్లు, భారతదేశం, సంగీతం, సినిమా పాటలు, సినిమాలు — Sriram @ 5:26 అపరాహ్నం

మొన్న రాత్రి మా ఊళ్ళో ఎడతెగని వర్షం. నేను ఇంటికి చేరుకున్నాకే మొదలవ్వడంతో నేను చాలా ఆస్వాదించాను. చదువరిగారు చెప్పినట్టు చీమచతురత  చూసి కాదులెండి. నాకిష్టమైన వానపాటని గుర్తు చేసుకుంటూ.  (ఇంకా…)

సెప్టెంబరు 5, 2007

అనానిమాసురుని ఆంతర్యమేమిటి?

ప్రచురించిన వర్గము భారతదేశం — Sriram @ 2:07 అపరాహ్నం

గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో ఉగ్రవాదుల  విధ్వంసాలు పదికన్నా ఎక్కువే జరిగాయి. ఇదివరకటిలా ఏ ఉగ్రవాదసంస్థా మేమే చేసామంటూ ప్రకటించటంలేదు. అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. మతకలహాలు రేపడమే ప్రధాన ఉద్దేశం అనడానికి ఆధారం లేదు. ఎందుకంటే వారణాసిలో బాంబు పేలినప్పుడూ హైదరాబాదులో పేలినప్పుడూ కూడా ఎప్పుడూ మనదేశంలో మతకలహాలు చెలరేగలేదు. ఐనా ఎందుకు చేస్తున్నట్టు? (ఇంకా…)

ఆగష్టు 29, 2007

మరింత వినోదం…

ప్రచురించిన వర్గము కబుర్లు, భారతదేశం, రాజకీయం — Sriram @ 10:25 అపరాహ్నం

వయ్యస్సార్ ని రీడిఫ్ వాడు ప్రశ్నలు వేసాడు. వాళ్ళకేం తెలుసు, ఈయనకి మీడియా అంటే కోపం అని. అప్పటిదాకా బానే ఉన్నాయన చివరలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగగానే ఎలా మారిపోయాడో. పాపం షీలా భట్!

ఆగష్టు 23, 2007

ఇత్యర్ధలు కూరా, ఇతిభావలు పులుసూ…

ప్రచురించిన వర్గము కబుర్లు, పుక్కిటి పురాణాలు, భారతదేశం — Sriram @ 1:11 పూర్వాహ్నం

అనగనగా గోదావరీ తీరాన ఒక గ్రామంలో ఒక వేదపండితుడు. మహా జ్ఞాని. పొద్దునే లేచి స్నానం,సంధ్యా కానిచ్చి అనుష్ఠానం,స్వాధ్యాయం(సెల్ఫ్ స్టడీ) చేసుకోడం - ఆ తర్వాత విద్యార్ధులకి వేదమూ, “ఇత్యర్ధః (ఇదీ దీని అర్ధం), ఇతి భావః (ఇదీ దీని భావము)” అంటూ దానికి అర్ధమూ పాఠాలు చెప్పుకోడం - ఇదీ ఆయన దైనందిక జీవితం.  

ఉన్న కాస్త భూమిలో పండే గింజలూ, పెరట్లో పండే కూరలూ ఆ కుటుంబానికి భోజ్యం.

ఎప్పుడూ బయటకెళ్ళి రూపాయి సంపాదించిన వ్యక్తి కాదు. ఆయనకి అవసరం కూడాలేదు.

కానీ భార్యకి మాత్రం కాస్త బాధగా ఉండేది. ఔను మరి ఇంట్లో ఏ పూటకి ఏముంటుందో కూడా తెలీదు, ఈవిడేగా అవన్నీ పడవలసింది. ఆయనకేమీ పట్టదాయె.

ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఇంటిల్లాలు వాకిట్లో ముగ్గు వేస్తుండగా మన పండితులుంగారు సరసంగా అరుగుమీద నిలబడి “ఈ పూట వంటకాలేమిటోయ్” అంటూ ప్రశ్నించారు. మంచి విసుగులో ఉందేమో ఆవిడ, ” ఏముందీ, ఇత్యర్ధలు కూరా ఇతిభావలు పులుసూ” అని పెడసరంగా సమాధానం చెప్పిందిట. 

పాపం ఈయనకి కలుక్కుమంది. ఔరా! భార్య చేత ఇంత మాట పడ్డాను కదా అనుకుని, దగ్గరకు పిలిచి - నీకేవో కోరికలున్నట్టున్నాయి, ఏం కావాలో చెప్పమని అడిగాడుట. పాపం ఆ వెర్రి ఇల్లాలు చేతులో ఉన్న ముగ్గు చెంబు ఈయన చేతిలో పెట్టి దీన్నిండా బంగారపు కాసులు తెచ్చిపెట్టండి, ఇంకేమీ అడగను అన్నదిట.

సరే అని మర్నాడు ఆ ముగ్గు చెంబుతో బయల్దేరాడీయన. రాజధానికి వెళ్ళేసరికి అక్కడ రాజుగారు ఏదో సమస్యలో ఉన్నారు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకున్న సమయంలో ఈయనకున్న శాస్త్రజ్ఞానాన్ని అన్వయించి ఇట్టే చిక్కుముడి విడగొట్టాడు.

రాజుగారు ఉబ్బితబ్బిబ్బై ఏం కావాలో కోరుకోమన్నారు. ఈయన వెంటతెచ్చిన ముగ్గు చెంబు రాజుగారి చేతిలో పెట్టి దీన్నిండా బంగారు కాసులు కావాలి అని అడిగాడు. రాజుగారు ఇదేం కోరికయ్యా ఏ అగ్రహారాలో కోరుకోక అని అనేసరికి ఈయన మహాప్రభో! ఇది నా భార్య కోరిక గానీ నాకేమీ కోరికలు లేవు అని చెప్పి ఆ చెంబుడు కాసులు పట్టుకొచ్చి భార్యకిచ్చాడుట.

ఇది చిన్నప్పుడు విన్న కధ. ఈ వారం ఈనాడులో వేదాన్ని తెలుగులో అనువదించిన దాశరధి రంగాచార్యులు గారి గురించిన వ్యాసం చదివినప్పుడు ఇది మళ్ళీ గుర్తొచ్చింది.

ఈ కధలో వినడమే కాదు, నేను ప్రత్యక్షంగా చూసిన చాలా మంది వేదపండితులు “ఇత్యర్ధలు కూర, ఇతిభావలు పులుసూ” గా కాలక్షేపం చేసిన వాళ్ళే.

అందుకే, దాశరధిగారు ఆయన అనువాదం ఎందుకు చేసానో చెప్తూ, “వేదం ఒక వర్గానికి ఉపాధి, అందులో ఆధిపత్యం పోతుందని భయం” కనకనే అందరికీ వేదం నేర్పలేదంటూ చేసిన వ్యాఖ్యలు నన్ను కాస్త బాధ పెట్టాయి.

నా అభ్యంతరమల్లా, వేదం జీవనోపాధికి మార్గమా అని? వేదపండితులంటే పెళ్ళిళ్ళు చేయించే పురోహితులూ, ఆలయాల్లో అర్చకులూ కాదే! ఈ సంగతి ఆచార్యుల వారికి తెలియదా?  కేవలం వేదాధ్యయనం వల్ల ఎటువంటి డబ్బు సంపాదన చెయ్యగలరు?

ప్రతిచోటా మంచీ చెడూ ఉంటాయి. మనసంస్కృతి కూడా అంతే. కానీ నేను గర్వపడే విషయాల్లో మన సత్సంప్రదాయాల్లో ముఖ్యమైనది ఒకటుంది. జ్ఞానము, అన్నము - ఈ రెండింటినీ అమ్ముకోడం పాపం. మనదేశంలో జరిగినంత విద్యాదానం, అన్నదానం ప్రపంచంలో ఎక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

మరి వేదమంటే కేవలం జ్ఞానమే! దానిని డబ్బు సంపాదనకి వాడడం మన పూర్వీకులు మహాపరాధమని భావించారే! అలాంటి వేదాన్ని జీవనోపాధి అనడం సబబు కాదని అనిపించింది. 

వేదాన్ని అందరికీ బోధించకపోడానికి ఏమి కారణమో నాకు ఖచ్చితంగా తెలీదు. నా అభిప్రాయం ఇదివరకు ఒకసారి రాసాను. వేదపండితులంతా చెడ్డవాళ్ళూ, బిల్ గేట్స్ లాంటి వాళ్ళూ అని అన్నా నేను అది ఆయన అభిప్రాయం అని ఊరుకుందును. కానీ వేదవిద్య ఇలా డబ్బు సంపాదనకి మార్గం కాదని మాత్రం చెప్పగలను.   

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః   

ఆగష్టు 18, 2007

స్వాతంత్ర్య ఫలాలు

ప్రచురించిన వర్గము కబుర్లు, భారతదేశం — Sriram @ 1:26 అపరాహ్నం

ఈ మధ్యనే మన అరవయ్యో స్వాతంత్ర దినోత్సవం గట్టిగా జరిపేసుకున్నాం. బ్లాగుల్లో కూడా చాలామంది సందడి చేసారు. కానీ ఈ స్వాతంత్ర్యానికి సార్ధకత ఎంత వరకూ అంటూ గాఢ నిట్టూర్పులు విడిచిన వాళ్ళే ఎక్కువ. వీళ్ళందరినీ చూసి నేను కూడా కొంత సందిగ్ధంలో పడ్డాను కానీ, ఈరోజు బయటపడ్డ ఈ వార్త నా సందేహాన్ని పటాపంచలు చేసింది.

స్వతంత్ర భారత న్యాయశాఖామంత్రివర్యులు నెహ్రూ కుటుంబానికి మన స్వాతంత్ర ఫలాలు రుచిచూపించారు. స్వయంగా ఖత్రోచిని ఇంటిదగ్గర దిగబెట్టి వచ్చారు.

ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? నెహ్రూ కుటుంబం తింటే ప్రజలందరూ తిన్నట్టే కదా.  తెలియకపోతే మన రాజ్ ని చూసి తెలుసుకోండి.

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.